ఛాంపియ‌న్స్ ట్రోఫీ విజేత‌ పై కోట్ల వ‌ర్షం..

- February 14, 2025 , by Maagulf
ఛాంపియ‌న్స్ ట్రోఫీ విజేత‌ పై కోట్ల వ‌ర్షం..

ఛాంపియ‌న్స్ ట్రోఫీకి స‌ర్వం సిద్ద‌మైంది.ఫిబ్ర‌వ‌రి 19 నుంచి మార్చి 9 వ‌ర‌కు ఈ మెగా టోర్నీ జ‌ర‌గ‌నుంది. పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వ‌నున్న ఈ టోర్నీని హైబ్రిడ్ మోడ్‌లో నిర్వ‌హించ‌నున్నారు. తాజాగా ఈ టోర్నీకి సంబంధించిన ప్రైజ్‌మ‌నీని తాజాగా ఐసీసీ వెల్ల‌డించింది.టోర్నీ మొత్తం ప్రైజ్‌మ‌నీ 6.9 మిలియన్లు అంటే భార‌త క‌రెన్సీలో రూ.59 కోట్లు గా వెల్ల‌డించింది.ఇది 2017 టోర్నమెంట్ కంటే ప్రైజ్‌మ‌నీ కంటే దాదాపు 53 శాతం ఎక్కువ‌.

ఛాంపియ‌న్స్ ట్రోఫీ విజేత‌గా నిలిచిన జ‌ట్టుకు 2.24 మిలియ‌న్ల యూఎస్ డాల‌ర్లు ప్రైజ్‌మ‌నీగా ల‌భించనుంది. అంటే భార‌త క‌రెన్సీలో సుమారు రూ.19.45 కోట్లు అందుకోనున్నారు. ఇక ర‌న్న‌ర‌ప్‌గా నిలిచిన జ‌ట్టుకు 1.12 మిలియ‌న్ల యూఎస్ డాల‌ర్లు.. అంటే భార‌త క‌రెన్సీలో సుమారు రూ.9.72 కోట్లు ల‌భించ‌నున్నాయి. ఇక సెమీఫైన‌ల్‌లో ఓడిన రెండు జ‌ట్ల‌కు ఒక్కొక్క‌రి 560,000 డాల‌ర్లు అంటే భార‌త క‌రెన్సీలో సుమారు రూ.4.86 కోట్లు ల‌భించ‌నుంది.

ఇక ఐదో, ఆరో స్థానంలో నిలిచిన జ‌ట్ల‌కు ఒక్కొక్కరికి $350,000 డాల‌ర్లు అంటే భార‌త క‌రెన్సీలో సుమారు రూ. 3.04 కోట్లు, ఏడవ, ఎనిమిదవ స్థానంలో ఉన్న జట్లకు $140,000 డాల‌ర్లు అంటే భార‌త క‌రెన్సీలో సుమారు రూ. 1.21 కోట్లు అందుతాయి. వీటితో పాటు అద‌నంగా.. గ్రూప్ స్టేజీలో ఒక్కొ మ్యాచ్ విజ‌యానికి 34,000 డాల‌ర్లు అంటే భార‌త కరెన్సీలో సుమారు రూ.29లక్ష‌లు ల‌భించ‌నున్నాయి.

1996 తర్వాత పాకిస్తాన్ తొలిసారి మేజ‌ర్ టోర్నీకి ఆతిథ్యం ఇస్తోంది. ఛాంపియ‌న్స్ ట్రోఫీ మ్యాచ్‌లు కరాచీ, లాహోర్, రావల్పిండిలలో నిర్వ‌హించ‌నున్నారు. ఇక భార‌త జ‌ట్టు ఆడే మ్యాచ్‌లు మాత్రం దుబాయ్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్నాయి.

ఈ టోర్నమెంట్ మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి.వీటిని రెండు గ్రూపులుగా విభ‌జించారు. గ్రూపు-ఏలో భార‌త్‌, పాకిస్థాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌లు ఉండ‌గా.. గ్రూప్‌-బిలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, అఫ్గానిస్థాన్‌, ద‌క్షిణాఫ్రికాలో ఉన్నాయి. ప్ర‌తి గ్రూప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జ‌ట్లు సెమీఫైన‌ల్‌కు చేరుకుంటాయి.సెమీస్‌లో విజ‌యం సాధించిన జ‌ట్లు ఫైన‌ల్‌కు అర్హ‌త సాధిస్తాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com