భారతదేశ ప్రజాస్వామ్య పునరుద్దారకుడు...!

- October 11, 2024 , by Maagulf
భారతదేశ ప్రజాస్వామ్య పునరుద్దారకుడు...!

భారతదేశ రాజకీయ చరిత్ర గతిని మలుపుతిప్పన మహనీయుడు లోకనాయకుడైన జయప్రకాశ్ నారాయణ్. వామపక్ష సామ్యవాద భావజాలాన్ని మదించి దేశ అవసరాలకు అనుగుణంగా సర్వోదయ సామ్యవాద భావజాలాన్ని రూపొందించిన రాజనీతిజ్ఞుడు.మహాత్మా గాంధీ అడుగుజాడల్లో నడుస్తూ గాంధేయవాదాన్ని చివరి వరకు ఆచరించి చూపించారు.ఐక్యరాజ్య సమితితో కలిసి ప్రపంచ శాంతి కోసం  పాటుపడ్డారు.సంపూర్ణ విప్లవానికి నాంది పలికి రాజకీయ దురహంకారంతో చట్టబద్దమైన వ్యవస్థల స్వేచ్ఛను హరించిన నేతల భరతం పట్టిన మహానాయకుడు జేపీ.నేడు స్వాతంత్య్ర సమరయోధులు, సర్వోదయ నాయకుడు, లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ జయంతి.

ప్రపంచ రాజకీయ వర్గాల్లో జేపీగా గుర్తింపు పొందిన  జయప్రకాశ్ నారాయణ్ 1902,అక్టోబర్ 11న నాటి ఉమ్మడి బెంగాల్ ప్రావిన్స్ లోని శరన్ జిల్లాలో భాగమైన సీతాబ్దియారా గ్రామంలో జన్మించారు( ప్రస్తుతం సీతాబ్దియారా గ్రామం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బలియా జిల్లాలో ఉంది). వీరి తల్లిదండ్రులు హార్ష్ దయాళ్, ఫూల్ రాణి దేవి. జేపీ ఇంటర్మీడియట్ వరకు తన విద్యాభ్యాసాన్ని పాట్నాలో పూర్తి చేశారు.విద్యార్ధి దశలోనే మాజీ రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్ బంధువైన ప్రభావతి దేవితో వివాహం జరిగింది.అనంతరం ఆయన ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లి ఆర్థికంగా పలు ఇబ్బందులు పడుతూనే యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్ నుంచి సోషియాలిజీలో మాస్టర్స్ పూర్తి చేశారు.

అమెరికాలో ఉన్న సమయంలోనే జేపీ వామపక్ష సామ్యవాద భావజాలానికి ఆకర్షితుడై, అక్కడి వామపక్ష మేధావులతో సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకున్నారు.వారి సలహా మేరకు రష్యాలో పర్యటించి సామ్యవాద పనితీరును పరిశీలించి, భారత దాస్య విముక్తికి వామపక్ష సామ్యవాదమే సరైన పరిష్కారం అని భావిస్తూ వచ్చారు. 1929లో భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత బాబు రాజేంద్రప్రసాద్ మరియు మరికొందరు ఆత్మీయుల ప్రోత్సాహంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు.అయితే, పార్టీ అధిష్ఠానం పనితీరు పట్ల అసంతృప్తితో ఉండేవారు జేపీ.1930లో గాంధీజీ పిలుపు మేరకు శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొని అరెస్ట్ అయ్యి నాసిక్ జైలులో ఉంచబడ్డారు.

