రాష్ట్ర ప్రభుత్వ ఇఫ్తార్‌కి ఏర్పాట్లు పూర్తయ్యాయి

- June 23, 2016 , by Maagulf
రాష్ట్ర ప్రభుత్వ ఇఫ్తార్‌కి ఏర్పాట్లు పూర్తయ్యాయి

రాష్ట్ర ప్రభుత్వ ఇఫ్తార్‌కి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మతపెద్దలు హాజరు కానుండటంతో విస్తృత ఏర్పాట్లు చేశారు. గుంటూరు కలెక్టర్‌ కాంతీలాల్‌ దండే, ప్రొటోకాల్‌ సెక్రెటరీ రమేష్‌ గురువారం ఇఫ్తార్‌ జరిగే జిల్లా కేంద్రంలోని సన్నిధి కన్వెన్షన సెంటర్‌ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం కలెక్టర్‌ తన కార్యాలయంలో వివిధ ప్రభుత్వ శాఖల అధిపతులతో సమీక్షించారు. ఇందుకోసం సుమారు రెండువేల మంది ముస్లింలకు జిల్లా యంత్రాంగం పాస్‌లు పంపిణీ చేసింది. సెక్యూరిటీ సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులు కలుపుకొంటే సుమారు నాలుగైదువేల మంది ఇఫ్తార్‌కి హాజరయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా వేసి ఏర్పాట్లను అందుకు తగిన రీతిలో చేస్తున్నారు. సీఎం చంద్రబాబు రోడ్డు మార్గాన వస్తారని సమాచారం. హెలికాఫ్టర్‌లో వచ్చే అవకాశం కూడా ఉండటంతో పోలీసు పరేడ్‌గ్రౌండ్స్‌లో హెలిప్యాడ్‌ని సిద్ధం చేశారు. ముఖ్యమంత్రి ఐదో నెంబర్‌ జాతీయ రహదారి మీదగా లాలుపురం వై జంక్షన నుంచి మిర్చియార్డు, చుట్టుగుంట మీదగా సన్నిధికి చేరుకొంటారు. సాయంత్రం 5.40 గంటల సమయంలో సీఎం రానున్నారు. నమాజ్‌ పూర్తి అయిన తర్వాత ముస్లిం సోదరులకు విందు ఏర్పాటు చేస్తారు. రాత్రి 8 గంటల సమయంలో సీఎం పర్యటన ముగించుకొని విజయవాడకు తిరుగు ప్రయాణం అవుతారు. వీలైతే సీఎం తిరుగు ప్రయాణంలో చంద్రమౌళీనగర్‌లోని నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు నివాసానికి వెళ్లొచ్చని కలెక్టర్‌కు సమాచారం అందింది. పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు 
సీఎం చంద్రబాబు నగరంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందుకు హాజరవుతున్న నేపథ్యంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. పలు రోడ్లలో వాహనాలను దారి మళ్లించారు. ఈ మేరకు గురువారం అర్బన్‌ ఎస్పీ త్రిపాఠి క్యాంప్‌ కార్యాలయంలో అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలతో భద్రతా ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. 
సీఎం చంద్రబాబు పర్యటన దృష్ట్యా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. వీవీఐపి, వీఐపి, సాధారణ వ్యక్తులకు ఏర్పాటు చేసిన ప్రత్యేక స్థలాలను అధికారులు పరిశీలించారు. మీడియా ప్రతినిధులకు జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి పూర్ణ చంద్రరావు, వెస్ట్‌ డీఎస్పీ సరితలను ఇన్‌చార్జ్‌లుగా నియమించారు. ఈ సందర్భంగా బాంబ్‌ డిస్పోజల్‌ టీమ్‌, డాగ్‌ స్క్వాడ్‌, క్విక్‌ రియాక్షన్‌ టీమ్‌, రోప్‌ పార్టీల సిబ్బందిని నియమించామన్నారు. వారంతా తమకు కేటాయించిన ప్రాంతాల్లో సమర్థంగా విధులు నిర్వహించాలన్నారు. నగరంలో ట్రాఫిక్‌ను డీఎస్పీ కండే శ్రీనివాసులు పర్యవేక్షిస్తారన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com