తెలుగు భాషా దినోత్సవం...!
- August 29, 2024
దేశ భాషలందు తెలుగు లెస్స అని ఏనాడో శ్రీకృష్ణదేవరాయులు తెలుగు ఖ్యాతిని చాటారు.ఒకరి భావాలు ఒకరు పంచుకోవడానికి పుట్టినదే భాష.. మాతృభాషను నేర్వలేనివాడు ఇతర భాషలను సంపూర్ణంగా నేర్చుకోలేరని కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ మాటలు అక్షరసత్యాలు.తెలుగు సాహిత్యంలో విప్లవాత్మకమైన మార్పులు చేసి గ్రాంధిక స్థానంలో వ్యవహారిక భాషను ప్రవేశపెట్టిన గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి సందర్భంగా ఏటా ఆగస్ట్ 29న తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటున్నాం.
తెలుగు భాషకు చాలా ప్రాచీన నేపథ్యం ఉంది. సాహిత్యం, కవిత్వం, సంగీతం ఇలా అన్ని కళల్లోనూ తెలుగు భాషకు ప్రాధాన్యం ఉంది. దేశంలోని 22 అధికారిక గుర్తింపు కలిగిన భాషల్లో ఒకటిగా వెలుగొందుతున్న తెలుగు భాషకు మూలం ద్రావిడ భాష. ఆంధ్రప్రదేశ్ అధికారిక భాషా చట్టం ద్వారా 1966 లో తెలుగును రాష్ట్ర అధికారిక భాషగా ప్రభుత్వం ప్రకటించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలోనూ తెలుగును అధికారిక భాషగా గుర్తించారు. 2008 లో కన్నడతో పాటు తెలుగును ప్రాచీన భాషగా గుర్తించారు.
తెలుగు భాషా దినోత్సవం తెలుగు గొప్పతనాన్ని, వైవిధ్యాన్ని చాటి చెప్పే గొప్ప రోజు. తెలుగు చరిత్ర, సంస్కృతి గురించి తెలుసుకోవడంతో పాటు తెలుగు భాషా సౌందర్యాన్ని మెచ్చుకునే రోజు. నేటి తరాన్ని మన సంస్కృతి, సంప్రదాయాలతో అనుసంధానం చేయడానికి తెలుగు భాష దినోత్సవం చాలా ముఖ్యమైన రోజు. తెలుగు భాషా దినోత్సవం రోజున సాంస్కృతిక కార్యక్రమాలు, సాహిత్య పోటీలు నిర్వహిస్తూ తెలుగు భాష గొప్పదనాన్ని నేటి తరానికి తెలియజేసే కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. తెలుగు భాష పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తూ ఉంటారు.
1966లోనే తెలుగును అధికార భాషగా చట్టం చేసినప్పటికీ అమలు చేయడంలో ప్రభుత్వ అధికారులు చిత్తశుద్ధితో వ్యవహరించలేదు. కార్యాలయాల్లో తెలుగును అత్యంత తక్కువగా వినియోగిస్తున్నారు. దస్త్రాలన్నీ ఆంగ్లంలోనే నడుస్తున్నాయి. భాష జారిపోతే జాతి, సంస్కృతీ గతించిపోతాయని భాషాభిమానులు వాపోతు న్నారు. తెలుగు భాషను దశాబ్దాల కిందటే ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్‌గా అభివర్ణించారు. ఈ భాషలో ప్రతి వాక్యం అచ్చు శబ్దంతో ముగుస్తుంది. ఈ ప్రత్యేకత ఇటలీ భాషకు మాత్రమే ఉంది. అందుకే ఇటలీ, తెలుగు భాషలను అజంత భాషలంటారు. ఇతర భాషలన్నీ హల్లు శబ్దంతో అంతమవుతాయి.
తెలుగు భాషకు ఆలస్యంగానే ప్రాచీన హోదా దక్కింది. తెలుగు భాషకు ప్రాచీన హోదాను కాదనలేమని 2016లో మద్రాస్ హైకోర్టు సైతం తీర్పునిచ్చింది. ఈ హోదా ప్రకటనకే పరిమితం కాకుండా మాతృభాషను అందరూ ఆదరించే విధంగా ప్రభుత్వం, భాషా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ఉపాధ్యాయ సంఘాలు మరింత కృషి చేయాల్సి ఉంది. ప్రస్తుతం పరభాష వ్యామోహంతో ఇంటిభాష, బడిభాష వేరవుతున్నాయి. తెలుగులో ఆంగ్లభాష పదాలు చొచ్చుకుపోతున్నాయి. మాటల్లో మమకారం, అపాయ్యత తగ్గిపోతున్నాయి. జాతీయాలు, నుడికారం, సామెతలు లేకుండా మాటలు సాగిపోతున్నాయి.
హిందీ, బెంగాలీ భాషల తర్వాత దేశంలో అత్యధికులు మాట్లాడుకునే భాష మన తెలుగు భాష. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ.. ఇతర దేశాల్లోనూ పెద్ద సంఖ్యలో తెలుగు మాట్లాడేవారు ఉన్నారు. అయితే అంతటి ఘన చరిత్ర కలిగిన తెలుగు భాష మనుగడకు, ఉనికికి ప్రమాదం వాటిల్లే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు భాష పరిరక్షణ కోసం తెలుగు భాష దినోత్సవాన్ని జరుపుకుంటూ వస్తున్నాం. తెలుగులో చదివితే ఉద్యోగాలు రావన్న అపోహతోనే తల్లిదండ్రులు అధికంగా ఆంగ్ల మాధ్యమ పాఠశాలలకు ప్రాధాన్యతనిస్తున్నారు. ఈ పరిస్థితి మారాలని పండితులు, కవులు, రచయితలు కోరుతున్నారు. తేట తెలుగు తీయదనాన్ని వేదికలపై చాటుతున్నారు.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం
- అంగరంగ వైభవంగా 77వ ఎమ్మీ అవార్డుల వేడుక..
- శంకర నేత్రాలయ USA దత్తత గ్రామ పోషకులకు సత్కారం
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం