నిబద్దత గలిగిన రాజకీయవేత్త...!
- November 09, 2024పిడతల రంగారెడ్డి...కాల గర్భంలో కలిసిపోయిన గొప్ప రాజకీయవేత్త. తన తరం సమకాలీన నాయకుల్లా ఉన్నత చదువులు చదవకపోయినా, స్వీయ క్రమశిక్షణ, పట్టుదలతో ఆర్థిక, రాజకీయ వ్యవస్థల మీద పట్టు సంపాదించారు.నీలం సంజీవ రెడ్డి వంటి బలమైన నేతతో తలపడి,ఆయన్ను ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయేలా చేశారు.కాంగ్రెస్ పెత్తందారీ సంస్కృతికి వ్యతిరేకంగా ఆ పార్టీలో ఉంటూనే పోరాడిన గొప్ప నాయకుడు రంగారెడ్డి.నేడు స్వాతంత్ర్య సమరయోధులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ స్వర్గీయ పిడతల రంగారెడ్డి జయంతి.
పిడతల రంగారెడ్డి గారు 1917, నవంబర్ 9న ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలోని అవిభక్త కర్నూలు జిల్లాలో భాగమైన గిద్దలూరు తాలూకాలోని అనుమలవీడు గ్రామంలో పిడతల వెంగళరెడ్డి, పిచ్చమ్మ దంపతులకు జన్మించారు. స్కూల్ ఫైనల్ వరకే చదువుకున్న రంగారెడ్డి గారు తన తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ వ్యవసాయం చేసేవారు.దేశ స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న జాతీయ నాయకులైన మహాత్మా గాంధీ, జయప్రకాశ్ నారాయణ్ వంటి పలు నాయకుల స్పూర్తితో స్వాతంత్ర్య ఉద్యమంలోకి ప్రవేశించారు.1937లో ఒంగోలు దగ్గర్లోని కొత్తపట్నంలో కాంగ్రేసు పార్టీ సోషలిష్టు విభాగం నేతృత్వంలో జరిగిన రాజకీయ పాఠశాలలో రాజకీయ, ఆర్థిక అంశాల మీద శిక్షణ పొందారు.
1939లో గిద్దలూరులో వ్యక్తిగత సత్యాగ్రహంలో పాల్గొని ఐదు వందల రూపాయల జరిమానా చెల్లించడంతో పాటు ఆరు నెలల జైలు శిక్ష అనుభవించారు.1940-42 మధ్యలో కర్నూలు జిల్లా కాంగ్రెస్ ప్రధానకార్యదర్శిగా, అధ్యక్షుడిగా రంగారెడ్డి గారు పనిచేశారు.1942 క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని 3 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత 1948లో కర్నూల్ నుంచి సెంట్రల్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు.1952 ఎన్నికల్లో కమ్యూనిస్టుల హవాలో ఆంధ్రరాష్ట్రంలో కాంగ్రెస్ సీనియర్లు ఓడినా, కంభం నియోజకవర్గం నుంచి రంగారెడ్డి ఎమ్యెల్యేగా ఎన్నికయ్యారు.1952-55 వరకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు.1952-59 వరకు ఏపీసీసీ అధ్యక్ష బాధ్యతల్లో కొనసాగారు.
