మరాఠా రాజకీయ కింగ్ మేకర్-థాకరే

- November 18, 2024 , by Maagulf
మరాఠా రాజకీయ కింగ్ మేకర్-థాకరే

బాల్ థాకరే... ఒకప్పుడు ఈ పేరు మహారాష్ట్ర రాజకీయాల్లో సృష్టించిన అలజడి అంత ఇంత కాదు! ఎటువంటి రాజకీయ పదవులు లేకుండానే, సుమారు ఐదున్నర దశాబ్దాల పాటు  మహారాష్ట్రను రాజధాని ముంబైను అప్రతిహతంగా ఏలిన మాస్ లీడర్ థాకరే. రాజకీయ నాయకులకు సైతం సాధ్యం కానీ అచంచలమైన ప్రజాదరణను ఆయన సొంతం చేసుకున్నాడు. దేశంలో భాజపా నాయకుడు అద్వానీతో పాటుగా కరుడుగట్టిన హిందుత్వ నాయకుడిగా ముద్ర పడ్డ నాయకుడు కూడా ఈయనే కావడం విశేషం. మహారాష్ట్రీయుల ఆత్మగౌరవమే తన రాజకీయ భావజాలంగా మార్చుకొని, మరాఠా రాజకీయాల్లో కింగ్ మేకర్ పాత్రను పోషించారు. 

బాల్ సాహెబ్ థాకరే పూర్తి పేరు బాల్ కేశవ్ థాకరే. 1926, జనవరి 23న పూణే పట్టణంలో ప్రబోధంకర్ థాకరే, రమాబాయి దంపతులకు జన్మించారు. థాకరే తండ్రి ప్రబోధంకర్ థాకరే జర్నలిస్టుగా, మరాఠా రచయితగా, కార్టూనిస్టుగా రాణించారు. అంతేకాకుండా,  మహారాష్ట్ర ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు కోసం జరిగిన సంయుక్త మహారాష్ట్ర ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. తండ్రి స్పూర్తితో కార్టూనిస్టుగా జీవితాన్ని ప్రారంభించిన థాకరే తొలుత బొంబాయి (అప్పట్లో ముంబైని బొంబాయిగా పిలిచేవారు)లోని "ఫ్రీ ప్రెస్ జర్నల్" అనే ఆంగ్ల పత్రికలో కార్టూనిస్టుగా చేరారు. అక్కడే, ప్రముఖ కార్టూనిస్టు ఆర్.కె.లక్ష్మణ్ గారితో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి.      

 ఫ్రీ ప్రెస్ జర్నల్ పత్రికలో తమిళనాడు బ్రాహ్మణుల ఆధిపత్యం బాగా ఉండేది. ఒకానొక దశలో థాకరేకు రావాల్సిన ప్రమోషన్ ను వేరే తమిళ బ్రాహ్మణుడికి ఇవ్వడంతో, అందుకు నిరసనగా తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. 1960లో తన సోదరుడు శ్రీకాంత్ థాకరేతో కలిసి "మార్మిక్" అనే రాజకీయ కార్టూన్ పత్రికను స్థాపించారు. శ్రీకాంత్ నిర్వహణలో ఆ పత్రిక సూపర్ హిట్ అవ్వడమే కాకుండా, ఆ పత్రిక ఎడిటర్ గా థాకరేకు మంచి గుర్తింపు లభించింది. మార్మిక్ పత్రికలో మహారాష్ట్ర యువత ఉద్యోగాల కోసం పడుతున్న ఇబ్బందులు గురించి, తమిళ బ్రాహ్మణ ప్రభుత్వ అధికారుల పక్షపాత వైఖరిని నిరసిస్తూ వేసిన కార్టూన్స్ అందరిని ఆకట్టుకున్నాయి. ఒక విధంగా థాకరే రాజకీయ ఆలోచనలకూ మార్మిక్ పత్రిక కార్టూన్లే పూనాది.

