ఆంధ్రప్రదేశ్ తోలి మహిళా స్పీకర్...!
- February 06, 2025
కావలి ప్రతిభా భారతి... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి స్పీకర్‌గా పనిచేసిన మొదటి మహిళా నాయకురాలు. ఉన్నత విద్యావంతుల కుటుంబం నుంచి వచ్చిన వీరు అన్న ఎన్టీఆర్ పిలుపునందుకొని రాజకీయ రంగప్రవేశం చేశారు. ఎన్టీఆర్, చంద్రబాబు మంత్రివర్గాల్లో అరడజను శాఖలకు మంత్రిగా వ్యవహరించిన ఘనత ప్రతిభా భారతికి దక్కుతుంది. నేడు ఆమె జన్మదినం సందర్భంగా ప్రత్యేక కథనం మీకోసం ...
కావలి ప్రతిభా భారతి 1956,ఫిబ్రవరి 6వ తేదీన ఉన్నత విద్యావంతులైన కుటుంబానికి చెందిన పున్నయ్య, లీలావతి దంపతులకు ఉమ్మడి విశాఖ జిల్లా సోంపేట తాలూకా కావలి గ్రామంలో జన్మించారు. హైదరాబాద్ నగరంలోని వనితా కళాశాలలో ఇంటర్,ఆర్.బి.వి.ఆర్ కళాశాల నుంచి డిగ్రీ మరియు నాగార్జున యూనివర్సిటీ నుంచి పీజీ పూర్తి చేశారు.
ప్రతిభా భారతి తండ్రి గారైన కొత్తపల్లి పున్నయ్య ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. న్యాయమూర్తి కంటే ముందే రాజకీయాల్లో క్రియాశీలకంగా రాణించారు. కాంగ్రెస్ పార్టీ తరపున 1955లో చీపురుపల్లి రిజర్వ్ నియోజకవర్గం,1962లో పొందూరు నియోజకవర్గం నుంచి ఎమ్యెల్యేగా ఎన్నికయ్యారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ కమీషన్ ఛైర్మన్‌గా పనిచేశారు.
1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాత ఎన్టీఆర్ ఇచ్చిన పిలుపునందుకొని ఆమె రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1983 ఎన్నికల్లో ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి మొదటి సారి ఎమ్యెల్యేగా ఎన్నికయ్యారు. అదే నియోజకవర్గం నుంచి 1985,1989,1994,1999లలో సైతం ఎన్నికయ్యారు. ఎన్టీఆర్ మంత్రివర్గంలో 1983-89 వరకు, 1994-95 వరకు సాంఘిక & స్త్రీ శిశు సంక్షేమం, పర్యాటక మరియు సాంస్కృతిక వ్యవహారాలు, గృహ నిర్మాణం శాఖల మంత్రిగా, సహాయ మంత్రిగానూ పనిచేశారు. 1998-99 వరకు చంద్రబాబు మంత్రివర్గంలో ఉన్నత విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. 1999-2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ తోలి మహిళా దళిత స్పీకర్‌గా ఎన్నికయ్యారు.
రాజ్యాంగ నియమాలు, చట్ట నిబంధనలు పాటించే విషయంలో స్పీకర్‌గా ప్రతిభా భారతి ఖచ్చితంగా వ్యవహరించేవారు. శాసనసభకు ఎన్నికైన సభ్యులు రాజ్యాంగంలోని మూడవ షెడ్యూలులో పొందుపరచిన విధంగానే ప్రమాణం చెయ్యాలని, అలాకాక రాజకీయ పార్టీల నాయకుల పేర్ల మీద గాని, తమకు ప్రీతిపాత్రమైన వారి పేర్ల మీద గాని ప్రమాణం చేయడం చెల్లదని ఆమె1999 నవంబరు 12వ తేదీన రూలింగు ఇచ్చారు. 2000 సంవత్సరం సెప్టెంబర్ 13న శాసనసభలో వెనకబడిన ప్రాంతాల అభివృద్ధిపై జరిగిన చర్చ సమయంలో ఉదయం 8.30 నుండి రాత్రి 9.30 గంటల వరకు ఎటువంటి విరామం లేకుండా పదమూడు గంటల పాటు శాసనసభను నిర్వహించారు.
వీరి హయాంలో 2000 సంవత్సరం మే నెల 29, 30, 31 తేదీలలో 63వ అఖిల భారత స్పీకర్ల సదస్సు, అదే సంవత్సరం నవంబరు 14వ తేదీ నుండి 16వ తేదీ వరకు ఎనిమిదవ ఆసియా పసిఫిక్ పార్లమెంటేరియన్ల సదస్సు భాగ్యనగరంలో జరిగింది. కామన్ వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ బ్రాంచ్ అధ్యక్షురాలిగా, కామన్వెల్త్ వుమెన్ పార్లమెంటేరియన్స్ ఆఫ్ ద సి.పి.ఎ. స్టీరింగ్ కమిటీ అండ్ స్టాండ్ బై మెంబర్గా పనిచేశారు. సి.పి.ఎ. ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలిగా వీరు అనేక సదస్సులలో పాల్గొన్నారు. వీరు అమెరికా, ఇంగ్లండ్, ఈజిప్ట్, ఆస్ట్రేలియా, థాయిలాండ్, న్యూజిలాండ్ మొదలైన దేశాలలో పర్యటించారు.
తెలుగుదేశం పార్టీ ఏర్పడిన నాటి నుండి నేటి వరకు కొనసాగుతున్న అతి కొద్దీ మందిలో ప్రతిభా భారతి ఒకరు. 2015-17 వరకు ఎమ్యెల్సీ గానూ ఆమె పనిచేశారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని రాజకీయ రంగంలో రాణించారు. గత కొద్దీ కాలంగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!







