దుబాయ్:మాస్టర్స్‌ కబడ్డీ టోర్నీ లో పాక్‌పై భారత్‌ ఘన విజయం

- June 22, 2018 , by Maagulf
దుబాయ్:మాస్టర్స్‌ కబడ్డీ టోర్నీ లో పాక్‌పై భారత్‌ ఘన విజయం

దుబాయ్:టోర్నీ ఏదైనా సరే, ప్రత్యర్థి జట్టు ఎవరైనా ఆధిపత్యం మాత్రం మాదేనని అంటోంది భారత కబడ్డీ జట్టు.దుబాయ్ వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో శుక్రవారం జరిగిన కబడ్డీ మాస్టర్స్‌ టోర్నీ తొలి మ్యాచ్‌లో భారత్‌ శుభారంభం చేసింది.

ఈ టోర్నీలో ఫేవరేట్‌గా బరిలోకి దిగిన భారత్ 36-20 తేడాతో పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించింది. అజయ్‌ ఠాకూర్‌ సారథ్యంలో భారత ఆటగాళ్లు రెచ్చిపోయి ఆడారు. ఈ పోరు ఆద్యంతం ఆధిపత్యం చలాయించిన భారత్‌... తొలి అర్ధభాగం ముగిసే సరికి 22-9తో స్పష్టమైన ఆధిక్యంలో నిలిచింది.

అనంతరం ప్రారంభమైన రెండో అర్ధభాగంలో భారత ఆటగాళ్లు తమ జోరు కొనసాగించి మొత్తం మీద 36-20 పాయింట్ల తేడాతో పాకిస్థాన్‌పై టోర్నీ తొలి మ్యాచ్‌లోనే ఘన విజయం నమోదు చేసి తమ సత్తా చాటారు. కెప్టెన్‌ అజయ్‌ ఠాకూర్‌ 15 రైడ్‌ పాయింట్లతో చెలరేగి ఒంటి చేత్తో జట్టును గెలిపించాడు.

టోర్నీలో భాగంగా భారత్‌ తమ తదుపరి మ్యాచ్‌లో శనివారం కెన్యాతో తలపడనుంది. ఆరు జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో పాక్‌, కెన్యాలతో కలిసి భారత్‌ గ్రూప్‌-ఎలో ఉంది. గ్రూప్‌-బిలో ఇరాన్‌, కొరియా, అర్జెంటీనా ఉన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com