మ‌హిళా టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌..భార‌త్ పై న్యూజిలాండ్ విజయం

- October 05, 2024 , by Maagulf
మ‌హిళా టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌..భార‌త్ పై న్యూజిలాండ్ విజయం

దుబాయ్: మ‌హిళ‌ల టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024ను భార‌త్ ఓట‌మితో మొద‌లుపెట్టింది. శుక్ర‌వారం న్యూజిలాండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో భార‌త్ 58 ప‌రుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో ఓట‌మిపై టీమ్ఇండియా కెప్టెన్ హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ మాట్లాడింది. తాము అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న ఇవ్వ‌లేద‌ని చెప్పింది. ఇలాంటి మెగా టోర్నీల్లో ప్ర‌తి మ్యాచ్ కూడా ఎంతో ముఖ్య‌మ‌ని తెలిపింది. ఈ ఓట‌మి నుంచి గుణ‌పాఠాలు నేర్చుకుని మిగిలిన మ్యాచుల్లో అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న ఇస్తామంది.

గ‌తంలో చాలా సార్లు మేము 160-170 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఛేదించాము. ఇలాంటి ల‌క్ష్యాల‌ను ఛేదించాలంటే ఎవ‌రో ఒక‌రు ఇన్నింగ్స్ ఆఖ‌రి వ‌ర‌కు క్రీజులో నిల‌బ‌డాల్సి ఉంటుంది. అయితే.. మేము వ‌రుస‌గా వికెట్లు కోల్పోతూనే ఉన్నాము. అని హ‌ర్మ‌న్ అంది.

మెగా టోర్నీలో ఇది తాము ఆశించిన ప్రారంభం కాద‌ని అంది. ఈ ఓట‌మి నుంచి త‌ప్పుల‌ను నేర్చుకుని ముందుకు సాగాలి. జ‌ట్టు పై త‌న‌కు పూర్తి న‌మ్మ‌కం ఉన్న‌ట్లు చెప్పింది.’ ఈ మ్యాచ్‌లో కొన్ని అవ‌కాశాల‌ను సృష్టించుకున్నాము. అయితే వాటిని స‌ద్వినియోగం చేసుకోలేక‌పోయాము. మా కంటే కివీస్ మెరుగైన క్రికెట్ అడింది. ఇక ఫీల్డింగ్‌లోనూ కొన్ని త‌ప్పుల‌ను చేశాము అని హ‌ర్మ‌న్ చెప్పింది.’ మిగిలిన మ్యాచుల్లో అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న ఇస్తామంది.ఆదివారం భార‌త జ‌ట్టు చిర‌కాల ప్ర‌త్య‌ర్థి పాకిస్థాన్‌తో త‌ల‌ప‌డ‌నుంది.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో కివీస్‌ 4 వికెట్ల న‌ష్టానికి 160 ప‌రుగులు చేసింది. కివీస్ బ్యాట‌ర్ల‌లో కెప్టెన్‌ సోఫీ డివైన్‌ (57; 36 బంతుల్లో 7ఫోర్లు) హాఫ్ సెంచ‌రీతో రాణించింది. భార‌త బౌల‌ర్ల‌లో రేణుకా సింగ్ రెండు వికెట్లు, ఆశ శోభ‌న‌, అరుంధ‌తి రెడ్డిలు చెరో వికెట్ తీశారు.

భారీ ల‌క్ష్య ఛేద‌న‌లో భార‌త్ 19 ఓవ‌ర్ల‌లో 102 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. 15 ప‌రుగులు చేసిన కెప్టెన్ హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ టాప్ స్కోర‌ర్‌. కివీస్ బౌల‌ర్ల‌లో రోజ్‌మేరీ మైర్ నాలుగు వికెట్లు, లియా తహుహు మూడు వికెట్లు, ఈడెన్‌ కార్సన్ రెండు వికెట్లు తీసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com