మహా కుంభమేళాలో వైభవంగా శ్రీ శ్రీనివాస కళ్యాణం

- January 18, 2025 , by Maagulf
మహా కుంభమేళాలో వైభవంగా శ్రీ శ్రీనివాస కళ్యాణం

తిరుమల: మహా కుంభమేళా సందర్భంగా ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్ లో ఏర్పాటు చేసిన శ్రీవారి నమూనా ఆలయ ప్రాంగణంలో శనివారం ఉదయం శ్రీ శ్రీనివాస కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు.

ముందుగా తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చుకులు వేణుగోపాల దీక్షితులు ఆధ్వర్యంలో అర్చక బృందం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ స్వామి వారి ఉత్సవర్లను కల్యాణ వేదిక వద్దకు తీసుకొచ్చారు. అనంతరం ఉదయం 11 నుండి 12 గంటల వరకు అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ శ్రీ విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కంకణ ధారణ, అగ్నిప్రతిష్టాపన, యజమాని సంకల్పం, భక్త సంకల్పం, మహా సంకల్పం, మాంగళ్య పూజ, మంగళ సూత్రధారణ మొదలయిన ఘట్టాలతో శాస్త్రోక్తంగా శ్రీ స్వామి అమ్మవార్ల కల్యాణాన్ని నిర్వహించారు.

చివరిగా శ్రీ స్వామి అమ్మవార్లకు నక్షత్ర హారతి, మంగళహారతి సమర్పించడం తో కల్యాణం దిగ్విజయంగా ముగిసింది. శ్రీవారు, అమ్మవార్ల కల్యాణ ఘట్టాన్ని నేత్రపర్వంగా తిలకించిన భక్తులు భక్తి పరవశంతో పులకించారు.

ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడు గోపీనాథ్ దీక్షితులు, హెచ్ డీపీపీ సెక్రెటరీ శ్రీరామ్ రఘునాథ్, డిప్యూటీ ఈవో గుణ భూషణ్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com