భరతమాత ముద్దుబిడ్డ-నేతాజీ
- January 23, 2025
నేతాజీ పేరు చెప్పగానే ఒక గంభీరమైన రూపం కళ్ల ముందు మెదలాడుతుంది. స్వాతంత్య్రం కోసం సాయుధ పోరాటాన్ని ఎంచుకుని, యువతను స్వరాజ్య పోరాటం వైపు తీసుకెళ్లిన ఒక వీరుడు గుర్తొస్తాడు.పరాయి పాలనలో మగ్గుతున్న భారతావనికి తిరిగి స్వపరిపాలన కావాలంటూ అనేక మంది నేతలు తమదైన రీతిలో పోరాటాలు చేశారు. వీరిలో కొందరు అహింసా మార్గాన్ని ఎన్నుకోగా, మరికొందరు సాయుధపోరాటం దిశగా అడుగులు వేశారు. ఆ సమయంలో దేశంలోనే అత్యుత్తన్న సర్వీసుగా భావించే ఐసీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి స్వాతంత్ర పోరాటంలో భాగం పంచుకుని యావత్ భారతావనికి తిరుగులేని మహా నాయకుడని అనిపించుకున్న అరుదైన నేత.. సుభాష్ చంద్రబోస్. అహింస, సత్యాగ్రహాలతో ఇక స్వాతంత్ర్యం రాదని భారతదేశం నిరాశలో కూరుకుపోయిన వేళ.. ‘మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి ..నేను మీకు స్వాతంత్య్రాన్ని ఇస్తాను’అని యువతను సాయుధపోరాటం దిశగా అడుగులు వేయించి, బ్రిటిషర్లకు చెమటలు పట్టించిన యోధుడు మన నేతాజీ. భారతదేశం శాంతిదేశమనీ, అయితే.. అవసరమైతే ఆయుధం పట్టటమూ చేతనైన దేశమని ప్రపంచానికి చాటిన మహా వీరుడు మన నేతాజీ. నేడు ఆ కర్మయోగి 128వ జయంతి.
నేతాజీగా సుపరిచితులైన సుభాష్ చంద్రబోస్ 1879వ సంవత్సరం జనవరి 23వ తేదీ ఒడిశాలోని కటక్‌లో బెంగాలీ కుటుంబానికి చెందిన జానకీ నాథ్, ప్రభావతీ బోస్‌లకు జన్మించారు. చిన్నతనం నుంచి విద్యలో రాణించిన బోస్.. రామకృష్ణ పరమహసం, స్వామి వివేకానందుడి మార్గంలో పయనించి సన్యాసం తీసుకోడానికి తీర్మానించారు. ‘మానవసేవే మాధవసేవ’ అనే నినాదం, రామకృష్ణ ఉపదేశించిన దేశాభిమానంతో ముందుకు సాగారు. జాతీయ కాంగ్రెస్‌లో చేరి, దేశ స్వాతంత్ర పోరాటంలో పాలు పంచుకున్నారు. శ్రీ ఆర్యా పత్రికలో సంపాదకుడిగా ఆయన రాసిన వ్యాసాలు స్వాతంత్ర సమరంలో పాల్గొనే వీరుల్లో ఉత్సాహాన్ని నింపాయి.
తత్వశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేసి, ఇంగ్లండ్‌కు వెళ్లిన సమయంలోనే జలియన్ వాలా బాగ్ ఉదంతం చోటుచేసుకుంది. ఐసీఎస్ శిక్షణ తీసుకున్నా అధికారిగా బాధ్యతలు స్వీకరించక స్వాతంత్ర పోరాటంలో పాల్గొనేందుకు కాంగ్రెస్ పార్టీలో చేరారు. బ్రిటిష్ అధికారి వెల్స్ క్యూన్ భారత్ పర్యటనకు వ్యతిరేకంగా చిత్తరంజన్‌తో కలిసి జరిపిన పోరాటంలో అరెస్టయ్యారు.
స్వాతంత్రం కోసం తన 23వ ఏటనే భారత జాతీయ కాంగ్రెస్‌లో సభ్యుడిగా చేరిన నేతాజీ.. రెండుసార్లు భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షుడిగా ఎన్నికైనా గాంధీజీతో సిద్ధాంతపరంగా విభేదించి ఆ పదవికి రాజీనామా చేశారు. గాంధీజీ ఆచరించిన అహింసావాదం మాత్రమే స్వాతంత్ర్య సాధనకు సరిపోదని, పోరుబాట కూడా ముఖ్యమని బోస్ బలంగా నమ్మారు. ఈ అభిప్రాయంతోనే ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ అనే రాజకీయ పార్టీని కూడా స్థాపించారు. బ్రిటిషర్ల ఆధిపత్యాన్ని అణచివేయడానికి 20 సంవత్సరాలు పోరాడారు. 1941లో గృహనిర్బంధంలో ఉన్నప్పుడు బ్రిటిష్ సైన్యం కళ్లల్లో దుమ్ముకొట్టి కలకత్తా నుంచి అదృశ్యమయ్యారు.
