చిరంజీవుడు....!

- September 22, 2024 , by Maagulf
చిరంజీవుడు....!

"ప్రపంచంలో ఎవరి దగ్గరా లేని టాలెంట్ నీకు ఉండొచ్చు.. కానీ క్రమశిక్షణ ఒక్కటీ లేకపోతే నిన్ను ఎవడూ పట్టించుకోడు". ఈ సూత్రాన్ని తప్పకుండా పాటించిన వ్యక్తి టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి. కెరీర్ మొదట్లో చిన్న చిన్న వేషాల కోసం చెప్పులరిగేలా తిరిగిన నాటి నుంచీ మెగాస్టార్ రేంజ్‌కి ఎదిగేందుకు దోహదపడింది. ఆ క్రమశిక్షణే ఆయన్ను  తెలుగు చిత్ర సీమకి తిరుగులేని 'ఇంద్ర'సేనుడ్ని చేసింది. నేటితో మెగాస్టార్ చిరంజీవి 46 ఏళ్ళ సినీ ప్రస్థానం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా, ఆయన సినీ ప్రయాణం గురించి క్లుప్తంగా... 

సాధారణ మధ్యతరగతి కుటుంబంలో కొణిదెల శివ శంకర వర ప్రసాద్‌గా జన్మించిన ఆయన్ను అభిమానులు మెగాస్టార్, అన్నయ్య మరియు చిరు అని ఆప్యాయంగా పిలుచుకుంటారు. స్టార్‌డమ్ ఉన్నప్పటికీ, వినయపూర్వకంగా ఉంటారు. 

1978, సెప్టెంబర్ 22న "పూనాదిరాళ్ళు" చిత్రంతో  తెలుగు తెరపై చిరంజీవి నట ప్రస్థానం మొదలైంది. కానీ, థియేటర్లలో విడుదలైన మొదటి చిత్రంగా ప్రాణం ఖరీదు నిలిచింది. మనవూరి పాండవులు (1978) ఆయనకు నటుడిగా గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇది కథ కాదు (1979), మోసగాడు (1980), రాణి కాసుల రంగమ్మ (1981) మరియు న్యాయం కావాలి (1981) వంటి చిత్రాలతో అతను తన ఇమేజ్‌తో ప్రయోగాలు చేశాడు. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య (1982), శుభలేఖ (1982), పట్నం వచ్చిన పతివ్రతలు (1982) తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఆయన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాయి.

కోదండరామి రెడ్డి దర్శకత్వం వహించిన ఖైదీ (1983), చిరంజీవి తన మొదటి పెద్ద వాణిజ్య పురోగతిని అందుకున్నాడు మరియు స్టార్‌డమ్‌ని పొందాడు. కొన్నేళ్లుగా ఆయన ఛాలెంజ్ (1984), స్వయంకృషి (1987), యముడికి మొగుడు (1988), రుద్రవీణ (1988), జగదేక వీరుడు అతిలోక సుందరి (1990), కొండవీటి దొంగ (1990), కొదమసింహం (1990), వంటి చిత్రాలతో లీడర్ (1991), ముఠా మేస్త్రి (1993), హిట్లర్ (1997), బావగారూ బాగున్నారా? (1998), చూడాలని వుంది (1998), ఇంద్ర (2002), ఠాగూర్ (2003) మరియు శంకర్ దాదా MBBS (2004) అతనికి సాటిలేని స్టార్‌డమ్‌ని అందించాయి.

2007 తర్వాత, అతను రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించాడు, అది సినిమాలకు 10 సంవత్సరాల విరామానికి దారితీసింది. 2008 లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రవేశించారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించలేక పోయినప్పటికీ అనంతర కాలంలో కాంగ్రెస్ పార్టీ లో చేరి కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా భాద్యతలు నిర్వర్తించారు.

2017లో ఖైదీ నంబర్ 150తో తన సినిమా ఇన్నింగ్స్‌ను తిరిగి ప్రారంభించారు. తర్వాత పీరియాడికల్ డ్రామా సైరా నరసింహా రెడ్డిలో నటించాడు. ఆ తర్వాత పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన ఆయన ప్రస్తుతం యువ దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో  విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు.

 చిరంజీవి అంటే ముందుగా గుర్తుకు వచ్చేది ఆయన డ్యాన్స్. నటనతోపాటు ఆయన డ్యాన్సుల్లో గ్రేస్‌, రిథమ్‌ కూడా ఆయన్ని అభిమానులకు మరింత చేరువ అవ్వడానికి కారణం అని చెప్పవచ్చు. చిరంజీవి తరహాలో స్టెప్పులు వేసిన ఇండియన్‌ హీరో మరొకరు లేరని చెబితే అతిశయోక్తి కాదు.డ్యాన్సులకు గానూ గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డులో మెగాస్టార్‌ చిరంజీవి  స్థానం సంపాదించుకున్నారు. 156 సినిమాల్లో 537 పాటల్లో, 24000 మూమెంట్స్ వేసిన అరుదైన నటుడిగా చిరంజీవి గిన్నిస్ రికార్డ్ సొంతం చేసుకున్నారు.  

సినిమాలతో పాటు సామాజిక కార్యక్రమాల ద్వారా ఎంతోమందికి అండగా నిలుస్తున్నారు. చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌ ద్వారా ఎంతోమంది ప్రాణాలను కాపాడుతున్నారు. తన నటనతో ప్రేక్షకులను అలరించిన చిరంజీవి పలు అవార్డులు, రివార్డులను అందుకున్నారు. భారత సినిమా రంగానికి ఆయన చేసిన కృషికి గానూ కేంద్ర ప్రభుత్వం నుండి పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులను అందుకున్నారు.ఆయన సినీ ప్రయాణం మరికొన్ని సంవత్సరాల పాటు దిగ్విజయంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.

--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com