తెలంగాణ రాజకీయ చాణక్యుడు-కేసీఆర్
- February 17, 2025
తెలంగాణ రాజకీయాల్లో తిరుగులేని వ్యక్తి కేసీఆర్‌గా సుపరిచితుడైన కల్వకుంట్ల చంద్రశేఖర రావు. రాష్ట్ర రాజకీయాలపై తనదైన ముద్ర వేశారు.అభిమానులు తెలంగాణ జాతిపితగా పిలుచుకునే ఆయన..దశాబ్దం పాటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలను నెరవేర్చిన కేసీఆర్ ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు.నేడు తెలంగాణ రాజకీయ చాణక్యుడు కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన రాజకీయ ప్రస్థానం పై ప్రత్యేక కథనం మీకోసం....
కేసీఆర్ 1954 ఫిబ్రవరి 17న మెదక్ జిల్లాలోని చింతమడక గ్రామంలో రాఘవరావు, వెంకటమ్మ దంపతులకు జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ తెలుగు లిటరేచర్ చదివిన కేసీఆర్.. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుగ్గా ఉండేవారు.కాంగ్రెస్ పార్టీతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన కేసీఆర్.. అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరారు. 1983 ఎన్నికల్లో తన గురువైన అనంతుల మదన్ మోహన్ చేతిలో 877 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
1985లో తెలుగు దేశం తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన కేసీఆర్.. తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత నుంచి ఆయన ప్రతి ఎన్నికలోనూ గెలుస్తూ వచ్చారు.1985 నుంచి 2004 వరకు ఆయన సిద్ధిపేట నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా,డిప్యూటీ స్పీకర్‌గా ఆయన వ్యవహరించారు.
2001లో టీడీపీకి,డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసిన కేసీఆర్.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా..అదే ఏడాది ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేశారు. ఉపఎన్ని్కలో విజయం సాధించడం ద్వారా అసెంబ్లీలో తెలంగాణ గళం వినిపించారు. 2004లో కేసీఆర్ కరీంనగర్ నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు.ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి కేసీఆర్, ఆలె నరేంద్ర సహా ఐదుగురు ఎంపీలుగా ఎన్నికయ్యారు. యూపీఏ కూటమిలో టీఆర్ఎస్ చేరడంతో 2004 నుంచి 2006 వరకు కేసీఆర్ కేంద్ర మంత్రిగా పని చేశారు.
2006లో కేంద్ర మంత్రి పదవికి, ఎంపీ పదవికి కేసీఆర్ రాజీనామా చేశారు. ఉపఎన్నికలో కరీంనగర్ నుంచి పోటీ చేసి 2 లక్షలకు పైగా మెజార్టీతో ఘన విజయం సాధించారు. 2008లో టీఆర్ఎస్ నాయకులంతా తమ పదవులకు రాజీనామాలు చేశారు.ఈసారి కూడా కేసీఆర్ కరీంనగర్ నుంచి ఎంపీగా గెలుపొందారు.పదవులకు రాజీనామా చేసి ఉపఎన్నికలకు వెళ్లడాన్ని కేసీఆర్ రాజకీయ అస్త్రంగా వాడుకున్నారు.తద్వారా తెలంగాణ వాదానికి బలం పెంచడంలో ఆయన సక్సెస్ అయ్యారు. 2009లో ఆయన మహబూబ్‌నగర్ నుంచి ఎంపీగా గెలుపొందారు.
తెలంగాణ సాధనే ధ్యేయంగా 2009 నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. సిద్ధిపేటను దీక్ష స్థలిగా ఎంచుకున్నారు.కరీంనగర్ నుంచి సిద్ధిపేట వెళ్తుండగా.. పోలీసులు ఆయన్న అరెస్ట్ చేసి ఖమ్మం తరలించారు.రెండు రోజుల పాటు ఖమ్మం జైల్లోనే కేసీఆర్ దీక్ష కొనసాగించారు.దీంతో ఆయన్ను ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ నిమ్స్‌లో చేర్పించారు.అయినా సరే కేసీఆర్ నిరాహార దీక్ష మానలేదు. చివరకు తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా కేంద్రం ప్రకటన చేయడంతో కేసీఆర్ దీక్ష విరమించారు.తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ నిరాహార దీక్షను పతాక సన్నివేశంగా చెప్పొచ్చు.
2014 ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది.అదే ఏడాది జూన్ 2న తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. 2018లో మరోసారి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఈ రెండు సందర్భాల్లోనూ ఆయన గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉద్యమ నాయకుడి నుంచి పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా తన వ్యూహాన్ని మార్చుకున్న కేసీఆర్..తనదైన దార్శనికత ప్రగతిని పరుగులు పెట్టించారు. రైతు బంధు, కళ్యాణలక్ష్మి లాంటి పథకాలు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టు లాంటి కార్యక్రమాలతో దేశం దృష్టిని ఆకర్షించారు.అదే తెగువతో జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఉద్యమ పార్టీ టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా రూపాంతరం చేసి 2023 ఎన్నికల్లో గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల నుంచి పోటీ కామారెడ్డిలో ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు.
