జాతీయ జనాభా గణన దినోత్సవం

- February 09, 2025 , by Maagulf
జాతీయ జనాభా గణన దినోత్సవం

జాతీయ జనాభా గణన దినోత్సవం మన దేశ అభివృద్ధిలో ప్రధానమైన సమాచార మూలాన్ని సేకరించే జనాభా గణనకు అంకితం చేసిన ప్రత్యేక రోజు. ఇది ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జరుపు కుంటారు. జనాభా గణన ద్వారా దేశంలోని ప్రజల సంఖ్యతో పాటు వారి వయస్సు, లింగం, విద్య, ఉపాధి, జీవన ప్రమాణాలు వంటి వివరాలు సేకరించ బడతాయి.

భారతదేశంలో జనాభా గణన ప్రారంభం 1872లో బ్రిటిష్ పాలనలో మొదలైంది. అయితే, అది ఒక సమగ్ర గణన కాకపోవచ్చు. మన స్వతంత్ర భారతదేశంలో తొలి జనాభా గణన 1951లో నిర్వహించబడింది. దేశంలో మొదటి జనాభా గణన 1951,  ఫిబ్రవరి 9న ప్రారంభమై 28 ఫిబ్రవరి 1951 వరకు కొనసాగింది. అప్పటి నుంచి ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి ఈ గణన చేయడం ఆనవాయితీగా మారింది. 2011 జనాభా గణన 15వ గణనగా నిర్వహించబడింది, అలాగే 2021లో జరగాల్సిన జనాభా గణన కోవిడ్-19 మహమ్మారి కారణంగా వాయిదా పడింది.

జనాభా గణన అనేది దేశ అభివృద్ధి ప్రణాళికలను రూపొందిం చడానికి కీలకమైన సమాచారం అందిస్తుంది.

1. నియోజకవర్గాల పునర్విభజన:

దేశ జనాభా ఆధారంగా పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరపవచ్చు.

2. వనరుల పంపిణీ:

నీరు, విద్యుత్, రవాణా, విద్య, వైద్యం వంటి సేవలను సమానంగా అందించడంలో సహాయపడుతుంది.


3. ఆర్థిక ప్రణాళికలు:

ఉపాధి అవకాశాలు, ఉపకార పథకాలు, పేదరిక నిర్మూలన వంటి కీలకమైన ఆర్థిక ప్రణాళికలను రూపొందించడంలో ఈ గణాంకాలు సహాయ పడతాయి.

4. సామాజిక ప్రణాళికలు:

వివాహ వయస్సు, విద్య, లింగ సమానత్వం వంటి అంశాలపై సమాచారాన్ని అందిస్తుంది.

 భారతదేశంలో జనాభా గణన రెండు విధాలుగా జరుగుతుంది.

1. గృహ గణన:

ప్రతి కుటుంబానికి సంబంధించిన వివరాలను సేకరించడం, ఉదాహరణకు ఇల్లు, వసతి పరిస్థితి, కుటుంబ నిర్మాణం.

2. వ్యక్తిగత గణన:

కుటుంబ సభ్యుల వివరాలు, వయస్సు, లింగం, విద్యార్హతలు, ఉపాధి స్థితి, మతం, భాష వంటి అంశాలపై దృష్టి పెట్టడం.

భారతదేశంలో జనాభా గణన ప్రత్యేకతలు :

భారత జనాభా గణన ప్రపంచంలోనే అతి పెద్ద గణాంక సేకరణ ప్రక్రియగా గుర్తింపు పొందింది. అయితే, గత కొద్దీ కాలంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వివరాలు సేకరిస్తారు. 2011లో మొదటిసారిగా బయోమెట్రిక్ వివరాలు సేకరించి ఆధార్‌తో అనుసంధానం చేశారు. అత్యంత దూరప్రాంతాలు పర్వత ప్రాంతాలు, దట్టమైన అడవులు కలిగిన ప్రాంతాల్లోనూ ఈ జనాభా గణన చేపట్టబడింది.

జాతీయ జనాభా గణన దినోత్సవం ఉద్దేశ్యం :

జాతీయ జనాభా గణన దినోత్సవం నిర్వహించడం ద్వారా దేశ  ప్రజల్లో గణన ప్రాముఖ్యత పై అవగాహన కల్పిస్తారు. ప్రతి వ్యక్తి వివరాలు నమోదు చేయడం ద్వారా సమాజానికి తన వంతు సహకారాన్ని అందించాలని చాటి చెబుతుంది. గణనలో భాగస్వామ్యం కావడం వల్ల ప్రభుత్వ సేవలు సక్రమంగా అందేలా చేస్తుంది. ప్రజల అవసరాలను గుర్తించి సరైన విధానాలు రూపొందించడంలో ఈ కార్యక్రమం దోహద పడుతుంది.

భారత దేశ అభివృద్ధికి కావాల్సిన ప్రాథమికమైన సమాచార మూలాల సేకరణకు, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పరచడానికి జనాభా గణన కీలకం. ప్రతి పౌరుడు ఈ గణనలో భాగస్వామ్యం కావడం ద్వారా సమాజ నిర్మాణంలో తన పాత్రను పోషించాలి. ఒక దేశ ప్రగతికి గణాంకాలు ముఖ్యమైన ఆధారం, వాటి సేకరణలో మనందరం చురుగ్గా పాల్గొనాలి. 

  --డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com