దిగ్గజ దర్శక నిర్మాత-జగపతి రాజేంద్రప్రసాద్

- November 04, 2024 , by Maagulf
దిగ్గజ దర్శక నిర్మాత-జగపతి రాజేంద్రప్రసాద్

తెలుగు చిత్రసీమలో ఎంతోమంది నిర్మాతలు తమ అభిరుచికి తగ్గ చిత్రాలను నిర్మించి, జనం మదిలో నిలచిపోయారు. అలాంటి వారిలో జగపతి ఆర్ట్ పిక్చర్స్ అధినేత వి.బి.రాజేంద్రప్రసాద్ స్థానం ప్రత్యేకమైనది. నిర్మాతగానే కాకుండా, దర్శకునిగానూ రాజేంద్రప్రసాద్ ఆకట్టుకున్నారు. ‘జగపతి’ బ్యానర్ కు జనం మదిలో ఓ తరిగిపోని స్థానం సంపాదించారు. తన చిత్రాలలో పాటలకు పెద్ద పీట వేసేవారు రాజేంద్రప్రసాద్. తరువాతి రోజుల్లో తన సినిమాల్లోని పాటలను కలిపి, కాసింత వ్యాఖ్యానం జోడించి, ‘చిటపటచినుకులు’ అనే మకుటంతో రెండు భాగాలుగా విడుదల చేసి, అలరించారు. ఈ తీరున ఆకట్టుకున్న నిర్మాత-దర్శకుడు మరొకరు కానరారు. నేడు సుప్రసిద్ద దర్శక నిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్ గారి జయంతి.

తెలుగు సినీ జగత్తులో జగపతి రాజేంద్రప్రసాద్ గా ప్రసిద్దులైన వీరమాచినేని బాబు రాజేంద్రప్రసాద్ గారు 1932, నవంబర్ 4వ తేదిన ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలోని ఉమ్మడి కృష్ణా జిల్లా గుడివాడ తాలూకాలోని డోకిపర్రు గ్రామంలోని సంపన్న రైతు కుటుంబానికి చెందిన జగపతి రావు చౌదరి, లక్ష్మీనరసమ్మ దంపతులకు జన్మించారు. వీరి తండ్రి గారు గుడివాడ ప్రాంత రాజకీయాల్లో కీలకంగా ఉండేవారు. వీరు చిన్నతనం నుంచి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉండేవారు. డోకిపర్రు, గుడివాడ ప్రాంతాల్లో పీయూసీ వరకు చదువుకున్నారు. ఆ తర్వాత కాకినాడలోని పిఠాపురం రాజా కళాశాలలో బీఎస్సీ పూర్తి చేశారు. కాలేజీలో పిఠాపురం యువరాజులు, ప్రముఖ సినీ నిర్మాత ఏడిద నాగేశ్వరరావులు ఆయన స్నేహితులు.

రాజేంద్రప్రసాద్ చదువుకుంటూనే నాటకాలలో వేషాలు వేస్తూ, సినిమాలపై ఆసక్తి పెంచుకున్నారు. ఏడిద నాగేశ్వరరావుతో కలిసి ‘రాఘవ కళాసమితి’ అనే సాంస్కృతిక సంస్థను నెలకొల్పి, ఆ బ్యానర్ పైనే నాటకాలు వేసేవారు. ‘ఇన్ స్పెక్టర్ జనరల్’ అనే నాటకంలో స్త్రీ పాత్ర ధరించి, ఉత్తమకథానాయికగా అవార్డునూ సంపాదించారు. నటుడవ్వాలనే కోరికతో మద్రాసు చేరారు. అక్కడ తన అభిమాన హీరో ఏయన్నార్ ను కలుసుకున్నారు. ఆయన ప్రోత్సాహంతో కొన్ని సినిమాల్లో ప్రయత్నించారు. కానీ, ఫలితం లేకుండా పోయింది. దాంతో తన తండ్రి పేరిటి ‘జగపతి ఆర్ట్ పిక్చర్స్’ పతాకం స్థాపించి, తొలి ప్రయత్నంగా జగ్గయ్య కథానాయకునిగా, జమున నాయికగా ‘అన్నపూర్ణ’ చిత్రం నిర్మించారు. వి.మధుసూదనరావు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నిర్మాతగా రాజేంద్రప్రసాద్ గారికి మంచి పేరు సంపాదించి పెట్టింది.

తొలి చిత్రం ‘అన్నపూర్ణ’ కాగానే, తన అభిమాన కథానాయకుడు ఏయన్నార్ తో ‘ఆరాధన’ నిర్మించారు. ఆ సినిమా కూడా మంచి ఆదరణ పొందింది. అప్పటి నుంచీ ఏయన్నార్ తోనే సినిమాలు నిర్మిస్తూ సాగారు. అలాగే తన సినిమా టైటిల్స్ అన్నీ ఇంగ్లిష్ అక్షరం ‘ఎ’తో ఆరంభమయ్యేలా చూసుకొనేవారు. “ఆత్మబలం, అంతస్తులు, ఆస్తిపరులు, అదృష్టవంతులు” వరకు వి.మధుసూదనరావు దర్శకత్వంలోనే చిత్రాలను నిర్మించారు. తరువాత ఎడిటర్ ఎ.సంజీవి దర్శకత్వంలో ‘అక్కాచెల్లెలు’ నిర్మించారు. ఆపై ఏయన్నార్ ప్రోత్సాహంతో తానే డైరెక్టర్ గా మారి ‘దసరాబుల్లోడు’ నిర్మించారు. ఈ రంగుల చిత్రం 1971లో బ్లాక్ బస్టర్ గా నిలచింది. ఏయన్నార్ కు తొలి స్వర్ణోత్సవంగానూ ‘దసరాబుల్లోడు’ చరిత్రకెక్కింది.

