అఫ్గనిస్థాన్‌లో తాలిబన్లను ఓ చూపుచూస్తోన్న సీఐఏ

- October 23, 2017 , by Maagulf
అఫ్గనిస్థాన్‌లో తాలిబన్లను ఓ చూపుచూస్తోన్న సీఐఏ

అఫ్గనిస్థాన్‌లో అమెరికా ప్రాధాన్యాలు మారుతున్నాయి. ఇప్పటి వరకు అల్‌ఖైదా ఉగ్రవాదులపై పోరాడిన అమెరికా నిఘా సంస్థ సీఐఏ ఈ సారి తాలిబన్లపై దృష్టిపెట్టింది. ఇటీవల అఫ్గాన్‌లో అమెరికా లక్ష్యంగా తాలిబన్లు తరచూ దాడులు చేస్తున్నారు. దీనికి తోడు తాలిబన్లు అఫ్గనిస్థాన్‌లో చాలా భాగాన్ని మళ్లీ ఆక్రమించుకుంటున్నారు. ఈ దాడులతో అప్రమత్తమైన సీఐఏ (సెంట్రల్‌ ఇంటిలిజెన్స్‌ ఏజెన్సీ) అఫ్గనిస్థాన్‌ ఇంటిలిజెన్స్‌ సంస్థకు సహకారం అందిస్తోంది. ఫలితంగా అఫ్గన్‌ సైన్యం తాలిబన్లపై దాడులను పెంచింది. 
రహస్య ఆపరేషన్లు.. 
మెరికల్లాంటి అధికారులు, కాంట్రాక్టర్లను సీఐఏ అఫ్గనిస్థాన్‌కు తరలించింది. అక్కడ చేపట్టే రహస్య ఆపరేషన్లను కూడా విస్తరిస్తోంది. తాలిబన్లలో బాంబుల తయారీదార్లను గుర్తించి హతమార్చడమే లక్ష్యంగా చిన్నచిన్న బృందాలను సిద్ధం చేసింది. ఈ బృందాలు రాత్రివేళల్లో దాడులు నిర్వహిస్తుంటాయి. 
ట్రంప్‌ వ్యూహానికి అనుగుణంగా.. 
అఫ్గనిస్థాన్‌పై అమెరికా విధానాన్ని అమెరికా దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. ఉగ్రవాదంపై పోరులో ఆ దేశ సైన్యానికి, ప్రభుత్వానికి అమెరికా సహకరిస్తుందని పేర్కొన్నారు. దీంతో పాటు మరో 4,000 మంది సైనిక సిబ్బందిని అక్కడకు తరలించేందుకు ఆమోదముద్ర కూడా వేశారు. దీనికి అనుగుణంగానే సీఐఏ ఆఫ్గన్‌ సైన్యంతో సమాచారాన్ని పంచుకుంటోంది. దీనిలో భాగంగానే పాక్‌-అఫ్గన్‌ సరిహద్దుల్లో తాలిబన్లపై డ్రోన్లతో దాడులు చేశాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com