వెండితెర లోక నాయకుడు...!
- November 07, 2024
అతనొక సమ్మోహన సంచలనాల సమాహారం, వినూత్న ప్రయోగాల విశేషణం, విలక్షణనటనా వినోదానికి చిరునామా, ఎన్నళ్లైనా ఎన్నేళ్లైనా అతడు ఎప్పటికీ నిత్యనూతన అధ్యయనం, వెండితెరకి వెలుతురు కిరణంలా కనున పాపలతోనే భావాలను పలికించగలడు, తన నటనతో నాట్యంతో జలజరించే విన్యాసాలు చేయగల సకల కళావల్లభుడు కమల్ హాసన్. నటుడిగా, నృత్య దర్శకుడిగా, నటుడిగా, గాయకుడిగా, రచయితగా, నిర్మాతగా తెలుగులోనే కాదు యావత్ భారతదేశం అతని నటనకు జేజేలు పలుకుతారు అందుకే కమల్ అభిమానులకు ‘లోకనాయకుడు’అయ్యారు. నేడు లోకనాయకుడు కమల్ హాసన్ పుట్టిన రోజు.
కమల్ హాసన్ 1954, నవంబర్ 7వ తేదీన తమిళనాడులోని రామనాథపురం జిల్లాలోని పరమకుడిలో పేరున్న విద్యావంతుల కుటుంబంలో జన్మించారు. కమల్ తండ్రి పెద్ద క్రిమినల్ లాయర్ కావడంతో పాటుగా కుటుబంలోని అందరూ ఉన్నత చదువులు చదివినా కమల్‌కి పెద్దగా చదువు అబ్బకపోవడం విశేషం. ఐదేళ్ల వయసులోనే ‘కలతూర్ కన్నమ్మ’ సినిమాలో నటించారు. ఏవిఎం బేనర్లో 1968లో వచ్చిన ‘కళత్తూర్ కన్నమ్మ’ చిత్రంలో తన నటనకు గాను జాతీయ అవార్డును అందుకున్నారు. నటించిన తొలి సినిమాతోనే తానేంటో నిరూపించుకున్నాడు కమల్. అలా మొదలైన తన సినీ ప్రస్థానంలో వెనుతిరిగి చూడలేదు. భారతీయ చిత్ర పరిశ్రమలో కమల్‌హాసన్ చేసినన్ని ప్రయోగాలు మరో నటుడు చేయలేదంటే అతిశయోక్తి కాదేమో.
1963 వరకు చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన కమల్ హాసన్.. ఆ తరువాత చదువు కోసం ఒక ఏడేళ్లు సినిమా నుంచి గ్యాప్ తీసుకున్నారు. 1970 నుంచి మళ్ళీ సినీ రంగంలో ప్రయాణం మొదలు పెట్టారు. అయితే ఈసారి నటుడిగా కాకుండా అసిస్టెంట్ డాన్స్ కొరియోగ్రాఫర్ గా పలు సినిమాల్లో పని చేశారు. ఈ సమయంలోనే పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో అలా కనిపించి స్క్రీన్ పై మెరిశారు.1973 నుంచి ‘అరంగేట్రం’ అనే తమిళ సినిమాతో నటుడిగా ప్రయాణం మొదలుపెట్టిన కమల్ హాసన్.. సపోర్టింగ్ రోల్స్ చేస్తూ వచ్చారు. 1974లో మలయాళ మూవీ ‘కన్యాకుమారి’తో హీరోగా కెరీర్ స్టార్ట్ చేశారు. ఇక హీరోగా చేసిన ఈ మొదటి సినిమాకే.. మలయాళంలో బెస్ట్ యాక్టర్ గా ఫిలిం ఫేర్ అవార్డుని అందుకున్నారు.
మలయాళ మూవీ తరువాత హీరోగా తమిళంలో కూడా సినిమాలు చేస్తూ వచ్చారు. పలు సినిమాల్లో నటించినా రాణి గుర్తింపు.. 1975లో బాలచందర్ దర్శకత్వంలో నటించిన ‘అపూర్వ రాగంగాళ్’ సినిమా నటిస్తే వచ్చింది. ఈ సినిమాతో తమిళంలో కూడా మంచి ఫేమ్ సంపాదించుకున్నారు. ఈ సినిమాకి కమల్ ఫిలిం ఫేర్ అవార్డుని అందుకున్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే.. ఈ సినిమాలో రజినీకాంత్ ఒక ముఖ్య పాత్ర చేశారు.ఇక అక్కడి నుంచి తమిళ్, మలయా సినిమాల్లో నటిస్తూ వచ్చిన కమల్ హాసన్.. ‘కబితా’ సినిమాతో బెంగాలీలో, ‘కోకిల’ సినిమాతో కన్నడలో ఎంట్రీ ఇచ్చారు. తెలుగు, హిందీలో ఒకటి రెండు సినిమాల్లో అలా మెరిసి మెప్పించారు. అయితే పూర్తి సినిమాతో డెబ్యూట్ ఇచ్చిందంటే ‘మరో చరిత్ర’ సినిమాతోనే. 1978లో తెలుగులో బాలచందర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా క్లాసిక్ గా నిలిచింది. ఇదే సినిమాని హిందీలో రీమేక్ చేస్తూ 1981లో కమల్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు.
కమల్ హాసన్, బాలచందర్ కాంబినేషన్ ఆడియన్స్ ని ఎంతలా మెప్పించిందో.. కమల్, కె విశ్వనాథ్ కాంబినేషన్ కూడా అంతే ప్రజాధారణ పొందింది. సాగర సంగమం, స్వాతి ముత్యం, శుభ సంకల్పం.. మూడు చిత్రాలు మూడు కావ్యాలులా ఉంటాయి. వీటిలో సాగర సంగమం, స్వాతి ముత్యం రెండు సినిమాలకు తెలుగులో నంది అవార్డు, ఫిలిం ఫేర్ అవార్డుని అందుకున్నారు. తెలుగులో మొదటిసారి ‘ఆకలి రాజ్యం’ (1981) చిత్రానికి ఫిలిం ఫేర్ అవార్డుని అందుకున్నారు.
16 ఏళ్ల కుర్రవాడి దగ్గరి నుంచి 60ఏళ్ల ముసలివాడి వరకు ఆయన చేయని పాత్రంటూ లేదు. తమిళ, తెలుగు భాషల్లో 200 చిత్రాలకు పైగా నటించారు కమల్. అయితే తమిళంలో నటించిన చిత్రాల కన్నా తెలుగులో నటించిన చిత్రాలే ఎక్కువశాతం విజయం సాధించాయి. ‘అంతులేని కథ’, ‘మరో చరిత్ర’, ‘వయస్సు పిలిచింది’, ‘ఇది కథ కాదు’, ‘ఆకలి రాజ్యం’, ‘ప్రేమపిచ్చి’, ‘స్వాతిముత్యం’, ‘అందగాడు’, ‘ఎర్రగులాబీలు’, ‘కల్యాణరాముడు’, ‘అమావాస్య చంద్రుడు’, ‘పుష్పక విమానం’,‘క్షత్రియపుత్రుడు’, ‘మహానది’, ‘ద్రోహి’, ‘భారతీయుడు’, ‘ఇంద్రుడు చంద్రుడు’, ‘అపూర్వ సహోదరులు’, ‘సాగర సంగమం’, ‘భామనే సత్యభామనే’, ‘సతీలీలావతి’, ‘మైకేల్ మదనకామరాజు’, ‘క్షత్రియపుత్రుడు’, ‘మహానది’, ‘ద్రోహి’, ‘భారతీయుడు’, ‘హేరామ్’, ‘తెనాలి’, ‘అభయ్’, ‘ముంబయి ఎక్స్‌ప్రెస్’, ‘రాఘవన్’, ‘దశావతారం’, ‘విశ్వరూపం’, ‘చీకటిరాజ్యం’, 'విక్రమ్', 'కల్కి 2898AD' ఇలా ఎన్నో చక్కటి చిత్రాల్లో నటించిన మెప్పించారు.
సినీ రంగానికి ఆయన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 1990లోనే ‘పద్మశ్రీ’ పురస్కారంతో సత్కరించింది. ఇక 2014లో ‘పద్మ భూషణ్’ ఇచ్చి గౌరవించింది. ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం ‘ఆర్డర్స్ ఆర్ట్స్ దెస్లెటర్స్’ పురస్కారాన్ని అందించింది. ఆయన ఫిల్మ్‌ఫేర్ అవార్డులకు కొదవ లేదు. ఫిల్మ్‌ఫేర్‌కు ఆరుసార్లు నామినేట్ కాగా రెండు సార్లు అవార్డు దక్కింది. ఇక ఫిల్మ్‌ఫేర్ సౌత్ విభాగంలో 18 సార్లు అవార్డును గెలుచుకున్నారు. ఆయన నటించిన ఆరు సినిమాలు భారతదేశం తరపున ఆస్కార్ నామినేషన్‌కు వెళ్లాయి. దేశంలో మరే నటుడికీ దక్కని గౌరవమిది.
