మహాత్మ మాలవ్య....!
- November 12, 2024
భారతదేశంలో జనులకు 'మహాత్మ' అనగానే మొదటిగా గుర్తొచ్చే పేరు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ.అలాంటి గాంధీ చేతే 'మహామాన' బిరుదు పొందిన నేత ఒకరున్నారు. ఆయనే పండిట్ మదన్ మోహన్ మాలవ్య. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం వ్యవస్థాపకుడైన ఆయన భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షునిగా నాలుగు సార్లు పనిచేశారు.ఈ రోజు ఆయన వర్థంతి సందర్భంగా కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీకోసం..!
పండిట్ మదన్ మోహన్ మాలవ్య 1861, డిసెంబర్ 25 తేదిన అలహాబాదులో మూనాదేవి, బ్రిజ్‌నాథ్ దంపతులకు జన్మించిన మదన్ మోహన్ మాలవ్య పూర్వీకులు మధ్యప్రదేశ్‌లోని మాల్వా ప్రాంతం నుండి వలస వచ్చారట. అందుకే ఆయన ఇంటి పేరు కూడా మాలవ్యగా సార్థకమైంది. ఆయన అసలు ఇంటి పేరు చతుర్వేది. పాఠశాల రోజుల నుండే మకరంద్ అనే కలం పేరుతో కవిత్వం రాయడం ప్రారంభించారు మాలవ్య. 1879లో అలహాబాద్ సెంట్రల్ కళాశాల నుండి మెట్రిక్యులేషన్ పూర్తి చేసిన ఆయన, కలకత్తా విశ్వవిద్యాలయం నుండి బి.ఎ.లో పట్టభద్రులైనారు. తర్వాత ఉపాధ్యాయునిగా తన జీవితాన్ని మొదలుపెట్టారు. అంతకు ముందే ఆయన 'ది ఇండియన్ ఒపీనియన్' అనే పత్రికకు సబ్ ఎడిటర్‌గా పనిచేశారు. అలాగే న్యాయశాస్త్రంలో కూడా పట్టా పొందారు.
1907లో మాలవ్య స్వయంగా 'అభ్యుదయ' అనే వార్తాపత్రిక ప్రారంభించారు. తర్వాత 'లీడర్' పేరుతో ఆంగ్ల పత్రికను ప్రారంభించారు. తర్వాత నష్టాల్లో ఉన్న హిందుస్తాన్ టైమ్స్ పత్రికను కూడా తీసుకొని నడిపారు. అయితే బహుకొద్ది కాలమే ఆయన దానికి ఛైర్మన్‌గా ఉన్నారు. 1908లో బ్రిటీష్ ప్రభుత్వం పత్రికలపై ఆంక్షలు విధించినప్పుడు.. వాటికి వ్యతిరేకంగా అలహాబాద్‌లో అఖిలభారత కాన్ఫరెన్సును నిర్వహించారు.
బ్రిటీష్ నియంతల రాజ్యానికి ఊతమిచ్చేందుకు ప్రారంభించిన సైమన్ కమీషన్‌కు వ్యతిరేకంగా గళం విప్పిన నేతల్లో ఒకరు మాలవ్య. 1931లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మహాత్మా గాంధీతో కలిసి కాంగ్రేసు పార్టీకి ప్రాతినిధ్యం వహించిన ఆయన, 1922లో హిందు మహాసభ అధ్యక్షుడుగా పనిచేశారు. "సత్యమేవ జయతే" అనే నినాదాన్ని తొలినాళ్లలో ప్రాచుర్యంలోకి తీసుకొచ్చింది మాలవ్యనే. 1922 లో చౌరీ చౌరా దాడుల ఘటనలో మరణశిక్ష పడిన 225 మంది స్వాతంత్ర్య సమరయోధులు, సాధారణ ప్రజానీకం తరపున వాదించి వారిలో 153 మందికి ఆ శిక్ష పడకుండా కాపాడారు. గంగా నది పరిరక్షణ కోసం 'గంగా మహాసభ' పేరుతో ఉద్యమాన్ని కూడా లేవదీశారు. భారతీయ స్కౌట్స్ మరియు గైడ్సు వ్యవస్థాపకులలో మాలవ్య ఒకరు.
1932 ఆగష్టులో జరిగిన రెండవ రౌండు టేబులు సమావేశం తరువాత రామ్సే మెక్‌డొనాల్డ్ ప్రధానమంత్రిగా ఉన్న బ్రిటిషు ప్రభుత్వం కమ్యూనల్ అవార్డును ప్రకటించింది. ప్రభుత్వం అల్ప సంఖ్యాక మతస్తులకు ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేయడం ఈ అవార్డు లక్ష్యం. అయితే ముస్లిములు, సిక్ఖులతో పాటు, దళితులను కూడా అల్ప సంఖ్యాక మతస్తులుగా ఈ అవార్డు ప్రకటించింది.
బి.ఆర్.అంబేద్కర్ ప్రతిపాదన మేరకు బ్రిటిషు ప్రభుత్వం కమ్యూనల్ అవార్డును తీసుకొచ్చింది. అయితే మహాత్మా గాంధీ దీన్ని వ్యతిరేకించాడు. దళితులను విడదీస్తే హిందూ మతం విచ్ఛిన్నం అవుతుందని భావించి, అందుకు నిరసనగా గాంధీ పూనాలోని ఎరవాడ జైల్లో నిరాహారదీక్ష చేపట్టాడు.కాంగ్రెసు నాయకులు గాంధీ వాదనకు మద్దతు తెలిపారు.ఆ సమయంలో అంబేద్కరు ఎరవాడ జైల్లో గాంధీతో చర్చలు జరిపాడు.వారి చర్చల ఫలితంగా వెలువడిందే పూనా ఒప్పందం.1932లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రతిపాదించిన పూనా పాక్ట్ అగ్రిమెంట్ పై ఆయనతో కలిసి సంతకం చేశారు.జీవితకాలం మొత్తం బ్రహ్మచారిగానే గడిపిన మాలవ్య నవంబర్ 12, 1946లో మరణించారు.ఆయన మరణించిన 6 దశాబ్దాల తర్వాత 2014లో భారతరత్న పురస్కారంతో గౌరవించింది.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!