సాయుధ పోరాటాన్ని బలంగా నమ్మిన బోస్.. జనరల్ మోహన్ సింగ్ ఆధ్వర్యంలో ప్రారంభమైన సింగపూర్, మలేషియాల్లోని భారత జాతీయ సైనికదళానికి జీవం పోశారు.జపాన్ సహాయంతో యుద్ధ ఖైదీలు, రబ్బరు తోట కూలీలు, ఔత్సాహికులతో ‘అజాద్ హింద్ ఫౌజ్’ను ఏర్పాటు చేశారు. జపాన్ అందించిన సైనిక, ఆర్థిక, దౌత్య సహకారాలతో ఆజాద్ హింద్ ప్రభుత్వంను సింగపూర్ లో ఏర్పరచారు. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా నేతాజీ జరిపిన పోరాటం వారికి ముచ్చెమటలు పట్టించింది. అహింస మార్గంలో మాత్రమే స్వాతంత్ర లభించదని ఆయుధాలను చేతపడితేనే సాధించగలమనే నినాదాన్ని నేతాజీ లేవనెత్తారు.
ఆంగ్లేయుల కబంధ హస్తాల నుంచి భరతమాతను రక్షించేందుకు చలో ఢిల్లీ నినాదాన్ని ఇచ్చారు. నేతాజీ ఆధ్వర్యంలో 1944 ఫిబ్రవరి 4న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహించారు. రెండో ప్రపంచ యుద్ధం ఆరంభం కావడంతో ఆంగ్లేయులను దెబ్బ తీయడానికి ఇదే సువర్ణవకాశమని భావించారు. యుద్ధం ప్రారంభం కాగానే కూటమి ఏర్పాటు చేసే ఉద్దేశంతో రష్యా, జర్మనీ, జపాన్‌లో పర్యటించారు.
1944 ఫిబ్రవరి 4న బర్మా రాజధాని రంగూన్ నుంచి భారత్ సరిహద్దులకు భారత్ సైన్యం ప్రయాణమైంది. తర్వాత రెండేళ్లలో ఈశాన్య భారతంలో కోహిమా కోట, దిమాపూర్- కొహిమాను సైనిక దళం చేరుకుంది. భారత్ జాతీయ సైనిక దళ దాడుల దాటికి తట్టుకోలేక బ్రిటిష్ సైన్యం కుదేలయింది. బంగాళాఖాతంలో ఉన్న అండమాన్ ద్వీపాలను బోస్ నాయకత్వంలోని భారత సైన్యం స్వాధీనం చేసుకుంది.
1945, ఆగస్టు 22న నేతాజీ ప్రయాణించిన యుద్ద విమానం తైవాన్ వద్ద ప్రమాదానికి గురై ఆయన వీరమరణం పొందినట్లు జపాన్ దేశపు అధికార రేడియో ప్రకటించింది. అయితే ఈ ప్రకటనపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కేంద్రప్రభుత్వం నేతాజీకి సంబంధి వంద సీక్రెట్ ఫైళ్లను విడుదల చేసినప్పటికీ ఆయన మరణం వెనుక కారణాలు ఇప్పటికీ ప్రపంచానికి ఓ మిస్టరీలానే మిగిలిపోయింది. అందుకే సుభాష్ చంద్రబోస్.. జయంతే కాని వర్ధంతి లేని మహావీరుడిగా నిలిచిపోయారు. భరతమాత స్వేచ్ఛా, స్వాతంత్ర్యాల కోసం పోరాడిన ఆ మహావీరుడి జయంతిని "పరాక్రమ్ దివస్"గా భారత ప్రభుత్వం నిర్ణయించింది. దేశం పట్ల అంచంచలమైన ప్రేమ, భక్తి భావాలను కలిగి ఉన్న బోస్ బాబు జీవితం యువతకు ఎల్లప్పటికి స్ఫూర్తిదాయకం.
--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- మళ్లీ తగ్గిన బంగారం ధర..పసిడి ప్రియులకు కాస్త ఊరట
- సౌదీ చమురుయేతర ఎగుమతుల్లో 18.6% వృద్ధి..!!
- సల్మాబాద్‌లోని గ్యారేజీని దోచుకున్న ఫేక్ పోలీసులు..!!
- బ్యాడ్మింటన్ గేమ్ ఆడుతూ..కేరళ వాసి మృతి..!!
- దక్షిణ అల్ బటినాలో ఫ్రాడ్ సస్పెక్ట్ అరెస్ట్..!!
- ఖతార్ లో 7 శాతం పెరిగిన FDI లు..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఎయిర్ ఫెయిర్స్ కు రెక్కలు..!!
- ఆన్లైన్ కంటెంట్‌కు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు బాధ్యత వహించాలి: మంత్రి వైష్ణవ్
- గన్నవరంలో ఈ నెల 28న జాబ్ మేళా
- వాయు శక్తి విన్యాసాలకు ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము









