భోగాపురం ఎయిర్‌పోర్టుకు మరిన్ని భూములు

- January 11, 2025 , by Maagulf
భోగాపురం ఎయిర్‌పోర్టుకు మరిన్ని భూములు

అమరావతి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి పనుల్లో వేగాన్ని పెంచింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భోగాపురం గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. విజయనగరం జిల్లా భోగాపురం దగ్గర నిర్మిస్తున్నఈ ఎయిర్‌పోర్టుకు మరికొన్ని భూముల్ని కేటాయించేందుకు సిద్ధమైంది. గత ప్రభుత్వ హయాంలో500 ఎకరాల్ని తగ్గించగా.. మళ్లీ ఆ భూమిని తిరిగి కేటాయించే అంశంపై ప్రభుత్వం ముగ్గురు మంత్రులతో కమిటీని నియమించింది. ఈ కమిటీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, పరిశ్రామలశాఖ మంత్రి టీజీ భరత్, పెట్టుబడులు, మౌలిక వసతులశాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డిలు ఉన్నారు. 

వాస్తవానికి భోగాపురం విమానాశ్రయానికి ఆర్‌ఎఫ్‌పీలో 2,703.26 ఎకరాల్ని ప్రతిపాదించింది.. కానీ గత ప్రభుత్వం 500 ఎకరాలు తగ్గించింది.. విమానాశ్రయాన్ని ఆనుకుని సిటీ సైడ్‌ డెవలప్‌మెంట్‌ కోసం ప్రతిపాదించిన భూమిని ఇవ్వలేదు. 2,203.26 ఎకరాలు మాత్రమే కేటాయించారు. అయితే ఆ 500 ఎకరాలు కూడా కేటాయిస్తే ప్రపంచస్థాయి ఏవియేషన్‌ హబ్‌ను అభివృద్ధి చేస్తామని, అక్కడ టౌన్‌ను అభివృద్ధి చేస్తామని భోగాపురం ఎయిర్‌పోర్ట్ నిర్మిస్తున్న జీవీఐఏఎల్‌ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది. ఈ 500 ఎకరాల ప్రతిపాదనలపై స్పందించిన ప్రభుత్వం.. ముగ్గురు మంత్రులతో కమిటీని నియమించింది. ఈ మేరకు మంత్రుల కమిటీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. ఈ 500 ఎకరాల భూమి అప్పగింతపై ఆలస్యం చేయకూడదని ప్రభుత్వం భావిస్తోంది. ఆ 500 ఎకరాలు వీలైనంత తొందరగా అప్పగించాలని ఆలోచన చేస్తోంది. మంత్రుల కమిటీ కూడా వీలైనంత త్వరలో అధ్యయనానికి సంబంధించిన నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com