రాజీనామా దిశగా కెనడా ప్రధాని..!

- January 06, 2025 , by Maagulf
రాజీనామా దిశగా కెనడా ప్రధాని..!

ఒట్టావా: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో రాజీనామా చేసే యోచనలో ఉన్నారని సమాచారం. లిబరల్ పార్టీతో పాటు ప్రధాని పదవి నుంచి కూడా ఆయన తప్పుకునే అవకాశముందని సన్నిహిత వర్గాల సమాచారం ఆధారంగా అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. నేషనల్ కాకస్ సమావేశానికి ముందే ట్రూడో రాజీనామా చేయవచ్చని అంచనా వేస్తున్నారు. జస్టిన్ ట్రూడో 2013 నుంచి లిబరల్ పార్టీ నేతగా కొనసాగుతున్నారు. లిబరల్ పార్టీతో పాటు ప్రధాని పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారంపై ఆయన కార్యాలయం స్పందిస్తే మాత్రమే దీనిపై స్పష్టత రానుంది.

అయితే, జస్టిన్ ట్రూడో తక్షణంగా రాజీనామా చేస్తారా లేక కొత్త నాయకుడిని ఎన్నుకునే వరకు ప్రధానమంత్రి పదవిలో కొనసాగుతారా అనే అంశంపై ఇంకా స్పష్టత లేదు. ఈ ఏడాది అక్టోబర్‌లో జరగనున్న ఫెడరల్ ఎన్నికల్లో ట్రూడో నేతృత్వంలోని లిబరల్స్ పార్టీ ప్రతిపక్ష కన్జర్వేటివ్‌ల చేతిలో ఘోర పరాజయం చెందుతుందని అనేక ఎగ్జిట్ పోల్స్ సూచిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో, జస్టిన్ ట్రూడో విధానాలపై విమర్శలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా, దేశ ఆర్థిక మంత్రి క్రిస్టియా ఫ్రీలాండ్ తన పదవికి రాజీనామా చేసిన నెల రోజులకే ట్రూడో కూడా రాజీనామా చేసే అవకాశం ఉందనే వార్తలు తెరపైకి వచ్చాయి.

కాగా, 2013లో పార్టీ తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న సమయంలో ఆయన ప్రధాని పదవిని చేపట్టారు. ఇక గత పదేళ్లుగా పదవిలో ఉన్న ట్రూడో ప్రాభవం ఇటీవలి కాలంలో మసకబారుతూ వస్తున్నది. ప్రస్తుతం ట్రూడోపై దేశ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పెరుగుతున్న ధరలు, ఇళ్ల సంక్షోభానికి కారణమైన ట్రూడోపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దీంతో ఆయన నాయకత్వాన్ని మార్చాలంటూ సొంత పార్టీ నేతల నుంచే ఒత్తిడి తీవ్రంగా ఉంది. 2025 అక్టోబర్‌లో కెనడా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com