విలక్షణ నటుడు-నరేష్

- January 20, 2025 , by Maagulf
విలక్షణ నటుడు-నరేష్

తెలుగు తెర పై నరేష్‌ ప్రస్థానం ప్రత్యేకం. నిన్నటితరం నవ్వించే చిత్రాల్లో మూడొంతులు నరేష్‌ నటించినవే. వెండితెర ఆంధ్ర చార్లీ చాప్లిన్‌ అని పిలిపించుకోవడం ఆయన హాస్యనట ప్రత్యేకత. ఒక్క హాస్యమే కాదు ఎప్పుడూ భిన్నమైన చిత్రాలు చేయాలని తపించారు.. హాస్య చిత్రాలతో ఘన విజయాలు అందుకున్న ఆయన వాటికే స్థిరపడిపోలేదు. ఎప్పటికప్పుడు ప్రయోగాత్మక చిత్రాలు చేశారు. ఆయన నటించిన చిత్రం భళారే విచిత్రం, జంబలకిడిపంబ, టూటౌన్‌ రౌడీ, కోకిల..లాంటి సినిమాలను గమనిస్తే నటుడిగా ఆయన ఎంపిక ఎలాంటిదో తెలుస్తుంది. అలాగే, ప్రయోగాత్మక చిత్రాల్లో సంతృప్తిని వెతుక్కున్న నరేష్‌…క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మారాక కూడా అదే దారిలో సాగుతున్నారు. నేడు వెండితెర విలక్షణ నటుడు నరేష్ జన్మదినం. ఈ సందర్భంగా ఆయన సినీ ప్రస్థానం గురించి తెలుసుకుందాం. 

విజయ కృష్ణ నరేష్ అలియాస్ నరేష్ 1960,జనవరి 20న మద్రాస్ (చెన్నై) నగరంలో జన్మించారు. నరేష్ తల్లి గారైన విజయనిర్మల ప్రముఖ హీరోయిన్ మరియు దర్శకనిర్మాత. భారత చలన చిత్ర రంగంలో అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన తోలి మహిళా దర్శకురాలిగా విజయ నిర్మల గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కారు. తల్లి గారి స్పూర్తితో నటన పట్ల చిన్నతనంలోనే ఆసక్తి పెంచుకున్న నరేష్ పదేళ్ల వయస్సులో అంటే 1970లో వచ్చిన రెండు కుటుంబాల కథ చిత్రం ద్వారా బాలనటుడిగా వెండితెరకు పరిచయం అయ్యారు. 1972లో వచ్చిన పండంటి కాపురం చిత్రంలో సైతం నటించారు. సినిమాల పట్ల ఉన్న ఆసక్తి కారణంగా ఇంటర్ చదువుతోనే ఆపేశారు. 

తల్లి విజయనిర్మల దర్శకత్వంలో 1982లో ‘ప్రేమ సంకెళ్లు’ చిత్రంలో హీరోగా నటించారు. ఆతర్వాత నాలుగు స్తంభాలాట, రెండు జెళ్లసీత, శ్రీవారికి ప్రేమలేఖ, చూపులు కలిసిన శుభవేళ, హై హై నాయక, జస్టిస్ రుద్రమదేవి, కోకిల తదితర చిత్రాల్లో నటించారు. జంధ్యాల, రేలంగి నరసింహారావు దర్శకుల చిత్రాల్లో ఈ హాస్య కథానాయకులు ఎక్కువగా నటించేవారు. 1980 దశకంలో యాక్షన్ మూవీస్ హవా నడుస్తున్న టైమ్ లో ఇద్దరు హాస్య కథానాయకులు తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు. అందులో ఒకరు రాజేంద్రప్రసాద్ కాగా మరొకరు నరేష్‌. 

రామచంద్రరావు దర్శకత్వంలో నరేష్ నటించిన చిత్రం ‘చిత్రం భళారే విచిత్రం’. ఈ సినిమా నరేష్‌ కెరీర్ కి బ్రేక్ ఇచ్చిందని చెప్పవచ్చు. ఆ తర్వాత 1993లో ఇ.వి.వి. సత్యనారాయణ దర్శకత్వంలో రూపొందిన ‘జంబలకిడిపంబ’ నరేష్‌ కి మంచి విజయాన్ని అందించింది. ఆ తర్వాత ఆమె, కొంగుచాటు కృష్ణుడు, శివ శక్తి, పెళ్లి నీకు శుభం నాకు, ఏంటి బావా.. మరీనూ, సొగసు చూడతరమా తదితర చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకున్నారు. నరేష్‌ 70కి పైగా సినిమాల్లో హీరోగా నటించారు. వాటిలో ఐదారేళ్లు వరుస విజయాలు అందుకున్నారు. 

కామెడీ జానర్లో అగ్రపథాన దూసుకెళ్తున్న సమయంలోనే నరేష్ ప్రయోగాత్మక చిత్రాలు చేయడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో వచ్చిన కొన్ని సినిమాలు అపజయం పాలయ్యాయి. మంచి సినిమాలు చేయాలనుకుంటే అవి ప్రేక్షకులకు నచ్చడం లేదేంటి అనే బాధతో కలత చెందిన ఆయన హఠాత్తుగా సినిమాలకు విరామం పలికారు. ఆమె, సొగసు చూడతరమా నరేష్ హీరోగా చేసిన చివరి చిత్రాలు. సినిమాలకు విరామం పలికిన తర్వాత సామాజిక సేవా కార్యక్రమాల్లో బిజీగా గడుపుతూ వచ్చారు. 

సామాజిక సేవా కార్యక్రమాల్లో బిజీగా ఉన్న దశలోనే ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలం పట్ల ఆకర్షితులైన నరేష్ భాజపా అగ్రనేత వాజపేయ్ పై మీదున్న అభిమానంతో ఆ పార్టీలో చేరారు. ఆ పార్టీలో ఉంటూనే ఉమ్మడి అనంతపురం జిల్లాను తన రాజకీయ కార్యక్షేత్రంగా మార్చుకున్నారు. రాయలసీమ ప్రాంత ప్రజల సాగునీటి అవసరాల కోసం చేస్తున్న పోరాటంలో భాగంగా ఇచ్చంపల్లి ప్రాజెక్ట్ నుంచి వరంగల్ వరకు 125 కిలో మీటర్లు నరేష్ పాదయాత్ర చేశారు. భాజపా ఉమ్మడి రాష్ట్ర యువ మోర్చా అధ్యక్షుడిగా, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఇక అనంతపురంలో కళాకారుల ఐక్య వేదిక ప్రారంభించి మరుగున పడుతున్న కళలకు చేయూత అందించారు. జిల్లావ్యాప్తంగా చెరువులు నింపే కార్యక్రమంలో భాగమయ్యారు. 2009లో హిందూపురం పార్లమెంట్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఓటమి తర్వాత వరుస సినిమా అవకాశాలు రావడంతో క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకున్నారు. 

రాజకీయాల్లో దశాబ్దం పాటు బిజీగా ఉన్న సమయంలో సినిమాల్లో నటించేందుకు అవకాశాలు వెతుక్కుంటూ వచ్చినా వాటిని అంగీకరించలేదు. అయితే, నటన పట్ల తనకున్న మక్కువ ఆయన్ని సినిమాలకు దూరంగా ఉంచలేకపోయింది. రెండో ఇన్నింగ్స్‌లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మారిన నాటి నుంచి పలు విజయవంతమైన చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. 

"నటుడిగా ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని 5 దశాబ్దాల సినీ ప్రయాణం పూర్తి చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇదంతా ప్రేక్షకులు ప్రేమాభిమానాల వల్లనే సాధ్యమైంది. నా జీవితాంతం సినీ పరిశ్రమకు సేవ చేస్తాను." అని నరేష్ అన్నారు. 

--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com