ట్రంప్‌ హామీతో టిక్‌టాక్‌ సేవల పునరుద్ధరణ

- January 20, 2025 , by Maagulf
ట్రంప్‌ హామీతో టిక్‌టాక్‌ సేవల పునరుద్ధరణ

అమెరికా: అమెరికాలో ప్రముఖ షార్ట్‌ వీడియో యాప్‌ టిక్‌టాక్‌ మూగబోయిన విషయం తెలిసిందే. జనబాహుల్యంలో విశేష ఆదరణ పొందిన ఈ షార్ట్‌ వీడియో యాప్‌ను నిషేధించేందుకు తీసుకొచ్చిన చట్టం ఆదివారం నుంచే అమల్లోకి రావడంతో తన సేవలను సంస్థ ఒకరోజు ముందే నిలిపివేసింది. ఈ విషయాన్ని స్వయంగా ఆ కంపెనీ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌ ప్రకటించింది. అయితే, ఈ ప్రకటన చేసిన కొద్దిసేపటికే టిక్‌టాక్‌ మరో ప్రకటన చేసింది. యూజర్లకు తిరిగి సేవలను పునరుద్దరించే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపింది. ఈ మేరకు ‘యూఎస్‌లో టిక్‌టాక్‌ ఈజ్‌ బ్యాక్‌’ అంటూ పోస్టు పెట్టింది.

టిక్‌టాక్‌ సేవలకు సంబంధించి కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. టిక్‌టాక్‌ కంపెనీలో కనీసం 50 శాతం వాటా అమెరికా పెట్టుబడిదారుల చేతిలో ఉండేలా షరతులు విధిస్తూ ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ ద్వారా వాటి సేవలను పునరుద్ధరించనున్నట్లు ప్రకటించారు.

ట్రంప్‌ ప్రకటనపై టిక్‌టాక్‌ స్పందించింది. అమెరికాలో తమ సేవలు పునరుద్ధరణపై ట్రంప్‌ నుంచి భరోసా లభించడంతో ధన్యవాదాలు తెలిపింది. ఈ మేరకు ఓ ట్వీట్‌ పెట్టింది. ‘మా సర్వీస్‌ ప్రొవైడర్లతో కుదిరిన ఒప్పందం ప్రకారం.. అమెరికాలో తిరిగి టిక్‌టాక్‌ సేవలను పునరుద్ధరించే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ విషయంలో కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నాం.

మా సర్వీస్ ప్రొవైడర్లు ఎదుర్కొనే పెనాల్టీలపై ఆయన హామీ ఇచ్చారు. ఫలితంగా 17 కోట్ల మంది అమెరికన్లకు టిక్ టాక్‌ సేవలు అందుతాయి. 70 లక్షల చిన్న వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఇది ఏకపక్ష సెన్సార్‌షిప్‌కు వ్యతిరేకంగా ట్రంప్ ఇచ్చిన బలమైన స్టాండ్. టిక్‌టాక్‌ను తిరిగి కొనసాగిస్తూ దీర్ఘ కాలిక పరిష్కారాల కోసం అధ్యక్షుడు ట్రంప్‌తో కలిసి పని చేస్తాం’ అని తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com