ఇండియన్ బ్యాడ్మింటన్ మార్గదర్శి-గోపీచంద్

- November 16, 2024 , by Maagulf
ఇండియన్ బ్యాడ్మింటన్ మార్గదర్శి-గోపీచంద్

భారత బ్యాడ్మింటన్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక పేజీని లిఖించుకున్న దిగ్గజ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్. ఇండియాలో క్రికెట్‌కు అభిమానించే వారికి సమానంగా బ్యాడ్మింటన్ ఆటకు క్రేజ్ తెచ్చిన వ్యక్తి గోపీచంద్. ఆటగాడిగా తన ఆటతో దేశ ఖ్యాతిని ప్రపంచం నలుదిశలు చాటాడు. ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ గెలిచిన రెండో భారత క్రీడాకారుడిగా గోపిచంద్ నిలిచాడు. అనంతర కాలంలో, కోచ్‌గా మారి ఎందరో బ్యాడ్మింటన్ క్రీడాకారులను తయారు చేశారు. ఆయన శిక్షణలో రాటుదేలిన వారందరూ ఇండియా తరుపున ప్రాతినిధ్యం వహించడమే కాకుండా, అంతర్జాతీయ టోర్నీల్లో వారు విజయకేతనం ఎగురవేశారు. ప్రస్తుతం ఆయన  భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్‌గా సైతం వ్యవహరిస్తున్నాడు. నేడు ద్రోణాచార్య అవార్డు గ్రహీత, పద్మభూషణ్ పుల్లెల గోపీచంద్ పుట్టినరోజు.

పుల్లెల గోపీచంద్ 1973, నవంబర్ 16న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి ప్రకాశం జిల్లా చీరాలలో పుల్లెల సుభాష్ చంద్రబోస్, సుబ్బారావమ్మ దంపతులకు జన్మించాడు. వారి స్వగ్రామం మాత్రం ఇంకొల్లు తాలూకా నాగండ్ల గ్రామం. గోపి తండ్రి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో ఫీల్డ్ ఆఫీసర్ కావడంతో, వారి కుటుంబం ఒరిస్సాలోని రాయగడ, చెన్నై, నిజామాబాద్ ప్రాంతాల్లో కొంత కాలం ఉంది. ఆ తర్వాత హైదరాబాద్ నగరంలో స్థిరపడింది. గోపీచంద్ ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా ఉండే ఆంధ్ర విద్యాలయ కళాశాల నుంచి డిగ్రీ పూర్తి చేశాడు.

గోపీచంద్ కంటే ముందు అతని పిన్ని (తల్లి చెల్లలు) మంచాల బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా రాణించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తరుపున 1973 జాతీయ బ్యాడ్మింటన్ టోర్నీలో ఫైనల్స్ లో ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అమీ గియా స్వల్ప పాయింట్ల తేడాతో ఓటమి పాలైంది. ఆమెను స్ఫూర్తిగా తీసుకోని గోపి అన్న రాజశేఖర్ సైతం బ్యాడ్మింటన్ ఆటగాడిగా యూనివర్సిటీ లెవల్లో ఆడాడు. అన్న ప్రోత్సాహంతో గోపి సైతం బ్యాడ్మింటన్ ఆట మీద చిన్నతనంలోనే మక్కువ ఏర్పడింది. అదే సమయంలో తండ్రికి హైదరాబాద్ బదిలీ కావడంతో గోపీ ఆట తీరును మెరుగుపరుచుకోవడానికి దోహదపడింది.      

బ్యాడ్మింటన్‌లో గోపీచంద్ మొదటి గురువు హమీద్ హుస్సేన్. అతని శిక్షణలో గోపి కొన్ని మెళుకువలు నేర్చుకున్నాడు. స్పోర్ట్స్ మినిస్ట్రీ  నేషనల్ టాలెంట్ సెర్చ్ స్కీమ్ లో ఢిల్లీ తరపున అండర్ -12లో ఆడాడు. ఆంధ్ర తరపున అండర్-14, అండర్ -15, అండర్18 టోర్నీల్లో ఆడాడు. వీటితో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టోర్నీల్లో కూడా ఆడాడు. 16 ఏళ్లకే అండర్-18 టైటిల్ సొంతం చేసుకున్నారు. వెటరన్ బ్యాడ్మింటన్‌ కోచ్ ఎస్.ఎం.ఆరిఫ్ శిక్షణలో గోపి జాతీయ స్థాయి టోర్నమెంట్స్ లో రాణించి జాతీయ జట్టులోకి అడుగుపెట్టాడు.

