సినీ నటి పార్వతీఘోష్‌ కన్నుమూశారు

- February 12, 2018 , by Maagulf
సినీ నటి పార్వతీఘోష్‌ కన్నుమూశారు

భువనేశ్వర్‌ అర్బన్‌, న్యూస్‌టుడే: సినీ సీనియర్‌ నటి, ఒడియా చలనచిత్ర రంగంలో తొలి మహిళా దర్శకురాలిగా గుర్తింపు పొందిన పార్వతీఘోష్‌(85) కన్నుమూశారు. ఆదివారం రాత్రి 12 గంటల సమయంలో భువనేశ్వర్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతూ మృతిచెందారు. ఆమె భౌతికకాయాన్ని భువనేశ్వర్‌లో ఉన్న నివాసానికి తరలించిన అనంతరం అభిమానులు, సినీ నటీనటులు చివరి దర్శనం చేసుకున్నారు. ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ కూడా ఆమె భౌతిక కాయం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒకప్పుడు ఒడియా సినీ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు పార్వతీఘోష్‌ ఎంతో కృషిచేశారన్నారు. ఒక మహిళ తలచుకుంటే ఏదైనా చేయగలరని నిరూపించారని కొనియాడారు. ఒడియా సినీ దర్శకురాలిగా తొలుత ఆమె గుర్తింపు సాధించారని, ఆమె ఆదర్శాలు అందరికీ అనుసరణీయమని పేర్కొన్నారు. ఆమె కుమారుడు అమెరికా నుంచి వచ్చేక అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని సీఎం ప్రకటించారు. 16 ఏళ్ల వయసులో పార్వతీఘోష్‌ సినీరంగంలో ప్రవేశించారు.

'శ్రీ జగన్నాథ్‌' పేరిట 1950లో నిర్మించిన చిత్రంతో ఆమె బాలనటిగా రంగప్రవేశం చేశారు. అప్పటి నుంచి ఎన్నో చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి ప్రేక్షకుల హృదయాల్లో మంచిస్థానం సంపాదించుకున్నారు. 1933 మార్చి 28న కటక్‌లో ఆమె జన్మించారు. 'అమారి గావ్‌ జియో', 'భాయి, భాయి', 'మా లక్ష్మీ' వంటి సినిమాల్లో ఆమె నటనకు ప్రేక్షకులు నీరాజనాలు అర్పించారు.

పార్వతీఘోష్‌కు పలు అవార్డులు, సత్కారాలు అందాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com