నాసిక్ జైలులో తనలాగే ఖైదు కాబడ్డ యువ కాంగ్రెస్ నేతలైన రామ్ మనోహర్ లోహియా, అచ్యుత పట్వర్థన్, మినో మాసాని వంటి పలువురితో పరిచయాలు ఏర్పడ్డాయి.రిలీజైన తర్వాత వీరందరూ కలిసి కాంగ్రెస్ అనుబంధ విభాగంగా కాంగ్రెస్ సోషలిస్టు పార్టీని స్థాపించారు.కాంగ్రెస్ సోషలిస్టు పార్టీలో పనిచేస్తున్న సమయంలోనే వామపక్ష సామ్యవాద భావజాలంలో ఉన్న లోటుపాట్లు స్పష్టంగా తెలుస్తూ వచ్చాయి. దాంతో పాటుగా మహాత్మా గాంధీ సహచర్యంలో అహింసాయుత వాదాన్ని అర్థం చేసుకుంటూ అస్పృశ్యత నివారణ, అంటరాని తనం, గ్రామీణ పునర్నిర్మాణం వంటి అంశాల మీద లోతైన అధ్యయనం ఆయన్ని సర్వోదయ సామ్యవాద భావజాల రూపకల్పనకు ప్రేరేపించాయి.జేపీ జాతీయ రాజకీయాల్లో బిజీగా గడిపే నాటికీ నెహ్రూ అనామకుడిగా కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా గాంధీ కోటరీలో ఉండేవారు.  

స్వాతంత్య్ర ఉద్యమంలో పనిచేస్తూనే భారతీయ సామ్యవాద సిద్ధాంత రూపకల్పనలో నిమగ్నమయ్యారు.దేశానికి స్వాతంత్య్రం వచ్చే దశలో జేపీ లాహోర్ జైల్లో ఉన్నారు. జేపీని స్వాతంత్య్ర చర్చల్లో పాల్గొనకుండా చేసిన ఘనత ఆనాటి కాంగ్రెస్ పెద్దలకు దక్కుతుందని సమకాలీన చరిత్రకారులు పేర్కొన్నారు.ఒకవేళ జేపీ ఆ చర్చల్లో పాల్గొనుంటే దేశ విభిజన జరిగేది కాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.దీనికి వివరణ ఇస్తూ జేపీకి నెహ్రూ మరియు ఇతర కాంగ్రెస్ నాయకులకు ఉన్న ఆత్మనూన్యతా భావం, పదవుల మీద వ్యామోహం లేకపోవడమే కాకుండా ముస్లింలీగ్ నాయకుడు జిన్నాకు జేపీకి మధ్య గౌరవమైన స్నేహం కుడా దేశ విభజన సమస్యను సామరస్యంగా పరిష్కరించే దిశగా అడుగులు పడేవని చెబుతున్నారు. ఏది ఏమైనా జేపీ ఆ చర్చల్లో పాల్గొనక పోవడం మూలాన, దేశ విభజన అస్తవ్యస్తంగా ముగిసి హింసాయుత ఘటనలకు తావు నిచ్చింది.

దేశ విభజన విషయంలో నెహ్రూ నేతృత్వంలోని కాంగ్రెస్ చేసిన ఘోర తప్పిదాలను నిరసిస్తూ ఆ పార్టీకి రాజీనామా చేసి, సామ్యవాద సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు దేశవ్యాప్తంగా పర్యటించారు. ఇదే సమయంలో కాంగ్రెస్ నిరంకుశ పెడ ధోరణలు నచ్చని అనేక మంది దేశభక్తులు జేపీని కలిసి కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా జాతీయ పార్టీని ఏర్పాటు చేయవలసిందిగా కోరడంతో, అందుకు సమ్మతించిన జేపీ, తన లాగే కాంగ్రెస్ పార్టీకి దూరమైన పాత సోషలిస్టు మిత్రులైన అశోక్ మెహతా, రామ్ మనోహర్ లోహియా మరియు ఇతరులతో కలిసి భారత సోషలిస్టు పార్టీని స్థాపించారు. ఆ పార్టీలో జేపీ ఏటువంటి రాజకీయ పదవిని చేపట్టకుండా, 1952 లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీ ప్రధాన స్టార్ క్యాంపెనర్ గా దేశమంతా తిరిగి విస్తృతంగా ప్రచారం చేశారు. కానీ, ఎన్నికల ఫలితాల్లో మాత్రం నెహ్రూ నేతృత్వంలోని కాంగ్రెస్ విజయభేరి మోగించడంతో రాజకీయాలకు దూరమయ్యారు.

