బీహార్ రాజకీయ చాణక్యుడు-నితీశ్ కుమార్

- March 01, 2025 , by Maagulf
బీహార్ రాజకీయ చాణక్యుడు-నితీశ్ కుమార్

నితీశ్ కుమార్...భారత రాజకీయాల్లో అవినీతికి ఆమడ దూరంలో నేతల్లో ఒకరు. ఆటవిక రాజ్యాంగా పేరుపడ్డ బీహార్ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న రథసారథి ఆయన. బీహార్ ప్రయోజనాల కోసం ఎంత దూరమైనా వెళ్లగలిగే సత్తా ఉన్న నాయకుడిగా నితీశ్ బాబు పేరు గాంచారు.కేంద్ర మంత్రిగా, బీహార్ రాష్ట్రానికి 19 ఏళ్ళ పాటూ సీఎంగా ఉన్న నితీశ్ ప్రజా సామ్యవాద సిద్ధాంత భావజాలానికి కట్టుబడిన అతికొద్ది నేతల్లో ఒకరు. నేడు బీహార్ రాజకీయ చాణక్యుడు, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ జన్మదినం సందర్భంగా ఆయన రాజకీయ ప్రస్థానంపై ప్రత్యేక కథనం... 

నితీశ్ కుమార్ 1951, మార్చి 1వ తేదీన బీహార్ రాష్ట్రం నలంద జిల్లా భక్తియార్ పూర్ గ్రామంలో మధ్యతరగతి రైతు కుటుంబానికి చెందిన కవిరాజ్ రామ్ లాఖన్ సింగ్, పరమేశ్వరి దేవి దంపతులకు జన్మించారు. తండ్రి ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు మరియు ఆయుర్వేద వైద్యుడిగా పనిచేసేవారు. నితీశ్ బాల్యం గ్రామంలో జరిగినప్పటికి చదువుల కోసం తమ గ్రామానికి దగ్గర్లో ఉన్న పాట్నా పట్టణంలో హాస్టల్లో ఉంటూ చదువుకున్నారు. పాట్నాలోని ప్రముఖ బీహార్ రీజనల్ ఇంజనీరింగ్ కళాశాల(ప్రస్తుతం పాట్నా NIT)లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి గోల్డ్ మెడల్ అందుకున్నారు. ఆ తర్వాత కొద్దీ నెలల పాటు రాష్ట్ర ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటులో ఇంజనీరుగా పనిచేశారు. 


నితీశ్ తండ్రి దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలంగా పనిచేసేవారు. ఆరోజుల్లో పాట్నా కాంగ్రెస్ పార్టీలో కీలకమైన నేతల్లో ఆయన ఒకరు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పాట్నా తూర్పు నుంచి మొదటి లోక్ సభకు పోటీ చేయాలనుకున్న ఆయనకి నాటి రాష్ట్ర కాంగ్రెస్ నేతలు రిక్త హస్తాన్ని చూపడంతో పాటుగా అవమానించారని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటారు. ఆ తర్వాత కాలంలో ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ తమ గ్రామంలో ఆయుర్వేద వైద్యుడిగా స్థిరపడ్డారు. 

తండ్రిని చూస్తూ పెరిగిన నితీశ్ కాంగ్రెస్ పార్టీ మరియు ఆ పార్టీ నేతలు తన తండ్రికి చేసిన అవమానాలు వల్ల ఆ పార్టీ పట్ల విముఖత చిన్నతనం నుంచే మొదలై తర్వాత కాలంలో తీవ్రరూపం దాల్చింది. 60వ దశకంలో బీహార్ రాజకీయాలు సోషలిస్టు పంథాలో సాగడం మొదలైన సమయంలోనే లోహియా, లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ వంటి సోషలిస్టు నేతల పట్ల ఆనాటి రాష్ట్ర యువతలో ఆదరణ ఉండేది. అలాంటి కోవలోకే నితీశ్ సైతం చేరారు. విద్యార్థిగా రాణిస్తూనే కాలేజీ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనేవారు. లోహియా వామపక్ష సామ్యవాద సిద్ధాంతాల పట్ల నితీశ్ ఆకర్షణకు గురయ్యారు. 

