సినిమా రివ్యూ: ‘పుష్ప2 ది రూల్’
- December 05, 2024
జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు తీసుకున్న తర్వాత అల్లు అర్జున్ నుంచి వస్తున్న చిత్రమే ‘పుష్ప 2’. మొదటి పార్ట్ అనూహ్యమైన విజయం అందుకోవడంతో ‘పుష్ప 2’పై అంతులేని అంచనాలు ఏర్పడ్డాయ్. అందుకే టైమ్ కాస్త ఎక్కువే తీసుకుని ఆ అంచనాల్ని అందుకునేలా లెక్కల మాస్టార్ సుకుమార్ ‘పుష్ప 2’ని తెరకెక్కించారు.మరి ఆ లెక్కలు అంచనాల్ని అందుకున్నాయా.? లేదా.? తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
కథ:
శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్‌కి సంబంధించిన కథ ఇది అని మొదటి పార్ట్‌లోనే ఈ సినిమా గురించి తెలిసిన సంగతే. కూలీగా చేరి, ఎర్ర చందనం స్మగ్లింగ్ సిండికేట్‌కి రాజుగా ఎదుగుతాడు పుష్ప అలియాస్ పుష్పరాజ్ (అల్లు అర్జున్).ఈ క్రమంలోనే ఆ స్మగ్లింగ్‌ని అడ్డుకునేందుకు ఐఏఎస్ ఆఫీసర్ షెకావత్ సింగ్ (ఫహాద్ ఫాజిల్) ప్రయత్నిస్తుంటాడు. మొదటి పార్ట్‌లో జస్ట్ అలా అలా టచ్ చేసి వదిలేశాడు ఆ క్యారెక్టర్. ఇక, ఈ పార్ట్‌లో నేషనల్, ఇంటర్నేషనల్ స్థాయిలో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించేస్తుంటాడు పుష్ప. డబ్బంటే లెక్కే లేదు. భార్య శ్రీవల్లి (రష్మిక మండన్నా) కోరిందని సీఎంతో ఫోటో దిగాలనుకుంటాడు పుష్ప. కానీ, అక్కడ జరిగిన అనూహ్యమైన సంఘటనతో పుష్ప ఏం చేశాడు.? అడుగుడుగునా తన వ్యాపారానికి అడ్డు తగులుతున్న షెకావత్ సింగ్‌ని ఎదుర్కొంటూ పుష్ప స్మగ్లింగ్ సామ్రాజ్యాన్ని ఎలా రూల్ చేశాడు.? ఎంత సంపాదించినా మొదటి పార్ట్‌లో దక్కించుకోని ఇంటి పేరు పుష్ప రాజ్‌కి ఈ పార్ట్‌లోనైనా దక్కిందా.? తెలియాలంటే ‘పుష్ప 2’ ధియేటర్లలో చూడాల్సిందే.!
నటీనటుల పనితీరు:
జాతీయ ఉత్తమ నటుడు కదా.. అందుకు తగ్గట్లుగానే తనలోని నటనా వైభవాన్ని మరింతగా బయటికి తెచ్చేయాలనుకున్నాడు అల్లు అర్జున్. అఫ్‌కోర్స్.. తెచ్చేశాడనుకోండి (తన ఆర్మీ ఉద్దేశంలో). మాస్ ఆడియన్స్‌ని పుష్ప ఆకట్టుకుంటాడేమో తనదైన హావభావాలతో, మేనరిజంతో. తగ్గేదేలే అంటూ మొదటి పార్ట్‌లో సంచలనాలు సృష్టించిన పుష్ప, రెండో పార్ట్ కోసం అస్సలు తగ్గేదేలే.. పుష్ప అంటే ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్.. అంటూ నెక్స్‌ట్ లెవల్ మేనరిజాలు క్రియేట్ చేశాడు ఈ పార్ట్ కోసం. పుష్పగా బయట తనకు తిరుగే లేదు. కానీ, ఇంట్లో మాత్రం భార్య మాటను జవదాటని భర్తగా తనదైన నటన కనబరిచాడు అల్లు అర్జున్. ఇక, రష్మిక మండన్నా విషయానికి వస్తే, ఈ పార్ట్‌లో పుష్ప రాజ్‌కి భార్యగా శ్రీ వల్లి పాత్రలో ఒకింత ఇంపార్టెన్స్ వున్న పాత్రే దక్కించుకుంది. తన భర్తకు గుర్తింపు కోసం పాకులాడుతుంది. జాతర ఎపిసోడ్‌లోనూ తనదైన పాత్రతో మెప్పించింది. ఇక, విలన్ పాత్రలో ఫహాద్ పాజిల్ గురించి చాలా ఎక్కువగా ఊహించుకున్నారంతా. ఎందుకంటే నటుడిగా ఆయన టాలెంట్ అలాంటిది. కానీ, ఈ సినిమాలో ఫహాద్ పాత్రకు అన్యాయం జరిగింది. ఆ పాత్రలో ఫహాద్ అయితే ఏంటీ.? మరొకరైతే ఏంటీ.? అనేలా షెకావత్ పాత్రను డిజైన్ చేశాడు సుకుమార్. అస్సలు పవర్ లేని పాత్ర. ఒక్క మాటలో చెప్పాలంటే, విలన్ కాదు, కమెడియన్ అయిపోయాడు షెకావత్ సింగ్‌గా ఫహాద్ ఫాజిల్ పాత్ర. ఎమ్మెల్యేగా సీఎంగా రావు రమేష్ ఆయన పాత్రలో ఓకే అనిపించాడు. స్నేహితుడి పాత్రలో జగదీస్ సినిమా చివరి వరకూ వున్నాడు. కానీ, ఫస్ట్ పార్ట్‌లో చేసిన మ్యాజిక్ ఈ పార్ట్‌లో చేయలేకపోయాడు తన నటనతో. అలాగే దాక్షాయణిగా అనసూయ, సునీల్ పాత్రలు, కేంద్రమంత్రి పాత్రలో జగపతిబాబు, పుష్ప రాజ్‌కి అన్నగా అజయ్ పాత్రలు ఓకే. మిగిలిన పాత్రధారులు తన పరిధి మేర నటించి మెప్పించారు.
సాంకేతిక వర్గం పనితీరు:
ఈ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఓ రకంగా ప్లస్ అనే చెప్పాలి.దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్‌లో పాటలు బాగున్నాయ్.ఆల్రెడీ జనాల్లోకి వెళ్లిపోయాయ్.విజువల్‌గానూ బాగున్నాయ్. యాక్షన్ ఘట్టాల్లో బీజీఎమ్ ఆకట్టుకుంటుంది.ఎడిటింగ్ విషయంలో కాస్త మాట్లాడుకోవాలి. బిట్స్ బిట్స్‌గా ఫైట్ సన్నివేశాలూ, పాటలు..