అక్కినేనితో “బంగారుబాబు, బంగారుబొమ్మలు, రామకృష్ణులు, ఎస్పీ భయంకర్, భార్యాభర్తల బంధం” వంటి చిత్రాలు నిర్మించి, దర్శకత్వం వహించారు. వీటిలో ‘రామకృష్ణులు’లో ఎన్టీఆర్, ‘భార్యాభర్తల బంధం’లో రామారావు తనయుడు బాలకృష్ణ ఏయన్నార్ తో కలసి నటించడం విశేషం. శోభన్ బాబు హీరోగా “మంచిమనసులు, పిచ్చిమారాజు” చిత్రాలను రూపొందించారు రాజేంద్ర ప్రసాద్. తమిళంలో ‘బంగారుబాబు’ రీమేక్ గా ‘ఎంగల్ తంగ రాజా’ తెరకెక్కించి విజయం సాధించారు. హిందీలో ‘దసరా బుల్లోడు’ రీమేక్ గా ‘రాస్తే ప్యార్ కీ’ నిర్మించారు. అక్కినేని ఆనందరావు నిర్మించిన ‘అందరూ దొంగలే’ చిత్రానికి వి.బి.రాజేంద్రప్రసాద్ దర్శకత్వం వహించారు. హిందీలో విజయం సాధించిన ‘విక్టోరియా 203’ఆధారంగా ‘అందరూ దొంగలే’ తెరకెక్కింది. తెలుగులోనూ మంచి ఆదరణ చూరగొందీ చిత్రం.

బాలకృష్ణ హీరోగా ‘బంగారుబుల్లోడు’ చిత్రాన్ని రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో నిర్మించగా, ఆ సినిమా ఘనవిజయం సాధించింది. నాగార్జున హీరోగా స్వీయ దర్శకత్వంలో వి.బి.రాజేంద్రప్రసాద్ ‘కెప్టెన్ నాగార్జున’ నిర్మించారు. తరువాత నాగ్ హీరోగా ఫాజిల్ డైరెక్షన్ లో ‘కిల్లర్’ రూపొందించారు. తనయుడు జగపతిబాబును హీరోగా పరిచయం చేస్తూ వి.మధుసూదనరావు దర్శకత్వంలో ‘సింహస్వప్నం’ నిర్మించారు. ఆ తరువాత తనయుడు హీరోగా ‘భలే బుల్లోడు, పెళ్ళిపీటలు’ వంటి చిత్రాలు తెరకెక్కించారు. ఆ సినిమాలేవీ అంతగా అలరించలేకపోయాయి. అప్పటి నుంచీ సినిమాలకు దూరంగా జరిగారు రాజేంద్రప్రసాద్.

భాగ్యనగరంలో తెలుగు చిత్రసీమ స్థిరపడడంలో కృషి చేసిన వారిలో రాజేంద్రప్రసాద్ గారు ముఖ్యులు. ఫిలిమ్ నగర్ హౌసింగ్ సొసైటీకి ఆయన చాలా రోజులు ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఆయన హయాంలోనే ఫిలిమ్ నగర్ లో దైవసన్నిధానం నిర్మాణం సాగడం విశేషం. ఆ దేవస్థానానికి చివరి దాకా రాజేంద్రప్రసాద్ ఛైర్మన్ గా సేవలు అందించారు.

రాజేంద్రప్రసాద్ గారి వ్యక్తిగత జీవితానికి వస్తే, ఆయనకు ముగ్గురు కుమారులు. పెద్దబ్బాయి రామ్ ప్రసాద్ గారు భాగ్యనగరంలో ప్రసిద్ధ వాల్డెన్ బుక్ స్టోర్ నిర్వహించారు. రెండో అబ్బాయి యుగేంద్ర కుమార్ బిజినెస్ చేస్తున్నారు. మూడో అబ్బాయి జగపతి బాబు ఒకప్పుడు హీరోగా అలరించారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.

రాజేంద్రప్రసాద్ గారు ముక్కుసూటి మనిషి, నీతి నిజాయితీలే ప్రాణంగా బ్రతికారు. సినిమాల నిర్మాణంలో ఎటువంటి కాంప్రమైజ్ కాకుండా నిర్మించే నిర్మాతగా సైతం ఆయనకు పేరుంది. ఆయన నిర్మించిన అత్యధిక చిత్రాలు ఘనవిజయాలు సాధించడమే కాకుండా, నిర్మాతగా ఆయనకు మంచిపేరు తెచ్చిపెట్టాయి. 2015,  జనవరి 12న 82వ ఏట అనారోగ్యంతో కన్నుమూశారు. భౌతికంగా దూరమైనా, ఆయన చిత్రాల ద్వారా తెలుగు వారి మనసుల్లో ఈ నాటికీ చెరగని ముద్ర వేసుకొనే ఉన్నారు. 

--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com