మార్మిక్ పత్రిక వల్ల మహారాష్ట్ర యువతలో థాకరేకు వచ్చిన ప్రజాదరణను ఉద్యమంగా మలిచే దిశలో భాగంగా, 1966లో శివసేన సంస్థను స్థాపించారు. శివసేన ద్వారా స్వరాష్ట్రమైన మహారాష్ట్రలో తమిళ బ్రాహ్మణుల ఉద్యోగాల దోపిడిని నిరసిస్తూ, రాష్ట్ర రాజధాని బొంబాయిలో నివసిస్తున్న మహారాష్ట్రీయుల సంక్షేమమే ధ్యేయంగా శివసేన కార్యకలాపాలు మొదలయ్యాయి. మహారాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టుపెడుతున్న రాజకీయ నాయికలను సైతం థాకరే విడిచిపెట్టలేదు. తమిళ బ్రాహ్మణ అధికారులకు, వ్యాపారులకు అండగా నిలిచే  కాంగ్రెస్ నేత ఎస్కె పాటిల్ ను రాజకీయంగా భూ స్థాపితం చేయడంలో థాకరే పాత్ర కీలకం. 1967 లోక్ సభ ఎన్నికల్లో బొంబాయి ఉత్తర నుంచి పోటీ చేసిన మాజీ రక్షణ శాఖ మంత్రి కృష్ణ మీనన్ కు ఓటమి రుచిని చూపించారు థాకరే.

శివసేన ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగాల్లో, యూనివర్సిటీ సీట్లలో మహారాష్ట్ర యువతకు మాత్రమే ప్రాధ్యానత ఇవ్వాలని కోరుతూ భూమి పుత్రుల (సన్స్ ఆఫ్ సాయిల్ ) ఉద్యమాన్ని థాకరే నడిపించారు. ఈ ఉద్యమంలో నాటి మహారాష్ట్ర యువత కీలకంగా పనిచేసింది. ఈ ఉద్యమం ద్వారా థాకరే పేరు జాతీయ రాజకీయాల్లో మారుమ్రోగిపోయింది. 1970ల ప్రారంభం నాటికే థాకరే మహారాష్ట్ర రాజకీయాల్లో బలీయమైన రాజకీయ శక్తిగా అవతరించారు. రాజధాని బొంబాయి కేంద్రంగా చేసుకొని శివసేన రాజకీయ కార్యకలాపాలను మహారాష్ట్ర వ్యాప్తంగా విస్తరించారు.

1971లో జరిగిన బొంబాయి మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక వార్డులను కైవసం చేసుకోవడం ద్వారా బొంబాయి మేయర్ పీఠాన్ని శివసేన చేతుల్లోకి రావటంతో మహారాష్ట్ర రాజకీయాలు కీలక మలుపు తిరిగింది. అప్పటికి వరకు శివసేనను ఉద్యమ పార్టీగానే గుర్తిస్తూ వచ్చిన రాజకీయ పక్షాలు మేయర్ ఎన్నికల ద్వారా శివసేనను రాజకీయ పార్టీగా గుర్తించడం మొదలు పెట్టారు. శివసేనకు దగ్గరయ్యేందుకు నాడు సోషలిస్టు రాజకీయ నాయకులూ తహతహ లాడేవారు. అయితే, వారిని థాకరే దగ్గరకు రానీయకుండా జాగ్రత్తపడ్డారు. ఇదే సమయంలో బొంబాయి కార్మిక సంఘాల్లో బలంగా ఉన్న వామపక్ష పార్టీలతో తలపడి శివసేనకు అనుబంధంగా కార్మిక విభాగాన్ని ఏర్పాటు చేశారు. 

1970 మధ్య నాటికి కాంగ్రెస్ అనుకూల వైఖరితో ఉన్న బాల్ థాకరే, ఆ పార్టీ సీనియర్ల సహకారంతో శివసేనను మహారాష్ట్ర రాజకీయాల్లో  తిరుగులేని ప్రాంతీయ పార్టీగా తీర్చిదిద్దారు. ఒకానొక దశలో కాంగ్రెస్ పార్టీలో నిర్ణయాలు జరిగితే, వాటిని అమలు చేయడంలో శివసేన శ్రేణులు ముందుండేవారు. శివసేన బొంబాయి మున్సిపల్ కార్పొరేషన్లో తన బలాన్ని నిలుపుకోవడానికి కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఎంతో తోడ్పడ్డారు. 80వ మధ్య దశకం వరకు సేన కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఉన్న అవగాహన కారణంగా, ఇరు పార్టీలు రాజకీయంగా లబ్ది పొందుతూ వచ్చాయి.

