మహామహోపాధ్యాయ..!
- September 12, 2024'కవయామి వయామి యామి’ అని తన వద్దకు వచ్చి చెప్పేదాకా ఆ కువిందుడు కవిత చెప్పగలడని భోజరాజుకు తెలియదు. అలాగే తల్లిలేని, పూటగడవని నిరుపేద తెలంగాణ పల్లె నుంచి వచ్చిన విద్యార్థి భారత దేశం గర్వించే మహామహోపాధ్యాయుడవుతాడని, అన్నంపెట్టి చదువు చెప్పిన ఆ విద్యా సంస్థకూ తెలియదు. వట్టిమట్టిబడిలో ఓనమాలు దిద్దబెట్టిన ఆ గురువుకు తెలియదు, అపశబ్దమాలిన్యం సోకని ఒక నిఘంటుకర్త, వ్యాకరణ వ్యాఖ్యాత అతనిలో ఉన్నాడని. తాను పుట్టిన నల్లగొండకూ తెలియదు, ఏడుకొండలవాడిని ముప్పైరెండు వేల కీర్తనలతో కీర్తించిన అన్నమయ్య పదాలకు పదకోశం తయారు చేసే నిఘంటు నిర్మాణ కర్త దాగి ఉన్నాడని. ‘నీ యవ్వా’ అంటూ నీల్గే తన తల్లి బాసకూ తెలియదు, తన మాండలికాన్ని వ్యాకరించే వ్యాకర్త ఆ పసివాడవుతాడని. ఇన్ని ఉషస్సుల్ని ముడివేసుకున్న మహోదయమే ఆచార్య రవ్వా శ్రీహరి. నేడు ఆయన జన్మదినం.
రవ్వా శ్రీహరి 1943, సెప్టెంబరు 12న ఆనాటి నైజాం రాష్ట్రంలో భాగమైన ఉమ్మడి నల్గొండ జిల్లా వెల్వర్తి గ్రామంలోని నిరుపేద పద్మశాలి కుటుంబంలో జన్మించారు. శ్రీహరి తల్లిదండ్రులు వెంకటనర్సమ్మ, నర్సయ్య. కుటుంబ ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉండటంతో చదువు ప్రశ్నార్థకంగా మారింది. ఆ సమయంలో యాదగిరిగుట్ట సంస్కృత విద్యాపీఠంలో ఉచిత భోజనంతో విద్యాబోధన ఉంటుందని తెలిసి ఆ తలుపు తట్టారు. అక్కడే సంస్కృతంపై పట్టుసాధించారు. తర్వాత హైదరాబాద్ సీతారాంబాగ్‌లోని మున్నాలాల్ సంస్కృత కళాశాలలో డీవోఎల్, బీవోఎల్ పూర్తిచేశారు. అక్కడ శఠకోప రామానుజాచార్యులు, ఖండవల్లి నరసింహశాస్త్రి, అమరవాది కృష్ణమాచార్యుల వద్ద మహాభాష్యాంతం వ్యాకరణం అభ్యసించారు. వివేకవర్ధిని కళాశాలలో తెలుగు పండితుడిగా చేరారు. 1967లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఏ సంస్కృతం ప్రైవేట్‌గా చదివి స్వర్ణ పతకం సాధించారు. ప్రైవేట్‌గానే ఎం ఏ తెలుగు చదివారు.
‘భాస్కర రామాయణం విమర్శనాత్మక పరిశీలనం’ అనే అంశం మీద పరిశోధన చేసి ఉస్మానియా విద్యాలయం నుంచి పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు. ఉద్యోగ ప్రస్థానంలో ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రాచ్య కళాశాలలో సంస్కృతాంధ్ర ఉపన్యాసకులుగా కొన్నాళ్లు పనిచేశారు. నిజాం కళాశాల, ఆర్ట్స్ కళాశాలల్లో తెలుగు అధ్యాపకుడిగా, రీడర్‌గా, ఆచార్యుడిగా, తెలుగు శాఖ అధిపతిగా సేవలు అందించారు. దాదాపు 43 సంవత్సరాలు అధ్యాపక వృత్తిలో ఎందరో శిష్యులను భాషా పండితులుగా తీర్చిదిద్దారు. తర్వాత కుప్పంలోని ద్రవిడ విశ్వవిద్యాలయం ఉపకులపతిగా సేవలు అందించారు.పదవీ విరమణ పొందిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణల విభాగం ప్రధాన సంపాదకుడిగా సాహితీ విస్తరణకు తనవంతు సాయం అందించారు.
సంస్కృత కావ్యాలను తెనుగీకరించడం వాడుకలో ఉన్న సంప్రదాయం. దానికి భిన్నంగా తెలుగు కావ్యాలను సంస్కృతంలోకి అనువదించి ఉభయ భాషల్లో తన పటిమను ఎన్నోసార్లు నిరూపించుకున్నారు శ్రీహరి. పదిహేడేండ్ల వయసులో మొదటగా కాళహస్తీశ్వర శతకంలోని పది పద్యాలను సంస్కృతంలోకి అనువదించారు. ఆ తర్వాత ఆయన సాహిత్యంలోని అన్ని ప్రక్రియల్లోనూ తనదైన ముద్రవేశారు. మాతృభాషకు పట్టం కట్టాలనే ఉద్దేశంతో మహా నిఘంటువు రచన చేపట్టారు.
