లద్ధాఖ్‌లో హిమపాతం..5 మృతి, 7 గల్లంతు

- January 18, 2019 , by Maagulf
లద్ధాఖ్‌లో హిమపాతం..5 మృతి, 7 గల్లంతు

 జమ్ముకశ్మీర్‌లోని లద్ధాఖ్‌ ప్రాంతంలో హిమపాతం సంభవించి ఐదుగురు మృతిచెందారు. మరో ఏడుగురు గల్లంతయ్యారు. ఖర్దుంగ్‌ లా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. 10 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ ట్రక్కు ఖర్దుంగ్‌ లా పాస్‌ మంచు చరియలను ఢీకొట్టింది. దీంతో వీరంతా హిమపాతంలో చిక్కుకుపోయారు. సమాచారమందుకున్న పోలీసులు, ఆర్మీ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ఇప్పటివరకు ముగ్గురి మృతదేహాలను వెలికితీయగా.. మిగతా వారి కోసం సహాయకసిబ్బంది గాలిస్తున్నారు. 17,500 అడుగుల ఎత్తులో వీరు గల్లంతైనట్లు తెలుస్తోంది. ఖర్దుంగ్‌ లా దేశంలో ఎత్తైన రహదారి మార్గాల్లో ఒకటి. లేహ్‌ జిల్లాలో ఉండే ఈ రోడ్డు షయోక్‌, నుబ్రా లోయలను కలుపుతుంది.

కశ్మీర్‌లోయలో చలి తీవ్రత విపరీతంగా ఉంది. గురువారం కూడా పలు ప్రాంతాల్లో దట్టంగా మంచు కురిసింది. జనవరి 23 వరకు వాతావరణం ఇలాగే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో హిమపాతం ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల వైపు వెళ్లొద్దని ప్రజలను సూచిస్తున్నారు. అనంత్‌నాగ్‌, కుల్గాం, బుద్గాం, బారాముల్లా, కుప్వారా, బాందిపొరా, కార్గిల్‌, లేహ్‌ జిల్లాల్లో మంచు చరియలు విరిగిపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com