వామపక్ష రాజకీయ దిక్సుచి-ప్రకాశ్ కారత్
- February 07, 2025
ప్రకాశ్ కారత్...భారత దేశ వామపక్ష రాజకీయాలకు దిక్సుచిగా నిలుస్తున్న నేత. విద్యార్ధి దశలోనే వామపక్ష వాదాన్ని తన నరనరాల్లో జీర్ణం చేసుకున్న ఆయన భారత వామపక్ష సైద్ధాంతిక భావశిల్పులైన ఏకే గోపాలన్, పుచ్చలపల్లి సుందరయ్య వంటి దిగ్గజాల వద్ద శిష్యరికం చేశారు. దశాబ్దం పాటు సీపీఎం జాతీయ కార్యదర్శిగా పనిచేసిన కారత్ దేశ రాజకీయ యవనికపై తనదైన ముద్ర వేశారు. ప్రస్తుతం సిపిఎం జాతీయ సమన్వయకర్తగా బాధ్యతల్లో కొనసాగుతున్నారు. నేడు వామపక్ష రాజకీయ దిగ్గజం ప్రకాశ్ కారత్ జన్మదినం. ఈ సందర్భంగా ఆయన రాజకీయ ప్రయాణం మీద ప్రత్యేక కథనం మీకోసం ....
ప్రకాశ్ కారత్ 1948, ఫిబ్రవరి 7న బర్మా(మయన్మార్)లోని లెట్‌పదన్ ప్రాంతంలో మలయాళీ కుటుంబానికి చెందిన చుండోలి పద్మనాభన్ నాయర్, రాధమ్మ కారత్ దంపతులకు జన్మించారు. కారత్ తండ్రి పద్మనాభన్ నాయర్ బ్రిటిష్ హయాంలోనే బర్మా రైల్వేలో క్లర్క్‌గా ఉద్యోగం చేసేవారు.అయితే, బర్మాకు స్వాతంత్య్రం ప్రకటించిన తర్వాత వీరి కుటుంబం భారతదేశానికి తిరిగి వచ్చి మద్రాస్ నగరంలో స్థిరపడింది. వీరి స్వస్థలం మాత్రం కేరళలోని పాలక్కాడ్ దగ్గర్లో ఉన్న ఎలుపల్లి గ్రామం. ప్రకాశ్ చిన్నతనంలోనే తండ్రి మరియు సోదరి కమల మృతి చెందారు. ఆ సమయంలో తల్లి రాధమ్మ ఎల్.ఐ.సి ఏజెంట్‌గా మారి కుటుంబ పోషణ చూసుకునేవారు.
ప్రకాశ్ తన ప్రాథమిక విద్యాభ్యాసాన్ని మద్రాస్ నగరంలోనే పూర్తి చేశారు. మద్రాస్ క్రిస్టియన్ కళాశాల నుంచి ఎకనామిక్స్‌లో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత తన ప్రతిభతో స్కాలర్‌షిప్ పొంది యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్‌బర్గ్ నుంచి ఎంఎస్సి పొలిటికల్ సైన్స్ పూర్తి చేసిన తర్వాత పొలిటికల్ ఎకనామిక్స్ విభాగంలో డాక్టరేట్ చేస్తున్న సమయంలోనే అతివాద వామపక్షవాదిగా ముద్రపడి కాలేజీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. అనంతరం ఇండియాకు తిరిగి వచ్చి ఢిల్లీ జెఎన్‌యూలో పీహెచ్‌డి చేస్తూ క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.
ప్రకాశ్ కారత్ ఎడిన్‌బర్గ్ యూనివర్సిటీలో చదువుతున్న సమయంలో వామపక్ష చరిత్రకారుడైన విక్టర్ కీర్న్‌న్ ప్రభావంతో వామపక్ష భావజాలంపై మక్కువ పెంచుకున్నారు. ఒక పక్క ప్రతిభావంతుడైన విద్యార్థిగా రాణిస్తూనే వామపక్ష విద్యార్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ వచ్చారు. అతివాద వామపక్ష భావజాల ప్రేరేపితుడైన మూలంగా ఆయన్ని యూనివర్సిటీ నుంచి డిస్మిస్ చేయడంతో తిరిగి మద్రాస్ చేరుకున్నారు. తమిళనాడు సిపిఎం నాయకుల సహకారంతో అప్పటి సిపిఎం దిగ్గజ నేత ఏకే గోపాలన్‌తో పరిచయాన్నిపెంచుకున్నారు.
