అస్సాం రాజకీయ చాణక్యుడు-హిమంత బిశ్వ శర్మ
- February 01, 2025
హిమంత బిశ్వ శర్మ...ప్రస్తుతం భారత దేశ రాజకీయాల్లో అత్యంత క్రియాశీలకంగా ఉన్న నేతల్లో ఒకరు.అస్సాం రాష్ట్ర రాజకీయాల్లో ఓటమెరుగని నేతగా, రాజకీయ వ్యూహకర్తగా కొనసాగుతూ వస్తున్నారు.ఈశాన్య భారతాన్ని భాజపా పరం చేయడంలో కీలకమైన పాత్ర పోషించిన నేత హిమంత.అస్సాంలో భాజపాను వరుసగా రెండు పర్యాయాలు తీసుకురావడమే కాకుండా తన చిరకాల వాంఛ అయిన సీఎం పీఠాన్ని అధిరోహించారు.నేడు అస్సాం రాజకీయ చాణక్యుడు హిమంత బిశ్వ శర్మ పుట్టినరోజు.ఈ సందర్భంగా ఆయన రాజకీయ ప్రస్థానం గురించి ప్రత్యేక కథనం మీకోసం ...
హిమంత బిశ్వ శర్మ 1969, ఫిబ్రవరి 1న అస్సాం రాష్ట్రంలోని జోర్హాట్ పట్టణంలో మధ్యతరగతి అస్సామీ కుటుంబానికి చెందిన కైలాష్ నాథ్ శర్మ, మృణాళిని దేవి దంపతులకు జన్మించారు. హిమంత చిన్నతనంలోనే వారి కుటుంబం గౌహుతి పట్టణంలోని ఉలుబారి ప్రాంతంలో స్థిరపడింది.హిమంత బాల్యం, విద్యాభ్యాసం మొత్తం గౌహుతిలోనే సాగింది. ప్రముఖ కాటన్ కాలేజీ నుంచి పొలిటికల్ సైన్స్ విభాగంలో బీఏ, ఎంఏలు పూర్తి చేసి, గౌహుతి యూనివర్సిటీ నుంచి ఎల్.ఎల్.బి, పొలిటికల్ సైన్స్‌లో డాక్టరేట్ పూర్తి చేశారు.
హిమంత 15 ఏళ్ళ వయస్సులోనే అస్సాం విద్యార్ధి సమాఖ్య(AASU)లో చేరి అస్సాంలో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశీ ముస్లిం వలస ప్రజలకు వ్యతిరేకంగా ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ సమాఖ్యలోనే ఉంటూ కాలేజీ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1988-92 వరకు వరసగా కాటన్ కాలేజీ విద్యార్ధి సంఘం ప్రధాన కార్యదర్శిగా హిమంత పనిచేశారు.
విద్యార్ధి రాజకీయాల్లో ఉన్న సమయంలోనే అస్సాం రాజకీయ దిగ్గజం, అప్పటి ఆ రాష్ట్ర సీఎం హితేశ్వర్ సైకియా హిమంతను గుర్తించి తన రాజకీయ చతురతతో తనవైపు తిప్పుకున్నారు. 1993లో సైకియా సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన హిమంత, రాజకీయంగా ఎలా పైకి రావాలో? అధికార యంత్రాంగాన్ని ఎలా అదుపులో పెట్టుకొని పనిచేయించుకోవాలో ? వంటి పలు విషయాలు సైకియా వద్ద ఆపోసన పట్టారు. సైకియా సీఎంగా ఉన్నంత అధికార యంత్రాంగంతో, కాంగ్రెస్ అగ్రనేతలతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకున్నారు.
1996లో సైకియా ఆకస్మిక మరణం తర్వాత మరో సీనియర్ నేత, గాంధీల సన్నిహితుడైన తరుణ్ గోగయ్ హిమంతను రాజకీయంగా పైకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. 1996 నుంచి 2001 వరకు అస్సాం కాంగ్రెస్ పార్టీలో బలమైన యువనేతగా హిమంత బిశ్వ ఎదిగారు. 2001లో జలక్‌బారీ నుంచి అస్సాం విద్యార్ధి రాజకీయ దిగ్గజం బ్రిగు ఫోకన్ నుంచి ఓడించి తొలిసారిగా ఎమ్యెల్యేగా ఎన్నికైన శర్మ అప్పటి నుంచి ఇప్పటి వరుసగా (2006,2011,2016,2021) అదే స్థానం నుండే ఎన్నికవుతూనే ఉన్నారు.
తరుణ్ గోగయ్ మంత్రివర్గంలో 2002-14 వరకు మంత్రిగా హిమంత పనిచేశారు. 2002-06 వరకు వ్యవసాయం, ఆర్థిక & ప్రణాళికాభివృద్ధి శాఖల సహాయ మంత్రిగా, 2006-11 వరకు ఆర్థిక, వైద్య ఆరోగ్యం, పబ్లిక్ వర్క్స్ మరియు సాంస్కృతిక శాఖల మంత్రిగా పనిచేయడం ద్వారా రాష్ట్ర పరిపాలనా వ్యవహారాలపై పట్టు సాధించారు. అయితే, గోగయ్ 2009 నుంచి తన కుమారుడి కోసం హిమంతని దూరం పెట్టడం ద్వారా వారిద్దరి మధ్య కోల్డ్ వార్ మొదలైంది.