జాతీయ జట్టులో వెళ్లిన గోపి, మెరుగైన శిక్షణ కోసం బెంగళూరు సాయ్ కేంద్రంలో చేరాడు. ఇండియన్ బ్యాడ్మింటన్‌ దిగ్గజం ప్రకాష్ పదుకొనె శిక్షణలో గోపి జాతీయ జూనియర్స్ మెడల్ సొంతం చేసుకున్నాడు. గంగూలీ ప్రసాద్ వంటి పలువురు వెటరన్స్ సైతం గోపికి శిక్షణ ఇచ్చారు. గోపి జాతీయ సీనియర్ లెవెల్ టోర్నీల్లో ఆరంభంలో తడబాటు పడినా, తర్వాత పుంజుకొని మరపురాని విజయాలను సొంతం చేసుకున్నాడు.

గోపీచంద్ 1996లో విజయవాడలో జరిగిన సార్క్ (SAARC) బ్యాడ్మింటన్‌ టోర్నీలో తోలి అంతర్జాతీయ గోల్డ్ మెడల్ సాధించారు. 1997లో సైతం అదే టోర్నీలో వరుసగా రెండో సారి కూడా గోల్డ్ మెడల్ సాధించిన తోలి భారతీయ ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు. సార్క్ టోర్నీతో మొదలైన గోపి జైత్రయాత్ర 2001 వరకు సాగింది.1996-2000 మధ్యలో వరుసగా ఐదుసార్లు జాతీయ బ్యాడ్మింటన్‌ టోర్నీలో గోల్డ్ మెడల్స్ సాధించారు. 1997 ఇండియన్ ఓపెన్ టోర్నీలో సిల్వర్ మెడల్ అందుకున్నాడు. 1998లో మలేసియా రాజధాని కౌలాలంపూర్ లో జరిగిన కామన్ వెల్త్ గేమ్స్ లో ఇండియా జట్టు తరపున సిల్వర్, సింగిల్స్ లో కాంస్య పతకాన్ని సాధించాడు.

1999వ సంవత్సరంలో గోపీచంద్ ఫ్రాన్స్ దేశంలో జరిగిన Le Volant d'Or de Toulouse అంతర్జాతీయ టోర్నమెంట్ లో గోల్డ్ మెడల్ అందుకున్నాడు. అదే ఏడాది జరిగిన స్కాటిష్ ఓపెన్, ఇండియా ఇంటర్నేషనల్ టోర్నీల్లో గోల్డ్ మెడల్స్ సాధించాడు. ఫ్రెంచ్, జర్మనీ ఓపెన్ టోర్నీల్లో సిల్వర్ మెడల్స్ సాధించాడు. 2000లో జరిగిన ఆసియా ఛాంపియన్‌షిప్ టోర్నీలో కాంస్య పతకాన్ని అందుకున్నాడు.

గోపీచంద్ మొదటి నుంచి గాయాలతో ఇబ్బందులు పడేవాడు. ఆ గాయాల కారణంగానే చాలా సార్లు పతకాలను సాధించడంలో వెనకబడే వాడు. వరల్డ్ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్ టోర్నీ, 3 సార్లు థామస్ కప్ వంటి పలు అంతర్జాతీయ టోర్నీల్లో తాను అనుకున్న విజయాలను  సాధించలేకపోయాడు. 2000లో సైతం ఆసియా ఛాంపియన్‌షిప్ టోర్నీ తర్వాత గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యాడు. అయితే, అనూహ్యంగా 2001 ఆల్ ఇంగ్లాండ్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ నాటికి తిరిగి పుంజుకొని, ఆ టోర్నీలో తన అద్భుతమైన ఆటతో టైటిల్ సొంతం చేసుకున్నాడు. ప్రకాశ్ పదుకొనె తర్వాత ఈ టైటిల్ సాధించిన రెండో భారతీయ ఆటగాడిగా గోపి చరిత్ర సృష్టించాడు. ఈ టైటిల్ ద్వారా అంతర్జాతీయ మేన్స్ విభాగంలో 5వ రాంక్ కు ఎగబాకాడు.  

