ఎత్తిపోతల పథకాల సృష్టికర్త - డాక్టర్ గోపాల్ రెడ్డి

- February 16, 2025 , by Maagulf
ఎత్తిపోతల పథకాల సృష్టికర్త - డాక్టర్ గోపాల్ రెడ్డి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధికి అహర్నిశలు కృషి చేసి అగ్రపథాన నిలిచిన వ్యక్తి డాక్టర్ గంటా గోపాల్ రెడ్డి . స్వతహాగా రైతు కుటుంబంలో జన్మించిన ఆయన గ్రామీణ రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాన్ని చూపేందుకు సామ్యవాద సహకార విధానాన్ని అనుసరించారు. అరవిందుడి బోధనలతో ప్రభావితుడై ఆధ్యాత్మిక వాదాన్ని సహకార రంగానికి అన్వయించి అద్భుతమైన విజయాలను సాధించారు. అలాగే, ఉమ్మడి రాష్ట్రంలో తక్కువ ఖర్చుతోనే ఎత్తిపోతల పథకాల రూపకల్పన చేసిన నిపుణుడిగా రైతాంగం మదిలో నిలిచిపోయారు. 

డాక్టర్ గంటా గోపాల్ రెడ్డి  1932 ఫిబ్రవరి 14న ఒకప్పటి నైజాం రాజ్యంలోని నల్గొండ జిల్లా హుజూర్‌నగర్ తాలూకాలోని గడ్డిపల్లి గ్రామంలో సంపన్న రైతు కుటుంబానికి చెందిన గంటా అనంతరెడ్డి, వెంకట నర్సమ్మ దంపతులకు జన్మించారు. గడ్డిపల్లి, హైదరాబాద్ ప్రాంతాల్లో ప్రాథమిక విద్య నుంచి ఇంటర్ వరకు చదుకున్నారు. ఆ తర్వాత వ్యవసాయం మీదున్న మక్కువతో వ్యవసాయ శాస్త్రం చదవాలనే కోరికతో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో  అలహాబాద్ విశ్వవిద్యాలయంలోని అనుబంధ వ్యవసాయ కళాశాలలో 1948-52 వరకు అగ్రికల్చర్ బీఎస్సి పూర్తి చేశారు

1952-58 వరకు హైదరాబాద్ మరియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వ్యవసాయ విస్తరణ అధికారిగా నల్గొండ జిల్లాలో పనిచేశారు. ఇదే సమయంలో 1958లో అమెరికా అందించే "ఫుల్ బ్రైట్ ఉపకారవేతనం"( full bright scholarship) పొంది మిన్నెసోట యూనివర్సిటీ నుంచి సాయిల్ సైన్స్ విభగంలో మాస్టర్స్ పూర్తి చేశారు. ఆ తర్వాత ఈస్ట్ వెస్ట్ సెంటర్ ఫెలోషిప్ అందుకొని హవాయిల్ యూనివర్సిటీ నుంచి సాయిల్ సైన్స్ మీదే  పీహెచ్‌డీ పూర్తి చేశారు. ఆ తర్వాత ఇండియా తిరిగి వచ్చి1964 నుంచి 1969 వరకు హైదరాబాద్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సాయిల్ సైన్స్ & ఆగ్రో కెమిస్ట్రీ డిపార్టుమెంటులో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తించారు.

గోపాల్ రెడ్డి అలహాబాద్ విశ్వవిద్యాలయంలో చదువుతున్న సమయంలోనే సోషలిస్టు భావజాలం పట్ల ఆకర్షితులయ్యారు. సోషలిజంలో సహకార వ్యవస్థ గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. అదే గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం రావాలంటే సహకార రంగం దేశంలో బలపడాలని గోపాల్ రెడ్డి నమ్మారు. అందుకే వ్యవసాయ విస్తరణ అధికారిగా ఉన్న సమయంలో సైతం రైతుల సహకారంతో గ్రామాల్లో వ్యవసాయ అభివృద్ధికి పాటుపడి నాటి హైదరాబాద్ రాష్ట్రంలో అవార్డులు రివార్డులు అందుకున్నారు.

అమెరికాలో చదువుకుంటూ ఉన్న సమయంలోనే మిత్రుల ప్రభావం వల్ల ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అరవిందుడి రచనలు చదవడం మొదలుపెట్టారు. ఆ రచనలు ఆయన్ని ఎంతో ప్రభావపరిచాయి. క్రమక్రమంగా వీరిలో ఆధ్యాత్మికత భావనలు చిగురించాయి. అదే సమయంలో అమెరికా నుండి తిరిగొచ్చిన తర్వాత పాండిచ్చేరిలోని అరవింద ఆశ్రమం సందర్శించారు. ఆశ్రమంలో గ్రామీణాభివృద్ధికి సంబంధించిన శిక్షణ తరగతులు మరియు సహకార పద్దతిలో నడుస్తున్న వ్యవసాయ విధానం ఆయన్ని ఆకట్టుకున్నాయి. వీటి మీద అధ్యయనం చేసేందుకు అప్పటి ఆశ్రమ నిర్వాహకురాలు శ్రీమాత వారి ఆశీస్సులతో ప్రతి ఏటా కచ్చితంగా ఆశ్రమానికి వెళ్లడం పరిపాటిగా మార్చుకున్నారు.    

అగ్రికల్చర్ యూనివర్సిటీలో పనిచేస్తున్న ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న సమయంలోనే నల్గొండ ప్రాంతంలో కరువు కాటకాలతో అల్లాడుతూ ఉన్న హుజూర్‌నగర్, కోదాడ తాలూకాల్లో రైతాంగం సాగునీటి కోసం ఇక్కట్లు చూసి చలించిపోయిన డాక్టర్ గోపాల్ రెడ్డి గారు అందుకు పరిష్కారం చూస్తున్న సమయంలోనే నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తవ్వడం జరిగింది. సాగర్ ఎడమ కాలువ ఖమ్మం, నల్గొండ జిల్లాలను సస్యశ్యామలం చేసేందుకు నిర్మించారు. ఎడమకాలువ తవ్వకాల సమయంలో కాలువకు ఎగువ భాగంలోని బీడు భూములను సాగులోకి తెచ్చేందుకు సుదీర్ఘంగా పోరాటం చేశారు.అయన వాదనను అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరిస్తూ ఎత్తిపోతల పథకం నిర్మించేందుకు బ్యాంకు నుంచి రుణాలు పొందడానికి అంగీకరించింది.

హుజూర్‌నగర్, కోదాడ తాలూకాల్లో ఉన్న 6,600 ఎకరాలకు సాగునీటి వసతిని కల్పించేందుకు ఎత్తిపోతల పథకం నిర్మాణానికి అనువైన ప్రాంతంగా తన స్వగ్రామమైన గడ్డిపల్లి గ్రామాన్ని ఎంచుకొని ఆ రెండు తాలూకాలోని రైతులను ఒప్పించి మహాత్మా గాంధీ శతజయంతి సందర్భంగా 1969లో మహాత్మాగాంధీ ఎత్తిపోతల సహకార సంఘాన్ని ఏర్పాటు ఎత్తిపోతల పథకం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనేక వ్యయ ప్రయాసలు ఒనకూర్చి కేవలం సంవత్సరంలోనే ఎత్తిపోతలను పూర్తి చేయించారు. దీనికి అనుబంధంగా విద్యుత్తు ప్లాంట్ ఏర్పాటు చేశారు.ఈ పథకాన్ని ఏర్పాటు చేయడం ద్వారా బీడు భూముల్లో పంట సిరులు కురువడం మొదలుపెట్టాయి. దీని నిర్మాణంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎత్తిపోతల సృష్టికర్తగా ఆయన మన్ననలు అందుకున్నాడు. ఆయనిచ్చిన ప్రణాళికతో నాటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఎత్తిపోతల పథకాలను నిర్మించేందుకు కృషి చేసింది.

గడ్డిపల్లి ఎత్తిపొత్తల పథకంతో గోపాల్ రెడ్డి కృషి ఆగిపోలేదు. గ్రామీణాభివృద్ధి ద్వారానే దేశాభివృద్ధికి బీజం అని నమ్మిన వ్యక్తుల్లో గోపాల్ రెడ్డి గారు ఒకరు. అందులో భాగంగానే గడ్డిపల్లి కేంద్రంగా అరవింద గ్రామీణాభివృద్ధి శిక్షణ సంస్థను స్థాపించి రైతులకు వ్యవసాయంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాల్లో శిక్షణలు ఇప్పించారు. పలు కొత్త వంగడాలను ఆయన సృష్టించారు. ఇవే కాకుండా గడ్డిపల్లి కేంద్రంగా ప్రాథమిక స్థాయి నుంచి డిగ్రీ కాలేజీ వరకు విద్యాసంస్థలను స్థాపించి ఎందరో నిరుపేద విద్యార్థులకు ఉచితంగా చదువు కోవడానికి కారకులయ్యారు.

1980లో గడ్డిపల్లి చుట్టూ ఉన్న ఏడు గ్రామాల రైతులను సమీకరించి అందరి సహకారంతో రైతు సేవా సహకార సంఘాన్ని ఏర్పాటు చేసి దాని ద్వారా రైతులకు అనేక సేవలు అందించారు. శ్రీమాతృ కృప గడ్డిపల్లి అభ్యుదయం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 1984-85లో గడ్డిపల్లిలో కృషి విజ్ఞాన కేంద్రాన్ని నెలకొల్పారు. గడ్డిపల్లి కేవీకే కార్యదర్శిగా అనేక సంవత్సరాలు పనిచేసి వ్యవసాయ పరంగా విస్తృత సేవలు అందించారు. కేవీకే ద్వారా చేస్తున్న సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 1994లో ఉత్తమ కేవీకేగా ఎంపిక చేసింది. అలాగే,  జిందాల్ అవార్డును కూడా పొందారు. గ్రామీణాభివృద్ధికి సంబంధించిన పలు ప్రతిష్టాత్మక సంస్థల కార్యవర్గంలో సేవలందించారు.

వ్యవసాయ శాస్త్రవేత్తగా జీవిత ప్రస్థానాన్ని ప్రారంభించిన డాక్టర్ గోపాల్ రెడ్డి సహకార రంగానికి, గ్రామీణాభివృద్ధికి తన జీవితాన్ని అంకితం చేశారు. అనారోగ్యం కారణంగా 2018, ఏప్రిల్ 14న తన 86వ ఏట కన్నుమూశారు. గ్రామీణాభివృద్ధికి ఆయన రూపకల్పన చేసిన అనేక కార్యక్రమాలు ఇప్పటికి గడ్డిపల్లి కేంద్రంగా జరుగుతూనే ఉన్నాయి.    

 - డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com