రంగారెడ్డి, కాసు బ్రహ్మానంద రెడ్డిలు సమకాలీన రాజకీయాల్లో ఒకేసారి రాజకీయంగా ఎదిగినా, రాయలసీమలో తన తర్వాత బలమైన నాయకుడు ఉండకూడదనే తలంపుతో అప్పటి సీఎం నీలం సంజీవ రెడ్డి, రంగారెడ్డి కంటే కాసు బ్రహ్మానంద రెడ్డిని రాజకీయంగా ప్రోత్సహిస్తూ తన మంత్రి వర్గంలోకి తీసుకున్నారు.నీలంతో ఏర్పడ్డ రాజకీయ విభేదాల కారణంగా అల్లూరి సత్యనారాయణ రాజు వర్గంలోకి రంగారెడ్డి చేరారు.1960లో నీలం స్థానంలో సీఎం అయిన దామోదర సంజీవయ్య మంత్రివర్గంలో సమాచార& ప్రణాళికా శాఖల మంత్రిగా 1962 వరకు పనిచేశారు. సమాచార మంత్రిగా ప్రభుత్వ పనితీరును గురించి ప్రతిరోజూ ఒక ప్రెస్‌నోట్ విడుదల చేస్తూ పాత్రికేయులకు బాగా పని కల్పించారు.1962 ఎన్నికల్లో గిద్దలూరు నుంచి ఓటమి పాలయ్యారు.ఒకవేళ ఆ ఎన్నికల్లో గెలిచుంటే 1964లో కాసుకు బదులు రంగారెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం అయ్యేవారు అని రాజకీయ విశ్లేషకులు అనేక సందర్భాల్లో పేర్కొన్నారు.
1962లో రెండో సారి సీఎం అయ్యిన నీలం, తనకు ప్రత్యర్థిగా ఉన్న రంగారెడ్డి గారిని ఆర్థికంగా దెబ్బతీయాలనే మిషతో ఉన్నపళంగా వారి కుటుంబం నిర్వహిస్తున్న కర్నూలు బస్ మార్గాలను ప్రభుత్వ పరం చేయగా, దాని మీద సుప్రీం కోర్టులో పోరాడి నీలం మీద విజయం సాధించారు. ఈ పరాజయంతో నీలం తన సీఎం పదవికి రాజీనామా చేసి, జాతీయ రాజకీయాల్లోకి వెళ్లిపోయారు. నీలం తర్వాత సీఎం అయ్యిన కాసుతో మైత్రి బంధం కానీ, విరోధం కానీ లేకపోవడం వల్ల అయన రాజకీయ జీవితం తిరిగి పుంజుకుంది.1966లో కర్నూలు జిల్లా స్థానిక సంస్థల నుంచి యం.యల్.సిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.1968-72 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ బాధ్యతల్లో కొనసాగారు.
1971లో కాసు బ్రహ్మానంద రెడ్డి సీఎంగా వైదొలిగిన తర్వాత, కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకం అయ్యారు. 1972 అసెంబ్లీ ఎన్నికల్లో గిద్దలూరు నుంచి మూడో సారి ఎమ్యెల్యేగా విజయం సాధించి, పివి నరసింహారావు ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ స్పీకర్ గా 1972-74 వరకు కొనసాగారు. శాసనమండలికి, శాసనసభకు అధ్యక్షత వహించిన ఏకైక రాజకీయవేత్తగా రంగారెడ్డి గారు దేశ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయాన్ని సువర్ణాక్షరాలతో తన పేరిట లిఖించుకున్నారు.1974లో జలగం వెంగళరావు సీఎం అయిన తర్వాత ప్రభుత్వంలో, పార్టీలో రంగారెడ్డి గారి రాజకీయ వైభవం మొదలైంది. జలగం మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టి రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టించారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక పరిశ్రమల స్థాపనకు కారకులయ్యారు.
1977 నుంచి దేశవ్యాప్తంగా జనతా పార్టీ హవా మొదలవ్వడంతో, రంగారెడ్డి సైతం పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలతో కలిసి జనతా పార్టీలో చేరారు. 1978 అసెంబ్లీ ఎన్నికల్లో గిద్దలూరు నుంచి జనతాపార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 1982 నాటికీ కాంగ్రెస్ పార్టీలో చేరినా, మునపటి ఆదరణను పొందలేకపోయారు. 1983లో తెదేపా ప్రభంజనంలో గిద్దలూరు నుంచి ఓటమి పాలయ్యారు. 1985లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి తెదేపా మద్దతుతో ఐదో సారి ఎమ్యెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఎన్టీఆర్ సమక్షంలో తెదేపాలో చేరి చివరి వరకు ఆ పార్టీలోనే కొనసాగారు. 1989లో వయోభారంతో రాజకీయాల నుంచి వైదొలిగారు.
