తెలుగు మీడియా టైకూన్ - రామోజీరావు
- November 16, 2024బహుముఖ ప్రజ్ఞ, నిరంతర పరిశ్రమ కఠోర సాధన ఇవే ఆయన అస్త్రాలు. ప్రతిదీ ప్రయోగమే! ఎప్పుడూ కొత్తదారే!! నలుగురు నడిచిన బాట కాదు కొత్త దారులు సృష్టించడం ఆయన నైజం. రైతుబిడ్డగా మొదలై వ్యాపారవేత్తగా రాణించినా మీడియా మహాసామ్రాజ్యాన్ని నిర్మించినా చైతన్యదీప్తుల్లాంటి చిత్రరాజాలను సృజించినా అద్భుత ఫిల్మ్‌సిటీని సృష్టించినా ఆయనకే సాధ్యం! తన లక్ష్యసాధన కోసం దశాబ్దాలపాటు నిర్విరామంగా పరిశ్రమించిన యోధుడిగా తెలుగు వారి హృదయాల్లో చెరగని ముద్ర వేశారు రామోజీరావు . నేడు ప్రముఖ వ్యాపారవేత్త, ఈనాడు మీడియా సంస్థల అధినేత రామోజీరావు జయంతి.
రామోజీరావు పూర్తి పేరు చెరుకూరి రామోజీరావు. 1936,నవంబర్ 16న ఉమ్మడి మద్రాసు ప్రెసిడెన్సీలోని ఉమ్మడి కృష్ణా జిల్లా గుడివాడ సమీపాన ఉన్న పెదపారుపూడి గ్రామంలో చెరుకూరి వెంకట సుబ్బారావు, సుబ్బమ్మ దంపతులకు జన్మించారు. తాతయ్య పేరు రామయ్యనే ఆయనకు మొదట తల్లిదండ్రులు పెట్టిన పేరు. ఆయనకు ఇద్దరు అక్కలు (రాజ్యలక్ష్మి, రంగనాయకమ్మ). అయితే, బడిలో చేరిన తర్వాత మాత్రం మాస్టారుకు తన పేరు రామోజీరావు అని చెప్పాడు. అలా రామయ్య రామోజీరావు అయ్యారు. ఇంట్లో అంతా ఆశ్చర్యపోయారు. బాలుని ప్రతిభకు మురిసిపోయారు. అలా తన పేరు తనే పెట్టుకున్న రామోజీలో విలక్షణత, సృజనాత్మకత నాడే మొగ్గతొడిగాయి.
రామోజీ ప్రకృతి ప్రేమకు, కళాత్మక ఆలోచనలకు పల్లె కాన్వాసుగా నిలిచింది. చిత్రకారుడు కావటానికి నేపథ్యమైంది. భవిష్యత్తు దర్శనం చేసింది. ప్రాథమిక విద్యపూర్తయ్యాక పైచదువులకు రామోజీ గుడివాడ వెళ్లారు. మునిసిపల్ స్కూల్లో 8వ తరగతిలో చేరారు. 11వ తరగతికి సమమైన అప్పటి సిక్స్త్ ఫాం చదివారు. రామోజీకి చదువు కంటే, కళలు, రాజకీయాలపై ఆసక్తి మిన్న. మాటల్లో నిశిత దృష్టి, సునిశిత పరిశీలన కనపడేది. గుడివాడ బజారులో నడిచి వెళ్తుంటే వరుసగా ఒకే వ్యాపార దుకాణాలు కనపడేవి. స్టీల్ సామాన్ల కొట్లయినా, ఫ్యాన్సీ షాపులైనా ఏవైనా వరుసగా అవే వ్యాపారాలు. ఇదేమిటి? ఇలా అందరూ ఒకే వ్యాపారం చేసే బదులు వేర్వేరు వ్యాపారాల్లో రాణించి లాభపడవచ్చు కదా? అని మిత్రులతో అనేవారు. అనుకరణలు వద్దని, సొంత ఒరవడే శ్రేయస్కరమని చెప్పేవారు. ఇందుకే కావచ్చు. రామోజీరావు ప్రారంభించిన ప్రతి వ్యాపారంలో ఓ నవ్యత, వైవిధ్యం కనపడతాయి.
1951లో రామోజీ హైస్కూలు చదువు ముగిసింది. గుడివాడ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివారు. అనంతరం అక్కడే BSC పూర్తయింది. చదువుకునే రోజుల్లో రామోజీరావు కమ్యూనిస్టు పార్టీలో సభ్యుడు. చండ్ర రాజేశ్వరరావు, సుందరయ్య ఆయనకు ఆరాధ్య నేతలు. సత్యాగ్రహ సిద్ధాంతకర్త, ప్రజాధన పరిరక్షణకు ఉద్దేశించిన ధర్మ కర్తృత్వ సిద్ధాంత ఆవిష్కర్త మహాత్మా గాంధీ రామోజీకి ఎంతో ఇష్టం. ఆయన దళిత జనోద్ధరణ అంటే మరీమరీ ఇష్టం. డిగ్రీ తర్వాత భిలాయ్‌లో ఓ ఉద్యోగానికి దరఖాస్తు చేశారు. పిలుపు వస్తుందన్న గట్టి నమ్మకం క్రమంగా సడలింది. నిరాశే మిగిలింది.
రామోజీ మనసులో సంఘర్షణ మొదలైంది. తనే పదిమందికి పనిచ్చేలా ఎదగాలని భావించారు. కానీ కొంత విరామం తీసుకున్నారు. ఈ దశలో రామోజీరావు దిల్లీలో మళయాళీ వ్యాపారవేత్త అనంత్ నెలకొల్పిన వాణిజ్య ప్రకటనల సంస్థలో ఆర్టిస్టుగా ఉద్యోగంలో చేరారు. తర్వాత కొద్దికాలానికే అమెరికా అవకాశం తలుపు తట్టింది. మళ్లీ అంతర్మథనం! అయినా అయిన వాళ్ల కోసం అవకాశాన్ని ఒదులుకున్నారు. మాతృదేశంలోనే ఉండిపోవాలని నిశ్చయించారు.
దిల్లీలో ఆర్టిస్టుగా తనను తాను తీర్చిదిద్దుకున్నారు. కృషి ఉంటే ఘన ఫలితాలు తథ్యమనే నమ్మకం కుదిరింది. నాయకత్వ లక్షణాలు అలవడ్డాయి. వ్యాపార దక్షత పెరిగింది. ముఖ్య విషయాలలో స్పష్టత వచ్చింది. నిరంతర అధ్యయనం, నిశిత పరిశీలనతో ప్రజాహిత వ్యాపారం చేపట్టాలని రామోజీ భావించారు. తను చేసే పని పదిమందికీ ప్రయోజకంగా ఉండాలని అభిలషించారు.1962లో రామోజీ దిల్లీలో ఉద్యోగపర్వం ముగించారు. వ్యాపార రంగ ప్రవేశానికి మార్గం నిర్మించుకునేందుకు సిద్ధమయ్యారు. రామోజీ రావు వ్యాపార ప్రస్థానంలో తొలి అడుగు మార్గదర్శి చిట్‌ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్.
ప్రతిమనిషి జీవితంలో ఆర్థిక భద్రత, భరోసా ఎంత అవసరమో గుర్తించి, ఆ దిశగా అందరికీ వెలుగుబాట చూపే కాంతి స్తంభంగా ఆయన స్థాపించిన సంస్థ.. మార్గదర్శి చిట్‌ఫండ్స్. 1962లో నమ్మకమే పెట్టుబడిగా, విశ్వసనీయతే ఆలంబనగా ఏర్పాటైంది ఆ సంస్థ. 'మార్గదర్శి తోడుంటే ఆనందం మీ వెంటే' అనే నినాదం తర్వాత కాలంలో లక్షలాది మంది ఖాతాదారులకు తారకమంత్రమైంది. చిట్ ఫండ్ వ్యాపారం అంటే అదేదో మహిళల వ్యవహారం అని భావించిన రోజుల్లో రామోజీ రావు అలాంటి మాటలను ఖాతరు చేయలేదు. పట్టుదలతో ముందుకు సాగారు. వసూళ్లు, చెల్లింపుల్లో కచ్చితత్వంతో ఖాతాదారుల్లో విశ్వాసం ఏర్పడింది. సిబ్బంది క్రమశిక్షణ, అంకిత భావం, యాజమాన్య విశ్వసనీయత వల్ల సంస్థ శరవేగంగా అభివృద్ధి చెందింది.
