జాతీయ పత్రికా దినోత్సవం

- November 16, 2024 , by Maagulf
జాతీయ పత్రికా దినోత్సవం

పత్రికలు.. జర్నలిజం ప్రమాణాలను పాటించేలా, శక్తిమంతుల ప్రభావానికి లోనుకాకుండా చూసేందుకు 1956లో భారత తొలి ప్రెస్ కమిషన్ సిఫార్స్ మేరకు 1966 నవంబర్ 16 వ తేదిన ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి ఏటా  నవంబర్ 16వ తేదీన జాతీయ పత్రికా దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. జర్నలిజంలో వృత్తిపరమైన ప్రమాణాలను కొనసాగించడానికి ప్రెస్ కౌన్సిల్ దోహదపడుతుంది.

అంతర్జాతీయ మానవ హక్కుల ప్రకటనలోని 19 ఆర్టికల్‌కు అనుగుణంగా పాలకులు పత్రికా స్వేచ్ఛను కాపాడాలని, వారికి పత్రికా స్వేచ్ఛ ప్రాధాన్యతను గుర్తు చేస్తూ ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛా దినంగా మే 3వ తేదీని ప్రకటించడం కూడా జరిగింది. సాంకేతిక విప్లవంతో వార్తలు అందించే తీరు మారినది. ఫోర్త్ ఎస్టేట్ అని పిలువబడే పత్రికలు ప్రజాభిప్రాయాన్ని చెప్పడంలో, సమాచారాన్ని వ్యాప్తి చేయడంలో.. అధికారంలో ఉన్నవారిని జవాబుదారీగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. భావ ప్రకటన స్వేచ్ఛ, భావ వ్యక్తీకరణ సూత్రాలను నిలబెట్టడానికి.. ఈ జాతీయ పత్రికా దినోత్సవం స్ఫూర్తిగా నిలుస్తుంది.

 ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వెబ్ సైట్ ప్రకారం “ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రెస్ , మీడియా కౌన్సిల్లు ఉన్నప్పటికీ, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒక ప్రత్యేకమైన సంస్థ- ఎందుకంటే పత్రికా స్వేచ్చను పరిరక్షించే విధిలో ప్రభుత్వ ఎజెన్సీలపై కూడా అధికారాన్ని ఉపయోగించే ఏకైక సంస్థ ఇది.” అందువల్ల దేశంలో విశ్వసనీయమైన, స్వేచ్ఛాయుతమైన పత్రికా వ్యవస్థను కలిగి ఉంది.

భారతదేశంలోనే కాకుండా చాలా ప్రపంచ దేశాలలో ప్రెస్ కౌన్సిళ్ళు ఉన్నాయి. అయితే భారతదేశ కౌన్సిల్‌కు ఉన్న ప్రత్యేకత, గుర్తింపు ఏమంటే ప్రభుత్వ శాఖలపై కూడా తన అధికారాన్ని వినియోగించే అవకాశం లభించడమే. అనేక సంవత్సరాలుగా ప్రెస్‌ కౌన్సిల్‌ పత్రికా రంగానికి ఎదురయ్యే సవాళ్లు, సమస్యల గురించి ప్రతి నవంబరు 16న సెమినార్లు నిర్వహించడం జరుగుతుంది.

పత్రికా రంగం లో నైతిక విలువల్ని పెంపొందించేందుకు, నిజాయితీ, ఖచ్చితత్వం, సమానత్వం వంటి అంశాలను ప్రోత్సహించేందుకు ఒక అవకాశం. సమాజం మొత్తానికి నిజమైన సమాచారాన్ని అందించటం, అర్థవంతమైన అభిప్రాయాలను వ్యక్తం చేయటం, మరియు సమాజంలోని అంశాలను ప్రశ్నించడం వీటి ద్వారా జర్నలిస్టులు తమ బాధ్యతను నిర్వహించాలి.ఈ రోజు, తప్పుగా వ్యాప్తి చెందుతున్న వార్తలు, అపోహలు మరియు అశ్రద్ధ విషయాలను పోగొట్టడం అవసరమైందని, నిజాయితీ మరియు సమర్థతగా పత్రికలు వ్యవహరించాల్సిన బాధ్యతను చర్చించేందుకు అవకాశమవుతుంది.

విధి నిర్వహణలో పాత్రికేయులు ఎదుర్కొనే సవాళ్లు తెలుస్తాయి. సెన్సార్ షిప్, పత్రికా స్వేచ్ఛపై దాడులు, పాత్రికేయుల భద్రతకు ముప్పు, ఫేక్ న్యూస్, నైతిక రిపోర్టింగ్ ఆవశ్యకత వంటి అంశాలు చర్చల్లో కేంద్ర బిందువుగా నిలుస్తాయి. ఇటీవలి కాలంలో, సోషల్ మీడియా, డిజిటల్ ప్లాటఫార్మ్‌ల రాకతో, సమాచార వ్యాప్తి క్షణాల్లో జరుగుతోంది. తప్పుడు సమాచారం, నకిలీ వార్తల వ్యాప్తి ఆందోళనలను పెంచుతోంది. అందువల్ల సమకాలీన మీడియా ల్యాండ్ స్కేప్‌లో మీడియా అక్షరాస్యత, బాధ్యతాయుతమైన జర్నలిజంను ప్రోత్సహించడం చాలా ముఖ్యం.

పత్రికా స్వేచ్ఛ ప్రాథమిక సూత్రాలను పరిరక్షించడానికి, పాత్రికేయుల భద్రతను కాపాడటానికి ఖచ్చితమైన నిష్పాక్షిక సమాచారాన్ని పొందే ప్రజల హక్కును కాపాడటానికి జాతీయ పత్రికా దినోత్సవం స్ఫూర్తిగా పనిచేస్తుంది. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి అవసరమైన స్వేచ్ఛాయుత, చైతన్యవంతమైన పత్రికా విలువలను నిలబెట్టడానికి ప్రభుత్వం, మీడియా సంస్థలు, పౌరులు సమిష్టి కృషి చేయాలని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పిలుపునిచ్చింది.

- డి.వి.అరవింద్, మాగల్ఫ్ ప్రతినిధి 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com