ఉమ్మడి ప్రకాశం జిల్లా ఏర్పాటులో రంగారెడ్డి కీలకంగా కృషి చేశారు.కర్నూలు నుంచి కంభం, గిద్దలూరు, మార్కాపురం,యర్రగొండపాలెం ప్రాంతాలన్నిటిని ప్రకాశం జిల్లాలో కలవడంలో ఆయన పాత్ర మరువలేనిది. ప్రకాశం జిల్లా ఏర్పాటుకు రాజకీయాలకు అతీతంగా నలమోతు చెంచు రామానాయుడు, కందుల ఓబుల్ రెడ్డి, గుజ్జల యల్లమందా రెడ్డి, దివి కొండయ్య చౌదరి, రొండా నారాప రెడ్డిలతో కలిసి పనిచేశారు. పశ్చిమ ప్రకాశం ప్రాంతంగా పేరుపడ్డ కంభం, గిద్దలూరు, మార్కాపురం మరియు యర్రగొండ ప్రాంతాల్లో తాగు, సాగు నీటి వనరుల అభివృద్ధికి రంగారెడ్డి కృషి చేశారు.
రంగారెడ్డి బంధువైన పిడతల రాంభూపాల్ రెడ్డి 1994లో, కుమారుడు పిడతల విజయ్ కుమార్ రెడ్డి 1999లో, విజయ్ కుమార్ రెడ్డి ఆకస్మిక మరణంతో ఆయన సతీమణి పిడతల సాయి కల్పనా రెడ్డి 2001 ఉపఎన్నికల్లో గిద్దలూరు ఎమ్యెల్యేలుగా ఎన్నికయ్యారు.ఇప్పటికి గిద్దలూరు నియోజకవర్గంలో వారి మద్దతు ఉన్న వారే ఎమ్యెల్యేలుగా విజయం సాధించడం విశేషం.
రంగారెడ్డి విద్యాదాతగా సైతం ప్రసిద్ధి గాంచారు.విద్య విలువ తెలిసిన ఆయన గిద్దలూరు ప్రాంతంలో స్కూళ్ళు, కాలేజీలు ఏర్పాటు చేసి ఎందరో ఆ ప్రాంత యువత ఉన్నత స్థానాలను అధిరోహించడానికి దోహదపడ్డారు.ఇప్పటికి ఆయన ఏర్పాటు విద్యాసంస్థలు ఎందరో పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి.
రంగారెడ్డి గారు రాజకీయాల్లోకి ఆస్తులు కరిగించుకొని నిజాయితీ పరుడైన నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు.ఆయన జీవితంలో ఎటువంటి రాజకీయ స్వలాభం కోసం చూసుకోకుండా, తన దగ్గరికి వచ్చే వారికీ పనులు చేసిపెట్టేవారు. పార్టీలకతీతంగా అన్ని పార్టీల నాయకుల గౌరవాభిమానాలను పొందారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా స్పీకర్ పదవిని చేపట్టిన తోలి నాయకుడిగా జిల్లా చరిత్రలో నిలిచిపోయారు.ఆయన తర్వాత 1978లో కందుకూరుకు చెందిన దివి కొండయ్య చౌదరి స్పీకర్ పదవిని చేపట్టారు.1991, జూన్ 1న గిద్దలూరులోని తన స్వగృహంలో కన్నుమూశారు.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ప్రముఖ గాయకుడు వై.ఎస్.రామకృష్ణకు ఎన్టీఆర్ వంశీ గ్లోబల్ అవార్డు
- నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించిన వైసీపీ
- మహా కుంభమేళాలో వైభవంగా శ్రీ శ్రీనివాస కళ్యాణం
- మైదుకూరులో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- సింగపూర్ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్
- గన్నవరం ఎయిర్ పోర్ట్ కు అమిత్ షా
- డేటా సెంటర్లకు రాజధానిగా హైదరాబాద్..
- దుబాయ్ హిందూ మందిరానికి అరుదైన గౌరవం
- ప్రపంచ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో యూఏఈ కీలకం..!!
- సౌదీలో 2.9 మిలియన్లకు పైగా క్యాప్‌గాన్ పిల్స్ సీజ్..!!