ఆర్థిక క్రమశిక్షణ, అంకితభావం, విశ్వసనీయత ఈ మూడూ మార్గదర్శికి మూడు మంత్రాక్షరాలు. అవే మార్గదర్శిని దేశంలోనే అగ్రశ్రేణి చిట్‌ఫండ్ సంస్థగా నిలిపాయి. 60 ఏళ్ల ప్రస్థానంలో 60లక్షల మంది ఖాతాదారులకు సేవలు అందించిన ఘనత దక్కేలా చేశాయి. అదే స్ఫూర్తితో ప్రస్తుతం నాలుగు రాష్ట్రాల్లో 113 శాఖలు, 3లక్షలకు పైగా ఖాతాదారులు, 4వేల100 మందికిపైగా ఉద్యోగులు, 18వేలకుపైగా ఏజెంట్లతో విలువల బాటలో ముందుకు సాగుతోంది మార్గదర్శి. ప్రభుత్వాలకి రిజిస్ట్రేషన్ ఫీజులు, ఆదాయపన్ను, జీఎస్టీ సహా వివిధపన్నుల రూపంలో వందల కోట్లు చెల్లిస్తోంది సంస్థ.
ఆరు దశాబ్దాల వజ్రోత్సవ ప్రయాణంలో నమ్మకానికి చిరునామాగా ఆ సంస్థను తీర్చి దిద్దారు రామోజీరావు. సవాళ్లకు ఎదురునిలిచి లక్షలమంది ఆర్థికనేస్తంగా ఖాతాదారుల మనస్సుల్లో ప్రత్యేక స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. మార్గదర్శి చిట్‌ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ నాటి నుంచి నేటి వరకు అదే స్ఫూర్తితో కలలు మీవి, వాటికి సాకారం చేసే ఆర్థికసహకారం మాది అంటూ నిరంతరాయంగా, నిర్విరామంగా సేవలు అందిస్తూ వస్తోంది మార్గదర్శి.
మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఈ 62 ఏళ్ల విజయగీతికలో 60 లక్షలమందికి పైగా చందాదారులు సంతృప్తికరమైన సేవలందుకున్నారు. ఇంటి నిర్మాణం, వ్యాపార ప్రారంభం, విస్తరణ, పిల్లల ఉన్నత చదువులు, పెళ్లిళ్లు, చింతలేని పదవీ విరమణ జీవితం.. ఇలా అవసరమేదైనా అందరి ఏకైక ఎంపికగా నిలిచింది మార్గదర్శి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో విస్తరిస్తునే ఉంది సంస్థ. మార్గదర్శి. ఈ సంస్థ తోడుతో జీవిత లక్ష్యాలు సాధించుకు న్న లక్షలాది ఖాతాదారుల మాదిరిగానే వేలాదిమంది ఉద్యోగ జీవితాన్ని మార్గదర్శిలో ప్రారంభిం చి సంతృప్తికరమైన వృత్తి జీవితం తర్వాత పదవీ విరమణ పొందారు. ఈ విజయం, నమ్మకం వెనకున్న ఒకేఒక్క స్ఫూర్తిప్రదాత రామోజీరావు.
ఖాతాదారులే దేవుళ్లు, వారికి సేవ చేయడమే మన విధి అన్న రామోజీరావు మాటనే తారక మంత్రం, విజయ సూత్రంగా చేసుకుని సుస్థిరవృద్ధిని సాధిస్తోంది మార్గదర్శి. భారతదేశ చిట్‌ఫండ్ వ్యాపారం లో దేశంలోనే నెంబర్-1 నిలిచింది మార్గదర్శి. ఉద్యోగులు, వ్యాపారులు, వృత్తి నిపుణులు... ఇలా అన్నివర్గాల వారిరీ, అందరికీ అందుబాటులో ఉండేలా ఆకర్ష ణీయమైన పథకాలు, చిట్ గ్రూపులతో ఆరు తరాల ఖాతాదారులకు ఆత్మీయ మిత్రుడిగా నిలవడం అంటే ఆషామాషీ కాదు. పైగా మధ్యలో గిట్టనివాళ్లు కుట్రలు చేసినా, రాజకీయ మారీచులు యుద్ధం ప్రకటించినా నమ్మకమే ఊపిరిగా, శ్రీరామరక్షగా 62ఏళ్లలో ఒక్కటంటే ఒక్కటి ఫిర్యాదు లేకుండా ఖాతాదారులందరికీ ఐశ్వర్యానందాలు పంచుతోంది రామోజీరావు ప్రారంభించిన మార్గదర్శి.
మార్గదర్శితో రామోజీ రావు విజయయాత్రలో తొలి అడుగుపడింది. అయినా ఆయన ఏనాడూ మూలాలకు దూరంగా వెళ్లలేదు. వ్యవసాయ కుటుంబంలో పుట్టి రైతుల కష్టాల్ని చూస్తూ పెరిగిన ఆయన సాగుబడికి తనవంతు సాయం చేయాలని సంకల్పించారు. ఆ బలమైన ఆలోచన నుంచి పుట్టుకొచ్చిందే అన్నదాత! 1969లో మీడియా రంగంలో తొలి అడుగువేస్తూ అన్నదాత పత్రికను ప్రారంభించారు రామోజీరావు. వ్యవసాయ వైజ్ఞానిక కేంద్రాలకు, కర్షకులకు మధ్య తిరుగులేని వారథిని నిర్మించారు. సేద్యంలో అధునాతన విధానాలు, సాంకేతిక పద్ధతులపై అన్నదాత పత్రిక ద్వారా ఎనలేని సమాచారమిచ్చారు. మూస విధానాలు దాటి ఏనాడూ ప్రయోగాల జోలికివెళ్లని తెలుగు రైతుల్ని అన్నదాత కొత్తబాట పట్టించింది. అధునాతన సాంకేతిక పద్ధతుల్ని అందిపుచ్చుకుని సేద్యంలో సరికొత్త విప్లవానికి తెరతీసేలా ప్రోత్సహించింది. అలా కర్షకులకు దిక్సూచిలా మారిన అన్నదాత అందుకు తగినట్లుగా ఎన్నో పురస్కారాలు దక్కించుకుంది.
ప్రపంచంలో ఎంతమంది మీడియా అధినేతలున్నా ఆయన ముద్ర ప్రత్యేకం! మీడియా ద్వారా ఒక జాతిని, భాషను ప్రభావితం చేసిన అసలు సిసలు పాత్రికేయుడు రామోజీరావు. నిత్యం సత్యం నినదించే ఈనాడు, తెలుగువారి ఠీవీ ఈటీవీ, అరచేతికి సమాచారమిచ్చే ఈటీవీ భారత్! ఇలా ఒకటేంటి, ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ ఆయన ఏ మాధ్యమంలో అడుగుపెట్టినా అదో సంచలనం. నిత్య నూతనం! అనేక ప్రయోగాలతో, మీడియా రంగంలో సరికొత్త సాహసాలు చేసిన యోధుడు రామోజీరావు.
మీడియా అంటే ఒక వ్యాపారం కాదు! సమాజాన్ని జాగృతం చేసే సామాజిక మాధ్యమం! రామోజీరావు దాన్నే నమ్మారు! 1974 ఆగస్టు 10న విశాఖ సాగరతీరంలో రామోజీరావు ప్రారంభించిన 'ఈనాడు' దినపత్రిక తెలుగు నాట ఓ సంచలనం. అణువణువు కొత్తదనంతో, ప్రజల పక్షాన అక్షరయుద్ధంతో ప్రారంభించిన 4ఏళ్లలోనే పాఠకుల మానసపుత్రికగా మారింది. ప్రాంతీయ దినపత్రికల చరిత్రలోనే కొత్త ఒరవడి సృష్టించింది. వార్తాపత్రిక డోర్ డెలివరీ విధానం అప్పట్లో ఓ సంచలనం. అప్పటివరకు వార్తాపత్రిక కావాలంటే ఎవరైనా దుకాణానికి వెళ్లి తెచ్చుకోవాల్సిందే. మారుమూల ప్రాంతాలవారైతే పేపర్ కోసం ఆ రోజు సాయంత్రం వరకో, మరుసటి రోజు ఉదయం వరకో వేచి చూడాల్సిందే. అలాంటి ఇబ్బంది లేకుండా రోజూ సూర్యోదయానికి ముందే ఈనాడు పత్రిక ఇంటికి చేరేలా సరికొత్త వ్యవస్థను సృష్టించారు రామోజీరావు. తర్వాతికాలంలో ఇతర వార్తాపత్రికలు ఇదే ఏజెన్సీ విధానాన్ని అవలంబించడం ప్రారంభించాయి.
ప్రజా సమస్యలను చేరవేయడం.. అక్షరాలు, అందమైన ఫొటోలు పేర్చేయడం.. కేవలం ఇందులోనే ఓ పత్రిక విజయం ఉండదు! ఏం రాసినా అది సామాన్యులకు సైతం అర్థం కావాలి. ఆ అక్షరాలు వారిలో చైతన్యం నింపాలి. కంటపడిన అన్యాయంపై వారు తమ గొంతుక వినిపించాలి. ఇదీ రామోజీరావు (Ramoji rao) చెప్పే మాట. ‘ఈనాడు’ విజయంలో తెలుగు భాషది కీలక పాత్ర అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదే ‘ఈనాడు’ను ప్రజలకు చేరువ చేసింది. దీనికి కర్త, కర్మ, క్రియ.. రామోజీరావే.
