కాంగ్రెస్ దిగ్గజం-మోతీలాల్ వోరా

- December 20, 2024 , by Maagulf
కాంగ్రెస్ దిగ్గజం-మోతీలాల్ వోరా

మోతీలాల్ వోరా ... భారత దేశ రాజకీయాల్లో దశాబ్దాల పాటు గాంధీ కుటుంబానికి అత్యంత విధేయులుగా కొనసాగిన నేత. జర్నలిస్టుగా మొదలైన వోరా ప్రస్థానం ఆనతి కాలంలోనే కాంగ్రెస్ పార్టీలో కీలకమైన నాయకుడిగా ఎదిగారు. కాంగ్రెస్ పార్టీకి అంగ, అర్థ బలం చేకూర్చడంలో ఆయన పాత్ర కీలకం. ఇందిరా నుండి రాహుల్ గాంధీ వరకు సన్నిహితంగా మెలుగుతూ వారి కుటుంబంలో ఒకరిగా నిలిచిపోయారు. భారత రాజకీయ యవనికపై కాంగ్రెస్ పార్టీ బలోపేతం తెరవెనుక కృషి చేసిన వ్యక్తుల్లో వోరా ఒకరు. నేడు కాంగ్రెస్ పార్టీ  దిగ్గజం మోతీలాల్ వోరా జయంతి. 

 మోతీలాల్ వోరా 1928,డిసెంబర్ 20న  బ్రిటీష్ ఇండియాలోని రాజపుట్న ప్రాంతంలో భాగమైన జోధ్‌పూర్ రాజ్యంలోని నింబి జోధా అనే చిన్న పట్టణంలో నిరుపేద బ్రాహ్మణ కుటుంబానికి చెందిన మోహన్ లాల్ వోరా, అంబాబాయ్ దంపతులకు జన్మించారు. అయితే, వోరా కుటుంబం ఉపాధి నిమిత్తం అప్పటి మధ్య బేరార్ రాష్ట్రంలో భాగమైన రాయపూర్ (ప్రస్తుత ఛత్తీస్ ఘడ్ రాష్ట్ర రాజధాని) పట్టణానికి తరలి వెళ్లడంతో వోరా అక్కడే 10వ తరగతి వరకు చదువుకున్నారు. 10వ తరగతి పూర్తవ్వగానే ఉపాధి కోసం కలకత్తా నగరానికి వెళ్లారు. 

కలకత్తాలో గుమస్తాగా ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించిన వోరా, ఆనతి కాలంలోనే జర్నలిజం రంగంలోకి ప్రవేశించి పలు దిన పత్రికలకు పనిచేశారు. జర్నలిస్టుగా పనిచేస్తున్న సమయంలోనే లోహియా ఆధ్వర్యంలోని సంయుక్త సోషలిస్టు పార్టీలో చేరారు. నాటి ఉమ్మడి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దుర్గ్ అనే చిన్న పట్టణాన్ని తన రాజకీయ కార్యక్షేత్రంగా మార్చుకొని దుర్గ్ నగర పంచాయతీ వార్డు సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1970లో తన మిత్రుడైన ప్రభాత్ తివారీ ద్వారా మధ్యప్రదేశ్ కాంగ్రెస్ దిగ్గజం కిశోరీ లాల్ శుక్లాకు దగ్గరయ్యారు. శుక్లా సమక్షంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరి దుర్గ్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. 

1972 అసెంబ్లీ ఎన్నికల్లో దుర్గ్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున తొలిసారిగా ఎమ్యెల్యేగా ఎన్నికైన వోరా, 1977, 1980, 1985,1990 లలో సైతం అదే నియోజకవర్గం నుంచి వరుసగా ఎన్నికయ్యారు. 1975 ఎమెర్జెన్సీ నాటికి సంజయ్ గాంధీ కోటరీలోకి వచ్చారు. సంజయ్ ద్వారా ఇందిరా గాంధీ ప్రాపకాన్ని పొందారు. 1977-80 వరకు ఇందిరా ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఢిల్లీకి తరచూ వెళ్తూ గాంధీ కోటరీలోకి వెళ్లిపోయారు. 1980లో మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన వోరా, అదే ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంలో కీలకంగా వ్యవహరించారు. అర్జున్ సింగ్ ప్రభుత్వంలో 1981-84 వరకు మధ్యప్రదేశ్ రాష్ట్ర రవాణా సంస్థ ఉపాధ్యక్షుడిగా, 1983-85 వరకు ఉన్నత విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. 

