అమెరికాలో భారీ తుఫాను: 7 రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితి

- January 06, 2025 , by Maagulf
అమెరికాలో భారీ తుఫాను: 7 రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితి

అమెరికా: అమెరికా మధ్య ప్రాంతాలను శీతాకాల తుఫాను భారీగా తాకింది. ఈ తుఫాను దశాబ్ద కాలంలోనే అత్యంత తీవ్రమైన హిమపాతాన్ని కలిగించింది. దీంతో 60 మిలియన్లకు పైగా ప్రజలు ప్రభావితమయ్యారు. విపత్కర పరిస్థితుల మధ్య కెన్సాస్, ఇండియానా, కెంటుకీ, మిస్సౌరీ సహా ఏడు రాష్ట్రాలు అత్యవసర పరిస్థితి ప్రకటించాయి.

మంచు, గాలి, పడిపోతున్న ఉష్ణోగ్రతల కారణంగా రహదారులు పూర్తిగా కప్పబడిపోయాయి. ముఖ్యంగా కెన్సాస్, పశ్చిమ నెబ్రాస్కా, ఇండియానా ప్రాంతాల్లో ప్రధాన రహదారులపై తీవ్ర మంచు పేరుకుపోయింది. నేషనల్ గార్డ్ బలగాలు చిక్కుకున్న వాహనదారులను రక్షించేందుకు రంగంలోకి దిగాయి.

ఇంటర్స్టేట్ 70 మార్గంలో 8-14 అంగుళాల వరకు మంచు కురుస్తుందని అంచనా వేయగా, గంటకు 45 మైళ్ల వేగంతో గాలులు వీచాయి. దీని కారణంగా కొన్ని ప్రాంతాల్లో రహదారులు పూర్తిగా మూసివేయాల్సి వచ్చింది. వందలాది రోడ్డు ప్రమాదాలు నివేదించబడ్డాయి. మిస్సౌరీలో 600 వాహనదారులు చిక్కుకోగా, ఇండియానాలో మంచు మరి వేగంగా పేరుకుపోవడంతో పోలీసులు ప్రజలకు రోడ్లకు దూరంగా ఉండమని హెచ్చరించారు.

విమాన ప్రయాణాలు పూర్తిగా నిలిచిపోయాయి. సెయింట్ లూయిస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 200 విమానాలు రద్దయ్యాయి. రైలు మార్గాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. చికాగో నుండి సెయింట్ లూయిస్ మధ్య అనేక రైళ్లు నిలిచిపోయాయి.

ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే 12-25 డిగ్రీల వరకు తక్కువగా నమోదయ్యాయి. మిన్నెసోటాలో -11.7°C, చికాగోలో -7°C వరకు పడిపోయింది. తూర్పు రాష్ట్రాలు, జార్జియా వరకు ఈ చల్లదనం విస్తరించింది.

అత్యవసర సేవలతో పాటు పాఠశాలలు, కార్యాలయాలు మూసివేయబడ్డాయి. న్యూజెర్సీ, వెస్ట్ వర్జీనియా ప్రాంతాల్లో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని అధికారులు హెచ్చరించారు. చల్లని గాలులతో పాటు కఠినమైన హిమపాతం, సుడిగాలులు ఈ తుఫాను ధాటిని మరింత తీవ్రముగా మారుస్తున్నాయి.

ఇటువంటి తీవ్రమైన తుఫాను అమెరికాలో ఒక దశాబ్ద కాలంలో చూడలేదని వాతావరణ నిపుణులు తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com