భాషా పాండిత్యాన్ని వదిలిపెట్టి చిన్న చిన్న పదాలు రాసేందుకు రచయితలు సంకోచించేవారు. గ్రాంథికంలో రాయడమే గొప్పని భావించే వారు. గిడుగు రామమూర్తి వంటి వారి కృషి ఫలితంగా వ్యావహారిక భాషకు ప్రాధాన్యం లభించింది. రచయితల్లో మార్పు వచ్చింది. సామాన్యులు సైతం చదివితేనే తమ భవిష్యత్ అని విశ్వసించారు. అలా పత్రికా రచనలో వ్యావహారిక భాష మొదలైంది. ‘ఈనాడు’ దాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లింది. తేలిగ్గా చదువుకునేందుకు.. పక్కన ఎవరైనా చదివినా అర్థం చేసుకునే విధంగా భాషా వినియోగం ఉండేది. అందుకు ‘ఈనాడు’ పెద్ద కృషే చేసింది. 1981లో ‘ఈనాడు భాషా స్వరూపాన్ని’ ఆవిష్కరించింది. దాని బాధ్యతను డాక్టర్ బూదరాజు రాధాకృష్ణకు రామోజీరావు అప్పగించారు. తర్వాతి కాలంలో ఈ పుస్తకమే జర్నలిస్టులకు కరదీపికగా మారింది.
దిన పత్రికలో వ్యావహారిక భాష వాడటాన్ని ఓ నియమంగా ఈనాడు పాటించింది. పడికట్టు పదాలు, సుదీర్ఘ శీర్షికలు తగ్గేలా శ్రద్ధ మొదలైంది. శ్రీ, శ్రీమతులు వంటి గౌరవ వాచకాలూ తగ్గాయి. ఈనాడు ‘భాషా స్వరూపం’ రావడంతో ఈ మార్పు సాధ్యమైంది. భాష అంటే ప్రామాణికమైనదని వాదించే వారికి.. ఆ వాదన తప్పని ‘ఈనాడు’ నిరూపించింది. పేర్లకు ముందు శ్రీ, శ్రీమతి.. తర్వాత గారు వంటి గౌరవ సూచికలను తీసేసి బహువచన క్రియను వాడడం మొదలు పెట్టింది. చివర్లో అన్నారు, చెప్పారు.. వంటి పదాల వాడకంతో గౌరవం ఇవ్వడం మొదలు పెట్టింది. తర్వాతి కాలంలో అన్ని పత్రికలూ దీన్ని అనుసరించాయి.
ఎంత వ్యావహారిక భాషను వినియోగించినా అవి అందరికీ చేరువయయ్యేవి కాదు. ఆ క్రమంలో జిల్లా పత్రికల్లో మాండలికాలకు ఈనాడు పెద్ద పీట వేసింది. జిల్లా, ప్రాంతాన్ని బట్టి పదాల వాడుక, స్థానిక మాండలికాల్లోనే రచన సాగేది. దీంతో అనతికాలంలోనే ప్రజలకు ఈనాడు చేరువైంది. అలాగని ఆంగ్ల పదాలు పూర్తిగా విడిచి పెట్టలేదు. అనువాదం వల్ల కృతకంగా మారిన తెలుగు పదం కన్నా.. సులువుగా అర్థమయ్యే ఇంగ్లిష్ పదాల వాడుకకు జై కొట్టింది. రోడ్డు, బస్సు వంటి పదాలను వాడుకలోకి తీసుకొచ్చింది. అంతర్జాతీయ వ్యవహారాలైనా, స్థానిక విషయాలైనా.. అందరికీ చదువుకునేలా చేయడంలోనే ‘ఈనాడు’ విజయ రహస్యం దాగుంది.
తెలుగు పత్రికా ప్రపంచంలో నవ శకానికి నాంది 'ఈనాడు'. తేనెలొలికే తెలుగు భాషకు అక్షర పాత్రైంది. నిత్యనూతన మార్పులకు.. అక్షయ పాత్ర అయింది. తెలుగు నేల తన చుట్టూ తాను తిరుగుతూ, ఈనాడు చుట్టూ తిరగడం మొదలుపెట్టింది. దానికి కారణం మార్పు ఒక్కటే శాశ్వతమని రామోజీరావు మనసారా నమ్మడం. ప్రజా సమస్యల పట్ల నిబద్ధత నిత్యం నిజానికి కట్టుబడే నిష్ఠలే ప్రాథమిక లక్షణాలుగా పునికిపుచ్చుకున్న ఈనాడు తెలుగు పాఠకుల దినచర్యలో భాగమైంది. ఈనాడులో అచ్చు అయిందంటే అది శిలాక్షరమే అని అసంఖ్యాక తెలుగుపాఠకులు ఏనాడో తీర్మానించుకున్నారు.
జాతీయ,.. అంతర్జాతీయ వార్తలు, నేతల ప్రకటనలు, బహిరంగసభల్లోప్రసంగాలతో నింపేసే మూసధోరణికి ముగింపు పలికింది ఈనాడు. తెలుగు జర్నలిజాన్ని పల్లె బాట పట్టించింది. అసలైన వార్తలు దేశ,రాష్ట్ర రాజధానుల నుంచి వెలువడేవి కావని, మారుమూల పల్లెల్లో నిస్సహాయ ప్రజలు అనుభవించే కష్టాలేపత్రికల ప్రాధాన్యం కావాలన్నది రామోజీరావు నమ్మకం. ఆ నమ్మకానికే ఈనాడు కట్టుబడింది. అందుకు అనుగుణంగానే స్థానిక ప్రజా సమస్యలకు పెద్దపీట వేయడం తొలిసంచిక నుంచే మొదలైంది. నాటి నుంచి నేటి వరకూ.. స్థానిక జన జీవనంతో ముడిపడిన వార్తలే ఈనాడుకు పంచప్రాణాలు.
ఈనాడు అంటే కేవలం వార్తలే కాదు తెలుగువారి ఆత్మగౌరవపతాక! 1978-83 మధ్య నాటి కాంగ్రెస్ అధిష్ఠానం ఐదేళ్లలో నలుగురు ఏపీ ముఖ్యమంత్రుల్ని మార్చింది. ఆ సయమంలో తెలుగు జాతి ఆత్మాభిమానాన్ని పరిరక్షించే కొత్త రాజకీయ శక్తిగా తెలుగుదేశం ఆవిర్భావాన్ని ప్రజలు స్వాగతించారు. ప్రజాభిప్రాయాన్ని గౌరవించే పత్రికగా తెలుగుదేశం పార్టీ రాకను ఈనాడు హర్షించింది. అయితే వ్యక్తులకు ఏనాడూ ప్రాధాన్యం ఇవ్వలేదు. నియంతృత్వాన్ని ప్రతిఘటించడమే లక్ష్యంగా తెలుగుదేశానికి అండగా నిలబడ్డామని, ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక మంచి చేస్తే అభినందిస్తుందని, తప్పులు జరిగితే హెచ్చరిస్తుందని రామోజీరావు 1983 అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మరుసటి రోజే తన సంపాదకీయంలో స్పష్టం చేశారు.దానికి తగినట్లే ఎన్టీఆర్ హయాంలో జరిగిన తప్పిదాలను నిస్సంకోచంగా ఎండగట్టింది ఈనాడు..!
జిల్లా సంచికలు తీసుకురావాలన్న ఆలోచన రామోజీరావుదే. సగటు పాఠకుడు తనచుట్టూ జరిగే చిన్నచిన్న ఘటనల్ని సైతం తెలుసుకునేందుకు వీలు కల్పించాలన్నదే ఆయన అభిమతం. తర్వాతికాలంలో నియోజకవర్గ పేజీల్ని ప్రవేశపెట్టి స్థానిక వార్తలకు పెద్దపీట వేశారు. అవినీతి పాలకుల చీకటి లెక్కలు బయటపెట్టే బ్రహ్మాస్త్రంగా సమాచార హక్కు చట్టాన్ని ఎలా వాడుకోవచ్చో 'ఈనాడు ముందడుగు' ద్వారా సామాన్యులకు తెలియచెప్పారు. పత్రికా ప్రకటనల రంగంలోనూ ఈనాడు ట్రెండ్ ఫాలో కాకుండా కొత్తట్రెండ్ సృష్టించింది. ప్రకటనల కోసం ప్రభుత్వంపైనే ఆధారపడాల్సిన అగత్యం నుంచి బయటపడి ప్రజలకు లాభం చేకూర్చే, ఉపయోగపడే క్లాసిఫైడ్ ప్రకటనల సంస్కృతిని తెలుగులో మొట్టమొదట ప్రవేశపెట్టింది ఈనాడే! ఆదివారం నాడు రోజువారీ వార్తలకు భిన్నమైన సమాచారం ఆస్వాదించేలా వైవిధ్యభరితమైన అనుబంధ పేజీ అందజేసింది. తదనంతరం..ఒక పుస్తకరూపంలో ఆకర్షణీయంగా చిత్రవిచిత్ర మాలికల సమాహారంగా తీర్చిదిద్దింది.
1992 సెప్టెంబరులో అలా మొదలైందే ఈనాడు వసుంధర పేజీ. మహిళలకోసం ఒక ప్రత్యేక పేజీ ఏర్పాటు చేసిన తొలి దేశీయ పత్రిక ఈనాడే. అంతేకాదు తెలుగు పత్రికా రంగంలో తొలిసారిగా విద్యార్థుల కోసం ప్రతిభ పేజీని, వాణిజ్య వార్తలు కావాలనుకునే వారికోసం బిజినెస్ పేజీని, ఆధునిక వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందించే రైతేరాజు పేజీని ప్రారంభించింది కూడా ఈనాడే.!పాఠకుల నాడి పసిగట్టడంలో ఈనాడు ఏనాడూ వెనుకబడలేదు. గతంలో వార, మాసపత్రికల్లో వచ్చే అంశాలను పాఠకులు రోజూ కోరుకుంటున్నారనే అభిప్రాయంతో వినూత్న అంశాలతో విభిన్న పేజీలు అందిస్తోంది.
విద్యార్థుల బంగారు భవితకు బాటలు వేసే చదువు పేజీ, ఆరోగ్యంపై అవగాహన పెంచే సుఖీభవ, క్రీడా సమాచారాన్ని అందించే ఛాంపియన్, శాస్త్ర సాంకేతిక పురోగతికి అద్దం పట్టే ఈ-నాడు పేజీ, మదుపరులకు మార్గనిర్దేశం చేసే సిరి, యువతరంలో జోష్ నింపే ఈతరం, పిల్లల కోసం హాయ్ బుజ్జీ, ఇలా అన్ని వర్గాలకూ ఆసక్తికరమైన వార్తల్ని, సమాచారాన్ని అందిస్తోంది ఈనాడు. పాఠకుడి గుండెలకు హత్తుకునే శైలిలో ప్రచురించే వార్తలేకాదు విలక్షణ రీతిలో రాజకీయ, సామాజిక అంశాలకు అద్ధంపట్టే ఈనాడు కార్టూన్లకూ కోట్ల మంది అభిమాన పాఠకులున్నారు. అందుకే 1976 ప్రథమార్థంలో 48,339 కాపీలుగా ఉన్న ఈనాడు సర్క్యులేషన్ అంచెలంచెలుగా పెంచుకుంటూ 2011 తొలి అర్ధానికి ఎవరూ అందుకోలేని స్థాయికి చేరింది. నేటికీ 23 కేంద్రాల్లో ముద్రితమవుతూ అత్యధిక సర్క్యులేషన్ ఉన్న తెలుగు దినపత్రికగా వెలుగొందుతోంది.
‘ఈనాడు’ పత్రిక చదివే వారికి ఓ అనుమానం ఉండేది. ఒకటే తరహా రచనా శైలి, పదాల వినియోగం చూసిన వారికి ఒక్కరే రాస్తారా ఏంటి? అన్న అనుమానం ఉండేది. దానికి సమాధానమే ఈనాడు జర్నలిజం స్కూల్. పనిచేస్తున్న జర్నలిస్టులకు ‘ఈనాడు’ రచనా శైలిని నేర్పించే బదులు.. భావి జర్నలిస్టులకు సొంతంగా శిక్షణ ఇచ్చే ఆలోచన చేశారు రామోజీరావు. అలా పురుడు పోసుకున్నదే ఈనాడు జర్నలిజం స్కూలు. ఇక్కడ శిక్షణ పొందిన వారు ఒకే తరహా రచనా శైలిని అలవర్చుకోవడం వల్లే పత్రికంతా ఒక్కరే రాశారా అన్నట్టు తోచేది. అంతేకాదు.. ఎప్పటికప్పుడు వాడుక భాషలో వస్తున్న మార్పులకు ‘ఈనాడు’ తన విన్యాసాన్ని మార్చుకోవడం వల్లే.. ‘ఈనాడు’కు నాడూ నేడూ పాఠకులు పట్టం కడుతున్నారు. దానికి రామోజీరావు ముందు చూపే నిదర్శనం.ఈనాడుతో వ్యావహారిక తెలుగుకు పెద్దపీట వేసిన రామోజీరావు.. తెలుగు భాషాభిమానుల కోసం ‘తెలుగు వెలుగు’ మాసపత్రికను నడిపారు. చతుర, విపుల కూడా పాఠకులను కొన్ని దశాబ్దాల పాటు అలరించాయి.
స్వచ్ఛభారత్, సుజలాం సుఫలాం అంటూ పరిశుభ్రత కోసం, జలసంరక్షణ కోసం ఊరూవాడను ఏకం చేశారు. ఇలా దాదాపు ఐదు దశాబ్దాలుగా ఎన్నో ప్రజాఉద్యమాలకు సారథిగా నిలుస్తూ ప్రతి ఉదయం కోట్లాదిమంది పాఠకుల్ని పలకరిస్తూ తెలుగువారందరినీ వార్తా, విజ్ఞాన, వినోద ప్రపంచంలో ముంచెత్తుతోంది ఈనాడు.
రామోజీరావు విజయయాత్రలో ఈనాడుతోపాటు కీలక మైలురాళ్లుగా నిలిచాయి సితార సినీపత్రిక, చతుర, విపుల వంటి సాహితీ పత్రికలు.1978లోనే 'విపుల, చతుర' సాహిత్య పత్రికల్ని ప్రారంభించడం ఇందుకొక ఉదాహరణ. ప్రపంచ భాషల్లోని అత్యుత్తమ కథల్ని అనువదించి తెలుగు వారికి అందించడానికి ఆయన 'విపుల' పత్రిక తెచ్చారు.. ఇలాంటి ప్రయత్నం, ప్రయోగం అంతకుముందెన్నడూ, ఎక్కడా లేదు. ఉత్తమ సాహిత్యాన్ని నెలనెలా నవల రూపంలో, చౌకగా పాఠకులకు అందించాలనే ఆలోచనతో మొదలైంది 'చతుర' పత్రిక, ఇదీ ఒక విభిన్న ఆలోచనే. నెలకో నవలతో చతుర, వివిధ భాషా కథల సమాహారంగా తెచ్చిన విపుల సాహిత్యరంగంలో వినూత్న ప్రయోగం. ఎందరో అసాధ్యమని భావించే సాహిత్య పత్రికల్ని 4 దశాబ్దాలపాటు నిరాటంకంగానడిపారు రామోజీరావు.
ప్రింట్ మీడియాలో ఈనాడు ఓ సంచలనమైతే లక్ట్రానిక్ మీడియాలో రామోజీరావు ప్రారంభించిన ఈటీవీ తెలుగువారి ఠీవీగా భావిల్లుతోంది. దృశ్యమాధ్యమంలో అప్పటివరకూ ఉన్న మూసధోరణిని మార్చేసి బుల్లితెరపై అవధుల్లేని వినోదం పంచుతూ ఇంటింటి టీవీ అయింది ETV. 1995 ఆగస్టు 27న తెలుగులో మొట్టమొదటి 24గంటల ఛానల్‌గా ప్రారంభమైంది! పేరుకు వినోద ప్రధానమైనా ఇంటిల్లిపాదినీ అలరించేలా వినూత్న కార్యక్రమాలు ప్రసారం చేసింది. వారానికి ఒక సీరియల్‌ను ఆస్వాదించే ప్రక్షకులను డైలీ సీరియల్స్‌తో టీవీలకు అతుక్కుపోయేలా చేసింది.