లోహియా మరణాంతరం యూపీ, బీహార్ రాష్ట్రాల్లో సోషలిస్టు పార్టీలు క్రమంగా ఆదరణ పొందుతూ అధికారంలోకి రావడం జరిగింది. పాట్నా యూనివర్సిటీ రాజకీయాల్లో ఆర్ట్స్ కాలేజీకి చెందిన లాలూ ప్రసాద్ యాదవ్ సైతం తన రాజకీయ హాస్య ఛలోక్తులతో విద్యార్థులను ఆకట్టుకునేవారు. సోషలిస్టు విద్యార్థి సంఘం తరపున లాలూ యూనివర్సిటీ స్టూడెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన సమయంలో అదే విభాగానికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి నితీశ్ లాలూ గెలుపు కోసం కృషి చేశారు. 

రాజకీయాల పట్ల మొదట్లో ఆసక్తి చూపని నితీశ్ నాటి బీహార్ రాష్ట్రంలో అవినీతి, నిరుద్యోగం వంటి ప్రజా సమస్యలపై విద్యార్థిగానే పోరాటాల్లో పాల్గొంటూ క్రమక్రమంగా రాజకీయాల పట్ల ఆసక్తి పెంచుకున్నారు. రాజకీయాల మీదున్న మక్కువ కారణంగానే తన ఇంజనీర్ ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు జేపీ నాయకత్వంలో జరిగిన విద్యార్థి ఉద్యమం ద్వారా ఆయనకు చక్కని అవకాశం లభించింది. ఆ విద్యార్థి ఉద్యమంలో లాలూ, నితీశ్ మరియు దివంగత సుశీల్ కుమార్ మోడీ, రవి శంకర్ ప్రసాద్ వంటి వారు పాల్గొన్నారు. ఈ ఉద్యమం విజయవంతం కావడంతో నితీశ్ పూర్తిగా రాజకీయాలకే పరిమితం కావాలని నిర్ణయించకున్నారు. 

దేశంలో పెరుగుతున్న అవినీతి, బంధుప్రీతికి మరియు ఆశ్రీత పక్షపాతానికి వ్యతిరేకంగా జేపీ తలపెట్టిన సంపూర్ణ క్రాంతి ఉద్యమంలో నితీశ్ భాగమయ్యారు. జేపీ ఉద్యమం, అలహాబాద్ కోర్టు తీర్పు వెలువడిన తర్వాత 1975లో ఇందిరా గాంధీ విధించిన ఎమెర్జెన్సీ సమయంలో ఎమెర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడి జైలుకు వెళ్లారు. ఎమెర్జెన్సీ ముగిసిన తర్వాత 1977లో జరిగిన ఎన్నికల్లో లాలూతో పాటుగా పలువురు పార్లమెంట్ మరియు బీహార్ అసెంబ్లీకి ఎన్నికైనప్పటికి నితీశ్ మాత్రం తాను పోటీ చేసిన మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.

ఓటమితో క్రియాశీలక రాజకీయ జీవితాన్ని మొదలు పెట్టిన నితీశ్ 1980 అసెంబ్లీ ఎన్నికల్లో రెండో సారి కూడా ఓటమి పలకరించింది. ఒకానొక దశలో రాజకీయాలకు దూరంగా ఏదొక వ్యాపారం చేసుకోవాలని అనుకున్న దశలోనే 1985 అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా హర్నట్ నుంచి లోక్ దళ్ పార్టీ తరపున ఎమ్యెల్యేగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి నితీశ్ రాజకీయ గ్రాఫ్ పెరుగుతూ వచ్చింది. అసెంబ్లీలో పార్టీ విప్ గా, లోక్ దళ్ ఉపనేతగా ఉంటూనే పార్టీ యువ విభాగం యువదళ్ అధ్యక్ష బాధ్యతల్లో పనిచేశారు. 