అదే సమయంలో ఢిల్లీ జెఎన్‌యూలో పీహెచ్‌డి సీటు రావడంతో తన భావి రాజకీయ జీవితానికి ఇది పూనాదిగా కారత్ భావించారు. ఢిల్లీలో గోపాలన్ రాజకీయ సహాయకుడిగా ఉంటూనే జెఎన్‌యూలో వామపక్ష విద్యార్ధి రాజకీయాల్లో పాల్గొనేవారు. సీపీఎం విద్యార్ధి విభాగమైన స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(sfi) స్థాపనలో కారత్ పాత్ర కీలకం. ఆ సంఘం రెండో జాతీయ అధ్యక్షుడిగా పనిచేస్తూనే జెఎన్‌యూ విద్యార్ధి సంఘం ఎన్నికల్లో ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. ఇదే సమయంలో దేశంలో విధించిన ఎమెర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడి జైలుకు సైతం వెళ్లారు.
జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత పుచ్చలపల్లి సుందరయ్య దిశానిర్దేశంలో వామపక్ష విద్యార్ధి సంఘటన ఉద్యమాల్లో పాల్గొంటూ సంఘాన్ని బలోపేతం చేస్తూ వచ్చారు. గోపాలన్, సుందరయ్య శిష్యుడిగా పార్టీలో అనతి కాలంలోనే కీలకమైన యువనేతగా కారత్ ఎదిగారు. 1982-85 వరకు ఢిల్లీ సీపీఎం కార్యదర్శిగా పనిచేసిన కారత్ 1985లో సీపీఎం కేంద్ర కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 80వ దశకం మొత్తంలో కారత్ పార్టీ సిద్ధాంత భావజాలంలో రావలసిన మార్పుల మీద కృషి చేశారు. 1992లో పొలిట్ బ్యూరోలో సభ్యుడయ్యారు.
పొలిట్ బ్యూరోలో సభ్యుడిగా ఉంటూనే పార్టీ రోజువారీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనేవారు. ఉద్యమ కార్యాచరణలో పార్టీ అవలంబిస్తున్న వైఖరులను సరిచేస్తూ పార్టీని భావజాలపు గీత వేరు కాకుండా చూస్తూ వచ్చారు. హరికిషన్ సింగ్ సుర్జీత్ వంటి గ్రామీణ ప్రాంత ఉద్యమ కారుడితో భావజాలపు వైరుధ్యాలను సరిచేకుంటూ పార్టీలో ఐక్యత రాగాన్ని వినిపించారు. 2005లో సుర్జీత్ తర్వాత జాతీయ కార్యదర్శిగా బాధ్యతలు అందుకున్న కారత్, పార్టీని క్రమశిక్షణ నడిపించడం మూలాన పార్టీలోని ప్రత్యర్థులతో ఎప్పటికి పూడ్చలేనంత దూరాన్ని పెంచుకున్నారు. 2005-15 వరకు పార్టీ జాతీయ కార్యదర్శిగా ఉన్న సమయంలో 3 దశాబ్దాల బెంగాల్ కోట కుప్పకూలింది, సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూడటం జరిగింది.
కారత్ తర్వాత జాతీయ కార్యదర్శిగా ఎన్నికైన సీతారాం ఏచూరితో సైతం పార్టీని పునఃనిర్మాణం చేయలేకపోయారు. ఏచూరి పార్టీ గీతను దాటిన ప్రతిసారి ఆయన్ని సక్రమ మార్గంలో పెట్టేందుకు కారత్ ఏనాడు వెనుకాడలేదు. వామపక్ష రాజకీయాల పట్ల ఏచూరి లౌకికవాద దృక్పథంతో ముందుకు సాగడాన్ని కారత్ బహిరంగంగానే నిరసించారు. ఏచూరి ఆకస్మిక మరణంతో పార్టీని నడిపే బాధ్యతను మళ్ళి తన భుజాన వేసుకున్న కారత్ ప్రస్తుతం పార్టీ జాతీయ సమన్వయకర్తగా కొనసాగుతున్నారు. పార్టీ నిర్వహణ పద్ధతుల్లో కారత్ వ్యవహారశైలిని ఎవరైనా దుయ్య బట్టవచ్చు కానీ ఆయనలోని నిష్కళంక వామపక్షవాదిని ఎవరు శంకించలేరు.
--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో ఫుట్‌బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్‌లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!
- 16 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్న మెటా!