ఆల్ ఇంగ్లాండ్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ తర్వాత గాయాలతో ఇబ్బంది పడి ఆటకు దూరమయ్యాడు. గాయాలు మానిన తర్వాత జట్టులోకి వస్తూ, పోతూ నిలకడ లేమితో ఇబ్బందులు పడ్డాడు. ఇదే సమయంలో 2004లో జరిగిన ఇండియా శాటిలైట్ టోర్నీలో గోల్డ్ మెడల్ సాధించాడు. ఇదే గోపి చివరి అంతర్జాతీయ టోర్నమెంట్. దీని తర్వాత 2006 నాటికి ఆటగాడిగా రిటైర్ అయ్యాడు.

ఆటగాడిగా రిటైర్ అయినప్పటికీ, బ్యాడ్మింటన్ మీదున్న ఇష్టంతో హైదరాబాద్‌లోనే గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీని స్థాపించి ఎందరో యువ బ్యాడ్మింటన్ క్రీడాకారులను తయారు చేయడం మొదలు పెట్టాడు. గోపి శిక్షణలో క్రీడా ప్రపంచానికి పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్, కశ్యప్, సైనా నెహ్వాల్ వంటి వారు అంతర్జాతీయ స్థాయిలో రాణించడమే కాకుండా ఇండియాకు పతకాలను తెచ్చిపెట్టారు. ముఖ్యంగా సింధు, సైనాలైతే తమ కెరీర్లో మరపురాని విజయాలను సాధించారు. ఒక విధంగా ఇండియాలో క్రికెట్ ఆటతో సమానంగా బ్యాడ్మింటన్ క్రీడకు క్రేజ్ తీసుకోని రావడంలో గోపీచంద్ పాత్ర మరువలేనిది. ఇప్పటి వరకు గోపి శిక్షణలో సుమారు 5 వేల మంది పైగా తర్ఫీదును పొందారు. వీరందరూ తమ తమ స్థాయిల్లో రాణిస్తున్నారు.

ఇండియన్ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్‌గా గోపీచంద్ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి భారత జాతీయ బ్యాడ్మింటన్ జట్టులోకి ఎందరో ప్రతిభావంతులైన యువ క్రీడాకారులు వచ్చారు. ఆటగాళ్ల ఎంపికలో ఎటువంటి పైరవీలకు తావులేకుండా, మెరిట్ బేసిస్ మీద వారిని జట్టులోకి ఎంపిక చేస్తూ సరైన ఫలితాలను రాబడుతున్నారు. గోపి కోచ్ బాధ్యతల్లోకి వచ్చిన తర్వాతనే బ్యాడ్మింటన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా అభివృద్ధి చెందింది. అలాగే, దేశవ్యాప్తంగా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(boi) సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే టోర్నీల సంఖ్య పెంచడం జరిగింది.

గోపీచంద్ వ్యక్తిగత జీవితానికి వస్తే 2002లో తన సహచర బ్యాడ్మింటన్ క్రీడాకారిణి  పీ.వీ.వీ. లక్ష్మిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. లక్ష్మి సైతం గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ బాధ్యతల్లో పాలుపంచుకుంటున్నారు. వీరి కుమార్తె గాయత్రీ ప్రస్తుతం భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా రాణిస్తుంది. కుమారుడు విష్ణు సైతం జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నీల్లో ఆడుతున్నాడు.

ఇండియన్ బ్యాడ్మింటన్ రంగానికి గోపీచంద్ అందించిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం 1999లో అర్జున అవార్డు, 2001లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న (ప్రస్తుతం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్‌రత్న అవార్డు), 2005లో పద్మశ్రీ, 2009లో ద్రోణాచార్య అవార్డు, 2014లో పద్మభూషణ్ వంటి అత్యున్నత అవార్డులతో సత్కరించింది. ఐఐటీ కాన్పూర్ 2019 జూన్‌లో గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. రాబోయే రోజుల్లో మరెంతోమంది ప్రతిభావంతులైన యువ క్రీడాకారులు ఇండియా తరుపున అంతర్జాతీయ టోర్నీల్లో ఆడేలా గోపి భవిష్యత్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడు.  

--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com