1988లో సోషలిస్టు పార్టీలు, జనతాపార్టీ చీలిక పార్టీలు కలిసి జనతాదళ్ పార్టీగా ఏర్పడగా 1989లో బీహార్ జనతాదళ్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నితీశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1989లొనే తొలిసారిగా లోక్ సభకు పోటీ చేసిన నితీశ్ బర్హ నుంచి ఎన్నికయ్యారు. 1990 అసెంబ్లీ ఎన్నికల్లో జనతాదళ్ పార్టీ గెలిచిన తర్వాత సీఎంగా లాలూ ప్రసాద్ పేరును ప్రతిపాదించిన వ్యక్తుల్లో నితీశ్ ఒకరు. లాలూ సీఎం అవ్వడం కోసం నాటి ప్రధాని విపి సింగ్ మరియు జనతాదళ్ దిగ్గజ నేతలైన చంద్రశేఖర్, దేవిలాల్ వంటి పలువురు నేతల మద్దతు కూడగట్టడంలో నితీశ్ కీలకంగా వ్యవహరించారు. ఇదే సమయంలోనే సింగ్ మంత్రివర్గంలో కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రిగా 8 నెలలు పనిచేశారు. 

సింగ్ ప్రవేశపెట్టిన మండల్ వ్యవస్థ మరియు అద్వానీ అరెస్ట్ కారణంగా ప్రభుత్వం కూలడంతో పాటుగా జనతాదళ్ పార్టీ చీలడం మొదలైంది. లాలూ, నితీశ్ మరియు అప్పటి ఒరిస్సా సీఎం బిజూ పట్నాయక్ వల్ల జనతాదళ్ బలహీన పడలేదు. అయితే 1992 చివరి నాటికే లాలూ వైఖరిలో మార్పు రావడం, పార్టీలో నంబర్ టూగా ఉన్న నితీశ్ పట్ల దురుసుగా ఉండటం ఇలా రాజకీయ విభేదాల కారణంగా నితీశ్ పార్టీ నుంచి బయటకు వచ్చారు. అదే సమయంలో జాతీయ స్థాయిలో జనతాదళ్ పార్టీలో కీలకంగా ఉన్న జార్జ్ ఫెర్నాండెజ్ సైతం పార్టీ అధిష్టానం వైఖరికి నిరసనగా పార్టీకి రాజీనామా చేశారు. 

నితీశ్, జార్జ్ ఫెర్నాండెజ్ కలిసి 1994లో సమతా పార్టీని స్థాపించారు. లాలూతో విభేదించిన వారందరు నితీశ్ పార్టీలో చేరారు. 1995 అసెంబ్లీ ఎన్నికల్లో లాలూ వర్సెస్ నితీశ్ మారిన ఎన్నికల మారిన తరుణంలో సీఎంగా ఉన్న లాలూ తన అధికారాలన్నింటిని వాడుకొని ఎన్నికల్లో సునాయాసంగా విజయం సాధించి నితీశ్ నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీసేందుకు ప్రయత్నించారు. ఇదే సమయంలో భాజపా సైతం ఎన్నికల్లో అనుకున్న ఫలితాలు సాధించలేకపోయింది. బీహార్ భాజపాకు పెద్ద దిక్కుగా ఆరెస్సెస్ సిద్ధాంతకర్త మరియు ప్రముఖ హిందీ జర్నలిస్ట్ దీననాథ్ మిశ్రా సహకారంతో నితీశ్, భాజపా పెద్దల మధ్య పొత్తు పొడుచింది. అలా 1996లొనే భాజపాతో పొత్తు పెట్టుకున్న మొదటి పార్టీగా నితీశ్ నేతృత్వంలోని సమతా పార్టీ నిలిచింది. 