అనర్గలంగా ప్రసంగించేవారు రాజకీయాల్లో చాలామంది కనబడతారు.కానీ ఆకట్టుకునేలా ఉపన్యసించడం కేసీఆర్‌కు వెన్నతో పెట్టిన విద్య.తన ఎదురుగా ఉన్న శ్రోతలను బట్టి ఆయన ప్రసంగశైలిని మార్చుకుంటారు. మహిళలు,ఉపాధ్యాయులు, మేధావులు, విలేకరులు ఇలా ఎవరికి తగ్గట్టు అప్పటికప్పుడు ఆయన ప్రసంగ ధోరణి మారిపోతుంది.వేదిక ఎక్కి ఆశువుగా మాట్లాడితే ఇక దానికి అడ్డే ఉండదు.
రాజనేవాడికి స్పందించే గుణం ఉండాలని కౌటిల్యుడు అర్థశాస్త్రంలో చెప్తాడు.కేసీఆర్‌కు ఈ లక్షణం అతికినట్టు సరిపోతుంది.ప్రతిరోజూ క్రమం తప్పకుండా అన్ని దినపత్రికలు చదువడం ఏండ్లుగా ఆయనకున్న అలవాటు. పత్రికల్లో వచ్చే ముఖ్యమైన వార్తలను క్రోడీకరించి అనుదినం అందించే యంత్రాంగం ప్రతి ముఖ్యమంత్రికి ఉన్నట్టే కేసీఆర్‌కూ ఉంది. అయినా ఆయన స్వయంగా ప్రతి పత్రికను ఆమూలాగ్రం చదువుతారు.ఆ తర్వాత ఆయా విషయాలపై ఆయన తక్షణం స్పందించే తీరు అద్భుతం అనే చెప్పా లి.ఒక్కోసారి ఆయన వ్యవహారశైలిని గమనిస్తుంటే అమెరికన్ రచయిత డేల్ కార్నెగి రాసిన వ్యక్తిత్వ వికాస పుస్తకాన్ని కేసీఆర్ ఆమూలాగ్రం చదివి ఒంట బట్టించుకున్నారా అనిపిస్తుంది.
తెలంగాణ ఉద్యమం సమయంలో ప్రజల్లో రాష్ట్ర సాధన కోరిక బలంగా ఉండటంతో.. నాడు కేసీఆర్ అమలు చేసిన రాజకీయ వ్యూహలు సక్సెస్ అయ్యాయి.ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో మోదీ ప్రభుత్వం బలంగా ఉంది.ఈ నేపథ్యంలో రాష్ట్ర స్థాయిలో కేసీఆర్ వ్యూహాలు ఎలా ఉంటాయి? పదునైన రాజకీయ వ్యూహాలకు మారుపేరైన కేసీఆర్ భవిష్యత్తులో ఎలా ముందుకెళ్తారు? అనేవి ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.ఒకప్పుడు సక్సెస్ అయిన కేసీఆర్ వ్యూహాలు మళ్ళీ తెలంగాణాలో ఆ స్థాయిలోనూ సక్సెస్ అవుతాయా..? వేచి చూడాల్సిందే..!
--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ఇరాన్ పోర్టులో భారీ పేలుడు.. 400 మందికి పైగా గాయాలు
- TGSRTC : త్వరలో హైదరాబాద్ కి 150 ఎలక్ట్రిక్ బస్సులు
- అబుదాబిలో అపార్ట్మెంట్ నుండి పడి యువకుడు మృతి..!!
- 17.6 కిలోల మెథాంఫేటమిన్ రవాణాను అడ్డుకున్న జాక్టా..!!
- కువైట్ లో అక్రమ క్రిప్టోకరెన్సీ మైనింగ్ కార్యకలాపాలపై ప్రచారం..!!
- దహిరాలో థర్డ్ స్కౌట్ క్యాంప్ అల్ ప్రారంభం..!!
- అల్ డైర్ సముద్ర తీరప్రాంతానికి ఫిషింగ్, సిట్టింగ్ ప్లాట్‌ఫామ్..!!
- ఖలీఫా అంతర్జాతీయ స్టేడియం.. మే 24న అమీర్ కప్ ఫైనల్‌కు ఆతిథ్యం..!!
- అమెరికాలో విదేశీ విద్యార్థులు హ్యాపీ
- విశాఖలో తలసేమియా బాధితుల కోసం మే 8న భరోసా కల్పిద్దాం-నారా భువనేశ్వరి