ఒడియన్ రివ్యూ

ఒడియన్ రివ్యూ

మన్యం పులి సినిమాతో మనవాళ్ళకు బాగా దగ్గరై జనతా గ్యారేజ్ లాంటి స్ట్రెయిట్ మూవీస్ తో ఇక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న మలయాళం కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ నటించిన ఒడియన్ చప్పుడు చేయకుండా ఈ రోజు విడుదలైంది.

అసలు ఇది వచ్చిన సంగతి కూడా ఎవరికి తెలియనంత వీక్ పబ్లిసిటీతో కేవలం మోహన్ లాల్ ను విపరీతంగా ఇష్టపడే వాళ్ళ పుణ్యమా అని ఓపెనింగ్స్ అంతో ఇంతో తెచ్చుకోగలిగింది. అయితే మరి ఈ ఒడియన్ చిన్న సినిమాలతో చేసిన యుద్ధంలో నిలిచాడా లేదా రివ్యూలో చూద్దాం

కథ

కేరళలో ఉండే ఓ ప్రత్యేక జాతి ఒడియన్. శత్రువులను భయపెట్టేందుకు వీళ్ళ సేవలను అప్పట్లో ఉపయోగించుకునేవారు. అలా వంశపారపర్యంగా వచ్చిన విద్యను ఒంటబట్టించుకున్న చివరివాడు మాణిక్యం(మోహన్ లాల్). తాను బాల్యం నుంచి ఇష్టపడిన ప్రభ(మంజు వారియర్)కుటుంబానికి రక్షణగా ఉంటూ ఎవరైనా పనికి పిలిస్తే వెళ్లి వస్తు ఉంటాడు.

ప్రభను ఎలాగైనా స్వంతం చేసుకోవాలని చూస్తుంటాడు తనకు బావ వరసయ్యే రాజారావు(ప్రకాష్ రాజ్). ఒడియన్ అడ్డుగా ఉన్నాడని భావించి కుట్రలు చేసి ఊరు వదిలి వెళ్ళిపోయేలా చేస్తాడు. కాని రాజారావు వల్ల ప్రభ ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందని గుర్తించి వెనక్కు వస్తాడు ఒడియన్. మరి తన లక్ష్యాన్ని ఎలా నేరవేర్చుకుని రాజారావు ఆటకట్టించాడు అనేదే ఒడియన్ కథ

నటీనటులు

మోహన్ లాల్ కు కంప్లీట్ యాక్టర్ అనే బిరుదు ఒక్క రోజులోనో ఒక్క సినిమాతోనో వచ్చింది కాదు. రకరకాల పాత్రలతో తనలో నటుడికి ఎప్పటికప్పుడు ఛాలెంజ్ విసురుతూ వైవిధ్యమైన పాత్రలను వయసును లెక్క చేయకుండా పోషిస్తున్నాడు కాబట్టి ఇప్పటికీ కోట్లాది అభిమానులు ఆయనంటే పడి చస్తారు. మోహన్ లాన్ ఒడియన్ పాత్రకు పూర్తి న్యాయం చేకూర్చాడు. తన వరకు ఎలాంటి లోపం లేదు. మన్యం పులి తరహాలో ఇందులో కూడా ఆయన ప్రేజెన్స్ కనులపండుగగా ఉంటుంది.

కాకపోతే పబ్లిసిటీలో చెప్పుకున్నట్టు మోహన్ లాల్ విశ్వరూపం చూపించిన సినిమా అయితే ఒడియన్ ముమ్మాటికి కాదు. మంజు వారియర్ ఒద్దికగా ఆ పాత్రకు తగ్గట్టు ఉంది. గ్లామర్ కు నో ఛాన్స్ కాబట్టి ఆశించడమె తప్పు. ప్రకాష్ రాజ్ విలన్ గా బాగున్నాడు కాని తనకూ వేరియేషన్స్ చూపించే అవకాశం దర్శకుడు ఇవ్వలేకపోయాడు. హీరొయిన్ తో సహా మోహన్ లాల్, ప్రకాష్ రాజ్ తప్ప ఇంకే తెలిసిన మొహం కనిపించినా ఒట్టు. అందుకే ఎవరి పెర్ఫార్మన్స్ గురించి చెప్పాల్సిన అవసరం పడలేదు

సాంకేతిక వర్గం

శ్రీకుమార్ మీనన్ తీసుకున్న నేపధ్యం బాగుంది కాని దానికి తగ్గట్టు బిగుతైన కథా కథనాలు మాత్రం రాసుకోలేకపోయాడు. ఒడియన్ల నేపధ్యం ఆసక్తికరంగా ఉన్నప్పటికీ వాళ్ళు జంతు రూపంలోకి మారడం నిజం కాదనే సంగతి ప్రేక్షకుడికి ముందే రివీల్ చేసేయడంతో థ్రిల్ కు అవకాశం లేకుండా పోయింది. దీంతో తెరమీద జరుగుతున్న తతంగమంతా మొక్కుబడి ప్రహసనంగా అనిపిస్తుంది. మోహన్ లాల్ తన భుజాల మీద వేసుకునేందుకు సిద్ధంగా ఉన్నా శ్రీకుమార్ వైఫల్యం అడుగడుగునా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.

