అట‌ల్ స‌మాధి వ‌ద్ద రాష్ట్ర‌ప‌తి, ప్ర‌ధాని నివాళి

- December 25, 2024 , by Maagulf
అట‌ల్ స‌మాధి వ‌ద్ద రాష్ట్ర‌ప‌తి, ప్ర‌ధాని నివాళి

న్యూ ఢిల్లీ: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి 100వ జయంతి సంద‌ర్భంగా ఢిల్లీలోని ఆయన సమాధి సదా అటల్ వద్ద ప‌లువురు రాజ‌కీయ ప్ర‌ముఖులు నివాళులర్పించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీతో పాటు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి జగదీప్ ధంకర్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, పార్టీ అధినేత జేపీ నడ్డా, ఎన్ చంద్రబాబు నాయుడు, కూటమి భాగస్వామ్య పక్షాల నేతలు వాజ్ పేయి స‌మాధి వ‌ద్ద పూల మాల‌లు వేసి అంజ‌లి ఘ‌టించారు.

ఈ సంద‌ర్భంగా అటల్ బిహారీ వాజ్‌పేయిని ప్రధాని మోడీ స్మరించుకున్నారు. ఈ డిసెంబర్ 25వ తేదీ భారత రాజకీయాలకు, భారత ప్రజలకు సుపరిపాలన దృఢమైన రోజుగా ఆయన అభివర్ణించారు. బలమైన భారత్ కోసం అటల్ జీ చేసిన కృషి తాము మ‌రువ‌లేమ‌న్నారు. వాజ్ పేయి విజ‌న్, మిష‌న్ భార‌త్ ను అభివృద్ధి చెందిన దేశంగా తాము నిర్మించేందుకు స్ఫూర్తిగా నిలుస్తుంద‌ని అన్నారు.

భ‌ర‌త జాతి గ‌ర్వించ‌త‌గ్గ నేత: చంద్ర‌బాబు

మాజీ ప్ర‌ధాని వాజ్ పేయి శ‌త జ‌యంతి ఉత్స‌వాల సంద‌ర్భంగా అటల్ ని ప్రశంసిస్తూ ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. ఆయనతో కలిసి పనిచేసిన సందర్భాలను గుర్తు చేసుకున్నారు. దేశానికి వాజ్ పేయి చేసిన సేవలు స్మరించుకున్నారు. గతంలో ఆయనతో దిగిన ఫొటోను షేర్ చేశారు. భారతజాతి గర్వించదగిన నేత, దేశగతిని మార్చిన వాజ్ పేయి దూరదృష్టి కారణంగానే నేడు ప్రపంచ దేశాలతో భారత్ పోటీ పడుతోంది. అన్ని రంగాల్లో వృద్ధి సాధిస్తూ సగర్వంగా తలెత్తుకు నిలబడుతోంది. ‘నేషన్ ఫస్ట్’ అని ఎప్పుడూ భావించే ఆయనతో కలిసి పనిచేసిన అనుభూతి నాకు చిరకాలం గుర్తుండిపోతుంది. దేశం గురించి ఆయన ఆలోచించే తీరు విలక్షణమైనది. దానికి ఆధునికత, సాంకేతికత జోడించాలని సూచించినప్పుడు, సంస్కరణల గురించి ప్రతిపాదనలు చేసినప్పుడు ఆయన స్పందించిన తీరు నేను ఎన్నటికీ మరచిపోలేను. రాజనీతిజ్ఞులు, ప్రాత:స్మరణీయులు భారతదేశ ముద్దుబిడ్డ అటల్ జీకి ఘన నివాళి అర్పిస్తున్నా” అంటూ ట్వీట్ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com