1990లో కేంద్ర ప్రభుత్వం కమల్‌హసన్‌ను ‘పద్మశ్రీ’ పురస్కారంతో గౌరవించింది. 2005లో మద్రాసులోని సత్యభామ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటు ప్రదానం చేసింది. 2014లో కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. మూడు దశాబ్దాలకు పైబడిన నట జీవితంలో కమల్ హసన్ మొత్తం 171 అవార్డులను సొంతం చేసుకున్నారు. తమిళ సినిమాకు చేసిన సేవలకు గాను ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ని కలైమామణి (కళాకారుల్లో మాణిక్యం) బిరుదుతో సత్కరించింది.
ప్రభుత్వానికి అధికారికంగా కమల్ హాసన్ చెప్పిన లెక్కల ప్రకారం అతనికి రూ. 130 కోట్ల రూపాయలు విలువ చేసే స్థిరమైన ఆస్తులు (immovable properties) ఉన్నాయని చెప్పారు. అందులోనే 17 ఎకరాల వ్యవసాయ భూమి కూడా ఉందని, అది రూ.17 కోట్ల రూపాయల విలువ చేస్తుందని తెలిపారు.స్థిరాస్తులు కాకుండా కమల్ హాసన్ కి చెన్నైలో రెండు అపార్టుమెంట్స్ వున్నాయి. ఈ రెండు అపార్టుమెంటుల విలువ కలిపి సుమారు రూ.19.5 కోట్లు ఉంటుంది అని చెప్పారు. ఇవి తమిళ నాడు రాష్ట్ర రాజధాని చెన్నై లో వున్నాయి. ఈ రెండు అపార్టుమెంట్లు కాకుండా కమల్ హాసన్ కి చెన్నైలో ఇంకా వ్యాపార నిమిత్తం కమెర్షియల్ కాంప్లెక్స్ కట్టి అద్దెకి ఇచ్చారని, అలాగే రియల్ ఎస్టేట్ లో కూడా డబ్బులు పెట్టారని తెలిసిందే. మొత్తం వీటన్నిటి విలువ కలిపితే సుమారు రూ.92.5 కోట్లు ఉంటుందని అంచనా.
ఇండియాలోనే కాకుండా కమల్ హాసన్ విదేశాల్లో కూడా పెట్టుబడి పెట్టారని తెలిసింది. చెన్నైలో వున్న ఈ స్థిరాస్తులు, వ్యవసాయ భూమి, ఇళ్ళు కాకుండా కమల్ హాసన్ బ్రిటన్ రాజధాని లండన్ లో కూడా ఒక ఇల్లు తన పేరుమీద కొని పెట్టుకున్నారని తెలిసింది. ఈ ఇంటి విలువ సుమారు రూ.2.50 కోట్లు ఉంటుందని అంచనా. కమల్ హాసన్ ప్రభుత్వానికి ఇచ్చిన ప్రకటనలో ఈ ఇంటి గురించి కూడా వివరాలు ఉన్నాయని తెలిసింది. ఇక కమల్ హాసన్ కార్లు కూడా చాలా ఖరీదైనవి వాడతారు. అతనికి ఒక బిఎండబ్ల్యూ 730 ఎల్ డి (BMW 730LD), లెక్సస్ ఎల్ఎస్ 570 (Lexus Ls 570) కార్లు వున్నాయి. ఈ రెండు కార్ల విలువ కలిపి రూ. 3.69 కోట్లు ఉంటుంది. ఇక అతని దగ్గర టొయోటా ప్రాడో (Toyoto Prado), మిత్సుబిషి పాజెరో (Mitsubishi Pajero), మెర్సిడెస్ బెంజ్ ఏ 220 (Mercedes Benz E 220), హమ్మర్ హెచ్3 (hummer H3) (రూ.80 లక్షలు), రేంజ్ రోవర్ ఎవాక్యూ (రూ.60 లక్షలు) (Range Rover Evoque), ఆడి ఎ8 ఎల్ (Audi A8 L) (రూ.1.19 కోట్లు) వున్నాయి. ఇంకా ఇవన్నీ ఎంత ఖరీదైనవో మీరే ఊహించుకోండి. ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో 'థగ్ లైఫ్' చిత్రంలో నటిస్తున్నారు.
- డి.వి.అరవింద్, మాగల్ఫ్ ప్రతినిధి
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







