సంక్రాంతి పండుగ
- January 11, 2025
సంక్రాంతి పండుగ సమయం రానే వచ్చింది. హిందూ మతంలో ఈ పండుగకు చాలా ప్రత్యేకత ఉంది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన తర్వాత మకర సంక్రాంతి పండుగ జరుపుకుంటారు. పంచాంగం ప్రకారం ఈసారి సూర్యుడు జనవరి 14న ఉదయం 9:03 గంటలకు మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. కాబట్టి ఈ రోజున మకర సంక్రాంతి జరుపుకుంటారు.
తెలుగు రాష్ట్రాలతో పాటు గుజరాత్, మహారాష్ట్ర ఇంకా అనేక ప్రాంతాల్లో మకర సంక్రాంతి పండుగ రోజున ప్రజలంతా తమ ఇంటి దాబాలపై చేరి గాలిపటాలను ఎగరేస్తారు. కొన్ని ప్రాంతాల్లో పతంగుల పోటీలు కూడా నిర్వహిస్తారు. ఈ సమయంలో మైదానంలో పెద్ద పెద్ద గాలిపటాలు, రంగు రంగుల పతంగులను ఎగరవేయడం వెనుక కొన్ని నమ్మకాలు ఉన్నాయి. ఇలా గాలిపటాలు ఎగురవేయడం వెనుక అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి.
పురాణాల ప్రకారం, శ్రీరాముడు మకర సంక్రాంతి పండుగ రోజున ఆకాశంలో ఓ గాలి పటాన్ని ఎగురవేశాడు. అలా రాముడు ఎగరేసిన గాలిపటం కాస్త ఇంద్రలోకానికి చేరింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి పండుగ రోజున గాలిపటాలను విధిగా ఎగురవేయడం ప్రారంభించారు. కొన్ని ప్రాంతాల్లో సంక్రాంతితో పాటు కనుమ, ముక్కనుమ రోజున కూడా గాలిపటాలను ఎగురవేస్తారు.
ఈ రోజున ప్రజలు పవిత్ర నదులలో స్నానం చేస్తారు. దానం చేయడంతోపాటు అనేక ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇలా చేయడం వల్ల పుణ్య ఫలితాలు లభిస్తాయని ప్రజలు భావిస్తారు. అయితే ఈ పండుగను దేశంలోని పలు రాష్ట్రాల్లో పలు విధాలుగా జరుపుకుంటారు. దీంతోపాటు అనేక ప్రాంతాల్లో అనేక విధాలుగా పిలుస్తుంటారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సంక్రాంతిని "మకర సంక్రాంతి" అని పిలుస్తారు. ఈ పండుగ మూడు రోజులపాటు జరుపుకుంటారు.భోగి (ముందు రోజు): ఈ రోజు ఇళ్లను శుభ్రం చేసుకుని పాత వస్తువులను కాల్చుతారు. ఆ తర్వాత ముగ్గులు వేసి, గొబ్బెమ్మలు పెట్టి పండుగను ప్రారంభిస్తారు.సంక్రాంతి (ప్రధాన రోజు): మకర సంక్రాంతి రోజు పండుగ ప్రధానంగా వేడుకగా జరుపుతారు. ఈ రోజు పలు రకాల వంటకాలు, స్వీట్‌లు తయారుచేసి, పల్లెలో కొత్త పంటల పండుగ జరుపుకుంటారు. కనుమా (మూడో రోజు): ఈ రోజు కొత్త పంట నుంచి వచ్చిన కొంత భాగాన్ని ప్రసాదించడం ఒక ముఖ్యమైన పద్ధతిగా భావిస్తారు.
తమిళనాడులో మకర సంక్రాంతిని పొంగల్‌గా జరుపుకుంటారు. పొంగల్ పండుగ నాలుగు రోజులు ఉంటుంది. పొంగల్ సమయంలో రైతులు తమ ఎద్దులను అలంకరించి పూజిస్తారు. దీంతో పాటు పొంగల్ రోజు వ్యవసాయానికి సంబంధించిన ఇతర విషయాలను పూజిస్తారు. ఈ పండుగను వ్యవసాయ ఉత్పాదకత, శ్రేయస్సుకు చిహ్నంగా భావిస్తారు.
కేరళలో మకర సంక్రాంతి పేరు మకరవిళక్కు. ఈ రోజున శబరిమల ఆలయం దగ్గర ఆకాశంలో మకర జ్యోతి కనిపిస్తుంది. ప్రజలు దానిని సందర్శిస్తారు. కర్ణాటకలో ఈ పండుగను ఎల్లు బిరోధు అని పిలుస్తారు. ఈ రోజున మహిళలు కనీసం 10 కుటుంబాలతో చెరకు, నువ్వులు, బెల్లం, కొబ్బరితో చేసిన వస్తువులను మార్పిడి చేసుకుంటారు.
పంజాబ్‌లో మకర సంక్రాంతిని మాఘిగా జరుపుకుంటారు. మాఘి నాడు శ్రీ ముక్తసర్ సాహిబ్‌లో ఒక ఉత్సవం జరుగుతుంది. ఇక్కడ ప్రజలు ఈ రోజున నృత్యం చేసి ఆడి, పాడతారు. ఈ రోజున కిచిడి, బెల్లం, ఖీర్ తినే సంప్రదాయం ఉంది.
గుజరాత్‌లో మకర సంక్రాంతిని ఉత్తరాయణంగా జరుపుకుంటారు. ఉత్తరాయణం రెండు రోజులు ఉంటుంది. గుజరాత్‌లో ఉత్తరాయణం నాడు గాలిపటాల పండుగ జరుగుతుంది. ఉత్తరాయణం నాడు ఇక్కడ ఉండియు, చిక్కీ వంటకాలు తింటారు. రాజస్థాన్, గుజరాత్‌లలో దీనిని సంక్రాంతి అని పిలుస్తారు. ఇక్కడ మహిళలు ఒక ఆచారాన్ని అనుసరిస్తారు. దీనిలో వారు 13 మంది వివాహిత మహిళలకు ఇంటికి సంబంధించిన వస్తువులు, అలంకరణ లేదా ఆహారానికి సంబంధించిన వస్తువులను ఇస్తారు.
సంక్రాంతి సమయంలో చలి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో ఆరోగ్యంగా ఉండేందుకు ఎన్నో ఔషధ గుణాలున్న నల్ల చెరుకు, నువ్వుల, బెల్లంతో తయారు చేసిన పదార్థాలను కచ్చితంగా తినాలని పెద్దలు చెబుతారు. గుమ్మడికాయ పులుసు తినడం వల్ల మహిళలు, మగవారిలో వంధ్యత్వం రాకుండా, వీర్యానికి సంబంధించిన సమస్యలకు చెక్ చెప్పడంలో గొప్ప ఔషధంగా పని చేస్తుంది. సంతాన సమస్యలను సైతం గుమ్మడికాయ నివారిస్తుందని పెద్దలు చెబుతారు.
--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!
- ముబారక్ అల్-కబీర్‌లో మహిళ, ఇద్దరు పిల్లలు మృతి..!!
- యూఏఈలో వాహనాలతో గ్యారేజీలు ఫుల్..!!
- 5 జిల్లాల పరిథిలో అమరావతి ORR
- ముందస్తు పర్మిషన్ ఉంటేనే న్యూఇయర్ వేడుకలు చేసుకోవాలి
- గువాహటిలో టీటీడీ ఆలయం
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం







