కర్షక కవి...!
- September 11, 2024భారతదేశం స్వేచ్ఛ, స్వాతంత్య్రం, జాతీయతతో కూడిన నవీన భావాలతో నిండిన సాహితీ సంపద కోసం తహతహలాడుతున్న రోజులవి. కవిత్వంలో కొత్త రుచులు మేళవించి సాహిత్య ప్రియుల దృష్టిని దువ్వూరి రామిరెడ్డి తన వైపు మరల్చుకున్నారు. ఆయన బహుబాషాకోవిదుడు, నిరాడంబరుడు, ప్రకృతి ఉపాసకుడు. ఆంధ్ర సాహిత్యాకాశంలో ధ్రువతారగా వెలుగొందిన కవివరేణ్యుడు దువ్వూరి రామిరెడ్డి. నేడు సింహపురి సిరి, రైతు కవి దువ్వూరు రామిరెడ్డి గారి వర్థంతి.
దువ్వూరి వారి జీవితమే ఓ సాహిత్య సాహసగాథ. 1895,నవంబర్ 9న ఉమ్మడి మద్రాస్ ప్రావిన్స్ లోని వెంకటగిరి జమీందారిలో భాగమైన గూడూరు గ్రామంలో దువ్వూరి సుబ్బారెడ్డి, లక్ష్మీదేవమ్మ దంపతులకు రామిరెడ్డి జన్మించారు. నెల్లూరులో థర్డ్ ఫారం చదివే రోజుల్లోనే ఆయన విదేశీ కెమెరాతో పోటీ పడగల కెమెరాను తయారు చేశారు. ఆ తర్వాత చిత్రలేఖనం, శిల్పకళపై ఆయన దృష్టి మరలింది. ఈ విజ్ఞాన పిపాస ఆయనను కలకత్తాలోని రామకృష్ణ పరమహంస ఆశ్రమానికి చేర్చింది. తాను సాధించాలనుకున్న దానికోసం ఎంత కష్టానికైనా, త్యాగానికైనా సిద్ధపడే కార్యదీక్ష, పట్టుదల రామిరెడ్డిది. అందుకే రామకృష్ణ మఠంలో సంస్కృతం, బెంగాలీని క్షుణ్ణంగా నేర్చుకున్నాడు. తర్వాత రామకృష్ణ పరమహంస సతీమణి శారదాదేవి ఆదేశానుసారం తిరిగి తన స్వస్థలానికి చేరుకున్నారు.
1913లో కోవూరు తాలూకా (ప్రస్తుతం కొడవలూరు మండలం) పెమ్మారెడ్డిపాళెం గ్రామంలో తన పినతల్లి కోడూరు రంగమ్మ ఇంట్లో ఉంటూ సమీపంలోని గండవరంలో గ్రంథాలయంలో పుస్తకాలపఠనంలో నిమగ్నమయ్యారు. తన 19వ ఏట తల్లి కోరిక మేరకు శేషమ్మను తన జీవిత భాగస్వామిగా రామిరెడ్డి స్వీకరించారు. ఆయనలోని సాహిత్యాభిలాషకు సతీమణి తోడ్పాటు కూడా లభించింది. ఆ సమయంలో కట్టమంచి రామలింగారెడ్డి రచించిన ‘ముసలమ్మ మరణం’ అనే పుస్తకం రామిరెడ్డిని ఎంతో ప్రభావితం చేసింది. దీంతో ఆయన ‘నలజారమ్మ’ కథ ఆధారంగా 1915లో తొలి పద్యకావ్యం రచించారు. ఈ కావ్యంతో రామిరెడ్డిలోని కవితా ప్రతిభ వెలుగు చూసింది. అనంతరం ‘వనకుమారి’ అనే కావ్యంతో ఆయన కీర్తి మరింత ప్రకాశించింది.
