టీం ఇండియా స్పెషలిస్టు బ్యాట్సమెన్-రైనా

- November 27, 2024 , by Maagulf
టీం ఇండియా స్పెషలిస్టు బ్యాట్సమెన్-రైనా

భారత క్రికెట్ జట్టులో అన్ని ఫార్మాట్‌లను ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లను లెక్కిస్తే అందులో సురేష్ రైనా పేరు ముందుంటుంది. అంతర్జాతీయ క్రికెట్ నుండి ఐపీఎల్ వరకు క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్‌లలో తనదైన ముద్ర వేశాడు రైనా. భారత మిడిల్ ఆర్డర్ బ్యాట్సమెన్ గా రైనా జట్టు విజయాల్లో కీలకమైన పాత్ర పోషించాడు. బ్యాట్సమెన్ గానే కాకుండా ప్రపంచంలోనే బెస్ట్ ఫీల్డర్ గా సైతం గుర్తింపు తెచ్చుకున్నాడు. అభిమానాలు"చిన్న తలా" గా పిలుచుకునే రైనా 2011లో  ప్రపంచ కప్ ను కైవసం చేసుకున్న భారత జట్టులో రైనా సభ్యుడు. ఐపీఎల్ లీగ్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరపున ఆడిన రైనా, ఆ జట్టు జైత్రయాత్రలో కీ రోల్ ప్లే చేశాడు. నేడు టీం ఇండియా మాజీ స్టార్ క్రికెటర్ సురేష్ రైనా పుట్టినరోజు.

సురేష్ రైనా 1986, నవంబర్ 27న ఉత్తరప్రదేశ్  రాష్ట్రంలోని ఘజియాబాద్ నగరానికి దగ్గర ఉన్న మురాదాబాద్ అనే చిన్న పట్టణంలో కశ్మీరీ పండిట్ల కుటుంబానికి చెందిన త్రిలోక్ చంద్ రైనా, పర్వేశ్ దంపతులకు జన్మించాడు. రైనా తండ్రి ఇండియన్ ఆర్మీలో మిలటరీ ఆర్డినెన్స్ విభాగంలో పనిచేశారు. చిన్నతనంలోనే క్రికెట్ మీద మక్కువ పెంచుకున్న రైనా హై స్కూల్ విద్యను పూర్తి చేసిన లక్నోలోని గురుగోబింద్ సింగ్ స్పోర్ట్స్ కాలేజీలో చేరాడు. దూరవిద్యలో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బీకామ్ పూర్తి చేశాడు.

రైనాకు క్రికెట్ మీదున్న ఆసక్తిని గమనించిన తల్లిద్రండులు, అటువైపుగా ప్రోత్సహించడంతో మరింత ఉత్సాహంతో క్రికెట్ మీద దృష్టి సారించాడు. ఉత్తరప్రదేశ్ అండర్-16 జట్టుకు కెప్టెన్ గానే కాకుండా, ఆటగాడిగా అద్భుతమైన ప్రదర్శన ఇవ్వడంతో 15 1/2 ఏళ్లకే అండర్-19 టెస్ట్ జట్టుకు ఎంపికైన రైనా ఇంగ్లాండ్ లో ఆడాడు. ఆ తర్వాత శ్రీలంకలో పర్యటించబోతున్న  టీం ఇండియా అండర్-17 జట్టులోకి ఎంపికయ్యాడు. 16 ఏళ్లకే ఉత్తరప్రదేశ్ తరపున రంజీ ట్రోఫీలో ఆడటం మొదలు పెట్టిన రైనా 2005 వరకు పలు దేశవాళీ ట్రోఫీలో ఆడాడు.

దేశవాళీ టోర్నీల్లో రైనా అద్భుతమైన ప్రదర్శన చేయడంతో 2005లో శ్రీలంక తరపున వన్డేల్లో ఆరెంగేట్రం చేశాడు. జట్టులోకి వచ్చాడే కానీ, చాలా వరకు రిజర్వ్ ప్లేయర్ గానే ఉండేవాడు. సీనియర్లు రీటైర్ అయిన జట్టులో తన స్థానాన్ని పదిల పరుచుకున్నాడు. రైనా టెస్టుల్లో టీమ్ ఇండియాకు పెద్దగా ఆడలేదు కానీ వన్డేల్లో టీమ్ ఇండియాకు ప్రాణంగా నిలిచాడు. తన అద్భుతమైన బ్యాటింగ్‌ శైలితో భారత్‌ను ఎన్నో మ్యాచ్‌లలో గెలిపించాడు. రైనాకు చివరి ఓవర్లలో ఎక్కువగా బ్యాటింగ్ చేసే అవకాశం లభించేది. దాంతో అప్పటికే ప్రషర్ మీద ఉండే ప్రత్యర్థి బౌలర్లను ఉతికారేసేవాడు. ధోని సారథ్యంలో భారత్  2011లో వన్డే ప్రపంచకప్ గెలిచన జట్టులో రైనా సభ్యుడు. టీం మిడిల్ ఆర్డర్ దిగ్గజ ద్వయంగా చెప్పుకునే యువరాజ్ సింగ్, మహేంద్ర సింగ్ ధోనీలతో కలిసి భారత్‌ను ఎన్నో మ్యాచ్‌ల్లో  గెలిపించాడు. 226 వన్డేలు ఆడిన రైనా 5,615 రన్స్ సాధించాడు. ఇందులో 5 సెంచరీలు, 36 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.  

