విలక్షణమైన హాస్య నటుడు-ధర్మవరపు
- December 07, 2024
టాలీవుడ్ ప్రముఖ కమెడియన్లలో ఒకరైన ధర్మవరపు సుబ్రహ్మణ్యం గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఆయన తెరపై కనిపించగానే నవ్వొస్తుంది...ఇక డైలాగ్ చెప్పాడా, పగలబడి నవ్వాల్సిందే. మేం అసలే లెక్కల్లో వీక్ బాబూ.. నీది తెనాలే.. మాది తెనాలే.. ఆకాశం నీలిరంగులో ఉంది... ఇలాంటి పేస్ట్ ఉన్న ఊళ్లో ఎందుకు దొరకదు... బ్రదరూ.. ధర్మవరపు సుబ్రహ్మణ్యం నోట పలికిన ఈ డైలాగులివి. ఆయన కామెడీ టైమింగ్, ఆయన వేసే పంచ్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన కామెడీ టైమింగే ఆయన్ను మిగిలిన కమెడియన్లతో పోలిస్తే ప్రత్యేకంగా నిలబెట్టింది. ధర్మవరపు ముందుగా బుల్లితెరపై పాపులర్ అయ్యి తానేంటో ఫ్రూవ్ చేసుకున్నాక వెండితెరపై సత్తా చాటారు. నేడు ప్రముఖ హాస్య నటులు ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారి వర్థంతి. ఈ సందర్భంగా సందర్భంగా ధర్మవరపు సినీ ప్రయాణంలోని కొన్ని విశేషాలను తెలుసుకుందాం.
ధర్మవరపు సుబ్రహ్మణ్యం 1954,సెప్టెంబరు 20న ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని బల్లికురవ మండలం, కొమ్మినేనివారిపాలెంలో సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. అద్దంకి, ఒంగోలులో చదువుకున్నారు. ఒంగోలు సి.ఎస్.ఆర్ శర్మ కళాశాలలో బీకామ్ చదువుతూ మధ్యలోనే ఆపేశారు. చిన్నప్పటి నుంచే సినిమాలపై ఆసక్తి పెంచుకున్నారు. శర్మ కళాశాలలో ఇంటర్ చదువుతున్న సమయంలోనే ప్రజా నాట్య మండలిలో చేరి "అన్న"గా సుప్రసిద్దులైన నల్లూరి వెంకటేశ్వర్లు గారి శిష్యరికంలో నటనలో రాటుదేలారు.
ప్రజా నాట్య మండలి తరఫున ఎన్నో నాటకాలు, ప్రదర్శనలు ఇచ్చారు. సినిమాల్లో నటించాలానే అభిలాషతో ఆయన మద్రాస్ పారిపోయారు. అక్కడ అవకాశాలు రాకపోవడంతో తిరిగి ఇంటికి వచ్చేశారు. ఇంటర్ అర్హతతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీష్ కమిషన్ పరీక్షలు రాసి పంచాయతీ రాజ్ శాఖలో ఉద్యోగం సాధించారు. అక్కడ కొద్ది కాలం కుదుట పడ్డాక ఆయన దృష్టి మళ్ళీ నాటకాల వైపు మళ్ళింది. తరువాత ఆకాశవాణి కోసం కొన్ని రేడియో నాటకాలు రాయడం మొదలు పెట్టారు సుబ్రహ్మణ్యం.
బుల్లితెరతో ఈయనకు అనుబంధం ఎక్కువ. సినిమాల్లోకి రాకముందు రచయితగా, నటుడిగా ధర్మవరపు బుల్లితెరపైనే బాగా పాపులర్ అయ్యారు. తెలుగులో తొలి ధారావాహిక 'అనగనగా ఓ శోభ' స్క్రిప్టు ధర్మవరం కలం నుంచి జాలువారిందే. 'ఆనందో బ్రహ్మ'తో ఇక వెనుదిరిగి చూసుకోలేదు. అమితాబ్ బచ్చన్ 'కౌన్ బనేగా కరోడ్‌పతీ' చేస్తే.. దానికి దర్మవరం పేరడీ ఒకటి రూపొందించారు. 'కంప్యూటర్ జీ..' అంటూ అమితాబ్ కంప్యూటర్‌తో మాట్లాడితే, ధర్మవరం కదా.. ఈయన కాస్త వెటకారంగా 'డింగుటకాజీ.. గొళ్లెం పెట్టేయనా..' అని నవ్వులు పంచారు. సందర్భానికి తగినట్టుగా పంచ్‌లు వేసి.. చుట్టుపక్కల వారిని నవ్వించడంలో సిద్దహస్తుడాయన. అందుకే వ్యాఖ్యాతగానూ ఆయన హిట్టే.
దూరదర్శన్ లో ఉండగానే జంధ్యాల దర్శకత్వంలో రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన జయమ్ము నిశ్చయమ్మురా అనే సినిమాలో అవకాశం రావడం ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో కమెడియన్ గా నటించిన ఆయన, సుమారుగా 700పైగా చిత్రాల్లో నటించారు. నటనలో తలమునకలై ఉండగానే తోకలేని పిట్ట అనే సినిమాకు దర్శకత్వం, సంగీత దర్శకత్వం వహించాడు. అయితే ఆ సినిమా ఆశించనంతగా ఆడకపోవడంతో మళ్ళీ దర్శకత్వ బాధ్యతల జోలికి పోలేదు.
బాడీలాంగ్వేజ్ అని ఒకటుంటుంది... అంటే కంప్యూటర్ పొగ్రామింగో, విదేశీయులు మాట్లాడుకొనే భాషో కాదు. నటుడి శరీర భాష. డైలాగ్ డల్ అయిపోయినప్పుడు, అసలు డైలాగే లేనప్పుడు తన కదలికలతో నవ్వించగలగడం. ఇందులో మాస్టర్ డిగ్రీ చేశాడు...ధర్మవరం. 'లీలామహల్ సెంటర్' చిత్రంలో అనేక వేషాలతో మెప్పించారు. 'పెదరాయుడు', 'ఠాగూర్', 'అడవిదొంగ', 'దానవీరశూర కర్ణ' అన్నీ ధర్మవరమే. అందులో ఆయన థియేటర్ ఓనర్. ఆడిన ప్రతి సినిమాలోని హీరోని అనుకరిస్తూ ఆ వేషం వేసుకొని వస్తాడు. ఆ విధంగా సినిమాలో హాస్యాన్ని పండించారు.
"నైనెయిట్...ఫోరెయిట్ అంటూ.." 'ఒక్కడు' సినిమాలోని ఈ డైలాగ్ ఎంత పాపులర్ అయిపోయిందో..? ఏముంది ఇందులో. పంచా..? పాడా..? ఏమీ లేవు. కానీ ధర్మవరం దాన్ని పలికిన విధానమే కొత్తగా కనిపించింది. నటుడిగా ధర్మవరం మార్క్ అదే! తన పాత్రతో చేయడానికి ఏమీ లేనప్పుడు..తన అసలుసిసలైన టైమింగ్‌ను, బాడీ లాంగ్వేజ్‌ను బయటకు తీస్తాడు. అంతే, థియేటర్లో నవ్వులు పండుతాయి. 'ఫ్యామిలీ సర్కస్'లో కోట పక్కన నిలబడి.. ఆయన్ని పొగుడుతూనే ఇమేజ్ను డామేజ్ చేసే పాత్ర పోషించాడు. ఆ సినిమా ఆడలేదు గానీ, ధర్మవరపు సుబ్రహ్మణ్యంలోని అసలు సిసలు టైమింగ్ ఎంటో..ఆ సినిమాలో తెలుస్తుంది. కాలేజీ లెక్చరర్ అంటో కొన్నాళ్లపాటు ధర్మవరమే గుర్తొచ్చేవారు. ఆ పాత్రలపై బ్రాండ్ వేసేశారాయన. దాదాపు వంద సినిమాల్లో ఆయన మాస్టారు అవతారం ఎత్తారు. వేసిన పాత్రే వేసి... ప్రేక్షకుల్ని నవ్వించారంటే అది కేవలం ఆయనలో ఉన్న హాస్యచుతురత మాత్రమే.
