ఆంధ్రా నైటింగేల్ ...!
- September 12, 2024ఒకప్పుడు రేడియో మాత్రమే ఒక సమాచార సాధనంగా ఉన్న పాతకాలపు మరచి పోలేని రోజుల్లో, ప్రజలకు వార్తలు ఎప్పటికప్పుడు తెలియచేస్తూ ప్రజలలో ఒకరిగా, అందరికీ ఆత్మీయులుగా వార్తా చదువరులు తమ తమ శైలులలో సుస్థిర స్థానం సంపాయించు కొన్నారు. ఆకాశవాణిలో వార్తా చదువరులుగా (NEWS READERS), ఎంతగానో ప్రాచుర్యం పొందారు. అలనాటి రేడియో శ్రోతలకు సుపరిచితమైన పేరు జోలెపాళ్యం మంగమ్మ. ఆల్ ఇండియా రేడియోలో మొట్టమొదటి మహిళా న్యూస్ రీడర్‌గా ప్రసిద్ధురాలుగా పేరెన్నిక గన్న మంగమ్మ గారి జన్మదినం నేడు.
జోలెపాళ్యం మంగమ్మ గారు 1925, సెప్టెంబరు 12న ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలోని ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లెలో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు జే.లక్ష్మమ్మ, సుబ్బయ్య. ఎం.ఎ, బి.ఎడ్ పూర్తి చేసిన మంగమ్మ తమ కుటుంబంలో తొలితరం విద్యావంతురాలు. వీధిబడి చదువులతో మొదలై.. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకునేవరకు ఆమె తన చదువు కొనసాగించారు. ఆలిండియా రేడియో నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణురాలై తొలి తెలుగు మహిళా న్యూస్‌రీడర్‌గా తమ పేరు నమోదు చేసుకున్నారు.
న్యూఢిల్లీలో పదేండ్లు ఎడిటర్‌గా, న్యూస్ రీడర్‌గా పనిచేశారు. చిన్నతనం నుంచే చురుకైన అమ్మాయిగా పేరు తెచ్చుకున్న ఆమె తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీషు, ఫ్రెంచ్, ఎస్పరాంటో, తమిళ భాషల్లో ప్రావీణ్యం సంపాదించారు. ఆ తర్వాత 35 ఏళ్లపాటు ప్రయోగాత్మక విద్యాకేంద్రం, టీచర్ ట్రైనింగ్ కేంద్రాల్లో ఉపాధ్యాయురాలుగా పనిచేశారు.
1962 నుండి నేషనల్ ఆర్కీవ్స్, ఢిల్లీలో పరిశోధనా రంగంలో విశేషకృషి చేశారు. మంగమ్మ కేంద్ర సమాచార శాఖ, విదేశాంగశాఖలలో కీలకమైన పదవులను నిర్వహించారు. ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మొదలైన సంస్థలలో లైఫ్‌టైమ్ మెంబర్‌గా ఉన్నారు. అనేక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనే ఆమె అనిబీసెంట్ ఎడ్యుకేషనల్ ట్రస్టు ఉపాధ్యక్షు రాలిగా, గాంధీ ఆర్గనైజేషన్ ఫర్ రూరల్ డెవలప్‌మెంట్ అధ్యక్షురాలిగా, లోక్‌అదాలత్‌లో సభ్యురాలిగా, వివిధ సంస్థల్లో కీలక హౌదాల్లో సేవలను అందించారు.
బహు భాషల్లో ప్రావీణ్యం గల మంగమ్మ ఆంగ్ల, తెలుగు భాషల్లో మూడువందలకు పైగా వ్యాసాలు రాశారు. అనేక పుస్తకాలను ప్రచురించారు. తెలుగు సాహిత్యంపై మక్కువతో మదనపల్లె రచయితల సంఘం ఏర్పాటులో కీలక భూమిక పోషించారు. ఆమె రాసిన పుస్తకాలలో తెలుగులో 'ఇండియన్ పార్లమెంట్', 'శ్రీ అరబిందో', 'విప్లవ వీరుడు అల్లూరిసీతారామరాజు', 'అనిబీసెంట్' తదితర పుస్తకాలు ఎంతో పేరు తెచ్చాయి. ఇంగ్లీష్‌లో ఆమె రాసిన' ప్రింటింగ్ ఇండియా', 'అల్లూరి సీతారామరాజు', 'లాస్ట్ పాలెగార్ ఎన్‌కౌంటర్ విత్ ది బ్రిటిష్ ఇన్ ది సీడెడ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, 1846-1847', 'ది రేట్ స్కూల్స్ ఆఫ్ గోదావరి' తదితర పుస్తకాలు ఆమెకు గుర్తింపు తీసుకు వచ్చాయి.
సాహిత్యరంగంలో ఆమె సేవలకు గాను 2002లో న్యూఢిల్లీ 'తెలుగు అకాడమీ ఉగాది పురస్కారం', కుప్పం రెడ్డెమ్మ సాహితీ అవార్డు , విజయవాడ 'సిద్ధార్థ కళాపీఠం విశిష్ట అవార్డు' మంగమ్మ గారిని వరించాయి.సరోజినీ నాయుడు స్నేహితురాలైన మంగమ్మ "ఆంధ్రానైటింగేల్" అనే బిరుదు అందుకున్నారు. 92 ఏట అనారోగ్యం కారణంగా మదనపల్లెలోని తన స్వగృహంలో 2017, ఫిబ్రవరి 1న మరణించారు.
- డి.వి.అరవింద్, మాగల్ఫ్ ప్రతినిధి
తాజా వార్తలు
- మహిళా టీ20 ప్రపంచకప్..భారత్ పై న్యూజిలాండ్ విజయం
- నిజమాబాద్: ముగ్గురి ఉసురు తీసిన ఆన్ లైన్ బెట్టింగ్..
- సీనియర్ హీరో రాజేంద్రప్రసాద్ ఇంట తీవ్ర విషాదం
- విద్యార్థుల నుంచి లంచం..టీచర్‌కు మూడేళ్ల జైలు, 5,000 దిర్హామ్‌ల జరిమానా..!!
- సౌదీయేతరులతోనే 64.8% సౌదీల వివాహాలు..అధ్యయనం వెల్లడి..!!
- షేక్ జాయెద్ రోడ్లో యాక్సిడెంట్.. 4.2 కి.మీ పొడవున ట్రాఫిక్ జామ్..!!
- దోహాలో రెండు కీలక రహదారులు తాత్కాలికంగా మూసివేత..!!
- కువైట్ లో తక్షణ చెల్లింపు కోసం 'WAMD' సర్వీస్ ప్రారంభం..!!
- మెట్రో రైడర్స్ కు గుడ్ న్యూస్.. ఈ-స్కూటర్లపై నిషేధం ఎత్తివేత..!!
- షార్ట్స్‌లో వీడియోల నిడివిని పెంచిన యూట్యూబ్