హిమాచల్‌ప్రదేశ్ కు ఆరెంజ్‌ అలర్ట్‌

- December 26, 2024 , by Maagulf
హిమాచల్‌ప్రదేశ్ కు ఆరెంజ్‌ అలర్ట్‌

హిమాచల్‌ప్రదేశ్: చలి తీవ్రతకు ఉత్తర భారతం గజగజ వణికిపోతోంది. జమ్ము కశ్మీర్‌, హిమాచల్‌ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. ముఖ్యంగా హిమాచల్‌ ప్రదేశ్‌ను మంచు దుప్పటి కప్పేసింది. దీనితో ఆరెంజ్‌ అలర్ట్‌ చేసారు. ఎడతెరిపి లేకుండా మంచు వర్షం కురుస్తూనే ఉంది. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రోడ్లపై అడుగుల మేర మంచు పేరుకుపోయింది. అప్రమత్తమైన అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా రహదారులను తాత్కాలికంగా మూసివేశారు.

పలు రోడ్లు మూసివేత

హిమాచల్ ప్రదేశ్‌లో మూడు జాతీయ రహదారులు సహా మొత్తం 226 రోడ్లను మూసివేశారు. ఇందులో సిమ్లాలో 123 రోడ్లు, లాహౌల్‌, స్పితిలో 36, కులులో 25 రోడ్లు ఉన్నాయి. 173 ట్రాన్స్‌ఫార్మర్‌లకు అంతరాయం ఏర్పడింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ సరఫరాపై తీవ్ర ప్రభావం పడినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో తీవ్రమైన చలి పరిస్థితుల కారణంగా భారత వాతావరణ శాఖ ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది.

డెహ్రాడూన్‌లో దట్టంగా మంచు
ఇక ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో మంచు దట్టంగా కురుస్తోంది. దీంతో త్యుని-చక్రతా-ముస్సోరీ జాతీయ రహదారి, ధరణాధర్-కోటి కనసర్ రహదారి పూర్తిగా మంచుతో కప్పుకుపోయింది. జమ్ము కశ్మీర్‌లోని పలు ప్రదేశాలు చలికి అల్లాడిపోతున్నాయి.

శ్రీనగర్‌లో మైనస్‌ 7 డిగ్రీల సెల్సియస్‌గా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు భారత వాతావరణ విభాగం (IMD) తెలిపింది. రాబోయే రెండు రోజుల్లో ఇది మరో 2 నుంచి 3 డిగ్రీల వరకూ తగ్గే అవకాశం ఉందని అంచనా వేసింది. ప్రజలు జాగ్రత్తగా వుండాలని, అవసమైతే తప్ప బయటికి రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com