అణగదొక్కబడుతున్న రైతుల జీవితాలే పాత్రలుగా ‘కృషీవలుడు’ అనే మహత్తర కావ్యం రచించారు. ఈ కావ్యం ఆయనను ముందుతరం కవులకు మార్గదర్శకుడిగా నిలిపింది. ఎన్నో పురస్కారాలు, సత్కారాలు ఆయన నట్టింటికి నడిచి వచ్చాయి. 1929లో ఆంధ్రదేశం ‘కవికోకిల’ బిరుదును అందించి గౌరవించింది. స్వాతంత్య్రం నేపథ్యంలో ఆయన రచించిన ‘మాతృశతకం’లో ఒక్కో పద్యం అగ్నిశిఖను తలపించింది. ఈ విషయం పసిగట్టిన బ్రిటిషు ప్రభుత్వం ఆ పుస్తకం ముద్రణను అడ్డుకుంది. దువ్వూరి రామిరెడ్డి 1920-1925 మధ్య కాలంలో మద్రాసు నుంచి వెలువడే ‘సమదర్శిని’ అనే పత్రికకు 9 నెలల పాటు సంపాదకుడిగా పనిచేశారు. 1923లో ఆయన తన కావ్యాలను ‘ది వాయిస్ ఆఫ్ ది రీడ్’ అనే పేరుతో ఆంగ్లంలోకి అనువదించారు. ఇది ఆంగ్లేయులను సైతం విశేషంగా ఆకట్టుకుంది.
1925 రామిరెడ్డి సతీమణి శేషమ్మ బాలింత వ్యాధితో మరణించింది. తర్వాత కొద్దిరోజులకే కుమార్తె కుముదమ్మ కూడా గతించడం ఆయనపై తీవ్రమైన ప్రభావం చూపింది. ఆసమయంలో ఉమర్‌ఖయ్యూం ‘రుబాయతులు’ ఆయనకు ఊరటనిచ్చాయి. పర్షియన్ భాషలో ఉన్న ఖయ్యూం ‘రుబాయతులు’ను రామిరెడ్డి తెలుగులోకి అనువదించారు. 1926లో ఓ ఫ్రెంచి ఆర్కిటెక్ట్‌ను సంప్రదించి పెమ్మారెడ్డిపాళెంలో ఓ సుందర భవనాన్ని నిర్మించేందుకు ఆయన నడుంబిగించారు. ఆ ఇంట్లోని గోడలకు, స్తంభాలకు ఎన్నో చిత్రాలను రామిరెడ్డి సొంతంగా అమర్చుకున్నారు.
1936లో రామిరెడ్డి సినీరంగ ప్రవేశం చేశారు. వేంకటేశ్వర మహత్యం, గరుడగర్వభంగం, సతీతులసి, సీతారామజననం తదితర సినిమాలకు మాటలు, పాటలు రాశారు. 1937లో నెల్లూరీయులైన శ్రీరామా ఫిలిం కంపెనీ వారు నిర్మించిన ‘నల దమయంతి’ సినిమాకు స్క్రీన్‌ప్లే, మాటలు, పాటలు రాసి దర్శకత్వం వహించారు. 1938 వరకు రామిరెడ్డి సినీ పరిశ్రమలో కొనసాగారు.
పారశీకం నుంచి సౌదీ కవి రచించిన రెండు కావ్యాలను ‘గులాబీ తోట’ పండ్ల తోట’ పేర్లతో తెలుగులోకి అనువదించారు. ‘కవి-రవి’, ‘ఫలితకేశం’ ద్వారా మూఢనమ్మకాలను ఎండగట్టారు. ‘జలదాంగన’తో భూగోళ రహస్యాలను చర్చించారు. రామిరెడ్డి రచనల్లో నలజారమ్మ, వనకుమారి, కృషీవలుడు, పానశాల, గులాబీ తోట, పండ్ల తోట, కుంభరాణా, సీతావనవాసం, నైవేధ్యం, భగ్న హృదయం, మాధవ విజయం, జలదాంగన, కవి-రవి, ఫలితకేశం ఎంతో ప్రాచూర్యం పొందాయి.
'కవి కోకిల' మకుటాన్ని ఇంటిపేరులో ఇముడ్చుకున్న దువ్వూరి శైలి తెలుగు సాహిత్యంలో నవోన్మేషణమై నలుదిశలా వెలుగులు ప్రసరించింది. కలకండ వంటి కమ్మని కావ్యాలు, పలకరిస్తే అశుధారాపాతంగా జాలువారే పద్యపూరిత ప్రబంధాలే కాకుండా సంస్కృత, అరబిక్ భాషల నుంచి ఎన్నో పుస్తకాలను ఆంధ్రీకరించిన నవ్యరీతి దువ్వూరి ప్రత్యేకం. కేవలం కవిగానే కాకుండా గొప్ప విమర్శకులుగా కూడా సమానమైన ఖ్యాతి గడించారాయన.
దువ్వూరి కలం నుంచి జాలువారిన సాహితీ సౌందర్యం గురించి వర్ణించి చెప్పడం కష్టం. మచ్చుకు ఒక్క రచన చదివితే తప్పించి ఆయన లోతైన అంతరంగం ఆవిష్కరించడం అంత సులభం కాదు. మృదు మధురమైన మాటలు, గంభీరమైన శైలి, అన్నిటికీ మించి ఆ రచనా చాతుర్యం చదువరులను ముగ్ధలను చేస్తాయి. కళ్ళను అక్షరాల వెంట పరుగులెత్తిస్తాయి. చెప్పవలసిన విషయాన్ని సూటిగా, నాటుకునేటట్టు చెప్పడం వల్ల దువ్వూరి విమర్శలు ఆనాటి యువతలో ఆలోచనాత్మకథోరణిని రేకెత్తించాయి.
కవి, విమర్శకులు గానే కాకుండా నాటక రచయితగా, 'చిత్ర నళీయం' సృష్టికర్తగా బహుముఖ కోణాల్లో ప్రతిభను చాటుకోవడం వల్ల దువ్వూరి పేరు సాహితీ పుటల్లో శాశ్వతస్థానం సంపాదించుకుంది. బహుభాషా కోవిదునిగా సంప్రదాయ రీతులను మిళితం చేసి కొత్తతరానికి సాహితీ బాటలు వేసిన దువ్వూరి, ఆధునికాంధ్ర కవుల్లో దువ్వూరి ముందు వరుసలో వుంటారని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. 1947 సెప్టెంబర్ 11న సాహితీ ప్రేమికులను విషాదంలో ముంచి అనంతలోకాలకు తరలివెళ్లారు. ఆంధ్రసాహిత్య నందనంలో అమరజీవిగా నిలిచారు.
- డి.వి.అరవింద్, మాగల్ఫ్ ప్రతినిధి
తాజా వార్తలు
- సీనియర్ హీరో రాజేంద్రప్రసాద్ ఇంట తీవ్ర విషాదం
- విద్యార్థుల నుంచి లంచం..టీచర్‌కు మూడేళ్ల జైలు, 5,000 దిర్హామ్‌ల జరిమానా..!!
- సౌదీయేతరులతోనే 64.8% సౌదీల వివాహాలు..అధ్యయనం వెల్లడి..!!
- షేక్ జాయెద్ రోడ్లో యాక్సిడెంట్.. 4.2 కి.మీ పొడవున ట్రాఫిక్ జామ్..!!
- దోహాలో రెండు కీలక రహదారులు తాత్కాలికంగా మూసివేత..!!
- కువైట్ లో తక్షణ చెల్లింపు కోసం 'WAMD' సర్వీస్ ప్రారంభం..!!
- మెట్రో రైడర్స్ కు గుడ్ న్యూస్.. ఈ-స్కూటర్లపై నిషేధం ఎత్తివేత..!!
- షార్ట్స్‌లో వీడియోల నిడివిని పెంచిన యూట్యూబ్
- కాంగో పడవ ప్రమాదంలో 78 మంది జల సమాధి
- రేపటి నుంచి భారత్–బంగ్లా టీ20 టిక్కెట్ల విక్రయం