1984లో దేశ ప్రధానిగా ఎన్నికైన రాజీవ్ గాంధీకి థాకరే మధ్య సఖ్యత ఏర్పడకపోవడంతో మహారాష్ట్ర రాజకీయాల్లో ఇరు పార్టీల మధ్య ఉన్న బంధానికి బీటలు ఏర్పడ్డాయి. ఇదే సమయంలో కాంగ్రెస్ నుంచి వేరుపడ్డ శరద్ పవార్ ను రాజీవ్ తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానం పలికిన తర్వాత పవార్ తన రాజకీయ చాణక్యంతో ఇరు పార్టీల మధ్య ఉన్న ఘర్షణపూరితమైన రాజకీయ వాతావరణాన్ని చల్ల బరిచారు. పవార్ తన రాయబారం ద్వారా శివసేన అధినేత థాకరేను ప్రసన్నం అయితే చేసుకోగలిగారు కానీ రాజకీయంగా మాత్రం లబ్ది పొందలేకపోయారు.

కాంగ్రెస్ పార్టీతో ఏర్పడ్డ రాజకీయ విబేధాల కారణంగా థాకరే హిందుత్వ రాజకీయాల వైపు అడుగులేస్తూ వచ్చారు. ఇదే సమయంలో భాజపా యువనేత ప్రమోద్ మహాజన్ తన శక్తి యుక్తులతో థాకరే ప్రాపకాన్ని సంపాదించి, సేన, భాజపాల మధ్య రాజకీయ మైత్రిని కుదర్చడంలో సఫలీకృతం అయ్యారు. భాజపా ఆగ్రనేతలైన అద్వానీ, వాజపేయ్ లు తనకు ఇస్తున్న ప్రాధాన్యత పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన థాకరే వారితో కలిసి రాజకీయంగా నడవడం మొదలుపెట్టారు.

భాజపా అగ్రనాయకత్వానికి, థాకరేకు అనుసంధానకర్తగా ప్రమోద్ మహాజన్ వ్యవహరిస్తూ మహారాష్ట్ర రాజకీయాల్లో భాజపా ఎదుగుదలకు తోడ్పడ్డారు. రామాజన్మ భూమి ఉద్యమంలో థాకరే డైరెక్టుగా పాలుపంచుకోకున్నా, తెరవెనుక మద్దతు ఇస్తూ వచ్చారు. బాబ్రీ మసీదు కూల్చివేత నాటికి థాకరే పూర్తిగా కరుడుగట్టిన హిందుత్వవాదిగా మారిపోయారు. ఎంతలా అంటే ఆయన్ని చంపేందుకే 1993 బొంబాయి పేలుళ్లు జరిగాయి. ఈ సమయంలోనే థాకరే, శివసేనను దేశవ్యాప్తంగా విస్తరించడం మొదలుపెట్టారు. మహారాష్ట్రీయుల ఆత్మగౌరవంతో మొదలైన శివసేన, ఎన్నో రాజకీయ మలుపులు తీసుకొని హిందూత్వవాద పార్టీగా మారింది.

1995 అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా - శివసేన కూటమి విజయానికి థాకరే అహర్నిశలు శ్రమించారు. అప్పటి అధికార కాంగ్రెస్ పార్టీ ఓటమే లక్ష్యంగా మునుపెన్నడూ లేని విధంగా ప్రచార బాధ్యతలను తన భుజాన వేసుకున్నారు. థాకరే కృషి ఫలితంగా ఆ ఎన్నికల్లో కూటమి విజయం సాధించింది. సీఎంగా ఉండమని ఇరుపార్టీల నేతలు థాకరేను కోరినా, ఆయన వారి అభ్యర్థనను సున్నితంగా తిరస్కరించి తన సన్నిహితుడైన బొంబాయి మాజీ మేయర్ మనోహర్ జోషిని సీఎం చేశారు. మనోహర్ జోషి పేరుకే సీఎంగా ఉన్నప్పటికీ ప్రభుత్వాన్ని నడిపింది మాత్రం థాకరేనే. తన నివాసం మాతోశ్రీ నుంచే రాష్ట్రాన్ని ఐదేళ్ళ పాటు మకుటం లేని మహారాజులా థాకరే పాలించారు. ఇదే సమయంలో రాజధాని బొంబాయి పేరును నగర దేవత ముంబా దేవి పేరు మీద ముంబైగా మార్చింది కూడా థాకరేనే కావడం విశేషం.  

1998,1999 లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లను సాధించిన భాజపా నాయకత్వంలోని ఎన్డీయే కూటమి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో సైతం థాకరే తన వంతు భాద్యతను పోషించారు. వాజపేయ్ ప్రధానిగా ఉన్న సమయంలో మహారాష్ట్ర అభివృద్ధికి అత్యధిక నిధులు రాబట్టారు. ప్రధాని హోదాలో వాజపేయ్ గారు ఎప్పుడూ ముంబై వచ్చినా థాకరేను కచ్చితంగా కలిసి వెళ్ళేవారు. స్వర్ణ చతుర్భుజి పథకంలో భాగంగా మహారాష్ట్రకు అత్యధికంగా హైవేలను మంజూరు చేయించడంలో సైతం థాకరే పాత్ర కీలకం.

2001లో గుజరాత్ గోద్రా అలర్ల సమయంలో అప్పటి భాజపా ముఖ్యమంత్రి, నేటి భారత ప్రధాని నరేంద్ర మోడీని గట్టిగా సమర్థించిన మొదటి వ్యక్తి థాకరే, ఆయన తర్వాతనే భాజపా నేతలు సైతం మోడీకి మద్దతుగా నిలిచారు. తన రాజకీయ జీవితాన్ని నిలబెట్టిన థాకరే అంటే మోడీకి ఎంతో అభిమానం. థాకరే జీవించినంత కాలం ఆయన దగ్గరకు మోడీ ప్రతి ఏడాది వెళ్ళేవారు. సంఘ్ పెద్దల తర్వాత మోడీ బాగా అభిమానించిన నేతల్లో థాకరే ముందువరుసలో ఉంటారు.

 2004,2009 లోక్ సభ ఎన్నికల్లో భాజపా- సేన కూటమి పేలవ ప్రదర్శన చేసినప్పటికీ, థాకరే ఏనాడూ రాజకీయ భవిష్యత్తు గురించి అధైర్యపడలేదు. థాకరేను అప్పటి యూపీఏ కేంద్ర ప్రభుత్వం కానీ, మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం కానీ రాజకీయంగా ఇబ్బందులకు గురిచేసే అవకాశం ఉన్నప్పటికీ, పార్టీలకతీతంగా ఆయనకున్న అశేషమైన ప్రజాదరణ చూసి వెనకడుగు వేశాయి. అయితే, మారుతున్న రాజకీయాలను అంచనా వేయడంలో థాకరే పూర్తిగా విఫలం అయ్యారు అని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటారు. తన రాజకీయ వారసుడిగా తమ్ముడు శ్రీకాంత్ కుమారుడైన రాజ్ థాకరేకు ఉన్న చరిష్మాను గుర్తించకుండా, పుత్ర వాత్సల్యంతో రాజకీయ ఓనమాలు తెలియని ఉద్దవ్ థాకరేను ప్రకటించడంతోనే శివసేన రాజకీయ పతనానికి పునాది పడింది.

సుమారు ఐదున్నర దశాబ్దాల పాటు మహరాష్ట్ర రాజకీయాల్లో కింగ్ మేకర్ పాత్రను తన కంటే సమర్థవంతంగా పోషించలేరు అని నిరూపించిన మహారాష్ట్ర రాజకీయ ధీరుడైన బాల్ సాహెబ్ థాకరే 2012, నవంబర్ 17న తన 86 వ యేట ముంబైలోని తన స్వగృహమైన మాతోశ్రీ లో కన్నుమూశారు. ఆయన మరణించి దశాబ్దం అవుతున్నా, ఆయన పేరుతోనే ఇప్పటికి మహరాష్ట్ర రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి.      

 --డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)      

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com