జేపీ రాజకీయాల నుండి విరమించుకున్న తర్వాత పూర్తిగా మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామీణాభివృద్ధి కోసం తన సతీమణి ప్రభావతి దేవితో కలిసి పనిచేయడం మొదలు పెట్టారు.భూదాన్ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నారు.1950 మధ్య నాటికి బీహార్ రాష్ట్రంలో వెనుకబడిన ఇప్పటి ఝార్ఖండ్ ప్రాంతంలో సామాజిక సేవా కార్యక్రమాలు మొదలు పెట్టారు. గిరిజనుల్లో నిరక్ష్యరాస్యత రూపు మాపేందుకు పాఠశాలల ఏర్పాటు, మహిళాల కోసం వృత్తివిద్యా శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయించారు.గ్రామాల్లో ఉన్న సహజ వనరుల రక్షణ బాధ్యత పట్ల గ్రామస్తుల్లో అవగాహన కోసం పలు అవగాహనా తరగతులు నిర్వహించారు. 60వ దశకం మొదటి నాటికి ఆయన సర్వోదయ ఉద్యమానికి నాయకత్వం వహిస్తూ ఉత్తరభారత రాష్ట్రాలైన అవిభక్త యూపీ, బీహార్ మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అంటరానితనం నిర్మూలన, గ్రామీణాభివృద్ధి, వృత్తి కళాకారులకు చేయూత వంటి పలు కార్యక్రమాలు చేపట్టారు. జేపీ సర్వోదయ ఉద్యమానికి పార్టీలకతీతంగా రాజకీయ నాయకులు ఏకగ్రీవంగా మద్దతు తెలపడం విశేషం.

సర్వోదయ ఉద్యమం ద్వారా గ్రామీణాభివృద్ధికి పాటుపడుతున్న జేపీ కృషిని గుర్తించిన ఐక్యరాజ్య సమితి తమ సంస్కృతిక రాయబారిగా నియమించుకొని, ఆయన ద్వారా పలు దేశాల మధ్య శాంతి స్థాపనకు పూనుకుంది. అంతర్జాతీయ వ్యవహారాల్లో జేపీ కీలకంగా వ్యవహరించారు. భారత్ - చైనా యుద్ధం తర్వాత ఇరు దేశాల మధ్య సఖ్యత కుదరడంలో తెరవెనుక జేపీ జరిపిన మంత్రాంగమే కారణం.నేపాల్ దేశంలో ప్రజాస్వామ్య పునరుద్ధణకు సాగుతున్న పోరాటానికి నాయకత్వం వహించిన ఆందోళన కారులకు జేపీ మద్దతుగా నిలిచారు. ఇవే కాకుండా ఇజ్రాయిల్ దేశాన్ని సందర్శించి వారి సమస్యలను పలు అంతర్జాతీయ వేదికల మీద ప్రస్తావనకు వచ్చేలా జేపీ కృషి చేశారు. ఇవే కాకుండా అంతర్జాతీయ సోషలిస్టు కౌన్సిల్ సమావేశాలకు భారతదేశం నుండి ప్రత్యేక ఆహ్వానితుడిగా గౌరవ పొందిన తోలి భారతీయుడిగా జేపీ నిలిచారు.

70వ దశకం నాటికి దేశ పాలనా వ్యవస్థలో అవినీతి, బంధుప్రీతి,పక్షపాత వైఖరి మితిమీరడంతో పాటుగా, దేశాన్ని సురక్షితంగా కాపాడే రాజ్యాంగ వ్యవస్థలను పతనం దిశగా నడిపిస్తున్న ఇందిరా నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ నేతలు దురంహంకారం మూలాన ప్రజల పడుతున్న అవస్థలను చూసి చాలించిన జేపీ, రాజకీయాల్లో తిరిగి క్రియాశీలకంగా వ్యవహరించడం ప్రారంభించారు. గుజరాత్ రాష్ట్రంలో మొదలైన కాంగ్రెస్ వ్యతిరేక విద్యార్ధి ఆందోళనలకు నైతిక మద్దతును అందించి, యావత్ దేశం దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత తన స్వరాష్ట్రమైన బీహార్ విద్యార్థుల ఆందోళనా ఉద్యమానికి నాయకత్వం వహించడం ద్వారా జేపీ ఢిల్లీ పాలకుల గుండెల్లో హడలు పుట్టించారు. అవినీతికి సంపూర్ణ విప్లవానికి నాంది పలికిన ఆ ఉద్యమంలో యువత క్రియాశీలకంగా పాల్గొన్నారు. ఈ ఉద్యమంలోనే ఆయన్ని ప్రజాస్వామ్య రక్షకుడిగా పరిగణిస్తూ "లోక్ నాయక్" బిరుదును ప్రజలే స్వచ్ఛందంగా అందించారు.  