అనుకరణ విద్య బాగా తెలిసిన హాస్యనటుల్లో ధర్మవరం కూడా ఒకరు. 'లీలా మహల్ సెంటర్'లో ఆయన పాత్ర అంతలా పండిందంటే కారణం అదే. జగ్గయ్య గొంతు అచ్చుగుద్దినట్టు దింపేస్తాడు. చాలా సినిమాల్లో ధర్మవరం.. జగ్గయ్య గొంతును అనుకరించారు. ఎక్కడా ఓవర్ అనిపించలేదు. శోభన్‌బాబు రింగు లాగాడంటే.. ఆ క్షణంలో సోగ్గాడైపోతాడు. ఈవీవీ సత్యనారాయణ, శ్రీనువైట్ల, తేజ, త్రివిక్రమ్‌లాంటి దర్శకులు దాన్ని బాగా వాడుకొన్నారు. శ్రీనువైట్ల, తేజల దర్శకత్వం వహించిన ప్రతి సినిమాలోనూ ఈయనకు మంచి పాత్ర దక్కింది. అవన్నీ ధర్మవరం కెరీర్లో ఆణిముత్యాలుగా మిగిలిపోయాయి.
నాలుగు దశాబ్దాల సినీ కెరీర్లో ఎన్నో ఉత్తాన పాతాలు చవిచూసిన ఆయన ఆలస్యం అమృతం సినిమాకు ఉత్తమ హాస్యనటుడిగా నంది అవార్డు అందుకున్నారు. ఆయన నటించిన చివరి సినిమా ప్రేమాగీమా జాంతానై విడుదల కావాల్సి ఉంది. అప్పటికే అనారోగ్యంగా ఉన్నప్పటికీ ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం మేరకు వికారాబాద్‌లో జరిగిన షూటింగ్‌కు హాజరయ్యారు.తన నటన, హాస్యంతో ప్రేక్షకులు మదిలో చెరగని ముద్ర వేసిన ధర్మవరపు సుబ్రహ్మణ్యం కాలేయ కేన్సర్‌తో బాధపడుతూ 2013, డిసెంబరు 7న మరణించారు. మరణించి దశాబ్దం దాటుతున్నా వెండితెరపై ధర్మవరపు పంచిన నవ్వులు ఈ నాటికీ జనానికి గిలిగింతలు పెడుతూనే ఉన్నాయి.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన
- గూగుల్ స్ట్రీట్, మైక్రోసాఫ్ట్ రోడ్ ప్రతిపాదనపై సీఎం రేవంత్
- బహ్రెయిన్, యూఏఈ పై ఇరాన్ కామెంట్స్..జీసీసీ సీరియస్..!!
- ఖతార్ లో నేషనల్ వాలంటీర్ వర్క్ ల్యాబ్ ప్రారంభం..!!
- 36, 610 మంది ప్రవాసులను బహిష్కరించిన కువైట్..!!
- సౌదీలో ఇల్లీగల్ రైడ్..వారంలో 1,278 మంది అరెస్టు..!!
- వింటర్ ట్రావెల్ ఇల్నెస్..డాక్టర్స్ వార్న్..!!
- మస్కట్ లో సునామీ పై మూడు రోజుల క్యాంపెయిన్..!!
- హైదరాబాద్ లో ప్రారంభమైన గ్లోబల్ సమ్మిట్ సమావేశం







