కేరళకు కేసీఆర్ సాయం

- August 17, 2018 , by Maagulf
కేరళకు కేసీఆర్ సాయం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన దాతృత్వాన్ని చాటుకున్నారు. భారీవర్షాలు, వరదలతో తల్లడిల్లిపోతోన్న కేరళకు ఆపన్న హస్తం అందించారు. 25 కోట్ల రూపాయలు తక్షణ సాయంగా ప్రకటించారు. ఈ మొత్తాన్ని కేరళ ప్రభుత్వానికి అందజేయాలంటూ తెలంగాణ చీఫ్ సెక్రెటరీ ఎస్ కే జోషీని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

నగదుతోపాటు 2.5 కోట్ల రూపాయలు విలువచేసే 10 రివర్స్ ఆస్మోసిస్ వాటర్ ప్లాంట్స్ కేరళకు పంపించబోతున్నారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. కేరళ పునర్నిర్మాణానికి ప్రజలంతా తమవంతు సాయం చేయాలని, కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి విరివిగా విరాళాలివ్వాలని కేటీఆర్ కోరారు. ఈ మేరకు పూర్తి వివరాలతో కూడిన ఒక ఫొటోని పోస్ట్ చేశారు కేటీఆర్.

ఇలాఉండగా, ఈ నెల 8 నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో కేరళలోని14 జిల్లాల్లో రెడ్ అలెర్ట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజా సమాచారం మేరకు కేరళలో ఇప్పటివరకు వర్షాలు, వరదల కారణంగా మృతిచెందిన వారి సంఖ్యల 324కు చేరింది. ఒక్క బుధవారం రోజునే 100 మంది మృత్యువాత పడ్డారు. 2 లక్షల మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. అళపుజ, ఎర్నాకుళం, త్రిసూర్, పథనాంతిట్ట ప్రాంతాల్లో పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది.

గత వందేళ్లలో కనీవినీ ఎరుగని రీతిలో కేరళ రాష్ట్రం వరదల్లో చిక్కుకోవడంతో.. కేరళలో అపార నష్టం వాటిల్లింది. ఇంకా వరుణుడి తన ప్రకోపాన్ని చాటుతున్న క్రమంలో నష్టం విలువను కూడా అంచనా వేయలేకపోతున్నారు. 30 బ్రిడ్జిలు కూలిపోగా, లక్షల హెక్టార్లలో పంట దెబ్బతింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com