సంజయ్ ఆకస్మిక మరణం తర్వాత రాజీవ్ గాంధీ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ అవుతున్న దశలోనే రాజీవ్ కు దగ్గరయ్యారు. 1984లో ఇందిరా  మరణంతో రాజీవ్ దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వోరా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. రాజీవ్ అండతోనే 1985లో అర్జున్ సింగ్ స్థానంలో మధ్యప్రదేశ్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. రెండున్నర సంవత్సరాలు ఆ స్థానంలోనే కొనసాగిన వోరా, 1988లో కేంద్ర మంత్రి అర్జున్ సింగ్ తన అనుచరుల చేత తిరుగుబాటు చేయించడంతో రాజీవ్ ఆదేశాల మేరకు సీఎం పదవికి వోరా రాజీనామా చేసి 1988-89 వరకు కేంద్ర పౌరవిమానయాన, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 

1989 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి తర్వాత తిరిగి మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తిరిగొచ్చి 318 రోజుల పాటు సీఎంగా పనిచేశారు. 1989-91 వరకు రాజీవ్ గాంధీకి వ్యక్తిగతంగా, రాజకీయంగా అండగా నిలుస్తూ వచ్చారు. 1991 ఎన్నికల సమయంలో రాజీవ్ ఆకస్మిక మరణం తర్వాత పార్టీని గెలిపించేందుకు తెరవెనుక వోరా చేసిన కృషి అసమాన్యమైనది. పివి నరసింహారావు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా, ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వోరాను పార్టీ వ్యవహారాల నుంచి దూరం పెట్టారు. 1993లో యూపీ గవర్నర్ గా నియమించారు. 1993-96 వరకు యూపీ గవర్నర్ గా పనిచేసిన వోరా సమాజవాదీ నేతల దాడి నుంచి బీఎస్పీ అధినేత్రి మాయావతిని రక్షించడంలో కీలకంగా వ్యవహరించారు. 1988-89 వరకు,  2002-20 మధ్యలో మొత్తం నాలుగు సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు.      

 1996-2004 మధ్య కాంగ్రెస్ పార్టీలో జరిగిన పరిణామాలు కాంగ్రెస్ పార్టీలో, గాంధీ కుటుంబంతో సన్నిహిత సంబంధాలను వోరా పదిల పరుచుకున్నారు. కాంగ్రెస్ పార్టీ పరంగా పార్టీని నడిపేందుకు ఆర్థికంగా వనరులు సమకూర్చడం, గాంధీ కుటుంబ విధేయులను పార్టీలో పెంచడం మరియు సోనియా గాంధీ రాజకీయ ప్రవేశానికి బాటలు పరచడం వంటివి ముఖ్య ఘట్టాలు. 2004లో సోనియాతో పాటుగా రాహుల్ గాంధీని సైతం క్రియాశీలక రాజకీయాల్లోకి ప్రవేశించేలా ఒప్పించడంలో వోరా పాత్ర కీలకం. రాహుల్ గాంధీకి రాజకీయ పాఠాలు నేర్పే బాధ్యతను సైతం వోరానే తీసుకున్నారు. ఈరోజు రాహుల్ గాంధీ దేశ రాజకీయాల్లో నాయకుడిగా ఎదిగారు అంటే ఆ ఘనత వోరాకే దక్కుతుంది. రాహుల్ సైతం తన తల్లి సోనియా మాట కంటే వోరా మాటకే ఎక్కువ విలువనిచ్చేవారు. 

2004-20 వరకు యూపీఏ పదేళ్ల పాలనలో వోరా ఆమోదించిన వ్యక్తులకు మాత్రమే కేంద్ర ప్రభుత్వంలో మంత్రి పదవులు దక్కేవి. ఆయన ద్వారానే కార్పొరేట్ లాబీ ప్రభుత్వంతో సత్సంబంధాలు ఏర్పర్చుకుంది. ఈ పదేళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీకి బహుళ సంఖ్యలో వచ్చిన విరాళాల లెక్కలు ఒక్క ఆయనకు తప్ప ఎవరికి తెలియదు. 2014లో కాంగ్రెస్ ఓటమి తర్వాత సైతం పార్టీకి విరాళాలు వస్తూనే ఉండటంలో సైతం ఆయనే ముఖ్య పాత్ర వహించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పెట్టిన ఖర్చు వివరాలు అన్ని అణా పైసాతో సహా మొత్తం లెక్క చెప్పి పార్టీ సీనియర్లను ఆశ్చర్యపరిచారు. 

కాంగ్రెస్ పార్టీ నిర్వహణలో ప్రణబ్, అహ్మద్ పటేల్ మరియు వోరాల పాత్రలు చాలా కీలకం. ఈ ముగ్గురిలో ప్రణబ్ ఇందిరా హయాం నుంచే పార్టీలో ఎదిగారు. తక్కిన ఇద్దరూ మాత్రం రాజీవ్ హయాంలో పార్టీకి మూల స్తంభాలుగా ఎదిగారు. ప్రణబ్ ప్రభుత్వ మరియు ఎన్నికల వ్యూహ రచనల వ్యవహారాలను చూసుకుంటూ పొతే, అహ్మద్ పటేల్ పార్టీ నిర్వహణ మరియు రాజకీయ వ్యవహారాలు, వోరా పార్టీ ఆర్థిక వ్యవహారాలను చక్కబెట్టే వారు. ఈ ముగ్గురిని కాంగ్రెస్ త్రిమూర్తులని ఢిల్లీ రాజకీయ వర్గాల్లో పేరుంది. అయితే, వీరి ముగ్గురిలో ప్రణబ్ ఎప్పుడైతే రాష్ట్రపతి పదవిని చేపట్టారో, అప్పుడే కాంగ్రెస్ వ్యవహారాల్లో సమన్వయం దెబ్బతిని 2014లో ఘోర పరాజయాన్ని చవిచూసింది. యాదృచ్ఛికంగా వీరు ముగ్గురు ఒకే ఏడాది కరోనా కారణంగా కన్నుమూయడం జరిగింది. 

ఆరు దశాబ్దాల రాజకీయ ప్రయాణంలో అజాత శత్రువుగా నిలుస్తూ వచ్చిన వోరా, కాంగ్రెస్ పార్టీలోనే కాకుండా అన్ని పార్టీల నాయకులతో స్నేహ సంబంధాలను ఏర్పరచుకున్నారు. కాంగ్రెస్ రాజకీయ ప్రత్యర్థి భాజపాలో సైతం వోరాకు ఆప్త మిత్రులున్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయ్, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్, అరుణ్ జైట్లీలు ఆయనకు మంచి మిత్రులు.  

కాంగ్రెస్ బలోపేతానికి, గాంధీ కుటుంబ రాజకీయ వారసత్వాన్ని కాపాడడానికే వోరా తన రాజకీయ జీవితాన్ని మొత్తం వెచ్చించారు. ఆయన మాటకు గాంధీలు రాజకీయంగా, వ్యక్తిగతంగా ఏంతో ప్రాధాన్యతనిచ్చేవారు. కాంగ్రెస్ పార్టీ ఆర్థిక వ్యవహారాలు, సంజయ్ సృష్టించిన ఆర్థిక వనరుల సమీకరణ మార్గాలు సైతం గాంధీల కంటే ఒక్క వోరాకే బాగా తెలుసు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని కలిగిన మోతీలాల్ వోరా తన 92వ యేట కరోనా కారణంగా 2020, డిసెంబర్ 21న కన్నుమూశారు.ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆర్థిక వ్యవహారాల్లో వోరా లేని లోటు గాంధీలకు చాలా వెలితిని తెచ్చిపెట్టింది. వోరా లాంటి విశ్వసనీయమైన నేతను గాంధీలు తయారు చేసుకోవడం అనేది ఇప్పట్లో జరిగే పని కాదు. 

--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com