అమల్లోకి ఇరాన్ పై ఆంక్షలు

- November 05, 2018 , by Maagulf
అమల్లోకి ఇరాన్ పై ఆంక్షలు

వాషింగ్టన్‌ : ఇరాన్‌పై అమెరికా విధించిన ఆంక్షలు సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి. ఇప్పటివరకు అమెరికా విధించిన వాటిల్లో ఇవే అతి కఠినమైన ఆంక్షలని అధ్యక్షుడు ట్రంప్‌ పేర్కొన్నారు. అయితే, ఇరాన్‌తో ఆర్థిక సంబంధాలు తెంచుకోవడానికి నిరాకరించిన పలు దేశాలకు అమెరికా మినహాయింపులు ఇచ్చింది. 
ఇరాన్‌ ఇంథనం, ఆర్థిక, షిప్పింగ్‌ రంగాలను ప్రధానంగా ఉద్దేశించి ఈ ఆంక్షలు విధించారు. 2015లో అణు ఒప్పందంపై సంతకాలు చేసిన తర్వాత ఇరాన్‌ కంపెనీలకు, వ్యక్తులకు అమెరికా ఇచ్చిన కాస్తంత ఉపశమనం కూడా ఈ ఆంక్షలతో కనుమరుగైంది. అమెరికాలో మధ్యంతర ఎన్నికలు జరుగుత్నున తరుణంలో బహిరంగంగా పాల్గొన్న ప్రతి సభలోనూ ట్రంప్‌ ఇరాన్‌ ఆంక్షల గురించి చెబుతూనే వచ్చారు. అణు ఒప్పందం నుంచి వైదొలగడం, ఆంక్షలు తిరిగి విధించడం తమ ప్రభుత్వం సాధించిన గొప్ప విజయంగా ట్రంప్‌ చెప్పుకుంటున్నారు. అయితే, ట్రంప్‌ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యకు అంతర్జాతీయ మద్దతు లేదా సహకారం కరువైన నేపథ్యంలో ట్రంప్‌ కొన్ని రాయితీలు ఇవ్వక తప్పలేదు. గడువు ముగిసిన తర్వాత ఇరాన్‌తో వ్యాపార సంబంధాలు కొనసాగించే వారిపై కఠినమైన చర్యలుంటాయని తొలుత అమెరికా ప్రకటించింది. కానీ, కొన్ని మిత్ర దేశాలను దృష్టిలో పెట్టుకొని ఎనిమిది దేశాలకు తాత్కాలిక మినహాయింపులు ప్రకటించారు. అందులో భారత్‌, చైనా, జపాన్‌, టర్కీ, దక్షిణ కొరియా ఉన్నాయి. అయితే, ఆంక్షల నుంచి యూరోపియన్‌ యూనియన్‌కు మినహాయింపు ఇవ్వలేదు. దీనిపై ఈయూ అధికారులు స్పందిస్తూ తమ కంపెనీలను పరిరక్షించుకోగలమని ప్రకటించారు.
అమెరికా ఆంక్షలను పట్టించుకోం : ఇరాన్‌ 
అమెరికా ప్రభుత్వం తమపై తాజాగా విధించిన ఆంక్షలను పట్టించుకునే ప్రసక్తే లేదని ఇరాన్‌ స్పష్టం చేసింది. ఆ దేశ అధ్యక్షుడు హసన్‌ రౌహానీ మీడియాతో మాట్లాడారు. ఇరాన్‌ నుంచి ఇంధనం కొనుగోలు చేయాలని ముందుకొచ్చే అన్ని దేశాలకు ముడి చమురు అమ్ముతామని స్పష్టం చేశారు. ఇటీవల ఇరాన్‌పై అమెరికా ఆర్థిక ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. తమ ఆంక్షలను కాదని ఇరాన్‌తో వాణిజ్య లావాదేవీలను నిర్వహించే దేశాలను తామే మాత్రం ఉపేక్షించమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ స్పష్టం చేశారు. అయితే ఈ ఆంక్షల నుంచి భారత్‌తో సహా ఎనిమిది దేశాలకు మినహాయింపు ఇచ్చారు. ఇరాన్‌ నుంచి ఈ ఎనిమిది దేశాలు చమురు కొనుగోలుకు ట్రంప్‌ అంగీకరించారు. దీంతో అమెరికా విధించిన ఆంక్షలు నీరుగారి పోయాయని అంతర్జాతీయ పరిశీలకులు భావిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com