‘శ్రీహరి నిఘంటువు’గా తీసుకొచ్చిన ఈ గ్రంథంలో అప్పటి వరకు ఏ నిఘంటువులోనూ చోటుదక్కని 13వేల అచ్చతెలుగు పదాలను సేకరించి, వాటికి అర్థాలను వివరించారు. మాండలిక పదాలకూ ఇందులో చోటిచ్చారు. తెలంగాణ మాండలికాలు- కావ్యప్రయోగాలు, నల్లగొండ జిల్లా మాండలిక పదకోశం తదితర గ్రంథాలు రచించారు.మాతృగీతం, సంస్కృత వైజయంతి వంటి సంస్కృత రచనలు పండిత ప్రకాండుల మెప్పుపొందినవి. ఎన్నెన్నో తెలుగు కావ్యాలను సంస్కృతంలోకి అనువదించి తన ప్రత్యేకతను చాటుకున్నారు.
కవి సి.నారాయణరెడ్డి ‘ప్రపంచ పదులు’ రచన కావ్యాన్ని ‘ప్రపంచ పది’ పేరుతో సంస్కృతంలోకి అనువదించి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు. గుర్రం జాషువా ఫిరదౌసి, గబ్బిలం కావ్యాలనూ సంస్కృతంలోకి అనువదించారు. వేమన పద్యాలను, నరసింహ శతకాలనూ సంస్కృతంలో తిరగ రాశారు. టీటీడీలో పనిచేసే రోజుల్లో అన్నమయ్య సాహిత్యంపై అవిశ్రాంతంగా పరిశోధన చేశారు. ‘అన్నమయ్య పదకోశం’, ‘అన్నమయ్య సూక్తి వైభవం’, ‘అన్నమయ్య భాషా వైభవం’, ‘అన్నమయ్య అచ్చ తెలుగు’ వంటి పలు గ్రంథాలు రచించి తొలి తెలుగు వాగ్గేయకారుడికి తగిన రీతిన నివాళులు అర్పించారు శ్రీహరి.
యాభైకి పైగా తెలుగు గ్రంథాలు, 25కు పైగా సంస్కృత గ్రంథాలు రచించి ఉభయ భాషా ప్రవీణుడిగా ఉన్నత కీర్తిని సముపార్జించారు. దుర్భర దారిద్య్రంలో ఉన్నా.. శేఖరీభూతమైన విద్వత్ సంపద ఆ సరస్వతీ పుత్రుడికి వివిధ పదవులను కట్టబెట్టి అందలాన్ని ఎక్కించింది. 2011లో తిరుమల తిరుపతి దేవస్థానం ‘మహామహోపాధ్యాయ’ అన్న బిరుదుతో ఆయనను సత్కరించింది. 2013లో సీపీ బ్రౌన్ పురసారంతోపాటు ఏపీ అధికార భాషా సంఘం విశిష్ట పురసారం కూడా ఆయన్ని వరించింది. 2014లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం గిడుగు రామ్మూర్తి పురసారం అందించింది.
తెలంగాణ మట్టిలో మెరుగుపెట్టిన మాణిక్యం రవ్వా శ్రీహరి. సంస్కృతాంధ్ర భాషలను కరతలామలకం చేసుకున్న పుంభావ సరస్వతి ఆయన. జీవితమంతా ఉభయభాషా సాహితీ వనంలో ఎన్నెన్నో కావ్య కుసుమాలను పూయించిన విద్వత్ కలం కాలపరీక్షను స్వీకరించి ఆగిపోయింది. సాహితీమూర్తిగా, అధ్యాపకుడిగా, రీడర్‌గా, ఆచార్యుడిగా, ఉప కులపతిగా నాలుగున్నర దశాబ్దాల అనుభవం ఆయన సొంతం. ఆయన రచనల్లో సంస్కృతానికి భాష్యం చెప్పారు.
తెలుగు భాషకు వన్నె తెచ్చారు. తెలంగాణ యాసకు పట్టం కట్టారు. తెలుగుజాతి మహామహోపాధ్యాయగా సగర్వంగా పిలుచుకునే ఆచార్య రవ్వా శ్రీహరి సామాన్య చేనేత కుటుంబంలో జన్మించి.. అసామాన్య ప్రజ్ఞ సముపార్జించి.. లబ్ధప్రతిష్ఠుడు అనిపించుకొని.. పండితవరేణ్యుల సందేహాలు నివృత్తి చేసే స్థాయికి చేరుకున్నారు. తెలుగు జాతికి ప్రాతఃస్మరణీయుడిగా తరగని కీర్తిని పొందారు.
- డి.వి.అరవింద్, మాగల్ఫ్ ప్రతినిధి
తాజా వార్తలు
- నిజమాబాద్: ముగ్గురి ఉసురు తీసిన ఆన్ లైన్ బెట్టింగ్..
- సీనియర్ హీరో రాజేంద్రప్రసాద్ ఇంట తీవ్ర విషాదం
- విద్యార్థుల నుంచి లంచం..టీచర్‌కు మూడేళ్ల జైలు, 5,000 దిర్హామ్‌ల జరిమానా..!!
- సౌదీయేతరులతోనే 64.8% సౌదీల వివాహాలు..అధ్యయనం వెల్లడి..!!
- షేక్ జాయెద్ రోడ్లో యాక్సిడెంట్.. 4.2 కి.మీ పొడవున ట్రాఫిక్ జామ్..!!
- దోహాలో రెండు కీలక రహదారులు తాత్కాలికంగా మూసివేత..!!
- కువైట్ లో తక్షణ చెల్లింపు కోసం 'WAMD' సర్వీస్ ప్రారంభం..!!
- మెట్రో రైడర్స్ కు గుడ్ న్యూస్.. ఈ-స్కూటర్లపై నిషేధం ఎత్తివేత..!!
- షార్ట్స్‌లో వీడియోల నిడివిని పెంచిన యూట్యూబ్
- కాంగో పడవ ప్రమాదంలో 78 మంది జల సమాధి