 ఇందిరా గాంధీ ప్రభుత్వం పాల్పడుతున్న అధికార దుర్వినియోగానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం జేపీ విమర్శనాస్త్రాలు సంధించడం ప్రారంభించారు. జేపీ వ్యాఖ్యలతో ఉక్కిరి బిక్కిరైన ఇందిరా దేశవ్యాప్తంగా ఎమెర్జెన్సీని విధించడమే కాకుండా జేపీతో పాటుగా ప్రతిపక్ష నేతలను, విద్యార్థులను అరెస్ట్  చేసి జైల్లో పెట్టించారు. జేపీ అరెస్ట్ ప్రపంచవ్యాప్తంగా పాకడంతో అంతర్జాతీయ దేశాల నుండి వచ్చిన ఒత్తిడి మేరకు ఎమెర్జెన్సీ ఎత్తివేసి ఎన్నికలకు మార్గం సుగమం చేసింది ఇందిరా సర్కార్. ఇందిరాను ఓడించేందుకు కంకణం కట్టుకున్న జేపీ, విపక్ష పార్టీలను విలీనం చేసి జనతా పార్టీని స్థాపించారు. 1977 లోక్ సభ ఎన్నికల్లో ఇందిరా సర్కారును గద్దె దింపి, జనతా పార్టీకి ప్రజలు పట్టం కట్టారు. జనతా పార్టీ గెలుపుతో తిరిగి రాజకీయాలకు దూరం జరిగారు.

రాజకీయ, సామాజిక రంగాల్లో జయప్రకాశ్ నారాయణ్ చేసిన విశేషమైన సేవలకు గుర్తుగా ఎన్నో సంస్థలు అవార్డులతో సత్కరించాలని చూసినా వాటిని సున్నితంగా తిరస్కరించారు. ఏదో ఫలితాన్ని, ప్రయోజనాన్ని ఆశించి పనులు చేయలేదని సమాజ అభివృద్ధికి  తనవంతు బాధ్యతగా చేసిన దాన్ని ప్రచారం చేసుకోవడం సరికాదని పలుమార్లు చెప్పారు. అయినప్పటికీ కొన్ని సంస్థలు ఆయన్ని గౌరవించడమే తమ లక్ష్యంగా పెట్టుకొని మరీ ఆయనకు తమ అవార్డులతో సత్కరించాయి. అలా,1965లోరామన్ మెగసెసే పురస్కారం మరియు పలు దేశాధినేతలు తమ దేశ అత్యున్నత పురస్కారాలతో ఆయన్ని సత్కరించారు. ఆయన మరణాంతరం 1998లో అప్పటి ఎన్డీయే కూటమి దేశ అత్యున్నత పురస్కారమైన "భారతరత్న"తో గౌరవించించింది.

జయప్రకాశ్ నారాయణ్ లాంటి విశిష్టమైన వ్యక్తిత్వం కలిగిన నాయకుడు భారతదేశంలో మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. తన ద్వారా జరిగిన తప్పులను బహిరంగంగా అంగీకరించడమే కాకుండా, సరి చేసుకునేవారు. పదవుల కోసం ఏనాడు ఆశపడిన దాఖలాలు లేవు, ఒకవేళ ఆయన పదవులనే కోరుకొని ఉంటే దేశానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత రెండో ఉపప్రధాని అయ్యేవారు లేదా జనతా ప్రభుత్వం ఏర్పడ్డ రోజే ప్రధానిగా బాధ్యతలు చేపట్టేవారు. గాంధీ చూపిన మార్గంలో నడుస్తూ నిరాడంబరంగా జీవిస్తూ వచ్చిన ఆయన 1979, అక్టోబర్ 8న  పాట్నాలోని తన స్వగృహంలో కన్నుమూశారు.దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు పాటుపడిన ఈ మహనీయుడికి నివాళిగా ప్రతి యేటా ఆయన జయంతిని "ప్రజాస్వామ్య పరిరక్షణ దినం"గా భారత ప్రభుత్వం ప్రకటించింది.    

--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com