2011 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ హ్యాట్రిక్ విజయంలో హిమంత కీలక పాత్ర పోషించినప్పటికి తన అనుచరుడికి తగిన గుర్తింపు ఇచ్చేందుకు గోగయ్ అంగీకరించలేదు సరికదా మంత్రివర్గంలో చోటివ్వడానికి సైతం నిరాకరించే సమయంలోనే ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల సయోధ్యతో హిమంతకు గోగయ్ మంత్రివర్గంలో చోటు దక్కింది. జరిగిన పరిణామాలన్నీ హిమంతను బాగా కలిచి వేయడమే కాకుండా తన ప్రత్యర్థికి బదులు చెప్పే అవకాశం కోసం ఎదురుచూస్తున్న సమయంలోనే 2014 సార్వత్రిక ఎన్నికల్లో మోడీ నేతృత్వంలోని భాజపా కేంద్రంలో అధికారంలోకి రావడంతో ఆ పార్టీకి దగ్గరవుతూ వచ్చారు. భాజపా అగ్రనేతలైన మోడీ, షా సైతం హిమంత బిశ్వ శర్మ పార్టీలో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
2015లో అప్పటి భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో భాజపాలో చేరిన హిమంతకు 2016 అస్సాం రాష్ట్ర ఎన్నికల్లో పార్టీని గెలిపించే బాధ్యతలు అప్పగించారు. తన కార్యనిర్వహణ సామర్థ్యం, వ్యూహ చతురతతో 15 ఏళ్ళ కాంగ్రెస్ పాలనకు చరమ గీతం పాడి భాజపాను తొలిసారి ఆ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చారు. సీఎంగా సర్బానంద సోనోవాల్ ఎన్నికైనప్పటికి, ఎన్నికల్లో పార్టీ గెలుపుకు కృషి చేసిన శర్మకు కీలకమైన ఆర్థిక, ప్రణాళికాభివృద్ధి, వైద్య ఆరోగ్య సంక్షేమం, విద్య మరియు పబ్లిక్ వర్క్స్ శాఖలు దక్కాయి.
ఈశాన్య రాష్ట్రాల్లో తమ ప్రభుత్వాలను ఏర్పాటు చేయడానికి అస్సాం ప్రభుత్వంలో నంబర్ 2గా ఉన్న హిమంతను ఉపయోగించుకోవడం భాజపా మొదలుపెట్టింది. అందులో భాగంగానే ఆరెస్సెస్ ప్రతినిధి రామ్ మాధవ్, హిమంతలు కలిసి ఏర్పాటు చేసిన ఈశాన్య భారత్ ప్రజాస్వామ్య కూటమి (NEDA)కు హిమంతనే సమన్వయకర్తగా నియమించింది. ఈశాన్యంలో ఉన్న త్రిపుర, అసోం, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్ మరియు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో పార్టీ బలోపేతం చేయడమే కాకుండా అధికారంలోకి తీసుకురావడం హిమంత యొక్క ముఖ్య బాధ్యత. అయితే, హిమంత ఈ బాధ్యతను విజయవంతంగా నెరవేర్చి ఢిల్లీ భాజపా పెద్దలకు మరింత దగ్గరయ్యారు.
2021 అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాను రెండో సారి అధికారంలోకి తీసుకురావడంలో హిమంత పాత్ర మరువలేనిది. ఆ ఎన్నికల్లో తన వ్యక్తిగత చరిష్మా, రాజకీయ వ్యూహాలతో భాజపాకు రెండో పర్యాయం విజయలక్ష్మిని దరిచేర్చిన ఘనత హిమంతకే దక్కుతుంది. ఈ ఎన్నికల్లో హిమంత పాత్రను బహుమతిగా సీఎం బాధ్యతలను అప్పగించింది భాజపా అధిష్టానం. రాష్ట్ర సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి నేటి వరకు అస్సాం రాష్ట్రాభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ ఈశాన్య భారత దేశంలో అతిపెద్ద శక్తివంతమైన రాజకీయ నేతగా ఎదిగారు.
ఇదే సమయంలో పలు వివాదాస్పద జాతీయ అంశాలను ప్రస్తావిస్తూ జాతీయ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు.హిమంత బిశ్వను దగ్గరగా గమనిస్తున్న వారు చెబుతున్న సమాచారం ప్రకారం రాబోయే రోజుల్లో జాతీయ రాజకీయాల్లో సైతం క్రియాశీలక పాత్ర పోషించే సంకేతాలను ఇచ్చే క్రమంలోనే ఈ అంశాలను ప్రస్తావిస్తున్నారని కథనాలు వస్తున్నాయి.ఏది ఏమైనా ఇప్పటికే ఈశాన్య భారత రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా విరాజిల్లుతున్న ఈ అస్సాం రాజకీయ చాణక్యుడు దేశ రాజకీయాల్లో సైతం అదే హోదాను అందుకుంటారో లేదో ఇంకొన్ని సంవత్సరాల్లో తేలనుంది.
--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష