వెండితెర నాట్య మయూరి....!

- September 21, 2024 , by Maagulf
వెండితెర నాట్య మయూరి....!

ఆమె మహా సంకల్ప బలం ఉన్న నారి.. నటరాజు గర్వించే భరత నాట్య మయూరి. జీవితం తన ముందుంచిన సమస్యను సవాలుగా స్వీకరించి మనోధైర్యంతో.. దృఢ సంకల్పంతో విధిని సైతం ఎదురించి విజయాలవైపు తరలింది తన దారి. సుమారు మూడున్నర దశాబ్దాల కాలం నుంచి నట, నాట్య రంగాల్లో తనదైన ప్రతిభతో కళలకే కళగా నిలిచిన వెండితెర నాట్య మయూరి 'సుధాచంద్రన్‌'. నేడు ఆమె జన్మదినం.

సుధాచంద్రన్‌ 1964,సెప్టెంబరు 21న ముంబైలో కేరళ మూలాలున్న కుటుంబంలో జన్మించారు. ముంబైలోని మిథీబాయి కళాశాల నుండి బీఏ, ఇండస్ట్రియల్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ ఎకనామిక్స్‌లో పోస్టు గ్రాడ్యుయేషన్‌ చేశారు. చిన్నతనంలోనే భారతనాట్యంలో ప్రవేశం పొంది, 12 ఏళ్లకే అరంగేట్రం చేశారు.1981లో ముంబై నుండి తమిళనాడుకు విహారయాత్రకు వచ్చి తిరుచురాపల్లి నుంచి చెన్నై వెళుతున్న సందర్భంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కుడి కాలును కోల్పోయింది. అయినప్పటికి ఆమె అధైర్యపడకుండా జైపూర్ కృత్రిమ కాలును అమర్చుకొని నాట్య ప్రదర్శనలు ఇస్తూ వచ్చారు.

సుధాచంద్రన్‌ జీవితం గురించి ప్రముఖ హిందీ దినపత్రికలో వచ్చిన కథనాన్ని చదివిన ఈనాడు సంస్థల అధిపతి స్వర్గీయ రామోజీరావు గారు. వారి కుటుంబ సభ్యులను సంప్రదించడం, వారి అనుమతి మేరకు సుధా జీవిత ఆధారంగా ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో ఆమెనే కథానాయకిగా పెట్టి ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై మయూరి చిత్రాన్ని నిర్మించారు.1985లో విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మయూరి చిత్రం ఆర్థికంగా విజయం సాధించడమే కాకుండా ఏ తెలుగు సినిమాకు దక్కని విధంగా 14 నంది పురస్కారాలు దక్కించుకోవడం విశేషం.

మయూరి చిత్రాన్ని1985లో జరిగిన 45వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించబడింది. ఈ సినిమాను మలయాళం,తమిళంలో అదే పేరుతో అనువాదం చేయగా అక్కడ సైతం సంచలన విజయం సాధించడం విశేషం. 1986లో హిందీలో సైతం "నాచే మయూరి" పేరుతో పునర్నిర్మించగా అది సంచలన విజయం సాధించడంతో సుధాచంద్రన్‌ పాన్ ఇండియన్ సెలేబ్రిటిగా మారిపోయారు. మయూరి తర్వాత సుధాచంద్రన్‌ ఎక్కువగా హిందీ, తమిళం, మలయాళం చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం బుల్లితెర మీద వివిధ భాషల సీరియళ్లలో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు.

 --డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com