మూడు పాటలు, ఆరు సినిమా కార్యక్రమాలు అంటూ.. గిరిగీసిన సినీ వినోద వలయంలో ఈటీవీ చిక్కుకోలేదు. వేకువనే 'అన్నదాత'కు పంట సిరులు కురిపించే మెలకువలు నేర్పిస్తుంది. గానగంధర్వుడు దివంగత ఎస్పీ బాల సుబ్రమణ్యంతో రామోజీరావు పట్టుపట్టి చేయించిన కార్యక్రమం పాడుతా తీయగా! ఈ కార్యక్రమం సినీ పరిశ్రమకు వందల మంది గాయనీగాయకుల్ని అందించింది! నేటికీ అందిస్తూనే ఉంది. స్టార్ మహిళ వంటి కార్యక్రమం గిన్నీస్ పుస్తకంలోకి ఎక్కింది. జబర్దస్త్ కామెడీషో ప్రేక్షకుల్ని ఒత్తిడి నుంచి దూరం చేస్తూ కడుపుబ్బా నవ్విస్తోంది! ఢీ రియాల్టీ డ్యాన్స్ షో ప్రేక్షకులతో స్టెప్పులు వేయిస్తోంది. ఇలా చెప్పుకుంటూపోతే వినోదాల జల్లులో జనం తడిసిముద్దయ్యేలా ETV కార్యక్రమాలను ప్రజలకు అందించారు రామోజీరావు.
మానవ సంబంధాలకు విలువిస్తూ, మన సంస్కృతీ సంప్రదాయాలను తర్వాతి తరాలకు అందిస్తూ ETV నెట్‌వర్క్‌ను వివిధ రాష్ట్రాల్లో విస్తరించారు. 2000 సంవత్సరం ఏప్రిల్లో ఈటీవీ బంగ్లా ప్రారంభమైంది. మూడు నెలల్లోనే మరాఠీ ఛానల్ మొగ్గ తొడిగింది. సరిగ్గా మరో ఐదు నెలలకే ఈటీవీ కన్నడ కస్తూరిలా పరిమళించింది. 2001 ఆగస్టు నుంచి ఈటీవీ ఉర్దూ ప్రసారాలు మొదలయ్యాయి. 2002 జనవరిలో ఒకేరోజు ఆరు ఛానళ్లను ఆరంభించి మీడియా చరిత్రలో మరో సంచలనం సృష్టించారు రామోజీరావు. ప్రాంతీయ భాషాఛానళ్లతో ప్రజలకు చేరువైన ఈటీవీ ఒక పెద్ద నెట్‌వర్క్‌గా అవతరించింది.
తెలుగునాట వినోదం పంచుతున్న ఈటీవీని ఓ సమాచార విప్లంగా మార్చాలని రామోజీరావు సంకల్పించారు. తెలుగు నేల నలుచెరగులా సమాచార వెలుగులు ప్రసరింపజేయడమే లక్ష్యంగా 2003 డిసెంబరులో ఈటీవీ-2 న్యూస్ ఛానల్‌ను ప్రారంభించారు. రాష్ట్ర విభజన తర్వాత ఇప్పుడు ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణ పేరిట రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా 24 గంటల వార్తాస్రవంతిని ప్రారభించారు. ఎప్పటికప్పుడు తాజావార్తలతోపాటు విశ్లేషణలు, నిజ జీవన గాథలతో అలరిస్తోంది. ఈటీవీ అంటే సంచలనాలకు దూరంగా వాస్తవాలకు దగ్గరగా విశ్వసనీయతకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారిపోయింది. ఈటీవీ తెరపై కనిపిస్తేనే నమ్ముతారనేంత విశ్వాసాన్ని పొందింది.
ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా ఈటీవీ నెట్‌వర్క్‌ను ఎప్పటికప్పుడు రామోజీరావు విస్తరించుకంటూ వెళ్లారు. ఈటీవీ ప్లస్, ఈటీవీ సినిమా, ఈటీవీ అభిరుచి, ఈటీవీ స్పిరిచ్యువల్ ఛానల్స్ ప్రేక్షకులను రకరకాల కార్యక్రమాలతో అలరిస్తున్నాయి. ఇక భవిష్యత్‌ను ముందే పసిగట్టే రామోజీరావు తెలుగునాట అతిపెద్ద డిజిటల్ మీడియా విభాగాన్ని సృష్టించారు. అదే ఈటీవీ భారత్. 13 భాషల్లో వార్తలు అందిస్తూ అతిపెద్ద డిజిటల్ ప్లాట్‌ఫాంగా ఈటీవీ భారత్ అరచేతిలో సమాచారం అందించే అస్త్రంగా మారింది.
పెద్దలకే కాదు పిల్లలకూ వినోదాన్ని అందించాలన్నది రామోజీరావు ఆలోచన. అందులో నుంచి పుట్టిందే ఈటీవీ బాల భారత్. 4 నుంచి 14 ఏళ్ల వయసున్న పిల్లల్ని కట్టిపడేసేలా 12 భాషల్లో కార్టూన్ కార్యక్రమాలను అందిస్తున్నారు. భవిష్యత్ వినోదాన్ని శాసించే ఓటీటీ ప్లాట్‌ఫాంలోకి ఈటీవీ అడుగుపెట్టింది. ఈటీవీ నెట్‌వర్క్‌లోని కార్యక్రమాలన్నింటితోపాటు ఉత్కంఠరేపే వెబ్‌సిరీస్‌లు, అలనాటి చిత్రరాజాలన్నీ ఈటీవీ విన్ ఓటీటీ యాప్ ద్వారా అందుబాటులో ఉంచారు.ఇవన్నీ కలిపి కోట్ల మంది ప్రేక్షకుల్ని ప్రభావితం చేసే ఈటీవీ నెట్‌వర్క్‌గా ప్రేక్షకుల అందించారు.
రాజకీయ, పాత్రకేయ రంగాల్లో ఎందరో తన సంస్థల నుంచి వెళ్లి ఆయన స్ఫూర్తితోనే నేడు అగ్రస్థాయిలో రాణిస్తున్నారు. తెలుగుదేశం కీలక నేత, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు, ఇటీవల విజయనగరం ఎంపీగా గెలుపొందిన అప్పలనాయుడు, YCP నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు, ఏపీ ప్రభుత్వ మాజీ మీడియా సలహాదారు జివిడి కృష్ణమోహన్, మెదక్ నుంచి ఇటీవల ఎంపీగా గెలుపొందిన భాజపా నేత రఘునందన్‌రావు గతంలో 'ఈనాడు' సంస్థల్లో పనిచేసిన వారే. ఇక పాత్రికేయ రంగానికి పుట్టినిల్లుగా చెప్పుకునే 'ఈనాడు' సంస్థల నుంచే వేలాది మంది నేడు జర్నలిజంలో అత్యున్నత స్థాయిలో రాణిస్తున్నారు.
భారతీయ సంప్రదాయ వంటకాల రుచుల్ని దేశదేశాలకూ పరిచయం చేశారు రామోజీ రావు. 1980 ఫిబ్రవరిలో ప్రియా ఫుడ్స్ ప్రారంభించారు. పచ్చళ్ల నుంచి చిరుతిళ్ల వరకు వందల రకాల ఉత్పత్తులతో, అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో అసంఖ్యాక ప్రజానీకం ఆదరణ పొందింది ప్రియా ఫుడ్స్. ఆహార ఉత్పత్తుల రంగంలో రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో అనేక పురస్కారాలు దక్కించుకుంది. ఇదే రీతిలో రామోజీరావు ప్రారంభించిన డాల్ఫిన్ హోటల్స్ ఆతిథ్య రంగంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.
ఈనాడు దినపత్రిక లాగానే విశాఖపట్నంలో మొదలైన డాల్ఫిన్.. హైదరాబాద్‌లో అడుగు పెట్టడం విశేషం. విశాఖలో మొదటి త్రీస్టార్ హోటల్‌గా డాల్ఫిన్ హోటల్ 1980లో మొదలైంది. నాలుగు అంతస్థులుగా మొదలై ఏండంతస్థులకు విస్తరించిన ఈ హోటల్ స్థాయి కూడా ఫోర్ స్టార్‌కు పెరిగింది. విశాఖలోనే ఉత్తమమైనదిగా 2008లో ప్రభుత్వ గుర్తింపు సాధించింది. ఇందులోని హొరైజాన్ 2010లో ఉత్తమ రెస్టారెంట్‌గా గుర్తింపు పొందింది. దేశ, విదేశాల పర్యాటకులు ఎందరినో ఆకట్టుకున్న డాల్ఫిన్ హోటల్‌కు ఫెడరేషన్ ఆఫ్ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్, ఇంటర్నేషనల్ హోటల్ అసోసియేషన్, ట్రావెల్ ఏజెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంస్థల్లో సభ్యత్వం ఉంది. ఈ హోటళ్ల సముదాయం ప్రపంచ స్థాయిలో I.S.O గుర్తింపు పొందింది. ఆహార నాణ్యతకు ఈ హోటళ్లు గీటురాయిగా నిలిచాయి. ఆతిథ్య సేవలకు అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన ఈ హోటళ్ల శ్రేణిని తీర్చిదిద్దడంలో రామోజీరావు కృషి నిరుపమానం.
