స్పిన్ మాంత్రికుడు-అనిల్ కుంబ్లే
- October 17, 2024
అనిల్ కుంబ్లే...భారత క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. సుమారు రెండు దశాబ్దాల పాటు జట్టులో కీలకమైన బౌలింగ్ బృందానికి నాయకత్వం వహించి, ఇండియాకు మరుపురాని విజయాలను అందించిన దిగ్గజ ఆటగాడు కుంబ్లే. అంతర్జాతీయ క్రికెటర్లో తన తరంలో ఏ ఒక్కరికి సొంతం కానీ 10 /10 వికెట్లు తీసిన ఘనత సైతం కుంబ్లే తన ఖాతాలో వేసుకున్నాడు. బౌలర్ గానే కాకుండా జట్టు నాయకత్వ బాధ్యతలు స్వీకరించి విజయపథంలో నడిపించాడు. ఆ తర్వాత టీం ఇండియా కోచ్ గా సైతం రాణించాడు. నేడు స్పిన్ మాంత్రికుడు అనిల్ కుంబ్లే పుట్టినరోజు.
అనిల్ కుంబ్లే పూర్తి పేరు అనిల్ కృష్ణస్వామి కుంబ్లే. 1970,అక్టోబర్ 17న కృష్ణ స్వామి, సరోజా దంపతులకు కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో జన్మించాడు. కుంబ్లే బెంగళూరులోని ఆర్వీ కాలేజ్ అఫ్ ఇంజనీరింగ్ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. చిన్న తనం నుంచే క్రికెట్ మీదున్న మక్కువతో బెంగళూరులోని క్లబ్ క్రికెట్లో ఆడేవాడు. అనంతరం కర్ణాటక తరుపున రంజీల్లో ఆడుతూ తన అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో జట్టుకు మరపురాని విజయాలను అందించాడు. దేశవాళీ క్రికెట్లో 10/10 వికెట్లు తీసిన ఘనతను మొదటి బౌలర్ కుంబ్లే కావడం విశేషం.
దేశవాళీలో అద్భుతంగా రాణించిన కుంబ్లేకు జాతీయ జట్టులోకి పిలుపొచ్చింది. 1990వ సంవత్సరంలో శ్రీలంకతోటి వన్డేల్లో, ఇంగ్లాడ్ మీద టెస్టుల్లో అరంగేట్రం చేసిన కుంబ్లే 90వ దశకంలో టీం ఇండియా జట్టుకు లెగ్ స్పిన్ బౌలింగ్ బాధ్యతలను భుజాన వేసుకొని జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. తనతో పాటుగా కర్ణాటకకు చెందిన ఫాస్ట్ బౌలర్లు జవగళ్ శ్రీనాథ్, వెంకటేశ్ ప్రసాద్ లతో కలిసి అద్భుతాలు చేశాడు. ఈ త్రయం బౌలింగ్ లో భారత బౌలింగ్ పటిష్టంగా ఉండేది. 1999లో పాకిస్తాన్ తో జరిగిన ఢిల్లీ టెస్టులో 10/10 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు కుంబ్లే. ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఇంగ్లాడ్ అతగాడు జిమ్ లేకర్ తర్వాత ఈ ఘనతను సాధించిన తోలి భారత ఆటగాడిగా, రెండో బౌలర్ గా రికార్డ్ సృష్టించాడు. కుంబ్లే నమోదు చేసిన ఈ రికార్డ్ మన దాయాది దేశమైన పాక్ తో కావడం అభిమానులను మరింత ఖుషి చేసింది.
2004లో బంగ్లాదేశ్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో టీం ఇండియా మాజీ కెప్టెన్ మరియు దిగ్గజ ఆల్ రౌండర్ కపిల్ దేవ్ పేరిట నమోదైన 434 రికార్డును కుంబ్లే అధిగమించాడు. ఆ తర్వాత 2006లో 500 వికెట్లు , 2008లో 600 వికెట్లు తీసిన మొదటి భారత ఆటగాడిగా కుంబ్లే చరిత్ర సృష్టించాడు. బ్యాటింగులో సైతం కుంబ్లే తనదైన శైలిలో రాణించాడు. 2007లో జరిగిన ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌లో అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో పాటుగా తోలి సెంచరీని నమోదు చేశాడు. 2007-08 మధ్యలో టీం ఇండియా సారథిగా వ్యవహరించాడు. 2008 నవంబర్‌లో జరిగిన ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ మూడో మ్యాచ్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాడు. 132 టెస్ట్ మ్యాచుల్లో 619 వికెట్లు, 217 వన్డే మ్యాచుల్లో 337 వికెట్లు తీశాడు. అంతర్జాతీయ మ్యాచుల్లో 900 పైగా వికెట్లు తీసుకున్న తోలి భారతీయుడిగా కుంబ్లే చరిత్రకెక్కాడు.
అంతర్జాతీయ క్రికెట్ నుంచి విరామం తీసుకున్న తర్వాత 2010లో కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘానికి అధ్యక్షుడిగా పనిచేశాడు. అలాగే, తన సహచర మిత్రులైన వెంకటేశ్ ప్రసాద్ ఉపాధ్యక్షుడిగా, జవగళ్ శ్రీనాథ్ కార్యదర్శిగా ఎన్నికవ్వడం విశేషం. కర్ణాటక రంజీ జట్టులో విప్లవాత్మకమైన సంస్కరణలు తీసుకురావడంలో కుంబ్లే తన వంతు పాత్ర పోషించాడు. 2016-17 మధ్యలో టీం ఇండియా ప్రధాన కోచ్ బాధ్యతలు నిర్వహించాడు. 2005లో పద్మ శ్రీ పురస్కారాన్ని అందుకున్నాడు.
రిటైర్మెంట్ తర్వాత ఐపీఎల్ లీగ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు తరుపున 2008,2009,2010 సీజన్లు ఆడిన కుంబ్లే తర్వాత ఆ జట్టుకు చీఫ్ మెంటర్ గా 2011-13 వరకు పనిచేశాడు. ఆ తర్వాత ముంబై ఇండియన్స్, కింగ్స్ లెవన్ పంజాబ్ జట్లతో కలిసి పనిచేశాడు.ప్రస్తుతం వ్యాఖ్యాతగా రాణిస్తున్నాడు.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి