సాహితీ విరాగి... ఆలూరి బైరాగి

- November 05, 2024 , by Maagulf
సాహితీ విరాగి... ఆలూరి బైరాగి

కవి జీవితం నుంచి కవిత్వం వెలువడడం తాదాత్మ్యకతను కనబరుస్తుంది. కవితా వస్తువు కవి జీవితం నుంచి రావడం కవిత్వానికి సజీవకత - శాశ్వతత్వం కలుగజేస్తుంది. జీవన ప్రయాణంలో ఎక్కువ కవిత్వం వెలువరించిన కవులు, ప్రసిద్ధి పొందిన వారు, తెలుగు నేల పైన ఎక్కువగా ఉన్నారనిపిస్తుంది. జీవితంలో ప్రతీ దశలోనూ మెరుపులు మరకలు కవులను స్పందింపజేస్తాయి.ఎలాంటి భేషజాలకూ, భుజకీర్తులకీ లొంగకుండా సాహిత్యమే తొలి ప్రాధాన్యతగా బతికేస్తారు. కీర్తి వస్తోందా లేదా, డబ్బు అవసరమా పాడా... అన్న మీమాంసలేవీ వారిలో కనిపించవు. వారి నిర్లక్ష్యానికి తగినట్లుగానే పేదరికంతోనే సదరు జీవితం గడిచిపోవచ్చు. కానీ సాహిత్యం పట్ల నిబద్ధతతో వారు సృజించిన రచనలు తరతరాల వరకూ నిలిచే ఉంటాయి.అలాంటి వారికి ఉదాహరణగా చెప్పుకోవాలంటే ముందుగా ఆలూరి బైరాగే గుర్తుకువస్తాడు. నేడు సుప్రసిద్ధ కవి, కథా రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, మానవతావాది ఆలూరి బైరాగి జయంతి.

బైరాగిగా సాహిత్య ప్రపంచం గుర్తించిన ఆలూరి బైరాగి పూర్తి పేరు ఆలూరి బైరాగి చౌదరి. 1925 నవంబర్ 5వ తేదీన ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలోని ఉమ్మడి గుంటూరు జిల్లా తెనాలి దగ్గర్లోని ఐతానగరంలోని మధ్యతరగతి రైతు కుటుంబానికి చెందిన ఆలూరి వెంకట్రాయుడు,సరస్వతి దంపతులకు జన్మించారు. బైరాగికి ముందు ఇద్దరు బిడ్డలు చనిపోవడంతో విచిత్రమైన పేర్లు పెట్టడం ఆచారమైన నాటి రోజుల్లో మూడవ బిడ్డగా జన్మించడం చేత పేరు ముందు “బైరాగి చేరిపోయింది. తరువాత ఆ పేరు స్థిరపడిపోయింది. బైరాగికి ముగ్గురు తమ్ముళ్లు భాస్కరరావు, గురవయ్య, సత్యం (ఇతడు లబ్ధప్రతిష్ఠుడైన వ్యంగ్య చిత్రకారుడు) ముగ్గురు చెల్లెళ్ళు ఉన్నారు.

ఆయన ఎక్కువకాలం బడికి వెళ్లింది లేదు. బహుశా ఆ రోజుల్లో చదువుకునే అవకాశాలు కూడా అంతంతమాత్రంగానే ఉండిఉంటాయి. అందుకనే రెండో తరగతి దాకా బడిబాట సాగించిన బైరాగి తర్వాత అందుబాటులో ఉన్న హిందీ పాఠశలలో చేరారు. ఆ హిందీలో ఒకో మెట్టూ ఎక్కుతూ ఉన్నతాభ్యాసం కోసం ఉత్తరాదికి వెళ్లారు. అక్కడివారితో పోటాపోటీగా హిందీ నేర్చుకోవడమే కాదు... హిందీ కవిసమ్మేళనాలలో పాల్గొనేంతగా అద్భుతమైన కవితలను సృష్టించారు! 1946లో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు హైస్కూల్లో హిందీ ఉపాధ్యాయుడుగాతన వృత్తి జీవితాన్ని మొదలుపెట్టారు.