డాల్ఫిన్ హోటళ్ల శ్రేణిలో పనిచేస సిబ్బంది ఇక్కడ బస చేసే పర్యాటకులకు ఎలాంటి సమాచారం, సహకారం కావాలన్నా నిమిషాల్లో అందించగలిగిన విధంగా నడుచుకుంటారు. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తారు. ఆతిథ్యానికి ఆత్మీయతను మేళవిస్తారు. దీనంతటి వెనుక ఉన్న కృషి, ఆలోచన అంతా రామోజీరావుదే.ప్రముఖ కార్పొరేట్ కంపెనీలు అధికారిక సమావేశాలను, కాన్ఫరెన్సులను, సెమినార్లను నిర్వహించుకోవడానికి ఈ సౌకర్యాలు అనువుగా ఉంటాయి. అప్పటికప్పుడు వచ్చినా నేరుగా సమావేశాల్లో పాల్గొనడానికి వీలుగా ఏర్పాట్లు ఉండటం విశేషం. దేశంలోనే పేరొందిన డాల్ఫిన్ హోటళ్లు రామోజీరావు కృషితో మేటి ఆతిథ్యరంగ సంస్థల్లో ప్రముఖ స్థాయికి ఎదిగాయి.
సినీ పరిశ్రమ సిగలో సింగారాల పువ్వుగా, పర్యాటకుల పెదవులపై సంబరాల నవ్వుగా రూపుదిద్దుకున్న అపురూప చిత్రనగరం రామోజీ ఫిల్మ్‌సిటీ, ప్రస్తుతం ఓ అంతర్జాతీయ అద్భుతం. ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్‌సిటీగా గిన్నిస్ రికార్డుల గీటురాయిపై మెరిసిన మేలిమి బంగారం. ఏకకాలంలో 20 సినిమాలు నిర్మించినా ఎక్కడా ఆగాల్సిన అవసరం లేకుండా ఆఘమేఘాల మీద అమర్చే సౌకర్యాలకు నెలవు. హాలీవుడ్ స్థాయిలో నిలిచే అత్యాధునిక సామగ్రిని సమకూర్చుకున్న విస్తృత దృక్పథానికి కొలువు.
"స్క్రిప్టుతో రండి- తుది ప్రింట్‌తో వెళ్లండి" అనేది ఇక్కడ కేవలం నినాదమే కాదు. కళ్లెదుట నిలిచిన కమనీయ వాస్తవం. సినిమా అంటే మాటలు కాదు ఎన్నో సన్నివేశాలు, ఎన్నెన్నో వేషాలు, మరెన్నో అవసరాలు ఇంకెన్నో పరిసరాలు. అన్నింటినీ కలిపి ఒకేచోట అందిస్తామనేది ఏమాత్రం అతిశయోక్తి కాదని, అత్యంత నిబ్బరంగా చెప్పగలిగిన ఆత్మవిశ్వాసపు శక్తిగా ఫిల్మ్‌సిటీని తీర్చిదిద్దారు రామోజీరావు. తెలుగు, హిందీ, బెంగాలీ, ఒడియా, మలయాళం, తమిళ, కన్నడ, మరాఠీ, అస్సామీ, బంగ్లా, ఇంగ్లిష్ ఇలా విభిన్న భాషలకు చెందిన వేలాది చిత్రాలు రూపుదిద్దుకున్న ఈ ఫిల్మ్‌సిటీ గురించి ఏ సినీ ప్రముఖుడిని అడిగినా ఒకటే చెబుతారు 'మనలో సత్తా ఉండాలేగానీ రామోజీ ఫిల్మ్‌సిటీలో సదుపాయాలకు కొదువ లేదని' అవును అది అక్షరాలా నిజం.
కుమార్తె పెళ్లి వేడుకలు అపురూపంగా నిర్వహించాలనుకున్నా, కార్పొరేట్ సమావేశాన్ని అబ్బురపరిచేలా జరపాలనుకున్నా రామోజీ ఫిల్మ్‌సిటీకి రావాల్సిందే. 20 మంది నుంచి 2,000ల మంది వరకు సరిపోయే సమావేశ మందిరాలు ఉన్నాయి. ఆరుబయట ఆస్వాదించాలనుకుంటే ఎలాంటి సందర్భానికైనా వేలాది మందికి సరపడా వసతులు ఉన్నాయి. అంతేకాదు రెయిన్‌బో గుండు సూది నుంచి హెలికాఫ్టర్ వరకు ఏది కావాలన్నా సమకూర్చే పరేడ్, స్టార్ హోటళ్లు తార, సితారతోపాటు సినిమా యూనిట్ సభ్యులకు బస కల్పించే సహారా హోటల్ అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా హెలికాఫ్టర్‌లో ఫిల్మ్‌సిటీకి రావాలనుకుంటే హెలిప్యాడ్ సంసిద్ధం.
సుమారు రెండు వేల ఎకరాలకు పైబడిన సువిశాల ప్రదేశాన్ని సుందరంగా మలిచిన కార్యరంగం. ఇప్పటికే ప్రభుత్వానికి వందల కోట్ల రూపాయలు పన్ను చెల్లించిన విస్తృత వ్యాపార కేంద్రం. హైదరాబాద్‌కు 30 కిలోమీటర్ల దూరంలోని కుగ్రామం అనాజ్‌పూర్‌లో నిర్మించిన రామోజీ ఫిల్మ్‌సిటీ సందర్శిస్తే కానీ జంటనగరాల వీక్షణ పూర్తికాదని పర్యాటకులు భావించే అద్భుత కళాఖండం. దేశ, విదేశాల నుంచి ఏటా లక్షలాది మంది పర్యాటకులను ఆకర్షిస్తున్న ఈ సొగసుల సముదాయం ఏకంగా 5 కోట్ల పనిదినాలతో రూపుదిద్దుకున్న కళాక్షేత్రం. ప్రత్యక్షంగా 7500 మందిని అక్కున్న చేర్చుకున్న ఉపాధి కేంద్రం.
రామోజీరావు సినిమా రంగంలో సైతం కాలుమోపి, ఉషాకిరణ్ మూవీస్ ద్వారా వివిధ భాషల్లో 87 సినిమాలు నిర్మించారు. ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ ద్వారా యువ నటీనటులు పరిచయం కాగా తారలుగా ఎదిగిన ఎంతోమంది అగ్రశ్రేణి నటులుగా ఉన్నారు. ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన 'పీపుల్ ఎన్‌కౌంటర్' సినిమాతో శ్రీకాంత్ తెలుగు తెరకు పరిచయం కాగా 'నిన్ను చూడాలని' చిత్రంతో జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా పరిచయమయ్యారు. వందల మంది గాయనీ, గాయకులను సంగీత ప్రపంచానికి పరిచయం చేశారు. ఎందరో మట్టిలో మాణిక్యాలను వెలుగులోకి తీసుకొచ్చారు. ఎంతోమంది సామాన్యులు రామోజీ ప్రోత్సాహంతో వినోద ప్రపంచంలో రాణిస్తున్నారు.
మాతృభాష పరిరక్షణకు కృషి చేయడం రామోజీ రావు చేపట్టిన మరో మహాయజ్ఞం తెలుగు- వెలుగు. పరాయి భాషలపై మోజు తెలుగు పలుకు ఉనికినే ప్రశ్నార్థకం చేసే దుస్థితి మధ్య అమ్మభాషలోని కమ్మదనాన్ని నేటి తరాలకు చాటిచెప్పే బృహత్ బాధ్యతల్ని భుజానికెత్తుకున్నారు. లాభాపేక్షలేని రామోజీ ఫౌండేషన్ ద్వారా తెలుగు వెలుగు మాసపత్రికను ప్రచురించి మాతృభాషాభివృద్ధికి తనవంతు కృషిచేశారు. భావిభారతాన్ని ముందుకు నడిపే బాలల్ని సుశిక్షితులుగా తీర్చిదిద్దడం ఎంతో అవసరమని భావించే రామోజీ రావు వారికోసమూ ప్రత్యేక పత్రిక అందుబాటులోకి తీసుకొచ్చారు. బాలభారతం ద్వారా చిన్నారుల్లో జ్ఞానం, సృజన, ప్రగతిశీల ఆలోచనా విధానం వంటి గుణాల్ని అలవర్చే ప్రయత్నం చేశారు.