1996 లోక్ సభ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి యూపీ, బీహార్ రాష్ట్రాల్లో పోటీ చేయగా సమతా పార్టీ ఈ ఎన్నికల్లో బాగా లాభపడింది. నితీశ్ జాతీయ స్థాయి రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు ఈ ఎన్నికలు కీలక మలుపని చెప్పవచ్చు. 1998 నుంచి 2004 మధ్యలో రెండు దఫాలు అధికారంలోకి వచ్చిన భాజపా నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో నితీశ్ రైల్వే, వ్యవసాయం, ఉపరితల రవాణా శాఖల మంత్రిగా పనిచేశారు. రైల్వే మంత్రిగా నితీశ్ చేపట్టిన సంస్కరణల మూలంగా రైల్వేశాఖకు భారీ ఆదాయం రావడం మొదలైంది. రవాణా,వ్యవసాయ శాఖల్లో పలు విప్లవాత్మకమైన సంస్కరణలకు నాంది పలికారు.

2000లో జరిగిన బీహార్ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజార్టీ రాకపోవడంతో భాజపా, సమతా, జేఎంఎం మరియు ఇతర స్వతంత్ర అభ్యర్ధులు కలిసి నితీశ్ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే, 7 రోజుల తర్వాత స్వతంత్ర అభ్యర్ధులు, ఇతర పార్టీల ఎమ్యెల్యేలు లాలూ ఆర్జేడీ వైపు వెళ్ళడంతో నితీశ్ సీఎం పదవికి రాజీనామా చేశారు. అలా మొదటి సారి సీఎంగా 7 రోజులు మాత్రమే చేయగలిగారు. 

1998 నాటికే జనతాదళ్ విచ్ఛిన్నం కావడంతో పాటుగా పలు ఆ పార్టీలోని మెజారిటీ వర్గాలు జనతాదళ్ సెక్యులర్, జనతాదళ్ యునైటెడ్ పార్టీలుగా చీలి పోయాయి. అయితే, శరద్ యాదవ్ నేతృత్వంలోని జనతాదళ్ యునైటెడ్ పార్టీలో ఉన్న నితీశ్ పూర్వ సన్నిహితులు తమతో చేతులు కలపమని జార్జ్ ఫెర్నాండెజ్ , నితీశ్ లను కోరగా అందుకు సమ్మతించిన ఇరువురు నేతలు 2003లో సమతా జేడీయూలో విలీనం అయ్యింది. నితీశ్ జేడీయూ పార్లమెంటరీ నాయకుడిగా 2004 వరకు ఉన్నారు. 1989 నుంచి 2005 మధ్యలో వరసగా 6 సార్లు లోక్ సభకు నితీశ్ ఎన్నికయ్యారు. 

2004 లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయే  ఓటమి పాలైన తర్వాత 2004 నుంచి 2005 వరకు జేడీయూ పార్లమెంటరీ పక్ష నేతగా వ్యవహరించిన నితీశ్ 2005 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా - జేడీయూ సంపూర్ణ మెజార్టీ సాధించి బీహార్ రాష్ట్రంలో లాలూ కుటుంబ 15 ఏళ్ల పాలనకు చరమగీతం పాడింది. ఎన్డీయే సీఎం అభ్యర్థిగా నితీశ్ రెండో సారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. భాజపా సీనియర్ నేత సుశీల్ కుమార్ మోడీ డిప్యూటీ సీఎం అయ్యారు. 

2005-13 వరకు ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో బీహార్ రాష్ట్ర శాంతిభద్రతలు గాడిన పడ్డాయి. అంతేకాకుండా, యాదవేతర బీసీ వర్గాలకు సంక్షేమ పథకాల ఫలాలు అందేలా చర్యలు చేపట్టారు. యువత మరియు మహిళలకు ఉపాధి కల్పన, డ్వాక్రా సంఘాల ఏర్పాటు, బీహార్ రాష్ట్రంలో కనీవినీ ఎరుగని రీతిలో మౌలిక సదుపాయాలు ఏర్పర్చారు. బీసీల్లో బాగా వెనకబడిన వారిని ఈబీసీ వర్గంగా విభజించి విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించారు. బీహార్ అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తున్న నితీశ్ ను ప్రజలు "సుశాన్ బాబు"(అభివృద్ధి సాధకుడు)గా కీర్తించారు. 