ఒకపక్క వృత్తిలో సాగుతూనే అటు హిందీలోనూ, ఇటు తెలుగులోనూ కవితలు రాయడం మొదలుపెట్టారు. ఆ సమయంలోనే ఆయన  దగ్గర బంధువు, విజయ అధినేతల్లో ఒకరైన చక్రపాణి  (ఆలూరి వెంకట సుబ్బారావు) ఆయన్ని చేరదీశారు. విజయ వారి ఆధ్వర్యంలో నడుస్తున్న చందమామ పత్రిక హిందీ విభాగానికి  సంపాదకత్వం వహించవలసిందిగా చక్రపాణి కోరడంతో, బైరాగి ఆ బాధ్యతలను స్వీకరించారు. కానీ స్వేచ్ఛపిపాసి అయిన బైరాగికి చందమామలోని వాతావరణం నచ్చలేదు. వినీలాకాశంలో కనిపించే చందమామే ఆయనకు ముద్దుగా తోచింది. దాంతో తిరిగి తెనాలికి చేరుకున్నారు.

ఆ రోజుల్లో విప్లవ కవిత్వం అంటే శ్రీశ్రీ గుర్తుకువచ్చేవారు, భావగీతిక అంటే కృష్ణశాస్త్రి మెదిలేవారు. కానీ బైరాగి కవిత్వం ఈ రెండు కోవలకీ భిన్నంగా సాగేది. తనలో మెదులుతున్న ఘర్షణకు అక్షరరూపంగా ఆయన కవిత్వం తోచేది. సమాజంలోని కుళ్లుని చూసిన తర్వాత, కలిగే వేదనని వ్యక్తీకరించేందుకు కవిత్వాన్ని సాధనగా ఆయన ఉపయోగించారు. అందాన్ని వర్ణించేందుకో, విప్లవాన్ని వల్లించేందుకో కాకుండా... జీవితాన్ని నగ్నంగా చూపించేందుకు తన కవితను వినియోగించారు. బైరాగి తొలి కవితా సంపుటి ‘చీకటినీడలు’లో ‘మీ నిద్రాసుఖసమయంలో/ స్వాప్నిక ప్రశాంతి నిలయంలో/ మేం పీడకలలుగా వస్తాం/ రౌరవదృశ్యం చూపిస్తాం’ అనే వాక్యాలు చదివితే ఆయన ఉద్దేశం ఏమిటో ఇట్టే అర్థమవుతుంది.

చీకటినీడలు పుస్తకంతో పాటుగా నూతిలో గొంతుకలు, ఆగమగీతి అనే కవితా సంపుటిలను కూడా బైరాగి రాశారు. వీటిలో ఆగమగీతి పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం లభించింది. ఇవే కాకుండా దివ్యభవనం పేరుతో పదకొండు కథల సంపుటిని కూడా వెలువరించారు.

రాజకీయ రంగంపై “రైతులకు కూలీలకు టోపీ వేస్తారు తేనె పూసిన కత్తులు, తడిగుడ్డలు అక్కర్లేదు శుద్ధఖద్దరుతో గొంతులు కోయవచ్చు గొర్రెలాంటి ప్రజాస్వామ్యం, జేబుదొంగల సోషలిజం నేటి సమాజానికి ఓ సజీవ చిత్రంలా కనిపిస్తుంది ఈ కవిత “గోబెల్స్ చెప్పిందే నిజం నిజం....గాంధీజీ శిష్యుల రాజ్యంలో రెండే రెండుట జాతీయ పరిశ్రమలు… వ్యభిచారాలు, దొంగ సారాబట్టీలు”. సాహో బైరాగి.... సాహో.... నీ ధైర్యసాహసాలకు...... నీ కలం పదునుకు...

బైరాగి మరణానికి భయపడని విరాగి... మృత్యువంటే ఓ సరదా....మృత్యువు ఆయనకు చిరపరిచిత మిత్రుడు.. మృత్యువు ఏదో ఒకటి చూచిపోయే అతిథి వెంటవడిన అప్పు పుట్టుకలో పుట్టిన చావు చావులో చస్తుంది. “మనిషిలో అన్నీ ఉన్నాయి కానీ నమ్మకమొకటి లేదు” అని ధైర్యంగా మరణాన్ని ఆహ్వానించిన అపర కవితా భీష్ముడు... ఆలూరి బైరాగి చివరిరోజుల్లో క్షయవ్యాధికి లోనయ్యారు. కానీ ఆ వ్యాధి నుంచి ఉపశమనం పొందేందుకు ఆయన ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. ఫలితంగా 53 ఏళ్ల చిన్న వయసులోనే 1978 సెప్టెంబరు 9న మరణించారు. ఒక్కసారి ఆయన జీవితాన్ని పరిశీలిస్తే “బైరాగిలో సామాజిక సంస్కర్త, ఉగ్రరూపం ధరించిన ఉద్యమస్ఫూర్తి, దీప్తి కనిపిస్తాయి.


- డి.వి.అరవింద్, మాగల్ఫ్ ప్రతినిధి 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com