రామోజీరావు సామాజిక సేవలో సైతం ముందుండేవారు. ప్రకృతి కన్నెర్ర చేసినా.. కరోనా మహమ్మారి విరుచుకుపడినా.. ఆపత్కాలంలో ముందడుగు వేసేవారు రామోజీరావు (Ramoji rao). నలుగురికీ చేయూతనివ్వండి అని పిలుపునివ్వడం కంటే ముందు.. ఆయనే స్వయంగా సాయానికి పూనుకొనేవారు. తాను చేయూతనందించి.. నలుగుర్నీ భాగస్వాముల్ని చేసేవారు. పేదరికంలో ఉన్న చిన్నపిల్లల వైద్యం కోసం అయినా.. ప్రకృతి ప్రకోపంలో కొట్టుమిట్టాడుతున్న బాధితుల కోసమైనా.. ఆయన పిలుపునిచ్చిందే తడువుగా దాతలూ మేమున్నామంటూ చేతులు కలిపేవారు. వారిచ్చిన ప్రతి రూపాయినీ బాధ్యతగా చేర్చేవారు. అందుకే ఇప్పటికీ ‘ఈనాడు’లో ఏదోమూల కదిలించే చిన్న వార్త వచ్చినా దాతలు స్పందించి తమ వంతుగా సాయం చేస్తుంటారు.
1976 వ సంవత్సరం.. ఒకే ఏడాదిలో దివిసీమ ప్రాంతంలో వరుసగా 3 తుపాన్లు విరుచుకుపడ్డాయి. అప్పుడే తొలిసారిగా తుపాను సహాయనిధిని ప్రారంభించింది ఈనాడు. దానికి విశేష స్పందన లభించింది. పాఠకుల నుంచి దాదాపు రూ.65 వేలు విరాళాల రూపంలో రాగా.. సీఎం సహాయనిధికి అందించారు.1977 నవంబరులో కృష్ణా జిల్లా పాలకయతిప్ప గ్రామాన్ని వరదలు ముంచేశాయి. అప్పుడు రామకృష్ణమఠం ఆధ్వర్యంలో వరదలకు తట్టుకునేలా దాదాపు 112 పక్కా ఇళ్లు కట్టించి ఇచ్చింది ఈనాడు. ఇళ్లు కట్టగా మిగిలిన డబ్బుతో పక్కనే కృష్ణాపురం అనే ఊళ్లో మరో 22 మందికి నీడ కల్పించారు. 1996లో కోస్తాపై పెనుతుపాను విరుచుకుపడినప్పుడు మరోసారి బాధితులకు అండగా నిలిచింది. పాతిక లక్షలతో తుపాను సహాయనిధిని ప్రారంభించగా పాఠకుల విరాళాలతో అది కోటి రూపాయలకు చేరుకుంది. దీంతో 42 సూర్య భవనాలను తీరప్రాంతంలో పునరావాస కేంద్రాలుగా ఉపయోగపడేలా అందించింది.
1999లో ఒడిశాను చెల్లాచెదురు చేసింది సూపర్ సైక్లోన్. అప్పుడు కూడా ముందుకువచ్చిన ఈనాడు పక్కా ఇళ్లను నిర్మించింది. జగత్‌సింగ్ పుర్ జిల్లాలో 50 లక్షలతో 60 పక్కా ఇళ్లు కట్టించి ఇచ్చింది.ఇక 2001లో గుజరాత్‌లో వేలమందిని బలిగొన్న భూకంపంలో తనవంతు సాయం అందించింది. సహాయనిధితో పాటు పాఠకుల విరాళాలను పోగు చేసి దాదాపు 2.2 కోట్ల రూపాయలతో కచ్ జిల్లాలో స్వామి నారాయణ్ సంస్థ సహకారంతో 104 ఇళ్లు సమకూర్చింది. 2004లో దేశ దక్షిణ తీర ప్రాంతంలో సునామీ ముంచెత్తినప్పుడు తీవ్రంగా నష్టపోయిన కడలూరు, నాగ పట్టణం జిల్లాల్లో రెండున్నర కోట్లు వెచ్చించి రామకృష్ణ మఠం సహకారంతో మత్స్యకారులకు 164 ఇళ్లు అందించింది.
2009 అక్టోబరులో కృష్ణ, తుంగభద్ర, కుందు నదులకు కనీవినీ ఎరుగనిరీతిలో వరదలు రావడంతో కర్నూలు, మహబూబ్‌నగర్ జిల్లాలు కకావికలమయ్యాయి. తీవ్రంగా నష్టపోయిన బాధితులకు అండగా ఈనాడు తక్షణం రంగంలోకి దిగి 1.2 లక్షల ఆహార పొట్లాలను అందజేసింది. ఈనాడు గ్రూపు సంస్థల తరపున కోటి రూపాయల విరాళాన్ని ప్రకటిస్తూ.. బాధితులను ఆదుకోవాల్సిందిగా దాతలకు రామోజీరావు పిలుపునిచ్చారు. వేలమంది దాతలు విరాళాలు అందించడంతో రూ.6.05 కోట్లు సమకూరాయి. వీటితో మహబూబ్ నగర్ జిల్లాలో తీవ్రంగా నష్టపోయిన చేనేత కుటుంబాలకు ఈనాడు మగ్గాలు అందజేసింది. కర్నూలు జిల్లాలో ఉషోదయ పేరిట ఆధునిక సౌకర్యాలతో 4 పాఠశాల భవనాలను నిర్మించి 2011 జులై 14న ప్రభుత్వానికి అప్పగించింది. వరద బాధితులను ఆదుకునేందుకు వేల మంది వితరణశీలురు రూ.కోట్లు విలువ చేసే వస్తువులు, ఇతర సామగ్రి పంపిణీ చేసేందుకు ‘ఈనాడు’ను ఆశ్రయించడం సంస్థపై ప్రజలకు ఉన్న విశ్వసనీయతకు నిదర్శనం.
2014లో హుద్ హుద్ బాధితుల కోసం రూ.3 కోట్ల సహాయనిధితో పాటు పాఠకుల విరాళాలు రూ.3 కోట్లు కలిపి విశాఖ జిల్లాలోని తంతడి, వాడపాలెం ప్రాంతాల్లో 80 కొత్త ఇళ్లు నిర్మాణంతోపాటు దెబ్బతిన్న మరికొన్ని ఇళ్లకు మరమ్మతులు చేసి ఇచ్చింది ఈనాడు. రామోజీ ఫౌండేషన్ తెలుగు రాష్ట్రాల్లో రెండు గ్రామాలను దత్తత తీసుకుంది. అందులో ఒకటి కృష్ణా జిల్లా పెదపారుపూడి కాగా.. రెండోది రంగారెడ్డి జిల్లా నాగన్‌పల్లి గ్రామం. ఈ రెండు గ్రామాల అభివృద్ధికి ఫౌండేషన్ ఎంతగానో కృషి చేసింది. కోట్లాది రూపాయలు ఆయా గ్రామాల అభివృద్ధికి వెచ్చించింది.
2018 కేరళ వరదల్లో సర్వం కోల్పోయినవారికి అండగా నిలిచేందుకు రామోజీ గ్రూపు సంస్థల తరఫున ఛైర్మన్ రామోజీరావు రూ.3 కోట్లతో ‘ఈనాడు’ సహాయనిధిని ఏర్పాటుచేశారు. మానవతావాదులూ ఇతోధికంగా సాయం చేయాలంటూ పిలుపునిచ్చారు. ఈ పిలుపును అందుకున్న ప్రజలు, చిరు వ్యాపారులు, విద్యార్థులు, పారిశ్రామికవేత్తలు, ఎన్‌ఆర్‌ఐలు ఇలా ఎందరో సహృదయులు తమకు సాధ్యమైనంత మేరకు విరాళాలు అందించారు. వారి దాతృత్వ హృదయాన్ని సాక్షాత్కరిస్తూ నిధి రూ.7.77 కోట్లకు చేరింది. ఆ డబ్బుతో అలెప్పీ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సర్వం కోల్పోయిన 121 కుటుంబాలకు ‘ఈనాడు’ ఆధ్వర్యంలో రెండు పడక గదుల ఇళ్లు కట్టించారు.
కరోనా మహమ్మారి విరుచుకుపడినప్పుడు రామోజీరావు రూ.20 కోట్లు విరాళం ప్రకటించారు. ఈ సాయాన్ని రెండు రాష్ట్రాల సీఎం సహాయనిధి ఖాతాలకు బదిలీ చేశారు. అలాగే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆ సంస్థ ఛైర్మన్ రామోజీరావు లేఖలు కూడా రాశారు. కరోనాపై యుద్ధంలో విజయం సాధించాలని ఆకాంక్షించారు. ప్రజలిచ్చే సొమ్ముకు కచ్చితమైన లెక్క ఉండాలి. లేదంటే వారు నమ్మకంతో చేసే సాయానికి విలువ ఉండదు. అందుకే ఏ రోజుకారోజు సహాయనిధికి ఎవరెవరు ఎంతిచ్చారన్నది పత్రికాముఖంగానే ప్రచురించింది.. ఈనాడు. ఆ నిధులతో ఏం చేయాలి..? ఎలా ఖర్చు చేస్తే బాగుంటుంది? అన్నది బాధిత ప్రాంత అధికారులతో, నాయకులతో చర్చించాకే నిర్ణయం తీసుకునేది. నిర్మాణాలు పూర్తయి, లబ్ధిదారులకు అందజేసి, నిర్వహణ బాధ్యతను స్థానికగ్రామ పంచాయతీలకు అప్పజెప్పే వరకూ ఈనాడు పాత్ర ఉంటుంది.
