స్పైస్ జెట్: సిబ్బందికి 3 నెలలు సెలవులు..జీతాలుండవు

- August 30, 2024 , by Maagulf
స్పైస్ జెట్: సిబ్బందికి 3 నెలలు సెలవులు..జీతాలుండవు

ముంబై: స్పైస్‌జెట్‌ అప్పుల భారంతో సతమతమవుతూ… 150మంది సిబ్బందికి 3 నెలలపాటు సెలవుల్చి… జీతాలు కూడా ఉండబోవని చెప్పింది.ఈ విషయాన్ని కంపెనీ అధికార ప్రతినిధి ఓ ప్రకటనలో వెల్లడించారు.

తప్పనిసరి పరిస్థితుల్లో ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ప్రకటనలో కంపెనీ అధికార ప్రతినిధి తెలిపారు. 150 మంది క్యాబిన్‌ సిబ్బందిని తాత్కాలికంగా మూడు నెలలపాటు సెలవులో ఉంచుతున్నామన్నారు. ప్రయాణికుల నుంచి డిమాండ్‌ లేమి, విమానాల సంఖ్య తగ్గడం, తదితర కారణాలతో పాటు సంస్థ దీర్ఘకాలికి స్థిరత్వాన్ని దృష్టిలోఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని ఆ ప్రకటనలో వివరించారు. ఈ మూడు నెలల కాలంలో సెలవులో ఉన్నవారిని కంపెనీ ఉద్యోగులుగానే పరిగణిస్తామని, వారికి ఆరోగ్య ప్రయోజనాలతో పాటు ఎర్న్‌డ్‌ లీవ్‌ సదుపాయాలు అందుతాయని స్పష్టం చేశారు.

ఆర్థిక ఇబ్బందులు - న్యాయపరమైన సవాళ్లు ….
బడ్జెట్‌ విమానయాన సంస్థ అయిన స్పైస్‌జెట్‌ గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో పాటు న్యాయపరమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. అప్పుల భారం పెరగడంతో ఇప్పటికే కొన్ని విమానాలను నిలిపివేసింది. ప్రస్తుతం ఈ సంస్థ కేవలం 22 విమానాలను మాత్రమే నడుపుతోంది. ఇటీవల కంపెనీ వెల్లడించిన త్రైమాసిక ఫలితాల్లో రూ.149.96 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2023-24 ఇదే కాలంలో వచ్చిన లాభం రూ.204.56 కోట్లతో పోలిస్తే ఇది 27 శాతం తక్కువ. మొత్తం ఆదాయం 2,268.06 కోట్ల నుంచి రూ.2,067.21 కోట్లకు తగ్గింది.

స్పైస్‌ జెట్‌ కార్యకలాపాలపై నిఘా ….
ఇప్పటికే స్పైస్‌ జెట్‌ పై పౌర విమానయాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట్‌ జనరల్‌ సివిల్‌ ఏవియేషన్‌ నిఘా పెడుతున్నట్లు ప్రకటించింది. స్పైస్‌ జెట్‌ ఆపరేషన్స్‌ సజావుగా సాగేందుకు స్పాట్‌ చెక్స్‌, రాత్రి వేళ నిఘా పెంచుతున్నట్లు తెలిపింది. ఆర్థిక పరంగా ఒత్తిళ్ల నేపథ్యంలో స్పైస్‌ జెట్‌ విమాన సర్వీసులను రద్దు చేస్తున్న నేపథ్యంలో ఈ నెల 7, 8 తేదీల్లో సంస్థ ఇంజినీరింగ్‌ వసతులపై నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో కొన్ని లోపాలు కనిపించినట్లు డీజీసీఏ తెలిపింది. స్పైస్‌ జెట్‌ గత రికార్డుతోపాటు ఈ నెలలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీ నేపథ్యంలో ఆ సంస్థ కార్యకలాపాలపై తక్షణం నిఘా పెంచుతున్నట్లు డీజీసీఏ వివరించింది. దీని ప్రకారం పలు దఫాలు స్పాట్‌ చెక్స్‌, రాత్రి వేళ నిఘా చర్యలు పెరుగుతాయి. స్పైస్‌ జెట్‌ విమాన సర్వీసులు సురక్షితంగా సాగేందుకే తాము ఈ చర్య తీసుకుంటున్నట్లు డీజీసీఏ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com