ప్రొస్టేట్ సమస్యలకు ప్రశాంత్ హాస్పిటల్లో విప్లవాత్మక చికిత్సా విధానం
- January 04, 2025
విజయవాడ: ప్రొస్టేట్ సమస్యలకు అందుబాటులోకి వచ్చిన విప్లవాత్మక చికిత్సా విధానం రెజ్యూమ్ వాటర్ వేపర్ థెరపీని రాష్ట్రంలో ప్రప్రథమంగా నగరంలోని ప్రశాంత్ హాస్పిటల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. చాలా ఎక్కువమందిలో ఉండే సమస్య అయిన ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ కు ఇప్పటికే పలు రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కొన్నాళ్లు మందులు వాడటం, ఆ తర్వాత శస్త్రచికిత్స చేయడం లేదా సమస్యను గుర్తించిన వెంటనే కూడా శస్త్రచికిత్స చేస్తారు. అయితే.. ఇలా మందులు వాడినా, శస్త్రచికిత్స చేసినా కూడా చాలామందిలో అంగ స్తంభన లేకపోవడం, వీర్య స్ఖలనం సరిగా కాకపోవడం లాంటి సమస్యలు కొనసాగవచ్చు. ముఖ్యంగా 40-60 ఏళ్ల వయసులోనే ప్రోస్టేట్ సంబంధిత సమస్యలు వచ్చినవారికి ఈ రెండు రకాల చికిత్సల్లో ఏది చేసినా ఫలితం ఉండకపోవచ్చు.
కొత్తగా అందుబాటులోకి వచ్చిన రెజ్యూమ్ వాటర్ వేపర్ థెరపీ ఇలాంటి రోగులకు ఓ వరం లాంటిదని ప్రశాంత్ హాస్పిటల్ చైర్మన్, ప్రఖ్యాత యూరాలజిస్ట్ డాక్టర్ కె. ప్రశాంత్ కుమార్ తెలిపారు. లబ్బీపేటలోని ప్రశాంత్ హాస్పిటల్లో ఈ చికిత్సను ఆవిష్కరించిన సందర్భంగా శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో డాక్టర్ ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ.. "ప్రోస్టేట్ సమస్య ఉన్నవారికి మందులు వాడడం వల్ల కొన్నాళ్ల పాటు శస్త్రచికిత్సను వాయిదా వేయగలం కానీ, ఆ తర్వాత ఐదేళ్లకో, పదేళ్లకో శస్త్రచికిత్స చేసినప్పుడు ఫలితాలు అంత ప్రభావవంతంగా ఉండట్లేదు. మందులు వాడినా, శస్త్రచికిత్స చేసినా కూడా చాలామంది రోగుల్లో అంగస్తంభన లేకపోవడం, వీర్యస్థలనం సరిగా ఉండకపోవడం లాంటి సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి. లైంగికంగా ఇంకా చురుగ్గా ఉన్న పురుషులకు ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటోంది. యుక్తవయసువారిలో ఈ ప్రోస్టేట్ సమస్యలు మరింత ఇబ్బందులకు దారి తీస్తున్నాయి. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారంగా విప్లవాత్మకమైన రెజ్యూమ్ వాటర్ థెరపీ అందుబాటులోకి వచ్చింది. ఈ అత్యాధునిక చికిత్స ద్వారా 15 నుంచి నెల రోజుల్లోపే పూర్తి ఫలితాలు కనిపిస్తాయి. ఈ చికిత్సలో భాగంగా నీటి ఆవిరిని ఇంజెక్షన్ రూపంలో ప్రోస్టేట్లోకి పంపుతాం. ఇలా పంపిన ఆవిరికి సహజంగా ఉండే శక్తి.. మూత్రనాళాన్ని నొక్కుతూ ఉన్న అదనపు ప్రోస్టేట్ కణజాలాన్ని క్రమంగా ముడుచుకుపోయేలా చేస్తుంది. లోకల్ ఎనస్థీషియాతోనే చేయబడే ఈ చికిత్స చాలా సులభమైనదిగా చెప్పొచ్చు. సాధారణంగా ఒకటి లేదా రెండు సిటింగ్ లలోనే చికిత్స పూర్తయిపోతుంది. ఈ చికిత్స ద్వారా అంగస్తంభన సమస్య పరిష్కారం లభిస్తుంది. వీర్య స్థలనం సక్రమంగా జరుగుతుంది. చికిత్స చేయించుకున్నవారిలో పది శాతం మందికి మాత్రమే 10-15 ఏళ్ల తర్వాత శస్త్రచికిత్స అవసరం కావొచ్చు” అని తెలిపారు.
ప్రశాంత్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ కె. ధీరజ్ మాట్లాడుతూ “గుండె శస్త్రచికిత్స చేయించుకున్న, లేదా గుండె వ్యాధులు ఉన్న రోగులు రక్తాన్ని పల్చబరిచే మందులు వాడాల్సి ఉంటుంది. అలాంటివారు ప్రోస్టేట్ చికిత్స కారణంగా ఆ మందులు కొంత ఎక్కువ కాలం పాటు ఆపేయాల్సివుంటుంది. అయితే, ఈ రెజ్యూమ్ వాటర్ థెరపీలో ఆ మందులు ఎక్కువ రోజులు ఆపాల్సిన అవసరం ఉండదు. కేవలం కొద్ది రోజులు మాత్రం ఆపితే సరిపోతుంది. చికిత్స చేయించుకున్న తర్వాత వైద్యులు చెప్పేదాన్ని బట్టి కొన్నిరకాల యాంటీబయాటిక్స్, నొప్పి నివారణ మందులను మాత్రం వాడాల్సిన అవసరం ఉండొచ్చు. అలాగే కొద్ది రోజుల పాటు అంటే.. సుమారు పది రోజుల వరకు క్యాథెటర్ ఒకటి ఉంచుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ చికిత్స తీసుకున్న తర్వాత కొన్ని రోజుల పాటు కాఫీ, చాక్లెట్లు, మద్యం జోలికి వెళ్లకపోవడం మంచిది. అయితే, దీన్ని ప్రోస్టేట్ సమస్యకు పూర్తి పరిష్కారంగా మాత్రం భావించకూడదు. తాత్కాలికంగా మాత్రమే ఇది సమస్యను పరిష్కరిస్తుంది. అలాగే ప్రోస్టేట్ సమస్య బాగా ఎక్కువగా ఉన్నవారికి, లేదా సంక్లిష్ట సమస్యలు ఉన్నవారికి ఇది ఉపయోగపడదు. బాగా పెద్దవయసులో ఉన్న రోగుల మీద కూడా ఇది అంతగా ప్రభావం చూపించకపోవచ్చు. యుక్తవయసులో ఉండి, ప్రోస్టేట్ సమస్య మధ్యస్థంగా ఉన్న వారికి ఈ చికిత్స బాగా ఉపయోగకరంగా ఉంటుంది" అని వివరించారు.
రెజ్యూమ్ వాటర్ థెరపీ గురించి హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్, చీఫ్ కన్సల్టెంట్ యూరో ఆంకాలజిస్ట్ డాక్టర్ కె. ప్రీతమ్ మాట్లాడుతూ “రోగులకు అత్యంత అధునాతన చికిత్సలను అందించడంలో భాగంగా రెజ్యూమ్ వాటర్ వేపర్ థెరపీని ఆవిష్కరించాం. బీపీహెచ్ విస్తృత చికిత్సల్లో రెజ్యూమ్ వాటర్ వేపర్ థెరపీ అత్యాధునికమైనది. మన దేశంలో బీపీహెచ్ సమస్య క్రమంగా పెరుగుతోన్న నేపథ్యంలో, అత్యాధునిక పరిజ్ఞానం, చికిత్సలు అందుబాటులో ఉండడం చాలా అవసరం. బీపీహెచ్ తో పాటు ఇతర సమస్యలున్న రోగులకు రెజ్యూమ్ వాటర్ వేపర్ థెరపీ ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ఆవిష్కరణ ద్వారా రాష్ట్ర ప్రజలకు మరింత మెరుగైన సేవలందించేందుకు అవకాశం లభిస్తుంది" అని చెప్పారు.
ఈ సమావేశంలో ప్రశాంత్ హాస్పిటల్ యూరో గైనకాలజిస్ట్ అండ్ రోబోటిక్ సర్జన్ డాక్టర్ పి. హరిత, సీవోవో బి.రమేష్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్
- భారత్ అమ్ములపొదిలో చేరిన అత్యాధునిక మిస్సైల్
- సౌదీలో రైడ్-హెయిలింగ్ యాప్ కు ఫుల్ డిమాండ్..!!