మన్యం పులి హ్యాంగ్ ఓవర్ నుంచి మోహన్ లాల్ కాని ఇతర దర్శకులు కాని బయటికి వస్తున్నట్టు లేరు. అదే ఫార్మాట్ లో దీన్ని రూపొందించే ప్రయత్నం చేయడం ఫైనల్ గా తేడా కొట్టించింది. చీకట్లో శత్రువులను భయపెట్టే పాయింట్ లో మంచి డెప్త్ ఉంది. దాన్ని దర్శకుడు మరీ సిల్లీగా తీసుకోవడంతో ఒడియన్ తన ప్రత్యేకతను కోల్పోయాడు. చీకట్లో యాక్షన్ ఎపిసోడ్లు అంతగా ఆకట్టుకునేలా లేవు. మూడు గంటల నిడివిలో దర్శకుడి ట్రీట్మెంట్ ఓ పాతికేళ్ళు వెనక్కు వెళ్లి రాసుకున్నట్టు అనిపించడంటో మొత్తంగా ఇది యావరేజ్ కన్నా కింది స్థాయిలో నిలిచే సినిమాగానే ఫిక్స్ అవుతాం.

ఫ్లాష్ బ్యాక్ ల ప్రహసనం కూడా విసిగిస్తుంది. స్ట్రెయిట్ గా ప్లాట్ ని చూపించకుండా ఏదో ట్విస్టుల కోసం శ్రీకుమార్ పడిన తాపత్రయం మొత్తానికే మోసం తెచ్చింది. అయినా ప్రేక్షకులు చివరి దాకా ఏదోలా సర్దుకుని కూర్చున్నారు అంటే దానికి ఒకే ఒక్క కారణం మోహన్ లాల్ మాత్రమే. జయచంద్రన్ సంగీతం మనకు కనెక్ట్ అయ్యే అవకాశం తక్కువ. మల్లు వుడ్ ఫ్లేవర్ లో ఉంది కాబట్టి ఆస్వాదించలేం. శాం పిఎస్ బిజిఏం మాత్రం బాగా ఎలివేట్ అయ్యింది. నీరసంగా ఉన్న సీన్లను సైతం యాక్టివ్ గా నిలిపే ప్రయత్నం చేసింది. షాజీ కుమార్ ఛాయాగ్రహణంకు మంచి మార్కులు ఇవ్వొచ్చు.

కాకపోతే అవసరానికి మించిన క్లోజ్ అప్ షాట్స్, రన్నింగ్ యాంగిల్స్ వీటికి సరిచూసుకుని దర్శకుడికి సలహా ఇచ్చుంటే బాగుండేది. ఎడిటర్ జాన్ కుట్టి ఇంత నిడివికి పూర్తి బాద్యత వహించాలి. మూడు గంటల దాకా ఉన్న లెంత్ ని తగ్గించే ప్రయత్నం ఏ కోశానా చేయలేదు. నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి. ప్రోమోస్ చూసి దగ్గుబాటి రానా హక్కులు కొన్నట్టు ఉన్నాడు

పాజిటివ్ పాయింట్స్

మోహన్ లాల్

బ్యాక్ గ్రౌండ్ స్కోర్

రెండు యాక్షన్ బ్లాక్స్

కెమెరా వర్క్

నెగటివ్ పాయింట్స్

సుదీర్ఘమైన నిడివి

ఆశించిన థ్రిల్స్ లేకపోవడం

కథనం

తక్కువ పాత్రలు

చివరి మాట

ఒడియన్ నుంచి మన్యం పులి రేంజ్ లో ఏదేదో ఊహించుకుని వెళ్తే మాత్రం వేట పూర్తి కాకుండానే ఇంటికి పంపిస్తాడు ఒడియన్. ఇది కేవలం మోహన్ లాల్ వీరాభిమానులకు తప్ప సగటు ప్రేక్షకుడికి యావరేజ్ అని చెప్పడం కూడా కష్టమే అనిపించే ఖరీదైన ప్రయత్నం. మనకు ఏ మాత్రం పరిచయం లేని నేటివిటీలో ఇలాంటి కాన్సెప్ట్ కు కనెక్ట్ కావాలి అంటే దానికి కోట్ల రూపాయల ఖర్చు మాత్రమే సరిపోదు. ప్రేక్షకుడు డబ్బింగ్ సినిమా అని మరిచిపోయి మురిసిపోయే స్థాయిలో కథా కథనాలు ఉండాలి. అవి లేకున్నా పర్వాలేదు కేవలం మోహన్ లాల్ కోసమే చూడాలి అనుకుంటే ఒడియన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు

ఒడియన్ - గెలవలేకపోయాడు

రేటింగ్ : 2.5 / 5

Back to Top