రైనా టెస్ట్ ఫార్మాట్‌ను అద్భుతంగా ప్రారంభించాడు. 2010లో శ్రీలంకతో కొలంబోలో జరిగిన టెస్టులో రైనా అరంగేట్రం చేసి.. తొలి టెస్టు మ్యాచ్ లోనే సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్‌లో అతను 120 పరుగుల ఇన్నింగ్స్ ఆడి, భారత తరఫున అరంగేట్రం టెస్టులో సెంచరీ చేసిన 12వ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. అయితే ఇంత గొప్ప ఆరంభం తర్వాత కూడా టీమ్ ఇండియాకు టెస్టు జట్టులో చోటు సంపాదించుకోవడంలో ఇబ్బంది పడ్డడాడు. 2011లో టీమ్ ఇండియా ఇంగ్లండ్‌లో పర్యటించినప్పుడు, రైనా కూడా టెస్టు జట్టులో సభ్యుడు. అక్కడ అతను చాలా మ్యాచ్‌లు ఆడాడు కానీ వాటిల్లో విఫలమయ్యాడు.. టెస్టులకు అతను దూరంగా ఉండటానికి ప్రధాన కారణంగా మారింది. టెస్టుల్లో భారత్ తరఫున 18 మ్యాచ్‌లు ఆడిన రైనా 768 రన్స్ సాధించాడు. ఈ 18 మ్యాచ్‌లలో అతను ఒక సెంచరీ, ఏడు అర్ధ సెంచరీలు చేశాడు. ఇండియా తరపున అంతర్జాతీయ క్రికెట్లో ఉన్న మూడు ఫార్మెట్లలో సెంచరీలు చేసిన మొదటి ఆటగాడిగా రైనా రికార్డ్ సృష్టించాడు.  

 టీ20 క్రికెట్ ఫార్మాట్‌లో ఉన్న ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లలో సురేష్ రైనా ఒకడు. అంతర్జాతీయ క్రికెట్లో భారత్ తరఫున టీ20లో తొలి సెంచరీ  చేసిన బ్యాట్స్‌మెన్‌గా రైనా రికార్డు సృష్టించాడు. ఇండియా తరపున 78 టీ20లు ఆడి 1605 రన్స్ సాధించాడు. ఇందులో 1 సెంచరీ, 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక ఐపీఎల్ లీగ్ ఆరంభం నాటి నుంచి చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు అత్యధిక కాలం ఆడిన రైనా, ఆ జట్టుకు  వెన్నెముకలాంటి ప్లేయర్.

మూడో స్థానంలో భ్యాటింగ్‌కు దిగే రైనా ప్రత్యర్థి బౌలర్లపై ఇష్టానుసారంగా తన బ్యాట్‌తో దాడి చేసేవాడు. అతన్ని ‘మిస్టర్ ఐపీఎల్’ అనడానికి ఇది కూడా ఒక కారణం. ఇంకా చెన్నై ఐపీఎల్ టీమ్ అభిమానులు అతన్ని చిన్న తలా( చిన్న నాయకుడు) అని కూడా ఎంతో ఆప్యాయంగా పిలుచుకుంటుంటారు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో ఒకడైన రైనా  జట్టుకు అవసరమైన సమయాల్లో రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేస్తాడు.

2015 సీజన్ తర్వాత చెన్నై టీమ్ రెండేళ్ల పాటు నిషేధాన్ని ఎదుర్కొన్నప్పుడు, తాత్కాలికంగా గుజరాత్ లయన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. నిషేధం నుంచి చెన్నై జట్టు తిరిగి టోర్నమెంట్‌లోకి వచ్చినప్పుడు, చైన్నై ఫ్రాంచైజీ రిటైన్ చేసిన ముగ్గురు ఆటగాళ్లలో రైనా ఒకడు. ఐపీఎల్ కెరీర్‌లో మొత్తం 205 మ్యాచ్‌లను ఆడి 5528 రన్స్ సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, 39 హాఫ్ సెంచరీలు ఉండడమే కాక అతని బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ 136.73 ఉండడం విశేషం.

రైనా క్రికెట్ కెరీర్లో టీం ఇండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని పాత్ర కీలకం. జట్టులో అవకాశాలు రాక ఇబ్బంది పడుతున్న దశలో ధోని ఇచ్చిన చేయూత కారణంగా జట్టులోకి వచ్చి తనను తాను నిరూపించుకున్నాడు. రైనా, ధోనిల మధ్య స్నేహ బంధం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే, టీం ఇండియా క్రికెట్ జట్టులో ధోనికి అత్యంత సన్నిహితంగా మెలిగిన సభ్యుల్లో ముఖ్యమైన వ్యక్తి. క్రికెట్ బయట కూడా వీరిద్దరూ కలిసి పార్టీలు, బైక్ రైడ్స్ చేస్తూ ఉంటారు. 2020లో ధోనితోనే రైనా క్రికెట్ కు వీడ్కోలు పలికాడు.

  --డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com