రామోజీరావు తమ సంస్థల్లోని నియమనిబంధనల్ని తు.చ. తప్పకుండా పాటిస్తారు. ప్రజలకు సంబంధించిన సమాచారమే వార్తాంశం కావాలని ఆయన నియమం. తన మాతృమూర్తి మరణం కూడా ఈనాడులో వార్తగా రావడానికి అంగీకరించలేదు. ఇతర పత్రికల ద్వారానే ఆ వార్త లోకానికి తెలిసింది. 1962లో ప్రారంభించిన మార్గదర్శి చిట్ఫండ్స్ హామీ పత్రం ఇవ్వకుండా డబ్బు చెల్లించండని ఇంతవరకు ఒక్కరికీ సిఫారసు చేయలేదంటే ఆయన పద్ధతుల్ని సులభంగా అర్ధం చేసుకోవచ్చు. రామోజీ గ్రూపులో దశాబ్దాలుగా నెలాఖరు రోజునే విధిగా జీతాలివ్వడం, పదవీ విరమణ రోజునే సంస్థాగతమైన చెల్లింపులు చేయడం ఆయన పట్ల నమ్మకాన్ని పెంచాయి. ఏ సంస్థ మనుగడకైనా ఇలాంటి ప్రమాణాలే శ్రీరామరక్ష.
రామోజీరావు బహుముఖ ప్రజ్ఞాశాలి. పారిశ్రామికవేత్తగా, పత్రికా సంపాదకుడిగా, స్టూడియో వ్యవస్థాపకునిగా, సినీ నిర్మాతగా, వ్యాపారవేత్తగా ఎన్నో రంగాల్లో రాణించారు. అన్నింటిలోకి జర్నలిజమే ఆయనకు అమితంగా ఇష్టమైనది. రోజులో ఎక్కువ సమయం దీనికే కేటాయిస్తారు. వర్తమాన వ్యవహారాల్ని ఆయన నిశితంగా పరిశీలిస్తారు. తెలుగు నుడి, పద ప్రయోగం, వాక్యనిర్మాణంపై ఆయనకు పట్టు ఎక్కువ. చెప్పాల్సిన విషయం అక్షరాల్లో నూరుశాతం ప్రతిబింబించేంత వరకు ఆయన పట్టు విడవరు. సంపాదకుడు అంటే ఆయనే. న్యూస్ ప్లానింగ్, న్యూస్ జడ్జిమెంట్ రామోజీరావు నుంచే నేర్చుకోవాలి. ఈనాడు ఇన్ని విజయ శిఖరాలు చేరడానికి తనలోని పాత్రికేయుడే ప్రధాన కారణం. ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా చైర్మన్ గా కూడా రామోజీరావు పనిచేశారు.
రామోజీరావు తన జీవితకాలంలోనే గ్రూపు సంస్థల్ని సమున్నత శిఖరాలకు చేర్చారు. ఒకదానికొకటి సంబంధం లేని రంగాల్లో రాణించేందుకు జీవితం అనే కొవ్వొత్తిని ఆయన రెండువైపులా వెలిగించారు. రోజుకు కనీసం 14-16 గంటల చొప్పున జీవితాంతం పనిచేశారు. దినపత్రిక నిర్వహణ అసిధారావ్రతం. ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలి. అందుకే అన్ని వనరులూ అవకాశాలూ ఉన్నా ఆయన ఎక్కువ దేశాలూ ప్రదేశాలూ చూడలేదు. ‘నా విజయ రహస్యమేమైనా ఉందీ అంటే అది, పని.. పని.. పని.. కష్టపడి పనిచేయడమొక్కటే. విశ్రాంతి కూడా నాకు పని చేయడంలోనే లభిస్తుంది. విజయానికి దగ్గరి దారులు ఉండవు’ అని ఎప్పుడూ చెప్పేవారు.
వ్యాపార, మీడియా, సామాజిక సేవా రంగాల్లో రామోజీరావు సేవలను గుర్తిస్తూ ఆంధ్ర, శ్రీ వెంకటేశ్వర, శ్రీశ్రీ రవిశంకర్ విశ్వవిద్యాలయాలు డాక్టరేట్లతో గౌరవించాయి. యుద్ధవీర్, కెప్టెన్ దుర్గాప్రసాద్ చౌధరి (రాజస్థాన్), బి.డి. గోయంకా వంటి అనేక ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. దేశంలో రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్‌ను రామోజీరావు అందుకున్నారు. లక్ష్యం, ప్రగతి ప్రస్థానం ఎప్పుడూ, ఎక్కడా అగకూడదన్నది రామోజీరావు భావన.
రామోజీరావు వ్యక్తిగత జీవితానికి వస్తే ఆయన జీవిత భాగస్వామి పేరు రమాదేవి, ఇద్దరు కుమారులు.పెద్ద కొడుకు కిరణ్, చిన్న కొడుకు సుమన్. సుమన్ బుల్లితెర రచయితగా, నటుడిగా, దర్శకుడిగా, చిత్రకారుడిగా రాణించారు. 2012లో అనారోగ్యంతో సుమన్ చనిపోయారు. ప్రస్తుతం ఆయన పెద్ద కుమారుడు కిరణ్ ఈనాడు గ్రూప్ సంస్థల మేనేజింగ్ డైరెక్టర్‌గా, పెద్ద కోడలు శైలజా కిరణ్ మార్గదర్శి ఎండీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సుమన్ సతీమణి విజయేశ్వరి రామోజీ ఫిలిం సిటి మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తూనే.. రామోజీ గ్రూప్‌కు చెందిన పలు సంస్థల బాధ్యతలు చూసుకుంటున్నారు.
సుమారు 7 దశాబ్దాల పాటు వ్యాపార, మీడియా మరియు సామాజిక రంగాల్లో రామోజీరావు తనదైన ముద్ర వేశారు.ఏ పని మొదలుపెట్టినా చివరివరకూ శ్రమించి ఆ పనిలో విజయం సాధించేందుకు పట్టుదలతో కృషి చేయడం,విజయం సాధించి చూపించడం రామోజీరావు తరహా. "కృషితోనాస్తి దుర్భిక్షం" అన్న నానుడికి నిలువెత్తు నిదర్శనంగా రామోజీరావు నిలిచారు. కేవలం తన కుటుంబానికి మాత్రమే కాక తన సంస్థల్లో పనిచేసే కుటుంబాలన్నింటికీ పెద్ద దిక్కుగా నిలచి ఉద్యోగుల ప్రేమాభిమానాలను అపారంగా సంపాదించుకున్న రామోజీరావు 87 ఏళ్ల వయస్సులో అనారోగ్యంతో 2024 జూన్ 8న నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని స్టార్ హాస్పిటల్‌లో తుదిశ్వాస విడిచారు.
అవరోధాలను అవకాశాలుగా, సవాళ్లను విజయసోపానాలుగా, వైఫల్యాలను గెలుపు పునాదులుగా ఎలా మలచుకోవచ్చో రామోజీరావు జీవితం నుంచి నేర్చుకోవచ్చు. ఆయనలోని అంకితభావం, ధైర్యం, ప్రతికూలతల్ని తట్టుకోగల సామర్థ్యం అందరికీ ప్రేరణ కలిగిస్తాయి.
- డి.వి.అరవింద్, మాగల్ఫ్ ప్రతినిధి
తాజా వార్తలు
- హైదరాబాద్‌లో విప్రో విస్తరణ
- ముహరఖ్ లో జాతీయ స్టేడియం..ఎంపీల ప్రతిపాదన..!!
- ఎన్విజన్ సిఇఓ లీ జంగ్ తో మంత్రి నారా లోకేష్ భేటీ
- డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ మాట్లాడుతున్నారా?
- మనీ ఎక్స్ఛేంజ్లో సాయుధ దోపిడీ..24 గంటల్లో నైజీరియన్ ముఠా అరెస్ట్..!!
- GCC స్థాయిలో మెటర్నిటీ లీవ్స్ రెగ్యులేషన్స్ పై వర్క్ షాప్..!!
- సౌక్ వాకిఫ్ ఈక్వెస్ట్రియన్ ఫెస్టివల్ 2025 సక్సెస్..!!
- దుబాయ్ లో టాక్సీ కంటే చౌకైనది.. బస్సు కంటే వేగవంతం..!!
- కాన్సస్‌లో దిగ్విజయంగా NATS బ్యాడ్మింటన్ టోర్నమెంట్
- తెలంగాణకు భారీ ఒప్పందం