2013లో నరేంద్ర మోడీ ఎన్డీయే ప్రధానమంత్రి అభ్యర్థి ప్రకటన తర్వాత కూటమి నుంచి తప్పుకున్నారు. అయితే, 2014 లోక్ సభ ఎన్నికల్లో నరేంద్ర మోడీ నాయకత్వంలో ఎన్డీయే కేంద్రంలో అధికారాన్ని కైవశం చేసుకోవడం, బీహార్ రాష్ట్రంలో జేడీయూ 20 నుంచి 2 సీట్లకు పరిమితం అవ్వడంతో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత తీసుకొని సీఎం పదవికి రాజీనామా చేశారు. 

2015లో పార్టీ నాయకుల ఒత్తిడి మేరకు తిరిగి సీఎంగా బాధ్యతలు చేపట్టిన నితీశ్ భాజపాను ఓడించేందుకు తన రాజకీయ ప్రత్యర్థి లాలూతో చేతులు కలిపారు. 2015 ఎన్నికల సమయంలో జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ మరియు ఇతర చిన్న పార్టీలు "మహాఘట్ బంధన్"గా ఏర్పడి భాజపా నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని ఓడించాయి. ఈ కూటమిలో సైతం నితీశ్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అయితే, లాలూ పుత్రుల మీద  అవినీతి ఆరోపణలు రావడంతో కూటమిని ఒదిలి తిరిగి 2017లో ఎన్డీయే కూటమిలోకి చేరుకున్నారు. 

2019 లోక్ సభ ఎన్నికల్లో జేడీయూ- భాజపా కూటమి గణనీయమైన స్థానాలను కైవసం చేసుకుంది. 2020 ఎన్నికల్లో నితీశ్ నేతృత్వంలోని జేడీయూ పార్టీని వెన్నుపోటు పొడిచి లబ్ధి పొందిన భాజపాకు తగిన గుణపాఠం చెప్పాలని 2022లో ఎన్డీయే నుంచి బయటికి వచ్చి తిరిగి ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. భాజపాను ఓడించే లక్ష్యంతో ఇండియా కూటమికి నాంది పలికిన మొదటి వ్యక్తి నితీశ్ . ఇండియా మొదటి రెండు సమావేశాల్లోనే విపక్షాల మధ్య అనైక్యతను గమనించిన ఆయన కరెక్టుగా 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు తిరిగి ఎన్డీయే కూటమిలో చెరి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. 2000-2024 మధ్యలో 9 సార్లు బీహార్ సీఎం అయ్యారు. 

2024 లోక్ సభ ఎన్నికల్లో భాజపాకు భారీగా సీట్లు తగ్గి అధికారంలోకి వస్తుందా రాదా అనే సందిగ్దత చోటు చేసుకున్న సమయంలో బీహార్ రాష్ట్రంలో నితీశ్ పార్టీ సాధించిన 16 లోక్ సభ సీట్లు మోడీ 3.0 ఏర్పడేందుకు దోహదపడ్డాయి. మోడీ 3.0 ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బీహార్ రాష్ట్రానికి నిధుల వరద పారించడం ద్వారా తమకు నితీశ్ ఎంత ముఖ్యమన్నది చెప్పకనే చెప్పారు మోడీ - షా ద్వయం. ప్రస్తుతం నితీశ్ ఈ సంవత్సరం జరగబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా అమలు చేస్తున్నారు. ఈసారి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తే నితీశ్ బీహార్ రాష్ట్ర చరిత్రలోనే తిరుగులేని నేతగా అవతరిస్తారు. 

--డి.వి.అరవింద్ ( మా గల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com