కొన్ని కొన్ని సన్నివేశాల పరంగా చూస్తే ఓకే. కానీ, సినిమాలో జపాన్‌లో జరిగిన తొలి ఫైట్ కీ తర్వాత జరుగుతున్న కథకీ, కథనానికీ అస్సలు సంబంధం వుండదు. సినిమాటోగ్రఫీ బాగుంది. మైత్రీ మూవీస్ నిర్మాణ విలువలు బాగున్నాయ్. ఇక లెక్కల మాస్టార్ సుకుమార్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కొన్ని సందర్భాల్లో ఇది సుకుమార్ సినిమానేనా.? అనే డౌటానుమానం వస్తుంది. నదిలో లారీలు వెళ్లిపోవడం.. పోలీస్ స్టేషన్‌లో పోలీసులందరికీ లైఫ్ టైమ్ సెటిల్‌మెంట్ చేసేసి తన వాళ్లను విడిపించుకు తెచ్చేసుకోవడం..లాంటి సన్నివేశాల్లో హీరోకి ఎలివేషన్ ఇవ్వాలని డైరెక్టర్ చేసిన ప్రయత్నాలు లాజిక్‌కి అస్సలు దగ్గరగా వుండవ్. మాల్దీవుల్లో 5000 కోట్లతో బిజినెస్ డీల్ సెట్ చేసుకోవడం.. అందులో 4,999 కోట్లు క్యాష్‌గా తీసుకుని మిగిలిన వంద కోట్లకు హెలికాప్టర్ తెచ్చేసుకోవడం సన్నివేశాలు కామెడీగా అనిపిస్తాయ్. అంతేకాదు, హెలికాప్టర్‌తో ఇంట్లోకి దిగిపోవడం కూడా. ఇలాంటి సన్నివేశాలు ఒక్కటి కాదు రెండు కాదు.. పుష్ప 2 నిండా అవే. ఫస్టాఫ్ ఓ ఎత్తు. సెకండాఫ్ జాతర ఎపిసోడ్ మరో ఎత్తు.. సెకండాఫ్ అంతా జాతర ఎపిసోడే నడిచినట్లు అనిపిస్తుంది. బీభత్సంగా సీరియస్‌గా యాక్షన్ ఘట్టాలు చేసేసినట్లున్నా.. ఎందుకో అవి కామెడీనే తలపిస్తుంటాయ్. ఎగిరెగిరి నోటితో పీకలు కరిచేసే యాక్షన్ ఘట్టం అయితే నెక్స్‌ట్ లెవల్. అబ్బో.! చెప్పడం కన్నా.. ఈ పుష్ప ఎంటర్‌టైన్మెంట్ కళ్లారా చూసి తరించాల్సిందేనేమో.
ప్లస్ పాయింట్స్:
అల్లు అర్జున్ నటన, యాక్షన్ ఘట్టాలు, పాటలు.. క్లైమాక్స్‌లో ఫ్యామిలీ ఎమోషన్స్..
మైనస్ పాయింట్స్:
వీక్ విలన్ క్యారెక్టరైజేషన్, అనవసరమైన ఎలివేషన్లు.. అక్కడక్కడా అర్ధం కాని డైలాగులతో విసుగు తెప్పించడం..
చివరిగా:
పుష్ప 2 అబ్బో ఈ ఎంటర్‌టైన్‌మెంట్ ధియేటర్లలో తట్టుకోవడం కష్టమే! చాలా ఓపిక కావాలి బాస్.!
తాజా వార్తలు
- వ్యాపారి ఇంట్లో భారీ చోరీ కేసులో మిస్టరీని ఛేదించిన హైదరాబాద్ పోలీస్
- రంజాన్ మాసంలో ముస్లిం ఉద్యోగులకు వెసులుబాటు!
- మైక్రోసాఫ్ట్ కొత్త క్యాంపస్..ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి
- రోడ్ల విషయమై మంత్రి గడ్కరి ని కలిసిన ఎంపీ బాల శౌరి
- దుబాయ్ లో ది లూప్ ప్రాజెక్ట్..ఎలోన్ మస్క్ తో ఒప్పందం..!!
- కువైట్‌లో 10 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు..!!
- ఎడారి ప్రాంతాల్లో ఉల్లంఘనలపై కేసులు నమోదు..తనిఖీలు ప్రారంభం..!!
- రియాద్ వేదికగా డిసెంబర్లో గ్లోబల్ ఎయిర్‌పోర్ట్స్ ఫోరమ్..!!
- ఘోర ప్రమాదం..గ్యాస్ పేలుడుతో కుప్పకూలిన భవనం..!!
- ఫిబ్రవరి 16న మస్కట్‌లో హిందూ మహాసముద్ర సదస్సు..!!